రైతుల ఆందోళన: ఆరు నెలలుగా వెనక్కు తగ్గని రైతులు, పరిష్కారం వెతకని కేంద్ర ప్రభుత్వం

రైతుల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కీర్తీ దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2020, నవంబర్ 26. పంజాబ్, హరియాణా, యూపీ నుంచి వేలాది రైతులు గుంపులు గుంపులుగా దిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు.

రైతులు రాజధానిలోకి చేరుకోకుండా జాతీయ రహదారి తవ్వేశారు. చలి రాత్రుల్లో వారిపై నీళ్లు కొట్టారు.

ఆ తర్వాత కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరికేంగా ప్రదర్శనలు చేసిన రైతులు దిల్లీ చుట్టుపక్కల సరిహద్దుల్లోనే గుడారాలు వేసుకుని ఉండిపోయారు.

2021 మే 26. వాతావరణం మారింది. ఎండలకు ఉక్కపోతగా ఉంది. రైతుల నిరసనలకు ఆరు నెలలు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లూ పూర్తయ్యాయి.

రైతు సంఘాల యునైటెడ్ ఫ్రంట్ మే 26న 'బ్లాగ్ ఫ్లాగ్ డే'గా ప్రకటించింది. వ్యవసాయ చట్టాలపై రైతులతో తక్షణం చర్చలు ప్రారంభించాలని, లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఈ నిరసనలు నిజానికి పంజాబ్, హరియాణాలో 2020 సెప్టెంబర్ నుంచే ప్రారంభమయ్యాయి.

కానీ, తమ గళం దిల్లీకి చేరడం లేదని అనిపించడంతో రైతులు గత ఏడాది నవంబర్‌లో దిల్లీ వైపు బయల్దేరారు. గత ఆరు నెలలుగా రైతులు రోడ్లపై గుడారాలు, ట్రాలీలనే తమ నివాసాలుగా మార్చుకున్నారు.

స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద, సుదీర్ఘ రైతు ఉద్యమం ఇదే. కానీ ఇది ఎలా మొదలైంది. ఈ ఆరు నెలల్లో రైతుల నిరనల్లో ఏమేం జరిగాయి. తెలుసుకుందాం.

2021 మే 21న 40 రైతు సంఘాల సమూహం యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశింది. మూడు వ్యవసాయ చట్టాలపై వెంటనే రైతులతో మళ్లీ చర్చలు ప్రారంభించాలని కోరింది.

"ప్రభుత్వం వైపు నుంచి జరిగిన చర్చలకు రైతులు పూర్తి సహకారం అందించారు. కానీ మా కనీస డిమాండ్లు, నిరసనలపై పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైంది" అని లేఖలో రాశారు. రైతులు "రైతులు ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు, వేరే ఏదైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం అయ్యుంటే ఈ చట్టాలను వెనక్కు తీసుకునేది" అన్నారు.

రైతుల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

"మే 26న మేం బుద్ధపూర్ణిమ పూజలతో మేం ప్రారంభిస్తాం. ఎక్కడెక్కడ నిరసనలు జరుగుతున్నాయో, అక్కడ ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగరవేస్తాం. మేం పంజాబ్‌లో ర్యాలీ చేస్తున్నాం. కానీ, దిల్లీలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ర్యాలీ లేదా పరేడ్ చేయడం లేదు" అని బీబీసీతో మాట్లాడిన యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ నేత దర్శన్‌పాల్ సింగ్ చెప్పారు.

"మేం మా డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. ఇక నరేంద్ర తోమర్(వ్యవసాయ మంత్రి) మేం ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకుని రాలేదంటున్నారు. ప్రభుత్వం మీది. ఆ పని మీరు చేయాలి. మేం మా డిమాండ్లు మీ ముందుంచాం. మా డిమాండ్లపై నిలబడ్డాం. మా ముందు తరాలవారి భవిష్యత్తు ప్రమాదంలో పడింది" అన్నారు.

