ఇండియన్ రైల్వేస్: చాలా రైళ్ళు రోజుల తరబడి ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయి?

ఫొటో సోర్స్, CHANDAN KUMAR
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని సామెత.
అలాగే నీవు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నాడో కవి.
అయితే చాలా రైళ్ళు జీవితకాలం లేటు కాకపోయినా కనీసం 24గంటలు పైబడి లేటుగా నడిచే సందర్భాలు చాలామంది ప్రయాణికులు ఎదుర్కొనే ఉంటారు.
అమితవేగంతో దూసుకుపోయే శతాబ్ది, వందేభారత్, రాజధాని లాంటి ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా కనీసం ఒకరోజు తరువాత కూడా తమ గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతున్నాయి.
అయితే రైల్వే వ్యవస్థ అధునీకీకరణ కోసం భారీమొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తోంది.
2023-24 బడ్జెట్‌లో రైల్వేలకు 2 లక్షల 40వేల కోట్లు కేటాయించినట్టు, ఇది యూపీఏ హయాంలో 2013-14లో ఇచ్చిన మొత్తానికి 9 రెట్లు ఎక్కువని కేంద్రం పేర్కొంది.
కానీ ఇంత పెద్దమొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నప్పటికీ శీతాకాలంలో ఎదురయ్యే పొగమంచులాంటి సమస్యల నుంచి రైల్వే శాఖ బయటపడలేకపోతోంది.
ఈ పొగమంచు సమస్య ఉత్తర భారతంతోపాటు, తూర్పు, పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటోంది.
ఈ సమస్యనుంచి గట్టెక్కడానికి ప్రతి ఏడాది ముఖ్యమైన రైళ్ళన్నీనిర్ణీత సమయానికి గమ్యం చేరుకుకోవడానికి వీలుగా తక్కువ డిమాండ్ ఉన్న రైళ్ళను రద్దుచేస్తోంది.
కిందటి నవంబర్‌లో ముందుజాగ్రత్త చర్యగా ఉత్తర రైల్వే 62 రైళ్ళను రద్దు చేసింది.
దీంతోపాటు 46 రైళ్ళ ఫ్రీక్వెన్సీని తగ్గించింది. మరో ఆరు రైళ్ళ దూరాన్ని కూడా తగ్గించింది.

ఫొటో సోర్స్, ANI
24గంటలు ఆలస్యంగా నడుస్తున్న రైళ్ళు
న్యూదిల్లీ నుంచి జనవరి 13న బయల్దేరిన 12394 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 27గంటలు ఆలస్యంగా నడిచి జనవరి 15న పాట్నాకు చేరుకుంది.
జనవరి 13న న్యూదిల్లీ నుంచి బయల్దేరిన సిల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ జనవరి 15న 23 గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంది.
న్యూదిల్లీ – రాజేంద్రనగర్ తేజాస్ రాజధాని రైలు కూడా జనవరి 13న బయల్దేరి రాజేంద్రనగర్ (పాట్నా)కు జనవరి 15న చేరింది.
ఈ రైలు దాదాపు 22గంటలు ఆలస్యంగా చేరింది.
మిగతా జోన్లలో ఇలాంటి ఆలస్యం లేకుండా రైల్వే శాఖ తగు చర్యలు తీసుకుంటోంది.
కానీ పొగమంచు కారణంగా ఈ ఏడాది అనేక రైళ్ళు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
వీటిల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, వందేభారత్ రైళ్ళు కూడా ఉన్నాయి.
న్యూదిల్లీ, జయనగర్ మధ్య నడిచే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ (12562) 24గంటలు లేటుగా న డిచింది.
అలాగే జనవరి 13న బయల్దేరి, జనవరి 15న 24గంటలు ఆలస్యంగా చేరుకున్న 12368 విక్రమశీల ఎక్స్‌ప్రెస్ ది కూడా ఇదే కథ. ఇది దిల్లీ, భాగల్పూర్ మధ్య నడుస్తుంది.
అదేరోజున 12304 న్యూదిల్లీ, హౌరా మధ్య పూర్వా ఎక్స్‌ప్రెస్ కూడా 24గంటలు ఆలస్యంగా నడిచింది.

