Fastag: ఫాస్టాగ్ కేవైసీని జనవరి 31లోగా అప్డేట్ చేసుకోండిలా...

ఫాస్టాగ్

ఫొటో సోర్స్, Getty Images

జనవరి 31లోపు కేవైసీ(నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోతే ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఇటీవల ప్రకటించింది.

ఒకే నంబర్‌పై అనేక ఫాస్టాగ్‌లు ఉండడం, కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్ వినియోగిస్తుండడంతో ఎన్‌హెచ్‌‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు ఎన్‌హెచ్‌‌ఏఐ, 'ఒక వాహనం, ఒక ఫాస్టాగ్' కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఫాస్టాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫాస్టాగ్ కేవైసీ ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి?

ఫాస్టాగ్‌లో కేవైసీ ప్రధానం. కేవైసీ ద్వారా వినియోగదారు గుర్తింపు (ఐడెంటిటీ) నిర్ధరితమవుతుంది.

ఆర్థికపరమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వారి కేవైసీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇది ఫాస్ట్‌ట్యాగ్‌‌కు కూడా వర్తిస్తుంది.

కేవైసీ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే, బ్యాంకులో సంప్రదించి వివరాలు అప్డేట్ చేసుకోవాలి.

కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని దరఖాస్తు చేసుకుంటే, ఫాస్టాగ్ ఖాతా కేవైసీ వివరాలను బ్యాంకు అప్డేట్ చేస్తుంది.

టోల్‌గేట్ - ఫాస్ట్ ట్యాగ్

ఫొటో సోర్స్, Getty Images

కేవైసీ‌కి ఏయే పత్రాలు అవసరం?

భారత రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ఈ కింద పేర్కొన్న గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి అందజేయాల్సి ఉంటుంది.

  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటర్ ఐడీ
  • పాన్‌ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన ఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ పథకం) కార్డు.

గుర్తింపుకార్డుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అందజేయాలి.

ఫాస్టాగ్

ఫొటో సోర్స్, Getty Images

కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

ఫాస్టాగ్ యాక్టివ్‌లో ఉండి, కేవైసీ అప్డేట్ కాకపోతే ఇలా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

2.మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిల్ అవ్వాలి.

3.డ్యాష్‌బోర్డుపై కనిపించే 'మై ప్రొఫైల్‌'పై క్లిక్ చేయాలి.

4.ఆ తర్వాత కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి 'కస్టమర్ టైప్'ని ఎంచుకోవాలి.

5.అవసరమైన వివరాలు పొందుపరచడంతో పాటు, ఐడెంటిటీ కార్డ్ కాపీ, అడ్రస్ జతచేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఏడు రోజుల్లో మీ కేవైసీ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది.

ఒకవేళ మీరు ఇప్పటికీ ఫాస్టాగ్ కొనుగోలు చేయకపోయి ఉంటే, టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకులు, లేదా ఆన్‌లైన్‌లో కొనవచ్చు.

అనంతరం ఫాస్టాగ్‌ను మీ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవచ్చు.

ఫాస్టాగ్

ఫొటో సోర్స్, Getty Images

మినిమం కేవైసీ, ఫుల్ కేవైసీ: పరిమితి ఎంత?

'మినిమం కేవైసీ' పూర్తయిన వినియోగదారులు తమ ఫాస్టాగ్ వ్యాలెట్‌‌లో నెలకు రూ.10 వేల వరకూ ఉంచుకోవచ్చు. అలాగే, ఒక ఆర్థిక సంవత్సరానికి వ్యాలెట్‌‌లో నగదు లక్ష రూపాయలకు మించకూడదు.

'ఫుల్ కేవైసీ' వినియోగదారులు ఏడాదికి ఫాస్టాగ్ వ్యాలెట్‌‌‌ విలువ లక్ష రూపాయలకు మించకూడదు.

మీ సేవింగ్స్ ఖాతాను ఫాస్టాగ్‌తో లింక్ చేసినప్పుడు, మీ ఫాస్టాగ్ 'ఫుల్ కేవైసీ'గా అప్డేట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)