హర్దిత్ సింగ్ మాలిక్: తన విమానానికి 400 బుల్లెట్లు తగిలినా బతికి బయటపడ్డ భారతీయ పైలట్ కథ

ఫొటో సోర్స్, STEPHEN BARKER
- రచయిత, గుర్జాత్ సింగ్
- హోదా, బీబీసీ జర్నలిస్ట్
‘‘ఓ జర్మన్ నాపై మెరుపుదాడి చేశాడు. నా కుడికాలిపై కాల్చాడు. వెంటనే నేనూ అతనిపై కాల్పులు జరిపాను’’.
‘‘నాకు తగిలిన బుల్లెట్ విమానం పెట్రోల్ ట్యాంకు మీదుగా వచ్చింది. ఒక వేళ ఆ బుల్లెట్ కొద్దిగా ఎత్తులో వచ్చి ఉంటే విమానం పేలిపోయి ఉండేది.’’
‘‘నన్ను నాలుగు జర్మనీ ఫైటర్ జెట్స్ వెంటాడాయి. వారు నాపై పదేపదే కాల్పులు జరిపారు.’’
‘‘ఎగరలేక రెక్కలు టపటపా కొట్టుకునే పక్షిలా నా పరిస్థితి మారింది. కొద్దిసేపట్లో నేను చనిపోతానని ఆ సమయంలో అనిపించింది.’’
‘‘కానీ అలా జరగకపోయేసరికి నేనేదో దైవశక్తి రక్షణలో ఉన్నాననిపించింది. నేను నడుపుతున్న విమానానికి 400కు పైగా బుల్లెట్లు తగిలాయని చెప్పారు.’’
- ఇవీ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న హర్దిత్ సింగ్ మాలిక్ మాటలు. ‘ఎ లిటిల్ వర్క్, ఎ లిటిల్ ప్లే’ అనే ఆత్మకథలో ఈ విషయాలను పొందుపరిచారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన అతికొద్దిమంది భారతీయులలో ఆయన కూడా ఒకరు.
ఇంకా చెప్పాలంటే తలపాగా కట్టుకున్న మొదటి సిక్కు పైలట్ ఆయనే.
యుద్దంలో చావు నుంచి తప్పించుకోవడంపై ఆయన ఇలా రాశారు. ‘‘ఈ అద్భుతం నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. దేవుడు తలుచుకుంటేనే చావు ప్రాప్తిస్తుందనే విషయాన్ని నేను నమ్మడం మొదలుపెట్టాను.’’
తలపాగా ధరించే ఒక సిక్కుగా ఆయన ప్రయాణం ఎన్నో ఆటుపోట్లతో సాగింది.
కానీ ఆయన తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ‘ఫ్లయింగ్ హాబ్‌గాబ్లిన్’ లాంటి అనేక బిరుదులు పొందారు.
హాబ్‌గాబ్లిన్ అనేది ఆంగ్ల సాహిత్యంలో ఒక కల్పిత పాత్ర. దీనిని అందులో ఒక ‘దెయ్యం’గా పరిగణిస్తారు.

పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జననం
హర్దిత్ సింగ్ మాలిక్ 1894 నవంబర్ 23న ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌లోని రావల్పిండిలో జన్మించారు.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన ఆరు కంటోన్మెంట్‌లలో రావల్పిండి కూడా ఒకటి.
హర్దిత్ సింగ్ మాలిక్ తండ్రి సర్దార్ మోహన్ సింగ్‌ను అక్కడ ఇంజినీర్‌గా పోస్టు చేశారు. ఆయనకు అక్కడ ఎంతో పేరు ఉండేది.
సంపన్నకుటుంబంలో జన్మించడంతో హర్దిత్ చిన్నప్పటి నుంచే పాశ్చాత్య విద్యను అభ్యసించారు.
కెనడాలో భారత తొలి హైకమిషనర్
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక హర్దిత్ సింగ్ మాలిక్ పాటియాల ప్రధానమంత్రిగానూ, తరువాత కెనడాలో తొలి హైకమిషనర్‌గానూ నియమితులయ్యారు.
ఆ సమయంలో హర్దిత్ సింగ్ అత్యంత ముఖ్యమైన సిక్కు వ్యక్తిగా పరిగణన పొందారని ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ తెలిపారు.
