ఆంధ్రప్రదేశ్‌లో 826 తెలంగాణ బస్సులు.. తెలంగాణలో 638 ఏపీ బస్సులు... ఒప్పందం ఖరారు - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టీసీ బస్సుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలెత్తిన విబేధాలు పరిష్కారమయినట్టేనని ఇరు రాష్ట్రాల ఎండీలు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో చర్చల తర్వాత ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఐదేళ్ల కిందట ఆర్టీసీ విభజన జరిగినప్పటికీ అంతర్ రాష్ట్ర ఒప్పందం జరగలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న అవగాహన మేరకే బస్సులు నడుపుతూ వచ్చారు. అయితే కరోనా లాక్‌డౌన్ అనంతరం తిరిగి సర్వీసులు ప్రారంభించాల్సి ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పటికే మూడు లక్షల కిలోమీటర్లకు పైగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తెలంగాణాలో తిరుగుతుండగా, టీఎస్ ఆర్టీసీ కేవలం 90 వేల కిలోమీటర్ల మేర మాత్రం నడుపుతూ వస్తోంది. దాంతో ఈ విషయంపై ఒప్పందం జరగాలని టీఎస్ ఆర్టీసీ కోరడంతో పలుమార్లు చర్చలు జరిపారు. అటు హైదరాబాద్ తో పాటుగా విజయవాడలో కూడా ఈడీల స్థాయి అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు.
దసరా సందర్భంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ప్రైవేటు ఆపరేటర్లు నిర్ణయించిన ధరల మేరకు పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వచ్చింది. దాంతో ఇరు రాష్ట్రాల ఆర్టీసీల తీరు పట్ల సాధారణ ప్రజల్లో అసహనం వ్యక్తమయ్యింది. చివరకు తాజాగా ఇరు ఆర్టీసీల ఎండీలు సమావేశమై అవగాహన కుదుర్చుకున్నారు.
తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఒప్పందం కుదిరింది. అదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులు తెలంగాణ రాష్ట్ర పరిధిలో 1,60,999 కి.మీ. తిరిగేందుకు ఇరువురి మధ్య అవగాహన కుదర్చుకున్నారు. ఏపీలో 826 తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పుతారు. తెలంగాణలో 638 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ తిప్పుతుంది.
కొన్ని నెలలుగా దఫదఫాలుగా సాగిన చర్చలు ఫలితాలు రాకపవోడంతో సమస్యలు ఎదుర్కొన్న సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఈ ఒప్పందం ఊరటనిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల మధ్య ఒప్పందం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య మార్చి తర్వాత మళ్లీ రాకపోకలకు ఆర్టీసీలు సిద్ధమయ్యాయి. సుదీర్ఘ విరామంతో ఆంధ్రా, తెలంగాణా మధ్య బస్సులు తిరుగుతుండడంతో ఆన్ లైన్ రిజర్వేషన్లకు కూడా అనుమతి మంజూరుచేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK/JANGAONDEPT
అవగాహన ఒప్పందం ప్రకారం...
- టీఎస్ఆర్టీసీ 826 బస్సులతో ఏపీలో 1,61,258 కిలోమీటర్లు, ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 638 బస్సులతో 1,60,999 కిమీ దూరం బస్సులు నడవనున్నాయి.
- విజయవాడ మార్గంలో, టీఎస్ఆర్టీసీ 273 బస్సులతో 52,944 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 192 బస్సులతో 52,524 కిలోమీటర్లు నడుస్తాయి.
- కర్నూలు- హైదరాబాద్ మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఎపిలో 213 బస్సులతో 43,456 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 146 బస్సులతో 43,202 కిలోమీటర్లు నడుస్తుంది.
- వడపల్లి మీదుగా పిడుగురాల్ల/ గుంటూరు మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 57 బస్సులతో 19,044 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 88 బస్సులతో 20,238 కిలోమీటర్లు నడుస్తుంది.
- మాచర్ల మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 66 బస్సులతో 14, 158 కిలోమీటర్లు నడపనున్నది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 61 బస్సులతో 16,060 కిలోమీటర్లు నడపనున్నది.
- నూజివీడు తిరువూర్, భద్రాచలం- విజయవాడ మార్గంలో టీఎస్ ఆర్టీసీ అదే కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధం. అంటే తెలంగాణ, ఏపీలో 48 బస్సులతో 12,453, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 65 బస్సులతో 14,026 కిలోమీటర్లు నడుస్తాయి.
- ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మార్గంలో తెలంగాణ.. ఏపీలో 35 బస్సులతో 9, 140 కిలోమీటర్లు, ఏపీ తెలంగాణలో 58 బస్సులతో 11,541 కిలోమీటర్లు తిప్పనున్నారు.
- హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 19,004 కిలోమీటర్ల కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి ఈ మార్గంలో బస్సులు నడపదు.
- సత్తుపల్లి- ఏలూరు (2 మార్గాలు), భద్రాచలం మరియు మిగిలిన మార్గాల్లో కల్లూగుడెం, సత్తుపల్లి, విజయవాడ మార్గం మరియు ఇతర మార్గాల ద్వారా టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 8,159 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 28 బస్సులతో 3,408 కిలోమీటర్లు బస్సులు నడపనున్నాయి.