ఫొటో సోర్స్, CHANDAN KUMAR
రైళ్ళ వేగానికి బ్రేకులెందుకు?
పొగమంచు ఉన్నప్పుడు...భారతీయ రైళ్ళు పట్టాలపై నిర్దేశిత వేగంతో ఎందుకు పరుగులు తీయలేకపోతున్నాయి? దీనికి సులభంగా లభించే సమాధానం ఒక్కటే..ట్రాక్ పక్కన ఉండే సిగ్నల్స్ ప్రకారమే ప్రతి రైలు ముందకు కదలాల్సి ఉంటుంది.
అయితే మంచుకురిసేవేళ్లలో తక్కువ దృశ్యమానత (లో విజుబిలిటీ) వల్ల లోకోపైలట్లకు
ఈ సిగ్నల్స్ సరిగా కనిపించవు.
ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ లైట్ వెలిగే సిగ్నల్ దగ్గరకు వచ్చాకా కానీ పైలట్ దానిని గుర్తించలేరు. ఆ సమయంలో రైలుకు హఠాత్తుగా బ్రేకులు వేయడం కష్టంగా మారుతుంది.
దీంతో ఇలాంటి సందర్భాలలో మంచు కారణంగా రైలు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది.
అందుకే మంచు కురిసేవేళల్లో రైళ్ళ గరిష్ఠ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంటారు.
దీనివల్లే రైళ్ళు గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటాయి.
ఒకే ట్రాక్‌పై రెండు స్టేషన్ల మధ్యన ఒకే రైలు ప్రయాణిస్తుంటే ఆ రైలు గరిష్ఠ వేగంతో ప్రయాణించడానికి వీలుంటుంది. ఎందుకంటే ఆ ట్రాక్‌పై మరో రైలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇది సాధ్యమవుతుంది.
కానీ భారత్‌లో ఒకదాని తరువాత ఒకటి రైళ్ళు పరుగులు తీస్తూనే ఉంటాయి. అంటే సిగ్నల్‌కు సిగ్నల్‌కు మధ్య రైలు ప్రయాణిస్తుంటుంది.
ఈ పరిస్థితులలో ఒక రైలు ఆలస్యమైందంటే దాని వెనుక వచ్చే రైలు కూడా ఆలస్యమవుతుంది.
దీని ప్రభావం ఈ మార్గంలో తిరిగే మిగిలిన అన్ని రైళ్ళపైనా పడుతుంది.
అంటే పొగమంచు కురిసే ప్రాంతం దాని ప్రభావం లేని ప్రాంతంలో కూడా రైలు ఆలస్యానికి కారణమవుతుంది.
‘‘ఒకసారి ఓ రైలు ఆలస్యమైందంటే, అక్కడ పొగమంచులేకపోయినా సరే, దానిని వేగం పెంచి తీసుకువచ్చే పరిస్థితులు ఉండవు’’ అని ఉత్తర రైల్వే అధికారప్రతినిధి దీపక్ కుమార్ చెప్పారు.
‘‘దిల్లీ, ముంబాయి మధ్య తిరిగే రైలు ఆలస్యంగా ప్రయాణిస్తుంటే, దాని ఆలస్యాన్ని తగ్గించడానికి అరగంట సమయం మాత్రమే ఉంటుంది. కానీ రెండున్నరగంటలు ప్రయాణించే విమానానికి ఈ వెసులుబాటు 45 నిమిషాల దాకా ఉంటుంది. అందుకే విమాన ఆలస్యాన్ని తగ్గించి, సమయానికి ల్యాండ్ అయ్యేలా చేయవచ్చు’’ అని ఆయన వివరించారు.
ఈనేపథ్యంలో ఏటా ఇండియాలో ఈ పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

ఫొటో సోర్స్, ANI
పొగమంచు పరికరాలు
గత కొన్నేళ్ళుగా భారతీయ రైల్వేలు దట్టమైన మంచులాంటి వాతావరణంలో ఫాగ్ సేఫ్టీ పరికారాన్ని వినియోగిస్తున్నాయి.
