దురద ఎందుకు వస్తుంది... ఈ బాధకు విరుగుడు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
దురద అనేది చికాకు కలిగించే ఓ తాత్కాలిక సమస్య. కానీ, ప్రతి ఐదుగురిలో ఒకరు వారాలు లేదా నెలల తరబడి మొండి దురదలతో ఇబ్బంది పడుతుంటారు.
షాయెన్నె బౌలెట్ వయసు 18 ఏళ్ళు. తన కళాశాల చదువు మొదటిసంవత్సరం చివరలో ఆమెను ఈ దురద సమస్య విపరీతంగా ఇబ్బంది పెట్టింది.
‘‘దీనిని మొదట్లో నేను తామరగా భావించాను. ఇది నన్నెంతో బలహీనురాలిని చేసింది’’ అని షాయెన్నె బౌలెట్ చెప్పారు.
‘‘నేను వేడినీళ్ళతో స్నానం చేయలేకపోయేదాన్ని, హోమ్‌వర్క్ పై శ్రధ్ధ పెట్టలేకపోయేదానిని, నిద్ర పోలేకపోయేదానిని. దాదాపు రెండుగంటలపాటు దురదపుట్టిన చోట గోకుతూ ఉండేదాన్ని. దీనివల్ల రక్తం వచ్చి బెడ్ కూడా తడిసిపోయేది. తరువాత బాగుచేసుకోవాల్సి వచ్చేది’’ అని చెప్పిందామె.
షాయెన్నెకు ఉన్న ఈ సమస్యను ప్రూరిగో నోడ్యులారిస్ (పీఎన్)గా గుర్తించారు.
ఇదో చర్మవ్యాధి. దీనిని ‘‘దురద గడ్డలు’’గా చెబుతారు.
ఈ ప్రూరిగో నోడ్యులారిస్ అనేది దీర్ఘకాలిక దురదను కలిగిస్తుంది. వైద్యపరంగా ఈ దురద ఆరువారాలకు మించి ఉంటుందని నిర్వచించారు.
ఈ మొండి దురదలనేవి చర్మ సంబంధిత రుగ్మతలతో ముడిపడి ఉంటాయి. అంటే తామర, దద్దుర్లు, సోరియాసిస్ లాంటివన్నమాట.
ఇవే కాకుండా ఇతర వైద్యకారణాలు కూడా ఉండి ఉండొచ్చు. అంటే కిడ్నీ వ్యాధులు, కాలేయ వైఫల్యం, లింఫోమా వంటి ఇతర వైద్య పరిస్థితులతోనూ సంబంధం కలిగి ఉంటాయి.
కొన్ని కేసులలో దురద అనేది సంవత్సరాల తరబడి కొనసాగుతుంటుంది.
కాలేయ వ్యాధులతో బాధపడేవారు అవయవమార్పిడి కి సిద్ధపడతారు. వీరు కాలేయ వైఫల్యంతో వచ్చే దురదలను భరించలేరు.
కొంతమంది క్యాన్సర్ బాధితులు ప్రాణాలను కాపాడే మందులను కూడా తీసుకోరు. ఎందుకంటే ఈ మందులు తీసుకోవడం వల్ల వారు దురద బాధితులుగా మారుతారు.
‘‘దీర్ఘకాలం ఉండే దురదలనేవి మొండి నొప్పుల్లానే మనుషులను చాలా బలహీనపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఇది అంతకుమించినదని నేను చెబుతాను’’ అంటారు న్యూయార్క్‌లోని మౌంట్ సైనీలోని ఇచాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో క్లినిషియన్, న్యూరోఇమ్యునాలజిస్టుగా పనిచేస్తున్న బ్రియాన్ కిమ్.
‘‘మొండి నొప్పులతోపాటు మీకు బాధాకరమైన అనుభూతి కలుగుతుంది. ఎప్పటికీ తగ్గని మధ్యస్తమైన నొప్పితో అయితే మీరు నిద్రపోగలుగుతారు. కానీ మొండి దురద భిన్నమైనది. ఎందుకంటే ఇది మిమ్మల్ని హాయిగా ఉండనీయదు. రాత్రంతా మీరు దురదన్నచోటు గోక్కుంటూ ఉండేలా చేస్తుంది. ఇదెక్కువగా బాధితులను బలహీనంగా మారుస్తుంది’’

ఫొటో సోర్స్, Getty Images
దురదకు కారణాలేంటి?
దీర్ఘకాలిక దురదకు కారణమేమిటనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే, తీవ్రమైన దురద ఎందుకొస్తుందనేది మాత్రం బాగా అర్థం చేసుకున్నారు.
