ఇరాన్ క్షిపణి దాడుల్లో తమ చిన్నారులు చనిపోయారన్న పాకిస్తాన్, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక

ఇరాన్ మిసైల్ పరీక్షలు (శిక్షణ సమయంలో తీసిన ఫొటో)

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఇరాన్ మిసైల్ పరీక్షలు (శిక్షణ సమయంలో తీసిన ఫొటో)
    • రచయిత, కరోలిన్ డేవిస్, సీన్ సెడాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్, లండన్

తమ పొరుగునే ఉన్న ఇరాన్ మంగళవారం తమ దేశంపై జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని పాకిస్తాన్ చెప్పింది.

పాకిస్తాన్‌లోని ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన రెండు స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇరాన్ చెప్పినట్లు ఇరాన్ సైన్యానికి అనుబంధంగా పనిచేసే ఓ వార్తాసంస్థ తెలిపింది.

ఇరాన్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్, ‘‘ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఇలాంటిది తీవ్ర పర్యవసానాలకు దారి తీయొచ్చు’’ అని పేర్కొంది.

పాకిస్తాన్ కంటే ముందు ఇరాన్ గత కొద్ది రోజులలో సిరియా, ఇరాక్‌లపైనా దాడులు చేసింది.

పాకిస్తాన్‌పై ఇరాన్ ఇలా క్షిపణి దాడి చేయడం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు.

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ నైరుతి ప్రాంతంలోని ఓ గ్రామంపై మంగళవారం ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ గ్రామం పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉంది.

నిరసన తెలిపిన పాకిస్తాన్

ఇరాన్ దాడులను పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.

‘‘మా వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తమ గగనతలంలో ఇరాన్ ఉల్లంఘనలకు పాల్పడింది’’ అంటూ పాకిస్తాన్ పేర్కొంది.

ఇరాన్‌ది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చర్య అని పాకిస్తాన్, ఇరాన్ మధ్య కమ్యూనికేషన్‌కు అనేక మార్గాలున్నప్పటికీ అక్రమంగా ఇలాంటి చర్యలకు దిగడం ఆందోళన కలిగిస్తోందని పాక్ తన ప్రకటనలో పేర్కొంది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వద్ద పాకిస్తాన్ తన నిరసనను కూడా తెలిపింది.

‘‘పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా పాల్పడిన ఈ తీవ్ర ఉల్లంఘనలకు, పర్యవసానాలకు ఇరానే పూర్తిగా బాధ్యత వహించాలి’’ అని పాకిస్తాన్ పేర్కొంది.

పరుగెడుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, AMIR COHEN/ REUTERS

ఫొటో క్యాప్షన్, అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్ భీకర దాడి తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఇరాన్ దాడులు

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకర దాడి తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దాడులు జరిగినప్పటి నుంచి గాజా స్ట్రిప్‌లో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఇరాన్ దాడులు జరిగాయి.

విస్తృతస్థాయి ఘర్షణల్లో తలదూర్చాలని తాము అనుకోవడం లేదని ఇరాన్ ఇప్పటికే ప్రకటించినా, ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’గా పిలిచే ఇరాన్‌కు చెందిన గ్రూపులు మాత్రం పాలస్తీనాకు సంఘీభావంగా ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలపై దాడులు చేస్తున్నాయి.

లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇజ్రాయెల్ దళాలపై సీమాంతర కాల్పులు చేపట్టింది. ఇరాక్, సిరియాలలో ఉన్న అమెరికా బలగాలపై షియా మిలీషియాలు డ్రోన్ దాడులు చేశాయి.

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారు.

ప్రతిగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో లెబనాన్‌లో ఒక హమాస్ నేత, సిరియాలో ఒక రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ చెప్తోంది.

ఇరాక్‌లో అమెరికా బలగాలు ఒక ఇరాకీ మిలీషియా నాయకుడిని చంపేశాయి. అలాగే యెమెన్‌లోని హూతీ స్థావరాలు లక్ష్యంగా బాంబు దాడులు చేశాయి.

