సచిన్ తెందూల్కర్‌కు ఆ వైరల్ వీడియో మీద ఎందుకు కోపం వచ్చింది?

సచిన్ తెందూల్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డీప్‌ఫేక్ బారిన పడిన తాజా సెలెబ్రిటి సచిన్ తెందూల్కర్
    • రచయిత, నిఖిల హెన్రీ
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, తాను ఒక ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా చూపిస్తోన్న ఒక డీప్‌ఫేక్ వీడియోను విమర్శించారు.

వేగంగా డబ్బు సంపాదించడానికి ఆ యాప్ ఒక మార్గం అంటూ సచిన్ ప్రశంసిస్తున్నట్లుగా ఆ వీడియో చూపిస్తుంది.

‘‘ఇవన్నీ నకిలీ (ఫేక్) వీడియోలు. టెక్నాలజీని ఈ తరహాలో దుర్వినియోగం చేయడం చూస్తుంటే చాలా భయంగా ఉంది’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సచిన్ ట్వీట్ చేశారు.

డీప్‌ఫేక్ వీడియోలకు వ్యతిరేకంగా మాట్లాడిన తాజా భారతీయ సెలెబ్రిటీ సచిన్ తెందూల్కర్.

కొన్ని నెలల క్రితం నటి రష్మిక మందన్నాపై తయారు చేసిన ఒక డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలను షేర్ చేయొద్దంటూ ప్రజల్ని రష్మిక కోరారు.

ఆ వీడియోలో ఒక మహిళ శరీరానికి రష్మిక ముఖాన్ని జోడించి దాన్ని వైరల్ చేశారు. ఆ తర్వాత టెక్నాలజీ దుర్వినియోగం గురించి భారత్‌లో పెద్ద చర్చ మొదలైంది.

దీన్ని ‘అతిభయంకరమైన ఘటన’గా అభివర్ణించిన రష్మిక, ఇలాంటి చర్యలకు బాధితులైన అమ్మాయిలందరూ ముందుకు రావాలని కోరారు.

ఆలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్ వంటి ఇతర భారతీయ నటులు కూడా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు.

సచిన్ తెందూల్కర్ కేసులో, తన కూతురు ఈ గేమింగ్ యాప్‌ను తరచుగా ఉపయోగిస్తుందని సచిన్ చెబుతున్నట్లుగా ఆ వీడియో చూపిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘‘సోషల్ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉండాలి. ఫిర్యాదుల పట్ల తగు విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని నివారించడానికి వారు త్వరగా చర్యలు తీసుకోవడం చాలా కీలకం’’ అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

2013లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన సచిన్ తెందూల్కర్ చాలా అగ్రశ్రేణి బ్రాండ్‌లకు ఎండార్స్ చేస్తున్నారు.

ఏఐ ఆధారిత డీప్‌ఫేక్స్, తప్పుడు సమాచారాలు ఇంటర్నెట్ వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని సచిన్ ట్వీట్‌కు స్పందిస్తూ భారత ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

డీప్‌ఫేక్ వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించేలా కఠిన నిబంధనలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

భారత ఐటీ నిబంధనల ప్రకారం, యూజర్లు ఎవరూ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకుండా సోషల్ మీడియా మాధ్యమాలు చూసుకోవాలి. నియమాలను పాటించని ప్లాట్‌ఫామ్‌లపై భారత చట్టాల ప్రకారం కోర్టులో కేసు వేయవచ్చు.

గతంలోనూ డీప్‌ఫేక్‌లకు వ్యతిరేకంగా ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఎం చంద్రశేఖర్ మాట్లాడారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, కృత్తిమ మేధ కంపెనీలతో నవంబర్‌లో అశ్వినీ వైష్ణవ్ సమావేశం అయ్యారు.

డీప్‌ఫేక్‌ సమస్య పరిష్కారానికి ఒక స్పష్టమైన, కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే తీసుకొస్తామని ఆ సమావేశంలో ఆయన చెప్పారు.

డీప్‌ఫేక్

ఫొటో సోర్స్, Getty Images

డీప్‌ఫేక్ అంటే ఏంటి?

కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎవరిదైనా ఒక నకిలీ ఫొటోను తయారు చేస్తుంది.

ఇందులో ఏదైనా ఫొటో, ఆడియో, లేదా వీడియోను నకిలీగా చూపించడానికి డీప్ లెర్నింగ్ అనే ఏఐని వాడతారు. దీన్నే డీప్ ఫేక్ అని పిలుస్తారు.

వీటిలో చాలావరకు పోర్న్ లేదా అశ్లీలమైనవి ఉంటాయి.

2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి డీప్‌ఫేక్ సాంకేతిక స్థాయి, సామాజిక ప్రభావం చాలా వేగంగా అభివృద్ధి చెందిందని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ డీప్‌ట్రేస్ చెప్పింది.

2019లో డీప్‌ట్రేస్ కంపెనీ ప్రచురించిన నివేదిక ప్రకారం, మొత్తం 14,678 డీప్‌ఫేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వీటిలో 96 శాతం వీడియోల్లో అశ్లీల అంశాలు ఉన్నాయి.