పొగమంచులో కూడా రైలు సురక్షితంగా ప్రయాణించేలా చేయడమే ఈ పరికరం వల్ల కలిగే ఉపయోగం.
‘‘ఉత్తర రైల్వే మీదుగా ప్రయాణించే 1200 రైళ్ళలో ఈ పరికరాన్ని అమర్చాం. పొగమంచు దట్టంగా ఉన్నప్పుడు ట్రాక్ పక్కన సిగ్నల్ ఎంత దూరంలో ఉందో ఈ పరికరం ద్వారా డ్రైవర్‌కు తెలుస్తుంది. దీన్నిబట్టి డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించి బ్రేకులు వేస్తాడు’’ అని దీపక్ కుమార్ చెప్పారు.
నిజానికి, ఎంత దూరం తరువాత సిగ్నల్ వస్తుందనే విషయాన్ని ఈ పరికరం ద్వారా లోకోపైలట్‌కు తెలుస్తుంది.
దృశ్యమానత తక్కువగా ఉన్నవేళ ప్రతి సిగ్నల్‌ను గమనించాలంటే రైలును మెల్లిగా నడపడం చాలా ముఖ్యం.
రైళ్లలో 20వేలకు పైగా ఫాగ్ డివైజెస్‌ను వినియోగిస్తున్నట్టు ఈ జనవరిలో రైల్వే మంత్రిత్వశాఖ విడుదలచేసిన పత్రికాప్రకటనలోతెలిపింది.
మంచు అలుముకున్నప్పుడు కూడా రైళ్ళలో ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణం చేయడానికే వీటిని అమర్చినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
కానీ ఈ పరికరంతో రైళ్ళను సమయానికి నడపడం అంతగా సాధ్యపడే విషయం కాదు.
కానీ పొగమంచులో రైళ్ళు సకాలంలో నడవాలంటే ‘కాబ్’ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఉత్తమమని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు దేవి ప్రసాద్ పాండే చెప్పారు.
ఈ విధానంలో లోకోపైలట్ ట్రాక్ వెంబడి ఉండే సిగ్నల్స్‌ను చూడాల్సిన అవసరం ఉండదు. ఒక మిషన్ ద్వారా ట్రాక్, సిగ్నల్స్ సమాచారం పైలట్‌కు అందుతుంది.
కానీ ఈ పద్ధతికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
ఒకే మార్గంలో వివిధ సెక్షన్ల మధ్య అనేక కారణాల వల్ల రైళ్ళ గరిష్ఠ వేగాన్ని తాత్కాలికంగా నిర్దేశిస్తుంటారు.
ఈ కారణంగా ఆయా మార్గాలలో రైల్వే ట్రాక్ పక్కన స్పీడ్ లిమిట్ సూచికలు కనిపిస్తుంటాయి.
దీనికి కారణం ఆ మార్గంలో ఏవైనా పనులు జరుగుతూ ఉండటం కావచ్చు. చాలా రైల్వే గేట్ల ముందు లోకోపైలట్ విజిల్ ఊదాలనే సూచన ఉంటుంది.
ఇలాంటి వాటివల్లే కాబ్ సిగ్నలింగ్ వ్యవస్థకు పరిమితులు ఉంటాయి.
చలికాలంలో 20, 30 మీటర్ల దూరాన్ని మించి చూడలేని పరిస్థితి ఉంటుంది.
ఇలాంటి సమయాలలో రైళ్ళను వేగంగా నడిపితే ప్రమాదాలు జరుగుతాయి.

ఫొటో సోర్స్, ANI
కవచ్ ఎక్కడివరకు వచ్చింది?
మంచు ప్రభావం వల్ల సమస్యలు తలెత్తడం అనేది శీతాకాలంలో ఇండియాకే కాదు చాలా దేశాలలో ఈ సమస్య ఉంది.
కొరియా, జపాన్, చైనా, యూరోప్‌లో ఈ సమస్య ఎక్కువే.
కానీ అక్కడి రైళ్ళన్నీ చక్కని సిగ్నలింగ్ సాంకేతికతతో పరుగులు తీస్తుంటాయి.