సరిహద్దులలో వేర్పాటువాద గ్రూపులపై పాకిస్తాన్, ఇరాన్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సరిహద్దులలో వేర్పాటువాద గ్రూపులపై పాకిస్తాన్, ఇరాన్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయి

జైష్ అల్ అదిల్, ఇతర గ్రూపులపై పాక్, ఇరాన్ దశాబ్దాల పోరు

జనసాంద్రత తక్కువగా ఉండే పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులలో జైష్ అల్ అదిల్ సహా వివిధ వేర్పాటువాద గ్రూపులపై పాకిస్తాన్, ఇరాన్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయి.

రెండు దేశాల మధ్య ఉన్న సుమారు 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి భద్రత విషయంలో రెండు దేశాలకూ అనేక ఏళ్లుగా ఆందోళనలున్నాయి.

గత నెలలో తమ సరిహద్దులలో జరిగిన దాడులలో ఇరాన్‌కు చెందిన పోలీసు అధికారులు పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడులకు జైష్ అల్ అదిల్‌కు సంబంధం ఉందని ఇరాన్ ఆరోపించింది.

ఆ దాడులకు పాల్పడిన మిలిటెంట్లు పాకిస్తాన్ నుంచి తమ దేశంలోకి ప్రవేశించారని అప్పుడు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వాహిది ఆరోపించారు.

సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో అత్యంత క్రియాశీలంగా ఉన్న సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్‌ అని ‘యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’ కార్యాలయం చెప్తోంది.

జైష్ అల్ అదిల్ చరిత్ర ఏమిటి?

సున్నీ సాయుధ గ్రూప్‌ అయిన ‘జైష్ అల్ అదిల్’ 2012లో తన కార్యకలాపాలు ప్రారంభించింది.

షియా ముస్లింల ప్రాబల్యం ఉన్న ఇరాన్‌లో మైనార్టీలయిన సున్నీల హక్కులను పరిరక్షించడమే తమ లక్ష్యమని ఈ గ్రూప్ చెప్పుకొంటుంది.

అగ్నేయ సిస్తాన్ బలూచిస్తాన్‌ ప్రావిన్సులో చురుకుగా ఉంటూ, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న కొన్ని సున్నీ బలూచ్ తెగల మద్దతుతో ఈ సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది.

ఇరాన్ ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తోంది. దీనిని జైషే –ఉల్– జోల్మ్ (అక్రమ సైన్యం) అని పిలుస్తోంది.

ఈ సంస్థకు అమెరికా, ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాలు మద్దతు ఇస్తున్నట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ప్ (ఐఆర్‌జీసీ)తో అనుబంధంగా ఉన్న ఇరానియన్ ఫార్స్ వార్తాసంస్థ చెబుతోంది.

ఇరాన్‌ ఆగ్నేయ ప్రాంతంలోని సిస్తాన్ బలూచిస్తాన్‌లోగల మిలటరీ స్థావరంపై 2013 అక్టోబరు 26న దాడి చేసి 14 మంది ఇరానియన్ గార్డులను చంపింది తామేనని ఈ సంస్థ ప్రకటించుకుంది.

అలాగే సిస్తాన్ బలూచిస్తాన్‌లోని జబోల్ నగరంలో 2013 నవంబర్ 6న ప్రభుత్వ న్యాయవాది మౌసా నూరిని కూడా ఈ సంస్థ చంపినట్టు ఇరానియన్ ప్రభుత్వ ప్రసార సంస్థ సహార్ వన్ టీవీ తెలిపింది.

ఈ సంస్థ ఏర్పడిన 2012 నుంచి 2023 డిసెంబరు 15 వరకు ఆత్మాహుతి దాడులు సహా అనేక దాడులకు పాల్పడి పలువురు ఇరానియన్ గార్డులను చంపేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)