మీరు దోమకాటుకు గురైనా, లేదా దురదగుంటాకు లాంటివి మీకు తగిలినా, శరీరంలోని రోగనిరోధక కణాలు హిస్టామైన్, ఇతర కారకాలను విడుదల చేస్తాయి. ఇవి ఇంద్రియ నాడులపై ఉన్న సూక్ష్మగ్రాహికల ద్వారా స్పందించి దురద అనే భావనను వెన్నెముక ద్వారా మెదడుకు పంపుతాయి. అయితే తీవ్రమైన దురదకు యాంటి హిస్టమైన్స్‌తోనూ, లేదంటే స్టెరాయిడ్లతో చికిత్స అందించవచ్చు.
కానీ, యాంటి హిస్టమైన్స్ అనేవి దీర్ఘకాలిక దురదలపై ప్రభావం చూపలేవు.
దీని ఫలితంగా 360 ఏళ్ళలో దురదకు చికిత్స అందించడంలో కొంత పురోగతి సాధించారు. ఇందులో భాగంగా ముందుగా దురదను వైద్యపరంగా నిర్వచించారు. దీనికి కారణం శాస్త్రవేత్తలందరూ దురదను నొప్పికి తేలికపాటి ప్రతిరూపంగా చూడటమే. 1920లవరకు ఇటువంటి దురభిప్రాయమే కొనసాగింది.
ఆస్ట్రియన్ జర్మన్ ఫిజియాలజిస్ట్ మాక్స్ వాన్ ఫ్రే తన ప్రయోగశాలలో కొంతమంది చర్మంపై పదునైన వస్తువులతో గుచ్చి పరిశోధనలు చేశాడు.
దీని ద్వారా గుచ్చిన ప్రదేశంలో ముందుగా నొప్పి కలుగుతుందని, తరువాత దురద అనే భావన వస్తుందని గ్రహించాడు.

ఫొటో సోర్స్, Getty Images
2007లో వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్‌లో జు ఫెంగ్ షెన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు మన శరీరంలో ప్రత్యేకంగా దురదను కలిగించే గ్రాహకాలను కనుగొన్నారు. ఇవి వెన్నెముకలోని నరాలకు సంబంధించిన ఉపసముదాయంపై ఉండటాన్ని కనుగొన్నారు.
ఎలుకలలో ఇటువంటి వ్యవస్థ లేదు కనుక వాటికి దురద అనే భావన కలగడం లేదని గుర్తించారు. వాటికి ఎంత చికాకు కలిగించినా, చక్కిలిగింతలు పెట్టినా, అవేమీ చలించలేదు, కానీ నొప్పిని అనుభవించాయి.
మరో మాటలో చెప్పాలంటే దురదకు సంబంధించిన అనుభూతిని మెదడుకు ప్రత్యేకంగా ప్రసారం చేసే న్యూరాన్ల సముదాయన్ని వెన్నెముకలో కనుగొన్నారు.
అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఇతర దురద గ్రాహకాలను, న్యూరాన్లను కనుగొన్నారు. ఉదాహరణకు ఇంద్రియ నాడుల ద్వారా చర్మం ఉత్తేజితమయ్యేచోట దురదగ్రాహకాలను కనుగొన్నారు. ఇవి దురదకు సంబంధించిన సంకేతాలను నేరుగా మెదడుకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
చర్మంలో ఏర్పడిన వాపునకు ఐఎల్-4 ఐఎల్-13 అని పిలిచే రోగనిరోధక కణాలు రసాయన సందేశాలు వెలువడటానికి కారణమవుతాయని 2017లో వాషింగ్టన్ యూనివర్సిటీస్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇచ్ అండ్ సెన్సారీ డిజార్డర్స్పై బ్రియాన్ కిమ్, ఆయన సహచరులు చేసిన పరిశోధనలో తేలింది.
ఈ రసాయనాలను సైటోకైన్స్ గా పిలుస్తారు. ఇవి చర్మంలోని ఇంద్రియనాడులకు బద్ధమై ఉండటంతోపాటు దురదకు కారణమవుతాయి.
బ్రియాన్ కిమ్ చేసిన పరిశోధనలో ఓ మంచి విషయం ఏమిటంటే , ఈ అణువులు దురద కలిగించే న్యూరాన్లకు పరిమితం కాకుండా, వాటిని చురుకుగా మార్చేందుకు చర్మంలోని ఇతర అణువుల పరిమితిని తగ్గించాయని కనుగొన్నాడు.