మొదటి ప్రపంచ యుద్ద చరిత్రకారుడు స్టీఫెన్ బార్కర్ హర్దిత్ సింగ్ మాలిక్ గురించి ‘‘లైన్ ఆఫ్ ది స్కైస్’ అనే పుస్తకం రాశారు.
‘’14 ఏళ్ళ వయసులోనే హర్దిత్ సింగ్ మాలిక్ ఇంగ్లండ్‌కు వెళ్ళిపోయినా ఆయన తన మూలాలతో ఎప్పుడూ అనుబంధం కలిగి ఉండేవారు’’ అని ఆయన రాశారు.
‘‘మా అమ్మకు భక్తి ఎక్కువ. నాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మా నాన్న ప్రార్థన చేసేవారు’’ అని హర్దిత్ సింగ్ మాలిక్ తన ఆత్మకథ ‘ఎ లిటిల్ వర్క్, ఎ లిటిల్ ప్లే’లో రాశారు.
హర్దిత్ మాలిక్ సింగ్ తల్లి పేరు లజవంతి భగత్.
హర్దిత్ తన చిన్ననాటి జీవితాన్ని రావల్పిండిలో గడపడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వాన్ని దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికిందని స్టీఫెన్ బార్కర్ రాశారు.
ఆ సమయంలో ప్రసిద్ధ సిక్కు సాధువు అతార్ సింగ్ మస్తౌనా ప్రభావం హర్దిత్‌పై చాలా ఉండేదని స్టీఫెన్ రాశారు.
తాను అతార్ సింగ్‌ను కలవకపోయి ఉంటే, తన జీవితం మరో విధంగా ఉండేదని సైనిక చరిత్రకారుడు సోమ్‌నాథ్ సఫ్రూకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హర్ధిత్ చెప్పారు.
రావల్పిండిలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన తన 12 ఏళ్ళ వయసులో లాలా లజపతిరాయ్ లాంటి స్వాతంత్య్ర సమర యోధులను చూశారు.

ఫొటో సోర్స్, STEPHEN BARKER
14 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు
భారతీయులలో 18 ఏళ్లు పైబడిన యువకులు పై చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్ళడమనేది సాధారణమైన విషయమని బార్కర్ రాశారు.
కానీ 14 ఏళ్ళ వయసులోనే బ్రిటన్ స్కూల్, ఆపై చదువుల కోసం వెళ్ళడమనేది కొంత మంది మాత్రమే ఆలోచిస్తారు.
హర్దిత్ ఈస్ట్‌బోర్నే కాలేజీలో స్కూలింగ్ పూర్తి చేసుకున్నాక, ఆక్స్‌ఫర్డ్‌లోని బల్లైల్ కాలేజీలో చదివారు.
ఇక్కడే ఆయనకు అనేక మంది ప్రముఖులతో పరిచయం కలిగింది. వీరంతా తమ కళాశాల జీవితం తరువాత ఎన్నో ఘనతలు సాధించారు.
చిన్నప్పటి నుంచి హర్దిత్‌కు ఆటలపై ఆసక్తి ఉండేది. ఇంగ్లండ్ వచ్చాక కూడా ఆ ఆసక్తి కొనసాగి క్రికెట్‌పై మోజు పెరిగేలా చేసింది. ఆయన కాలేజీ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్ అయ్యారు.
ఆటలపై ఉన్న ఇష్టాన్ని ఆయన క్రికెట్‌కే పరిమితం చేసుకోలేదు. ఆయన మంచి గోల్ఫర్ కూడా.
హర్దిత్ మరణం తరువాత గోల్ప్ ఆసియా సొసైటీ ఆయనపై ఒక ఆర్టికల్ కూడా ప్రచురించింది.
ఈస్ట్‌బౌర్నే కాలేజీలో ఆయనకు ఎన్నో గుర్తులున్నాయి. అక్కడ ఆయన కాలేజీ తరపున క్రికెట్ ఆడేవారు. ఆయనతోపాటు క్రికెట్ ఆడిన దల్పత్ సింగ్ తరువాత జోధ్‌పూర్ అశ్వదళం మేజర్ అయ్యారు.
దల్పత్ సింగ్ 1918లో పాలస్తీనాలో జరిగిన హైఫా యుద్దంలో మరణించారు.

ఫొటో సోర్స్, STEPHEN BARKER
హర్దిత్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎలా చేరారు?
