టోల్‌గేట్ దగ్గర వాహనాల వరుస వంద మీటర్లు దాటితే, టోల్ తీసుకోకుండానే పంపాలి-ఎన్‌హెచ్ఏ : ప్రెస్ రివ్యూ

టోల్ గేట్ దగ్గర రద్దీ

టోల్ గేట్ల దగ్గర వాహనాలు సాఫీగా సాగిపోయేలా ఎన్‌హెచ్ఏ టోల్ గేట్ నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

జాతీయ రహదారుల్లో రద్దీ గరిష్ఠంగా ఉన్న సమయంలోనూ టోల్‌గేట్ల వద్ద ఒక్కో వాహనం పది సెకన్లకు మించి వేచి ఉండటానికి వీల్లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది.

ఇందుకు అనుగుణంగా వాహనాలు సాగిపోవడానికి చర్యలు తీసుకోవాలని రహదారి నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేసిందని ఈనాడు చెప్పింది.

టోల్‌గేట్ల వద్ద వాహనాల వరుస వంద మీటర్లకు మించి ఉండకూడదని స్పష్టం చేసింది. వందశాతం ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ పూర్తిగా తగ్గినప్పటికీ, కొన్నిచోట్ల మాత్రం విభిన్న కారణాల వల్ల వంద మీటర్లకు మించి వాహనాలు వరుసలో ఉంటున్నట్లు గుర్తించారు.

ఇలాంటి సమయాల్లో క్యూ వంద మీటర్ల లోపునకు వచ్చేంతవరకు ముందున్న వాహనాలను టోల్‌ఫీజు లేకుండానే వేగంగా వదిలేయాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు అన్ని టోల్‌బూత్‌ల వద్ద వంద మీటర్ల దూరంలో ఒక పసుపుపచ్చ లైన్‌ గీయనున్నారు.

వాహనాలు ఎప్పుడు ఆ లైన్‌ దాటి నిల్చున్నా ముందున్న వాహనాలను టోల్‌ లేకుండా వేగంగా పంపేసి మిగతా వాహనాలు ఆ లైన్‌లోపు ఉండేలా చూసుకోవాలి.

టోల్‌ప్లాజా సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జాతీయ రహదారుల్లో వందశాతం నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఫాస్టాగ్‌ వినియోగం సగటున 96 శాతానికి చేరింది. కొన్ని టోల్‌గేట్ల వద్ద ఇది 99 శాతం వరకూ ఉంటోంది.

ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూళ్లు పెరిగిన దృష్ట్యా వచ్చే పదేళ్లకాలంలో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త డిజైన్లలో టోల్‌ప్లాజాలను నిర్మించాలని నిర్ణయించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ చెప్పిందని ఈనాడు వివరించింది.

తెలంగాణలో టీకా

ఫొటో సోర్స్, Reuters

తెలంగాణలో రేపటి నుంచి 'సూపర్ స్ప్రెడర్‌'లకు టీకా

తెలంగాణలో సూపర్ స్ప్రెడర్‌గా గుర్తించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి టీకా వేయనుందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో సూపర్‌స్ర్పెడర్స్‌గా గుర్తించిన వివిధ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వ్యాక్సిన్‌ను అందించాలని నిర్ణయించింది.

ఈ నెల 28న వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. సూపర్‌స్ర్పెడర్స్‌లో తొలుత వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వాళ్లు 7.75 లక్షల మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివా్‌సరావు బుధవారం చెప్పారని పత్రిక రాసింది.

ఇందులో ఆరు లక్షల మందికిపైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నారు. వ్యాక్సిన్‌ అందుకోబోయే సూపర్‌స్ర్పెడర్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్యాస్‌, పెట్రోల్‌ డీలర్ల సిబ్బంది, చౌకధరల దుకాణాల డీలర్లు, లిక్కర్‌ షాప్‌ సిబ్బంది ఉన్నారు.

ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, రైతుబజార్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయలు, పూలు, పళ్లు అమ్మేవాళ్లు, చికెన్‌, మటన్‌షాపుల్లో పని చేసేవారితో పాటు కిరాణా, బార్బర్‌ షాపుల్లో పని చేసేవారికి వ్యాక్సిన్‌ వేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాక్సిన్‌ అందుకోబోయే వీరి సంఖ్య ఆరు లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌ విషయమై రవాణా, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయం చేస్తారు.

ఇతరుల సమన్వయ బాధ్యతను జీహెచ్‌ఎంసీ చూసుకుంటుందని ఆంధ్రజ్యోతి వివరించింది.

జగన్ ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీలో మధ్యతరగతి ప్రజలకు వచ్చే ఉగాదికి ఇళ్ల స్థలాలు

వచ్చే ఏడాది ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్‌లోని మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో మూడు లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్‌ 2) ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

జూన్‌ 1వ తేదీన పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సిందేనని, ఈలోగా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

'స్పందన'లో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. మధ్య తరగతి ప్రజలకు (ఎంఐజీ) అందించే ఇళ్ల స్థలాల గురించి కూడా మాట్లాడారు...

"పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో 3 లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్‌ 2న) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

వివాదాలు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం 17 వేల ఎకరాల భూమి కావాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల సేకరణ చేపట్టి మూడు కేటగిరీల్లో 133.33 గజాలు, 146.66 గజాలు, 194.44 గజాలలో ప్లాట్లు అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు కేటాయించాలి.

వాటిలో భూగర్భ కేబుల్, విద్యుత్‌ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా, వాటర్‌ డ్రెయిన్ల నిర్మాణం లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి" అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించరాని సాక్షి వివరించింది.

నిజామాబాద్ జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు

ఇది సమ్మె చేసే సమయం కాదు- జూ.డా.లకు సీఎం పిలుపు

తెలంగాణలో విపత్కర పరిస్థితులు ఉన్నాయని, వెంటనే విధుల్లో చేరాలని జూ.డా.లను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవవేతనాన్ని 15 శాతం పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

మూడేండ్ల వైద్య విద్య అభ్యసించి కొవిడ్‌ సేవలు కొనసాగిస్తున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సూచించారు.

కరోనా సేవలందిస్తున్న జూనియర్‌ డాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్‌లో ఇప్పటికే ఇస్తున్న వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించాలని పేర్కొన్నారని పత్రిక చెప్పింది.

నిబంధనల మేరకు ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని ఆదేశించారు.

బుధవారం ప్రగతిభవన్‌లో వైద్యారోగ్యశాఖ అధికారులతో కరోనా పరిస్థితి, వాక్సినేషన్‌ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

'జూనియర్‌ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు, పరిషరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిషరించుకోవచ్చు. అంతేకానీ, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా.. సమయం సందర్భాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిషరించడం సరైన పద్ధతి కాదు. అదికూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు' అని సీఎం కేసీఆర్‌ అన్నారని పత్రిక చెప్పింది.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు సూచించారు.

జూనియర్‌ డాక్టర్లపై ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపలేదని.. వారి న్యాయమైన సమస్యలను పరిషరిస్తూనే ఉన్నదని, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)