ప్రభుత్వం, నిరసనలు చేస్తున్న రైతుల మధ్య గత నాలుగు నెలలుగా ఎలాంటి చర్చలు జరగలేదు. సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి న్యూస్ చానళ్లు, ప్రభుత్వ ఎజెండా నుంచి పూర్తిగా బయట ఉన్నట్లు కనిపిస్తోంది.

భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన ధర్మేంద్ర మలిక్ యూపీ గాజీపూర్ సరిహద్దు నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.

"మేం కరోనా ఉందని రైతులను ఇక్కడికి రావద్దని చెప్పాం. కానీ ఈసారీ నల్ల జెండాలు ప్రతి గ్రామంలో ఎగురుతాయి" అని బీబీసీతో అన్నారు.

రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు తక్కువగా జరిగాయని కాదు. లెక్కపెడితే కనీసం 11 సార్లు రెండు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఆ సమావేశాల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు.

ఈ 11 సమావేశాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా అవసరమే

2020 అక్టోబర్ 14

2020 సెప్టెంబర్‌లో కేంద్రం వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. పంజాబ్‌లో రైతుల ప్రదర్శన తీవ్రం అయ్యింది.

రైతులు రైల్ రోకో చేశారు. దాంతో థర్మల్ ప్లాంట్స్‌కు సరఫరా అయ్యే బొగ్గుపై ప్రభావం పడింది. ఫలితంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులను అక్టోబర్ 14న చర్చలకు ఆహ్వానించింది.

ఈ సమావేశం కోసం 29 మంది రైతు నేతలు దిల్లీ వచ్చారు. కానీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగ్రవాల్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన రైతుల నేతలు తమ డిమాండ్లు ఉన్న ఒక పత్రాన్ని ఆయనకు ఇచ్చి తిరిగి వెళ్లిపోయారు.

తర్వాత 2020 నవంబర్‌లో మరోసారి రైతు నేతలను చర్చలకు ఆహ్వానించారు. ఈసారీ కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఆ చర్చల తర్వాత 250 రైతు సమూహాలున్న ఆల్ ఇండియా సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. ఎంఎస్‌పీ గ్యారంటీ డిమాండును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని, చర్చలు ఫలించలేదని చెప్పింది.

రైతు సంఘాల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

2020 డిసెంబర్‌ 1

డిసెంబర్ 1న జరిగిన రెండో విడత చర్చల్లో కేంద్రం తమ తరఫున ఐదుగురు సభ్యుల కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. వ్యవసాయ చట్టాల గురించి వ్యక్తమవుతున్న ఆందోళనలకు పరిష్కారం వెతకడానికి అది ప్రయత్నిస్తుందని చెప్పింది.

కానీ రైతులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

2020 డిసెంబర్ 3

సుదీర్ఘంగా సాగిన చర్చల్లో 3 వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకోవాలని రైతులు పట్టుబట్టారు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, స్నాక్స్ తీసుకోడానికి కూడా నిరాకరించారు.

2020 డిసెంబర్ 5

నాలుగు గంటల పాటు జరిగిన చర్చల తర్వాత ముగ్గురు కేంద్ర మంత్రులు, అధికారులు తుది ప్రతిపాదనను రైతుల ముందు ఉంచడానికి, తదుపరి చర్చల కోసం రైతు నేతలను సమయం కోరారు.

2020 డిసెంబర్ 8

ఈ సమావేశానికి ముందు రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాత్రి జరిగిన చర్చల్లో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. అందులో రైతులకు 22 పేజీల ప్రతిపాదనలు ఇచ్చారు.

అందులో ఎంఎస్‌పీపై భరోసా ఇచ్చారు. ఈ చట్టాల వల్ల ప్రభుత్వ మండీలు బలహీనం కావని స్పష్టత ఇచ్చారు. కానీ రైతులు వాటిని తోసిపుచ్చారు. నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు.

రైతుల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

2020 డిసెంబర్ 30

ఈ సమావేశంలో రైతుల రెండు డిమాండ్లు అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఒకటి విద్యుత్ సవరణల చట్టం 2020ను వెనక్కు తీసుకోవడం. రెండోది గడ్డి తగలబెట్టడంపై వేసిన భారీ జరిమానాలు రద్దు.