ట్రాఫిక్ రైల్వే బోర్డు మాజీ సభ్యుడు గిరీష్ పిళ్ళై మాట్లాడుతూ ‘‘ప్రపంచమంతటా అందింపుచ్చుకన్న ఆధునిక సిగ్నలింగ్ టెక్నాలజీ.. మంచులాంటి ప్రతికూలవాతావరణంలోనూ పనిచేస్తుంది. ఈ సాంకేతితకు పలు దేశాలలో పలురకాలైన పేర్లు ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీపై ఇండియా కూడా దృష్టిసారించింది’’ అని చెప్పారు.
ఈ విధానంలో రైల్వే ట్రాక్ పక్కన సిగ్నల్స్‌కు సమీపంలో ఓ యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. మరొకదానిని ఇంజిన్’లో ఏర్పాటు చేస్తారు.
ఇది రియల్ టైమ్‌లో లోకోపైలట్‌కు జీపీఎస్‌లాంటి సాంకేతికతద్వారా సిగ్నల్ సమాచారాన్ని అందిస్తుంది.
ఇదొకరకంగా హెచ్చరిక వ్యవస్థలాంటింది. దీని ద్వారా ఇంజిన్ వద్ద ఉన్న లోకోపైలట్‌కు రాబోయే సిగ్నల్ ఎరుపా, గ్రీనా, లేదా ఎల్లోనా అనే విషయం తెలుస్తుంది.
దీనివల్ల ట్రాక్ పక్కన ఉన్న సిగ్నల్స్‌ను పైలట్ చూడాల్సిన అవసరం ఉండదు.
అందుకే మంచులాంటి ప్రతికూల వాతావరణంలోనూ ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ టెక్నాజీని కొన్ని రైళ్ళలో ఏర్పాటు చేశారు.
దీనివల్ల ఒకే ట్రాక్ పై రెండు రైళ్ళు దగ్గరగా వచ్చేస్తే , బ్రేకులు పడి, ఒకదానికొకటి గుద్దుకునే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.
ఇండియన్ రైల్వేస్ వినియోగిస్తున్న ఈ వ్యవస్థ పేరు ‘కవచ్’.
ఇది ఇండియా సొంతంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికత.
ఒకేట్రాక్ పై రెండు రైళ్ళు ఎదురెదురుగా వస్తుంటే రెండుకిలోమీటర్ల ముందే ఈ వ్యవస్థ లోకోపైలట్‌ను హెచ్చరిస్తుంది.
దీనివల్ల సరైన సమయంలో లోకోపైలట్ రైలును ఆపేందుకు వీలుంటుంది.
ఒకవేళ లోకోపైలట్ బ్రేకులు వేయకపోయినా ఈ వ్యవస్థే అటోమెటిక్‌గా బ్రేకులు పడేలా చేస్తుంది.
ఈ సిగ్నలింగ్ విధానం గురించి 2022లో భారతీయ రైల్వేలు ప్రకటించాయి.
ఇందుకోసం గత బడ్జెట్‌లో 13వేల కోట్లరూపాయలకు ఆమోదం తెలిపినట్టు రైల్వేశాఖ తెలిపింది.
ఇండియన్ రైల్వే 68వేల కిలోమీటర్ల రైల్వే మార్గాలను కలిగి ఉంది.
తొలుత 34 వేల కిలోమీటర్ల మేరకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఏటా ఐదు నుంచి 6వేల కిలోమీటర్ల వరకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈమేరకు ఈ రక్షణ వ్యవస్థను 8వేల రైళ్ళ ఇంజిన్లలో ఏర్పాటు చేయాల్సి ఉంది.
ప్రస్తుతానికి మంచుప్రభావిత ప్రాంతాలలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రయాణికులు, రైల్వేవిభాగం ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు
- మాల్దీవులు దూకుడుపై భారత్ మౌనం ఎందుకు?
- పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- ఇరాన్ క్షిపణి దాడుల్లో తమ చిన్నారులు చనిపోయారన్న పాకిస్తాన్, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