మహిళలకు హాని కలిగించేందుకు డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీని ఉపయోగిస్తున్నారని డీప్‌ట్రేస్ అంచనా వేసింది.

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ పెరుగుతోంది. వినోద రంగంలోని మహిళలు, మ్యూజీషియన్స్‌ను ఈ పోర్నోగ్రఫీ వీడియోల్లో బాధితులుగా మారతారని చెప్పింది.

కానీ, డీప్‌ఫేక్‌లలో మహిళలతో పాటు పురుషులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఫేక్ మెటీరియల్‌ను పురుషులు పట్టించుకోరు. అది వేరే విషయం.

డీప్‌ఫేక్‌లు సమాజంలో చెదపురుగుల్లా వ్యాపిస్తున్నాయని ముంబయికి చెందిన సైబర్ లా అండ్ డేటా ప్రొటెక్షన్ ప్రైవసీ నిపుణురాలు పునీత్ భసీన్ అభిప్రాయపడ్డారు.

‘‘గతంలో కూడా ఫొటోలను మార్ఫింగ్ చేసేవారు. కానీ, అవి గుర్తుపట్టేలా ఉండేవి. కానీ, ఏఐని ఉపయోగించే చేసే డీప్‌పేక్‌లను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి చాలా కచ్చితత్వంతో ఉంటాయి. ఏది నిజమైనది? ఏది నకిలీది అనే విషయం గుర్తించడం చాలా కష్టం’’ అని ఆమె అన్నారు.

డీప్ ఫేక్

ఫొటో సోర్స్, Getty Images

డీప్‌ఫేక్ టెక్నాలజీ వీడియోలకే పరిమితమా?

వీడియోలకే కాకుండా, ఫొటోలకు కూడా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. అందుకే అవి నకిలీ ఫొటోలు అని గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది.

ఈ టెక్నాలజీ ద్వారా నకిలీ ఆడియోలను కూడా తయారు చేస్తున్నారు. సెలెబ్రిటీల గొంతులను అనుకరించడానికి ‘వాయిస్ స్కిన్’ లేదా ‘వాయిస్ క్లోన్’‌లను వాడుతున్నారు.

డీప్‌ఫేక్ అనేది కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లు, ఏఐల కలయిక అని సైబర్ సెక్యూరిటీ-ఏఐ నిపుణులు పవన్ దుగ్గల్ చెప్పారు.

డీప్ ఫేక్

ఫొటో సోర్స్, Getty Images

డీప్‌ఫేక్‌లను ఎవరు ఉపయోగిస్తున్నారు?

ఒక సాధారణ కంప్యూటర్‌లో మంచి డీప్‌ఫేక్‌ను తయారు చేయడం చాలా కష్టం.

హై ఎండ్ డెస్క్‌టాప్ మీద హై ఎండ్ ఫొటోలు, గ్రాఫిక్ కార్డ్‌లను ఉపయోగించి డీప్‌ఫేక్‌లను సృష్టిస్తారు.

సైబర్ నేరస్థులు ఈ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారని పవన్ దుగ్గల్ చెప్పారు.

‘‘అసభ్యకర వీడియోలను తయారుచేసి, వాటిని ఉపయోగించి వ్యక్తుల్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. వారి పరువుకు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో ఫొటోలను ఉంచుతారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో వీటిని తయారు చేస్తారు’’ అని ఆయన చెప్పారు.

ఇలాంటి వీడియోలను ఎక్కువ మంది చూస్తారని, ఎక్కువ వీక్షణల కోసం కూడా ఇలాంటి వీడియోలు తయారు చేస్తుంటారని పునీత్ భసీన్ తెలిపారు.

డీప్‌ఫేక్ వాడకం ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తుందని పవన్ దుగ్గల్ ఆందోళన వ్యక్తం చేశారు.

డీప్‌ఫేక్ వీడియోలు రాజకీయ నాయకుల ప్రతిష్టతో పాటు వారి పార్టీకి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. డీప్‌ఫేక్‌లను ఎలా గుర్తించాలి?

డీప్‌ఫేక్ కంటెంట్‌ని గుర్తించడానికి కొన్నిఅంశాలను చూద్దాం.

కళ్లను చూసి గుర్తించవచ్చు: ఒకవేళ డీప్‌ఫేక్ వీడియో అయితే అందులో ఉన్నవారు కనురెప్పలు ఆర్పలేరు.

పెదవులను జాగ్రత్తగా చూడటం ద్వారా, డీప్‌ఫేక్ వీడియోలో పెదవుల కదలికలకు, మాటలకు మధ్య సమన్వయం ఉండదు.

జుట్టు, పళ్లను గమనించడం డీప్‌ఫేక్‌లో హెయిర్ స్టైల్‌ను మార్చడం చాలా కష్టం. దంతాలను చూడటం ద్వారా కూడా వీడియో డీప్‌ఫేక్ అని గుర్తించవచ్చు.

‘‘డీప్‌ఫేక్ చాలా పెద్ద సమస్య. నియంత్రణకు కఠిన చట్టాలు అవసరం. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)