కానీ, మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకోవడం, ఎంఎస్‌పీపై చట్టం చేయడాన్ని ప్రభుత్వం తమ ఎజెండాలో చేర్చాలని యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ పట్టుబట్టింది. తమ ప్రధాన డిమాండ్లు లేకుండా చర్చలు ముందుకు వెళ్లవని స్పష్టం చేసింది.

2021 జనవరి 4

కొత్త ఏడాదిలో తొలి చర్చలు నాలుగు గంటలపాటు జరిగాయి. వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకోవడం తప్ప తమకు వేరే ఏదీ వద్దని రైతులు స్పష్టం చేశారు. లంచ్ సమయంలో ప్రభుత్వం అందించిన భోజనం కూడా తిరస్కరించారు.

ఈ సమావేశం తర్వాత "రెండు చేతులతో కొడితేనే చప్పట్లు మోగుతాయి" అని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

2021 జనవరి 8

ఈ చర్చల్లో చట్టాలు వెనక్కు తీసుకుంటేనే, మేం తిరిగి ఇళ్లకు వెళ్తామని రైతులు స్పష్టం చేశారు. కానీ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోడానికి ప్రభుత్వం నిరాకరించింది.

రైతుల్లో ఒక పెద్ద భాగం ఈ చట్టాలను సమర్థిస్తోందని, రైతులు మొత్తం దేశం గురించి ఆలోచించాలని అప్పుడు నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

కానీ, జనవరి 11న సుప్రీంకోర్ట్ ఈ అంశంలో విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాల వరకూ కొత్త చట్టాలపై స్టే విధించింది. ఆ తర్వాత కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి, రెండు పక్షాల వాదనలు విని తమకు నివేదిక అందించాలని సూచించింది.

2021 జనవరి 15

ఈ సమావేశంలో ప్రభుత్వం, రైతు నేతల మధ్య చర్చలు అసలు ముందుకు వెళ్లలేదు.

సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటును కేంద్రం స్వాగతించింది. కమిటీకి తమ వాదన వినిపిస్తామని చెప్పింది. ఈ వివాదానికి పరిష్కారం వెతకాలనుకుంటున్నట్లు తెలిపింది.

రైతుల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

2021 జనవరి 20

ఈ సమావేశంలో ప్రభుత్వం వైపు నుంచి వ్యవసాయ చట్టాలపై ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామనే ప్రతిపాదన వచ్చింది. ఆలోపు ప్రభుత్వ అధికారులు, రైతు నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ దీనికి ఒక పరిష్కారం వెతుకుతుందని, సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు నిరసనలు విరమించి తిరిగి ఇళ్లకు వెళ్లాలని కోరింది.

దీనిపై వెంటనే సమాధానం ఇవ్వకుండా రైతు సంఘాలు కాస్త సమయం కోరాయి.

జనవరి 21న దీనిపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రైతు సంఘాల నేతలు ఏడాదిన్నర పాటు చట్టాలను నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దాన్ని మేం తోసిపుచ్చుతున్నామని, జనవరి 22న చర్చల్లో పాల్గొంటామని చెప్పారు.

2021జనవరి 22

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు తోసిపుచ్చారు. మరోసారి వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం-రైతుల మధ్య ఎలాంటి చర్చలూ జరగలేదు.

ఖలిస్తాన్ కుట్ర ఆరోపణలు

ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఈ నిరసనల వెనుక ఖలిస్తాన్ ఫండింగ్ ఉందంటూ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. నిరసనల్లో పాల్గొన్న కొన్ని సంఘాల నేతలకు, సమ్మన్లు కూడా పంపింది.

రైతు నిరసనల్లోకి చొరబడిన కొన్ని సంస్థలు, దేశంలో భయాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టడానికి చూస్తున్నాయని ఎన్ఐఏ తమ రిపోర్టులో చెప్పింది.

కొన్ని సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయని అది చెప్పింది. భారత్‌లోని అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ రాయబార కార్యాలయాల బయట జరిగిన నిరసనలు కూడా ఆ కుట్రలో భాగమని తెలిపింది.

