టోల్‌గేట్ వద్ద తగాదాలు ఎందుకు? రాజకీయ నాయకులు ఏం చేయాలి... ఏం చేస్తున్నారు?

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
టోల్ ప్లాజాల వద్ద తగాదాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి ఉదంతం వివాదాస్పదమైంది. ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేసే వరకూ వెళ్లింది. అయితే తనపై టోల్‌గేట్ సిబ్బంది దాడి చేసి, కించపరిచారని ఆమె అంటున్నారు. డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.
గతంలో కూడా పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా టోల్ చెల్లించే క్రమంలో వివాదాలకు దిగిన అనుభవాలున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన నేతలు టోల్ ప్లాజాల వద్ద హంగామా సృష్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు టోల్ గేట్ వద్ద నిబంధనలు ఏంటి? టోల్ ఫీ ఎవరి దగ్గర వసూలు చేయాలి? ఎవరికి మినహాయింపునిస్తారనేది చర్చనీయాంశం అవుతోంది.
దేశంలో సుదీర్ఘకాలం పాటు రోడ్డు సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యతగా ఉండేది. ఆతర్వాత 1991 లో నూతన ఆర్థిక విధానాల ప్రారంభంతో.. రోడ్లు, వంతెనల నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఓ సంస్థకు అప్పగించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యత కూడా వారికే అప్పగించే పద్ధతి అమలులోకి వచ్చింది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్( బీవోటీ) పేరుతో ప్రస్తుతం ఈ విధానం అమలులో ఉంది.
తొలుత జాతీయ రహదారుల చట్టం (1956) ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 2008లో టోల్ ఫీజుల వసూళ్ల కోసం చట్టాన్ని సవరించారు. 6లైన్లు, 4 లైన్ల రహదారులపై టోల్ ఫీజు వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. దేశంలో 2016 నాటికి కేవలం జాతీయ రహదారులపై 390 చోట్ల టోల్ గేట్లు ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

ఏపీలో సుదీర్ఘంగా సాగుతున్న జాతీయ రహదారి 16ని పరిశీలిస్తే ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ 20 చోట్ల టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో 977 కిలోమీటర్ల మేర ఉన్న ఈ జాతీయ రహదారిపై దాదాపుగా ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక చోట టోల్ ప్లాజా ఉంది. ఇక విజయవాడ నుంచి విశాఖ వెళ్లాలంటే 7 చోట్ల చెల్లించాల్సిన టోల్ ఫీజు మొత్తం 4 వీలర్ కారుకి దాదాపుగా రూ. 700 ఉంటుంది. 350 కిలోమీటర్ల పైబడిన దూరానికి కిలో మీటర్‌కి సుమారుగా రూ. 2 చొప్పున చెల్లించాల్సి వస్తోంది.
అదే సమయంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాల్సి వచ్చినా నాయుడుపేట వరకూ జాతీయ రహదారిపై 7 చోట్ల టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 411 కిలోమీటర్ల దూరంలో సుమారుగా రూ. 800 టోల్ ఫీజును వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రారంభంలో తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత తెలియకుండానే టోల్ ఫీజు పెరిగిపోయింది. ఓవైపు పెట్రో భారం, మరోవైపు టోల్ పీజుల భారం వినియోగదారులకు భారం అవుతోంది. పైగా ఫాస్టాగ్ వచ్చిన తర్వాత రెండు వైపులా కలిపి వసూలు చేసే ప్రక్రియను నిలిపివేశారు. దీంతో విడివిడిగా చెల్లించాల్సి వస్తోంది. ఇది మరింత భారంగా మారింది. ప్రభుత్వాలు రోడ్ల నిర్వహణ పేరుతో టోల్ ట్యాక్స్ తీసుకొచ్చి, ఇప్పుడు మొత్తం ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్టు కనిపిస్తోంది అంటూ గుంటూరుకి చెందిన మద్దాలి వీరేష్ బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.