1917లో హర్దిత్ కాలేజీలో చదువుతున్నప్పుడు సహచర విద్యార్థులు చాలా మంది మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నారు.
దీంతో ఆయన కూడా యుద్ధంలో పాల్గొనాలని భావించారు.
ఆయన ఫ్రాన్స్‌లో రెడ్‌క్రాస్ తరపున అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేయడం మొదలుపెట్టారు.
21 ఏళ్ళ వయసులో ఫ్రాన్స్‌కు చేరుకున్న హర్దిత్‌కు భారత్ స్వాతంత్య్రం పొందాక అక్కడే భారత రాయబారి అవుతాననే విషయం తెలియదని స్టీఫెన్ రాశారు.
ఫ్రాన్స్‌లో అనుభవాలను హర్దిత్ ఆత్మకథలో రాసుకున్నారు.
‘‘ఆస్పత్రిలోని వారంతా నన్నో భారతీయ రాజుననుకుంటూ ఉండేవారు’’ అని ఆయన రాశారు.
‘‘ఫ్రెంచ్ రెడ్ క్రాస్‌తో పనిచేస్తున్నప్పటికీ హర్దిత్ మనసంతా నేరుగా యుద్ధంలో పాల్గొనడంపైనే ఉండేది’’ అని స్టీఫెన్ రాశారు.
ఈ ఆలోచనతోనే హర్దిత్ ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడమెలా అని తరచూ తన స్నేహితులను అడుగుతుండేవారు.
సైనిక నిబంధనలను పక్కనబెట్టి మరీ ఆయన్ను ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకున్నారని స్టీఫెన్ బీబీసీకి చెప్పారు.
ప్రపంచ యుద్ద సమయంలో బ్రిటన్ వైమానికదళంలో పైలట్ల కొరత ఉండేది. దీంతో భారతీయులను పైలట్లుగా నియమించుకోవాలని బ్రిటన్ భావించింది.
‘‘ఈ రిక్రూట్‌మెంట్ 1916 అక్టోబర్‌లో మొదలై, 1917 మార్చి వరకు కొనసాగింది. ఐదుగురు భారతీయులను నియమించుకున్నారు. వారిలో హర్దిత్ ఒకరు’’ అని స్టీఫెన్ వివరించారు.

ఫొటో సోర్స్, STEPHEN BARKER
‘తలపాగా తాకితే చంపేస్తానన్నా’
హర్దిత్ తన ప్రతిభతో ప్రతి చోటా గుర్తింపు పొందారు కానీ కొన్ని సందర్భాల్లో తన తలపాగా కారణంగా ఇబ్బందిపడ్డారు.
‘‘మిలటరీ యూనిఫామ్‌తోపాటు వచ్చే టోపీని కాకుండా, నేను నా తలపాగాను ధరించాను. ఓ సార్జంట్ మేజర్ నన్ను చూసి టోపీ ఎక్కడా అని అడిగారు. ఒక సిక్కుగా తలపాగా ధరించడం అవసరమని నేను ఆయనకు వివరించాను’’ అని హర్దిత్ ఆత్మకథలో రాసుకున్నారు.
‘‘ఇంతలో మరో అధికారి అక్కడకు వచ్చి సర్దిచెప్పారు. తరువాత ఈ విషయాన్ని సీనియర్ అధికారులు చర్చించారు. ఆపైన నన్ను తలపాగాతో కొనసాగడానికి అనుమతించారు’’ అని ఆయన రాశారు.
తన తలపాగాపై ఇతరులకు ఉండే ఆసక్తి గురించి కూడా హర్దిత్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
‘‘కళాశాలలో చదువుకునేటప్పుడు రాత్రి భోజనం పూర్తయ్యాక, ఐదారుగురు సహచర విద్యార్థులు నా చుట్టూ చేరి, తలపాగా తీయాలని అడిగేవారు. దాని కింద ఏముంటుందోననే ఉత్సుకత వారిలో ఉండేది’’ అని తెలిపారు.
