షాపులో దొంగతనం చేసి పట్టుబడిన న్యూజీలాండ్ పార్లమెంటు సభ్యురాలు

గోల్రీజ్ గారమన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోల్రీజ్ గారమన్ ఒక మాజీ యూఎన్ మానవ హక్కుల న్యాయవాది
    • రచయిత, క్యాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

వస్త్రాల దుకాణంలో దొంగతనం చేశారనే ఆరోపణలతో ఒక పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) తన పదవికి రాజీనామా చేశారు.

న్యూజీలాండ్ ఎంపీ గోల్రీజ్ గారమన్‌పై దొంగతనం ఆరోపణలు వచ్చాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు వస్త్ర దుకాణాల్లో (క్లాత్ స్టోర్స్) మూడుసార్లు దొంగతనం చేసినట్లు గ్రీన్ పార్టీకి చెందిన గోల్రీజ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఒక దుకాణం ఆక్లాండ్‌లో మరొకటి వెల్లింగ్టన్‌లో ఉంది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ న్యాయవాది అయిన గోల్రీజ్, న్యూజీలాండ్ ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో దక్కించుకున్న తొలి శరణార్థిగా 2017లో చరిత్ర సృష్టించారు. ఆమె న్యాయ శాఖ పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు.

పని ఒత్తిడే తనతో ఇంత పని చేయించిందని ఆమె చెప్పారు.

గోల్రీజ్

ఫొటో సోర్స్, Getty Images

‘‘చాలా మందిని బాధపెట్టాను. నన్ను క్షమించండి’’ అని ఆమె అన్నారు.

గోల్రీజ్ చిన్నతనంలో ఇరాన్ నుంచి తన కుటుంబంతో కలిసి న్యూజీలాండ్‌కు శరణార్థిగా వచ్చారు.

ఆక్లాండ్‌లోని ఒక బొటిక్ నుంచి ఆమె ఒక డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకుంటున్నట్లుగా చూపించే సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చిన తర్వాత మంగళవారం ఆమె రాజీనామా చేశారు.

42 ఏళ్ల గోల్రీజ్‌పై ఎలాంటి నేరసంబంధిత అభియోగాలు నమోదు కాలేదు.

ఎన్నికైన ప్రతినిధుల నుంచి ప్రజలు ఆశించే ఉన్నత ప్రమాణాలకు సరితూగేలా తన చర్యలు లేవని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు.

‘‘ఈ ప్రవర్తన ఏంటో నేను వివరించలేను. ఎలాంటి సాకులు చెప్పలేను. కానీ, ఇది ఎంతమాత్రం తగినది కాదు. వైద్యపరీక్షల తర్వాత నేను బాగా లేనట్లుగా నాకు అర్థమైంది.

నేను ఇటీవల ప్రవర్తించిన తీరు గతంలో గుర్తించని ట్రామా, విపరీత ఒత్తిడికి ప్రతిస్పందనగా ఉందని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్పారని’’ ఆమె అన్నారు.

పార్లమెంట్‌కు ఎన్నికైన రోజు నుంచి గోల్రీజ్ నిరంతర లైంగిక, శారీరక హింసకు సంబంధించిన, చంపుతామనే బెదిరింపులను ఎదుర్కొన్నారని ఆమె రాజీనామాపై స్పందిస్తూ గ్రీన్ పార్టీ సహ నాయకుడు జేమ్స్ షా చెప్పారు.

గోల్రీజ్

ఫొటో సోర్స్, Getty Images

‘‘పార్లమెంట్‌లో చాలా సభ్యులు అనుభవించిన ఒత్తిడి కన్నా ఆమె అధిక ఒత్తిడి ఎదుర్కొనేందుకు ఇవి కారణం అయ్యాయి. ఆమె పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నంతకాలం దాదాపు ఈ బెదిరింపుల గురించి పోలీసు విచారణలు జరిగాయి. ఈ స్థాయి ఒత్తిడి పరిస్థితుల మధ్య జీవిస్తుంటే ఇలాంటి పర్యవసనాలే ఉంటాయి’’ అని ఆయన అన్నారు.

తన ఇరాన్ వారసత్వం, లింగం, పలు సమస్యలపై తాను తీసుకున్న వైఖరి వల్ల వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ వేదికగా చాలా వేదింపులు ఎదుర్కొన్నానని ఆమె గతంలోనే చెప్పారు.

‘‘చివరకు కొన్ని ఆన్‌లైన్ బెదిరింపుల కారణంగా పార్లమెంట్ లోపల, బయట నేను భద్రతా సిబ్బందిని నియమించుకునే పరిస్థితి వచ్చింది’’ అని 2021లో జాతీయ ప్రసారదారు టీవీఎన్‌జడ్‌తో ఆమె అన్నారు.

తెల్లజాతి ఆధిపత్యవాదుల బెదిరింపుల కారణంగా 2017లో ఆమెకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేశారు.

గ్రీన్ పార్టీ విదేశీ వ్యవహారాలు, మానవ హక్కుల అధికార ప్రతినిధిగా ఆమె పాలస్తీనా అనుకూల నిరసనల్లో ఇటీవల పాల్గొనడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి.

ఆమె రాజీనామా చేయడం సరైనదే అని భావించిన గ్రీన్ పార్టీ సహచరుడు డేవిడ్‌సన్, ఆమెకు తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఆమె బాధలో ఉన్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)