టోల్ గేట్ లో మినహాయింపు ఎవరికీ
టోల్ ఫీజు ప్రతీ ఒక్కరూ చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. కొందరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు మినహాయింపునిస్తున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. మినహాయింపులు కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటుగా, ఎంపీలు, సుప్రీంకోర్ట్, హైకోర్టు జడ్జీలు, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌కి మినహాయింపులు ఉన్నాయి. ఇక ఆర్మీ అధికారులు, ప్రభుత్వ వ్యవహారాల నిమిత్తం వచ్చిన విదేశీ ప్రతినిధులు, పరమ్ వీర్ చక్ర, శౌర్య చక్ర, మహావీర్ చక్ర వంటి అత్యున్నత పురష్కారాలు అందుకున్న వారికి కూడా టోల్ ఫీజు నుంచి దేశవ్యాప్తంగా మినహాయింపులు ఉంటాయి.
ఇక ఆయా రాష్ట్రాల పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మినహాయింపు ఉంటుంది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వారు ఆయా వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే మినహాయింపు అమలవుతుంది.
ఇక అంబులెన్సులు, ఆర్మీ వాహనాలు , పైర్ సిబ్బంది వాహనాలు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ప్రయాణిస్తున్నప్పుడు ఆయా వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక అంతిమయాత్ర నిమిత్తం వినియోగిస్తున్న వాహనాలకు కూడా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
వాటితో పాటుగా టోల్ ప్లాజాకి సమీపంగా 10 కి.మీ.ల దూరం నివసిస్తున్న వారికి నెలకు 150 రూపాయలు, 20 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వారికి 300 రూపాయల నెలవారీ పాసులు కూడా అనుమతిస్తారు.

ఎక్కువ వివాదాలు అందుకే వస్తున్నాయి...
ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారు ప్రయాణిస్తున్న సమయంలో టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనే నిబంధన ఉంది. కానీ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుచరులు కూడా తమ వాహనాలకు ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో తిరుగుతుండడం సర్వ సాధారణం. ముఖ్యంగా ఒక్కొక్కరికీ రెండు మూడు వాహనాలున్నప్పుడు వాటికి కూడా స్టిక్కర్ ఉంటుంది. దాంతో తమ వాహనాలకు మినహాయింపు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న సందర్బంలోనే ఎక్కువ వివాదాలు వస్తున్నాయి.
గత ప్రభుత్వ హయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వాహనానికి టోల్ ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో అప్పట్లో ఆమె వీరంగం చేశారు. నల్గొండ జిల్లాలోని ఓ టోల్గేట్ వద్ద 2019 మే 18 నాడు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగడం వివాదానికి దారితీసింది. అంతకుముందు పలు చోట్ల టోల్ గేట్ వద్ద పలువురు నేతల తనయులు, బంధువులు తగాదాలకు దిగడం, కొన్ని సార్లు టోల్ ఫ్లాజాల మీద దాడులకు పాల్పడడం వంటి ఘటనలు జరిగాయి.