ఇలా అణువుల పరిమితి తగ్గడం వల్ల సాధారణ అలెర్జీలు ఉన్న వ్యక్తులకు మరింత దురద కలిగేలా చేస్తాయి అని శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో డెర్మటాలజీ ప్రొఫెసర్ మార్లిస్ ఫాసెట్ చెప్పారు.
ప్రొఫెసర్ ఫాసెట్ ఐఎల్ -31 అనే ‘ఇచ్ సైటోకైన్’పై దృష్టిసారించారు. ఇవి దురదను కలిగించే న్యూరాన్లను ప్రేరేపిస్తాయి.
2023 చేసిన అధ్యయనంలో ఐఎల్ -31 దురదను కలిగించడంతోపాటు మంటను కూడా తగ్గిస్తుందని, దీనివల్ల దురద అనుభూతి అంతిమంగా తగ్గిపోతుందని తెలిపారు.
ఈమె బృందం ఎలుకలో ఓ జన్యువును తీసి వేసి, ఐఎల్-31 అనే కోడ్ ఇచ్చారు. దీని తరువాత ఆ ఎలుకను దురద , అలర్జీలు కలిగించే సూక్ష్మక్రిములు ఉండే చోట వదిలారు. ఊహించినట్టుగానే ఆ ఎలుకకు ఎటువంటి దురదగానీ, అలర్జీగానీ కలగలదు.
దీనికి కారణం ఆ ఎలుకకు ఐఎల్-31 జన్యువు లోపించడమే. కానీ సూక్ష్మక్రిములు కుట్టినచోటు ఎలుకకు పెద్దఎత్తున మంట కలిగింది.
‘‘మీరు చర్మం లేదా ఎలుక వెన్నెముక ద్రవంలోకి ఐఎల్ -31ను ఇంజెక్ట్ చేస్తే అవి అనియంత్రంగా గోక్కోవడం ప్రారంభిస్తాయనే విషయం 15 ఏళ్ళుగా తెలిసిందే’’ అని ఫాసెట్ చెప్పారు.
చర్మంలోని నాడులను చురుకుగా చేసే ఐఎల్ -31 రోగనిరోధక స్పందనను తగ్గిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ మంటను అదుపులోకి ఉంచుతోంది.
ఈ ప్రయోగ ఫలితాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే దురదను తగ్గించే మందులు ఐఎల్ 31ను లక్ష్యంగా చేసుకోవడం వల్ల అనుకోని పరిణామాలు తలెత్తి, మంటపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
దురదకు చికిత్స
దురదను తగ్గించే మందులనుఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. ఉదాహరణకు నెమోలీజుమాబ్ ఐఎల్ -31 గ్రాహకాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
దీనిని పొడిబారిన, దురద, ఎర్రబడిన చర్మానికి కారణమయ్యే ఎటోపిక్ డెర్మటైటిస్ (ఒకరకమైన తామర) కోసం రూపొందించారు.
ఇటీవలే దీనికి సంబంధించిన 2,3 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి.
ఇలాంటి వ్యక్తులకు డుపిలుమాబ్‌ను సూచించవచ్చు. ఇటీవలే దీనికి అనుమతులు మంజూరయ్యాయి. ఇది ఐఎల్-4ను, ఐఎల్ – 13 గ్రాహకాలను నిరోధిస్తుంది. ఎటోపిక్ డెర్మటైటిస్ చికిత్స కోసం ఈపీ262లానే అబ్రోసిటినిబ్, ఉపదాసిటినిబ్ అనే మందులు కూడా మూడోదశ ప్రయోగాలలో ఉన్నాయి.
ఈపీ262 అనేది మాస్ రిలేటెడ్ జీ ప్రొటీన్ కపుల్డ్ రిసెప్టర్ ఎక్స్2 ( ఎంఆర్‌జిపిఆర్ ఎక్స్2)ను అడ్డుకుంటుంది. ఇక అబ్రోసిటినిబ్, ఉపదాసిటినిబ్ అనేవి అనే గ్రాహకాన్ని అడ్డుకోవడం ద్వారా ఐఎల్ -4, ఐఎల్ -13తో జెఏకే1 మార్గాలలో జోక్యం చేసుకుంటాయి.