దేశంలో బీభత్సం సృష్టించడానికి భారీగా నిధులు సేకరించి, ప్రభుత్వేతర సంస్థల ద్వారా వాటిని ఖలిస్తాన్ మద్దతు గ్రూపులకు అందిస్తున్నట్లు ఎన్ఐఏ చెప్పింది.

కొన్ని సంస్థలపై నిషేధం విధించిన ఎన్ఐఏ వాటిపై యూఏపీఏ సెక్షన్లు కూడా నమోదు చేసింది. అయితే ఆ విచారణ ఎంతవరకూ వచ్చింది, అందులో ఏం తేలింది అనేది చెప్పలేదు.

రైతుల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

2021 జనవరి 26

రిపబ్లిక్ డే సందర్భంగా రైతు సంఘాలు దిల్లీలో ట్రాక్టర్ పరేడ్‌కు పిలుపునిచ్చాయి. ఈ ర్యాలీకి అనుమతి కోసం దిల్లీ పోలీసులు, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి.

చివరికి టికరీ, సింఘు, గాజీపూర్ సరిహద్దుల నుంచి రైతుల ట్రాక్టర్లు దిల్లీలో కొన్ని కిలోమీటర్లు రావచ్చని, తర్వాత తిరిగి నిరసనలు జరిగే ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

కానీ, పరేడ్ కొనసాగినప్పుడు కొంతమంది నిర్ధారిత మార్గంలో వెళ్లకుండా సెట్రల్ దిల్లీలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా దిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది.

ఆ తర్వాత యువకుల ఒక గుంపు ఎర్ర కోట దగ్గరకు చేరుకుంది. వారిలో కొంతమంది అక్కడ సిక్కు మతం చిహ్నం ఉన్న నిషాన్ సాహెబ్ జెండా ఎగురవేశారు. దాన్ని ఎగరేసిన దీప్ సింగ్ సిద్ధూ భారత జెండాను తను కిందికి దించలేదని తర్వాత ఒక వీడియో సందేశం పెట్టాడు.

ఈ హింసాత్మక ఘర్షణల్లో తాము పాల్గొనలేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన నేతలు, విచారణకు సహకరిస్తామని తెలిపారు.

జనవరి 26న జరిగిన ఈ హింసకు సంబంధించి దిల్లీ పోలీసులు 44 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 127మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన 12 రోజుల తర్వాత కర్నాల్ నుంచి దీప్ సింగ్ సిద్ధూను అరెస్ట్ చేశారు.

రైతు సంఘాల ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్ట్ కమిటీ, వివాదం

జనవరి 11న నలుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్ట్.. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం, రైతులతో మాట్లాడి, తమకు ఒక నివేదిక అందించాలని ఆదేశించింది.

కానీ ఈ కమిటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇందులో ఉన్న వారంతా అంతకు ముందు కేంద్రం వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడినవారే. అందుకే కమిటీ నిస్పక్షపాతంగా ఎలా వ్యవహరిస్తుందనే ప్రశ్నలు వచ్చాయి.

రైతులకు మద్దతుగా మాట్లాడిన భూపిందర్ సింగ్ మాన్ ఆ కమిటీ నుంచి తప్పుకోవడంతో.. మిగతా ముగ్గురు సభ్యుల కమిటీ ఈ ఏడాది మార్చి 15న సుప్రీకోర్టుకు తమ నివేదిక సమర్పించింది.

దీనిపై బీబీసీతో మాట్లాడిన కిసాన్ యూనియన్ నేత దర్శన్‌పాల్ సింగ్, కమిటీ నుంచి తమకు ఆహ్వానం అందిందని, కానీ రైతు సంఘాల నేతలు దానికి నిరాకరించారని, కమిటీ ముందు హాజరు కాలేదని చెప్పారు.

"మేం కఠిన పరిస్థితుల్లో రోడ్లపై ఉన్నాం. మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు. మేం నేరుగా ప్రభుత్వంతోనే మాట్లాడాలని అనుకుంటున్నాం. కమిటీలో ఎవరిని నియమించారు, వారి అభిప్రాయాలు ఏంటనేది అందరికీ తెలిసిందే కదా" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)