ఫొటో సోర్స్, BBC Sport
వడ్డెర కార్పోరేషన్ చైర్మన్ వివాదంలో కేసు నమోదు
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నాయకురాలు రేవతి తమపై దురుసుగా ప్రవర్తించారని టోల్ గేట్ నిర్వాహకులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దాంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నెంబర్ 538 2020 గా కేసు నమోదు చేశారు. ఐపీసీ 294-బీ, 323, 342 వంటి సెక్షన్లు ఆమెపై నమోదు చేశారు. టోల్ గేట్ వద్ద ఆమె కారుని ఆపిన టోల్ ప్లాజా సిబ్బందిపై రేవతి చేయి చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై ఆమె టోల్ ప్లాజా సిబ్బందిపై ఎదురుదాడి చేశారు. తాను కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె బీబీసీకి తెలిపారు. ‘‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. కానీ టోల్ ప్లాజా సిబ్బంది తీరు మూలంగానే కారు దిగాల్సి వచ్చింది. నాపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేశారు. నేను అన్ని వివరాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తాను. మా అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం అత్యవసరం అని చెప్పినా వినలేదు. నాకు రెగ్యులర్ పాస్ కూడా ఉంది. అయినా అనుమతించకుండా , అవమానపరిచేలా మాట్లాడారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి...
రేవతి తీరుని టోల్ ప్లాజా సిబ్బంది తప్పుబడుతున్నారు. ఈమేరకు సదరు టోల్ ప్లాజా మేన్ పవర్ మేనేజర్‌గా ఉన్న కే ప్రవీణ్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన బీబీసీకి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ‘‘మా సిబ్బంది చెప్పినా వినకుండా ఆమెకు దూసుకువచ్చారు. పైగా చెంపదెబ్బ కూడా కొట్టారు. అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. దాని ప్రకారం చట్ట ప్రకారమే మేము వ్యవహరిస్తున్నాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’’అని అన్నారు.
టోల్ ప్లాజాల నిర్వహాకులపై పలు విమర్శలున్నాయి. జాతీయ రహదారుల నిర్వహణ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం టోల్ ఫీజుల వసూళ్ల కోసం శ్రద్ధ పెట్టడమే తప్ప రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా ఖాతరు చేయడం లేదని అంటున్నారు.
రాజమండ్రికి చెందిన ఎస్ వాసు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘గోదావరి వంతెన దాటగానే కొవ్వూరులో టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. కానీ వంతెనకు ఇటు రాజమండ్రి వైపు రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయినా పట్టించుకోవడం లేదు. వర్షాలు వచ్చినప్పుడు లారీలు మొల లోతు గోతుల్లో పడిపోతున్నాయి. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. అనేక మంది ఆందోళనలు చేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లాంటి వాళ్లు స్వయంగా నిరసన వ్యక్తం చేశారు. అయినా లెక్కలేదు. టోల్ వసూళ్లు మాత్రం ఆపలేదు. రోడ్డుని బాగు చేయకుండా ఇలాంటి దందాలు చేయడం దారుణం’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీలో కొత్తగా స్టేట్ హైవేలపై కూడా టోల్ ఫీజు
ఏపీలో జాతీయ రహదారులతో పాటుగా ఎంపిక చేసిన రాష్ట్ర రహదారులపై కూడా టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్లు, జీపులకు కిలోమీటర్‌కు 90 పైసలు, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు, మినీ బస్సులకు రూపాయి 80 పైసలు, బస్సు, లారీలకు 3 రూపాయల 55 పైసలు, భారీ వాహనాలకు 8 రూపాయల 90 చొప్పున టోల్ ఫీజులుగా వసూళ్లకు రాష్ట్రం శ్రీకారం చుట్టింది.
టోల్ ఫీజు నిర్వాహకుల తీరు మార్చుకోవాల్సిన అవసరముందని సామాజిక వేత్త కే ఎస్ రాజు అభిప్రాయపడ్డారు. . ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం రేవతి, ఇంతకుముందు పలువురు నేతలకు ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. కొన్ని సార్లు అనుమతిస్తూ, మరికొన్ని సార్లు టోల్ ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబడుతూ ఉంటారు. అంతేగాకుండా కొందరి వ్యవహారశైలి కూడా అభ్యంతరకరంగా ఉంటుంది. అలాంటి వారిని నియంత్రించాలి. నాయకులు, అధికారుల పట్ల సామరస్యంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలి. రోడ్ల నిర్వహణకు ప్రాధాన్యతనివ్వడం మరచిపోయినట్టుగా ఉంది. కానీ టోల్ ఫీజుల కోసం ప్రముఖుల వాహనాలను ఆపినప్పుడు వారితో వ్యవహరించే పద్ధతి మార్చుకోవాల్సి ఉంది’’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొందరు నాయకులు కూడా తాము అందరికీ అతీతులమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అందుకే టోల్ ప్లాజాల వద్ద కూడా తగాదాలకు దిగుతుంటారని గుంటూరుకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నాయకులు తమ హోదాలకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కొందరు అది మరచిపోతున్నారు. మంత్రి భార్య, ఓ కార్పొరేషన్ చైర్మన్ వంటి వారు కూడా టోల్ ఫీజు చెల్లించడానికి పట్టుబట్టడాన్ని ఏమనాలి. వాళ్ల వ్యవహారాలు మీడియాలో వచ్చాయి గానీ నిత్యం టోల్ ప్లాజాల వద్ద తగాదాలు చాలా సాధారణం. అవి కొన్నిసార్లు హద్దులు దాటుతున్నాయి. ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్య రాదు. ముఖ్యంగా, ఏపీ రాజధాని ప్రాంతంలో కాజ వద్ద టోల్ గేట్ తొలగించాలి. నిత్యం విజయవాడ, గుంటూరు మధ్య తిరిగే స్థానికులకు ఇది భారం అవుతోంది. గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఫలితం లేదు. అందుకే అక్కడ ఎక్కువ తగాదాలు వస్తున్నాయి." అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