కొత్త చికిత్సా విధానాల వల్ల ఇతర దురద కారణాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు షాయెన్నె లాంటి వ్యక్తులు బాధపడే పీఎన్ లాంటి రుగ్మతలకు చికిత్స చేసేందుకు డుపిలుమాబ్ అనే ఔషధంపై ఫేజ్ త్రీ ప్రయోగాలు పూర్తి చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ మిల్లర్ స్కూల్ మెడిసిన్ లో డెర్మటాలాజీ ప్రొఫెసర్‌గానూ ,ఫిజీషియన్‌గానూ ఉన్న గిల్ యోసిపోవిచ్ బ్రయాన్ కిమ్, మరికొందరితో కలిసి ఈ ఏడాది ప్రయోగాలు చేశారు.
ఈ డుపిలుమాబ్ అనే ఔషధాన్ని తీసుకున్న రోగులు, ప్లాసెబో అనే ఔధం తీసుకున్న వారితో పోల్చిచూసినప్పుడు 24 వారాల తరువాత, డుపిలాంబ్ తీసుకున్న 60శాతం మంది లో దురద చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. ఇది ప్లాసెబో తీసుకున్నవారిలో 18.4 శాతంగానే ఉంది. దీంతో ప్రూరిగో నోడ్యులారిస్ కు (పీఎన్)కు చికిత్స చేసేందుకు డుపిలుమాబ్ కు ఎఫ్‌డిఏ అనుమతి ఇచ్చింది.
‘‘అత్యంత దురదను కలిగించే పీఎన్ అనే రుగ్మతతో తరచూ రోగులు చర్మవ్యాధుల డాక్టర్ల దగ్గరకు వస్తుంటారు. మొన్నటిదాకా ఈ రుగ్మతకు సరైన మందులు లేవు. దీంతో రోగులు ఎంతో బాధపడుతుడేవారు’’ అని యోసిపోవిచ్ చెప్పారు.
‘‘ఇది నిజంగా మా రోగులకు ఓ ఉత్సాహపూరితమైన కాలం. తమకో ఆశ దొరికినట్టుగా వారు ఆనందిస్తున్నారు. ఎంతో విసిగిపోయిన, దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్న పేషెంట్లు నా దగ్గరున్నారు. వారంతా నా దగ్గరకు వచ్చి ‘‘ఈ మందులు మా జీవితాన్ని కాపాడాయి’’ అని చెప్పారు.
ఈ లోగా బ్రయాన్ కిమ్ ఇచానా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని కొత్త లాబ్‌లో డైఫ్‌లీకెఫాలిన్ అనే ఔషధంపై పరిశోధన చేస్తున్నారు. ఇది నోటాల్జియా పరెస్టికా అనే వ్యాధికి విరుగుడుగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
నోటాలజియా పరెస్టికా అనేది నడుము పైభాగాన తరచూ దురదను కలిగించే రుగ్మత.
ఈ రెండు మందులు రోగులలో ఆశలను రేపుతున్నాయి.
‘‘నేను నా జీవితాన్ని నాకు నచ్చిన ఉత్తమమైన మార్గంలో జీవించగలననిపిస్తోంది’’ అని యోసియోపోవిచ్ పరిశోధనలలో పాల్గొన్న షాయెన్నె చెప్పారు.
‘‘కొన్నిసార్లు దురదగా ఉంటుంది. కానీ అది కేవలం పది నిమిషాలే. నా జీవితం మునుపుకంటే ఇప్పుడెంతో బావుంది’’ అని చెప్పారామె.
డుపిలుమాబ్ ఔషధం అందరి పేషెంట్లకు కాకపోయినా మరికొన్ని మందులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
‘‘రాబోయే ఐదేళ్ళలో ఎక్కువమంది రోగులకు సాంత్వన కలిగించలమని నమ్ముతున్నాను. చాలా ఏళ్ళ నుంచి ఇలాంటి రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిస్తున్న నాలాంటి డాక్టర్లందరికీ ఈ మందులు ఓ రివార్డులాంటివే’’ అంటారు యోసోపోవిచ్.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్:షేక్ హసీనాను ఇందిరా గాంధీ ఎందుకు ఇండియా రప్పించి రహస్యంగా ఉంచారు?
- రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?
- అడాల్ఫో మసియాస్ (ఫిటో): ఈ గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి తప్పించుకుంటే దేశంలో ఎమర్జెన్సీ విధించారు...
- కుక్క మాంసాన్ని నిషేధించిన దక్షిణ కొరియా... ఎందుకీ నిర్ణయం?
- అడాల్ఫో మసియాస్ (ఫిటో): ఈ గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి తప్పించుకుంటే దేశంలో ఎమర్జెన్సీ విధించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