కాబూల్ యూనివర్సిటీపై సాయుధుల దాడి: 19 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ యూనివర్సిటీలో సోమవారం నాడు తుపాకులు ధరించిన దుండగులు దాడికి పాల్పడి కాల్పులు జరపటంతో 19 మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు.
అఫ్గాన్ భద్రతా బలగాలు ఈ దుండగులతో కొన్ని గంటల పాటు పోరాడాయి. బలగాల కాల్పుల్లో ముగ్గురు సాయుధులు చనిపోయారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
యూనివర్సిటీలో జరుగుతున్న ఇరాన్ పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యే సమయంలో.. ప్రభుత్వ అధికారులు రావటానికి కొద్ది నిమిషాల ముందు ఈ దాడి మొదలైంది.
ఈ దాడిలో తమ పాత్ర లేదని తాలిబన్ చెప్పింది. దాడిని ఖండించింది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు గత కొన్నేళ్లుగా అఫ్గానిస్తాన్‌లో విద్యా సంస్థలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.
గత నెలలో ఒక ట్యూషన్ సెంటర్ వెలుపల చేసిన దాడిలో 24 మంది చనిపోయారు. 2018లో కాబూల్ యూనివర్సిటీ ముందు జరిగిన దాడి కూడా తమపనేనని ఈ సంస్థ ప్రకటించుకుంది. ఆ దాడిలో డజన్ల మంది చనిపోయారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 47,725 కోట్లు కేటాయించాలి: పీపీఏ భేటీలో ఏపీ సర్కారు వాదన

పోలవరం ప్రాజెక్టు కోసం టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఆమోదించిన రూ. 47,725 కోట్ల వ్యయం కేంద్రం కేటాయించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రధానికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సోమవారం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ. 20,398 కోట్లు మాత్రమే కేటాయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణ నిధుల విషయమే ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి ఏర్పడింది.
ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహించారు. పీపీఏ సభ్యకార్యదర్శి రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ నిధులు మాత్రమే ఇస్తే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వాదించారు. రూ. 28 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే పునరావాసం, భూసేకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
మరోవైపు పోలవరం ముంపుపై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కిన్నెరసాని వరదల మూలంగా బూర్గుంపహాడ్ మండలంలో 48 వేల ఎకరాలకు ముంపు సమస్య ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం పీపీఏ దృష్టికి తీసుకొచ్చింది. భద్రాద్రి ఆలయం విషయంలో కూడా ముంపు సమస్య రాకుండా చూడాల్సి ఉంటుందని కోరింది.
పోలవరం నిర్మాణానికి అభ్యంతరం లేదని, కానీ పునరావాసం విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరింది. పూర్తి నిల్వ సామర్థ్యాన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తన లేఖలో పేర్కొన్నారు. దానికి సంబంధించి పీపీఏ భేటీలో ప్రత్యేకంగా చర్చించారు.
పీపీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు ఇరిగేషన్ ఈఎన్ సి.నారాయణ రెడ్డి బీబీసీకి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గతంలో ఆమోదించిన దాని ప్రకారం నిధులు ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. దాంతో పాటుగా పునరావాస ప్యాకేజీని కూడా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంగా పరిగణించాలని కోరామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరుపున ముంపు ప్రాంతాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు గతంలోనే వాటిపై సర్వే జరిగిన విషయాన్ని గుర్తు చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ముంపు సమస్య ఉండదని చెప్పామన్నారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ, చైర్మన్‌కి రైతు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017-18 ధరల స్థాయి ప్రాతిపదికగా సమర్పించిన డీ.పి.ఆర్ -2పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక నిపుణుల బృందాలు ఏడాదిన్నర పాటు లోతైన అధ్యయనం, క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి రూ. 55,548.87 కోట్ల వ్యయ అంచనాకు వచ్చినట్టు గుర్తు చేశారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సాంకేతిక సలహా కమిటీ కూడా వాటికి ఆమోద ముద్రవేశాయన్నారు. ఈ మొత్తం ప్రక్రియను తృణీకరిస్తూ వ్యయ అంచనా పైన, నిథుల మంజూరు పైన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివాదానికి తెరలేపడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
సాంకేతిక సలహా మండలి ఆమోదించిన రూ. 55,548.87 కోట్ల వ్యయ అంచనాకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఆమోదించాలని వారి వినతిపత్రంలో కోరారు.
ఇవి కూడా చదవండి:
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి నీళ్లు.. వైఫల్యమా, ఘనతా?
- పోలవరం ప్రాజెక్టు: ''మునిగిపోయే మండలాలే కదా అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు''
- పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: అసలేం జరుగుతోందక్కడ?
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- కాళేశ్వరం: ఈ ప్రాజెక్టు తెలంగాణను మాగాణం చేస్తుందా?
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలివి: BBC Special Report
- కరోనావైరస్కు మందు కనిపెట్టడంలో దారి చూపుతున్న 14 ఏళ్ల తెలుగమ్మాయి
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