‘‘కానీ నేను వారికి చాలా మృదువుగా సమాధానం చెప్పేవాడిని. ‘ఎవరైతే ముందు నా తలపాగాను ముట్టుకుంటారో వారిని చంపేస్తాను’ అని చెప్పేవాడిని. సిక్కులు కత్తులు కూడా ధరిస్తారని వారికి తెలుసు అందుకే ఈ సరదా విషయం సీరియస్ అవుతుందని వారు వెనుకడుగువేసేవారు’’ అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, LIBRARY-ARCHIVES.CANADA.CA
జిన్నాతో భేటీపై హర్దిత్ ఏమన్నారు?
హర్దిత్ సింగ్ మాలిక్ పాటియాలా స్టేట్‌కు ప్రధానిగా ఉన్న సమయంలో ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నాను కలిశారు.
దిల్లీలోని భగవాన్ దాస్ రోడ్డులోని హర్దిత్ సోదరుడు తేజా సింగ్ మాలిక్ ఇంట్లో ఈ సమావేశం జరిగింది.
‘‘ఇదో చరిత్రాత్మకమైన సమావేశం. నేనిప్పటిదాకా ఇలాంటి సమావేశానికి హాజరుకాలేదు’’ అని హర్దిత్ రాశారు.
‘‘జిన్నా ఎటువంటి సలహాదారుల తోడు లేకుండా వచ్చారు. కానీ మా పార్టీ మాత్రం మహారాజా భూపేందర్ సింగ్, తారా సింగ్, గైనీ కర్తార్ సింగ్ , నన్నూ ఈ సమావేశానికి పంపింది. సిక్కులు పాకిస్తాన్‌లో కలవాలని జిన్నా కోరుకున్నారు. ఇందుకోసం మా డిమాండ్లు ఏమిటో చెబితే వాటిని నెరవేర్చుతామని చెప్పారు’’ అని హర్దిత్ ఆత్మకథలో వివరించారు.
అయితే జిన్నా లేనిపక్షంలో ఆయన ఇచ్చిన మాటను పాకిస్తాన్‌లో ఎవరు నెరవేరుస్తారని అడిగితే, ‘‘నా మాట పాకిస్తాన్‌లో దేవుడి మాటతో సమానం’’ అని జిన్నా చెప్పారని హర్దిత్ రాశారు.
‘‘అలాంటి అహంభావం నిజంగా పిచ్చితనమే’’ అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీ హత్య రోజే హర్దిత్‌కు గుండెపోటు
‘‘జీవితంలో ఎంతో సాధించినవారు నాకు తెలిసి కొంత మందే ఉన్నారు’’ అని 1985 నవంబర్‌లో హర్దిత్ మరణం తరువాత కుష్వంత్ సింగ్ హిందుస్థాన్ టైమ్స్‌లో రాశారు.
హర్దిత్ అనేక రకాలైన మద్యాన్ని సేకరించేవారు. అలాగే ఆయన వివిధ రకాల ఆహార పదార్థాలను ఇష్టపడేవారని కుష్వంత్ సింగ్ రాశారు.
హర్దిత్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలను ఆరాధించేవారని, కానీ అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోకి సైన్యం ప్రవేశించినప్పుడు ఆయన గుండె బద్దలైందని, ఈ ఘటన తరువాత హర్దిత్ ఎప్పడూ విచారంగా ఉండేవారని కుష్వంత్ రాశారు.
‘‘ఇందిరా గాంధీ హత్య జరిగిన రోజు హర్దిత్ గుండెపోటుకు గురయ్యారు. అదే సమయంలో బయట సిక్కుల ప్రాణాలు తీయడానికి కొన్ని గుంపులు తిరుగుతున్నాయి. ఎలాగో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగలిగారు’’ అని కుష్వంత్ రాశారు.
ఇందిర మరణ వార్తను కుటుంబసభ్యులు ఆయనకు చెప్పలేదు.
హర్దిత్ మరణం తరువాత, ఆస్పత్రిలోని రోగులను భక్తిగీతాలు ఆలపించాలని ఆయన భార్య ప్రకాష్ కౌర్ కోరారని కుష్వంత్ సింగ్ తెలిపారు.
- పాకిస్తాన్‌లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- పాడేరు: మేఘాలు తాకే వంజంగి కొండపైకి టూరిస్టులు రాకపోతేనే బావుండని స్థానికులు ఎందుకంటున్నారు?
- షాపులో దొంగతనం చేసి పట్టుబడిన న్యూజీలాండ్ పార్లమెంటు సభ్యురాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














