చక్కెరతో వచ్చే చిక్కులేంటి... డయాబెటిస్‌కు, స్వీట్స్‌కు ఏంటి సంబంధం?

చక్కెర వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్, పాయల్ భుయాన్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్లు

దిల్లీలో నివసించే 15 ఏళ్ళ రియా (పేరు మార్చాం) చర్మంపై పిగ్మంటేషన్‌తో బాధపడుతున్నారు.

ఆమె గొంతు, చంకలు, కీళ్ళదగ్గర చర్మం నలుపు రంగులోకి మారింది.

ఆమెను చర్మవ్యాధి నిపుణుడు ఎండోక్రైనాలజిస్టు దగ్గరకు పంపారు.

రియాకు షుగర్ పరీక్షలు చేయగా, ఆమె షుగర్ లెవెల్స్ ఆహారం తినకముందు 115గానూ, ఆహారం తీసుకున్న తరువాత 180గా ఉన్నాయి.

సహజంగా ఆహారం తీసుకోక మునుపు చక్కెర స్థాయిలు 100వరకు, ఆహారం తీసుకున్న తరువాత 140వరకు ఉండవచ్చని డాక్టర్లు చెబుతుంటారు.

రియాకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సురేంద్ర కుమార్ మాట్లాడుతూ, ‘‘రియా జంక్ ఫుడ్ తినేవారు. ఆమె కుటుంబానికి కూడా షుగర్ చరిత్ర ఉంది. ఆమె ఎటువంటి వ్యాయమాలు చేసేవారు కాదు. తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉంటే, పిల్లలకు కూడా డయాబెటిస్ రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.

రియాకు ఇన్సులిన్ లోపం కూడా ఉందన్నారు.

డయాబెటిస్
diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

చిన్నపిల్లల్లోనూ పెద్దల వ్యాధి

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చిన్నపిల్లల ఎండోక్రైనాలజిస్టుగా పనిచేస్తున్న ప్రసిద్ధ అమెరికన్ వైద్యుడు రాబర్ట్ లస్టింగ్ పెద్దలకు మాత్రమే పరిమితమయ్యే డయాబెటిస్ ఇప్పుడు పిల్లల్లోనూ చూస్తున్నట్టు చెప్పారు.

ఆయన ‘షుగర్ ఓ చేదు నిజం’ అనే పుస్తకం రాశారు.

‘‘ఈ రోజుల్లో పెద్దవారిలోలా పిల్లల్లోనూ టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ కనిపిస్తోంది’’ అని చెప్పారు.

1980 ప్రాంతంలో ఈ వ్యాధి పెద్దల్లో మాత్రమే ఉండేది.

మద్యం సేవించేవారిలో సహజంగా కాలేయంలో కొవ్వు చేరుతుంది.

కానీ, ఇప్పుడు అమెరికాల్లో 25 శాతం మంది పిల్లల్లో నూ ఈ కాలేయ కొవ్వు వ్యాధి కనిపిస్తోంది.

ఈ విషయాన్ని డాక్టర్ రాబర్ట్ లస్టింగ్ మరింత వివరిస్తూ ‘‘ గతంలో పిల్లలు కాండీలు, చాక్లెట్లు లాంటి షుగర్ పదార్థాలు ఎక్కువ తినేవారు కాదు. కానీ ఇప్పుడు వాటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో తేలికగా ఈ వ్యాధుల బారినపడుతున్నారు’’ అని చెప్పారు.

డయాబెటిస్
diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

శరీరానికి కార్బోహైడ్రేట్లు ఎందుకు?

ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు అనే మూడుభాగాలు ఉంటాయి.

మానవశరీరానికి శక్తి కోసం కార్బోహైడ్రేట్లు అవసరం. సహజంగానే అనేక రకాల ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి ఎక్కువగా పండ్లలో ఉంటాయి. షుగర్ కూడా కార్బోహ్రైడేటే.

షుగర్ కాకుండా బియ్యం లేదా పిండి లాంటి పదార్థాల ద్వారా కార్బోహైడ్రేట్లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనలోని జీర్ణవ్యవస్థ కార్బో హైడ్రేట్లను విడగొట్టి వాటినుంచి గ్లూకోజును వేరు చేస్తుంది. గ్లూకోజ్ ఇంధనంలా పనిచేసి మనకు శక్తినిస్తుంది.

ఇన్సులిన్ హార్మోన్ మన శరీరంలో చోదకశక్తిలా పనిచేస్తుంది. అది కణాలకు, అవయవాలకు, కిడ్నీలు, గుండె సహా గ్లూకోజును సరఫరా చేస్తుంది అని ముంబాయిలోని డయాబెటిస్ కేర్ సెంటర్‌లో డాక్టర్ రాజీవ్ కోవిల్, డాక్టర్ సురేంద్రకుమార్ వివరించారు.

‘‘ఇన్సులిన్ పరిమాణం పెరిగితే అది పనిచేయడం ఆగిపోతుంది. అలాంటి పరిస్థితులలో గ్లూకోజు ఇతర మార్గాలలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంది. ఇది కణాలలో సమస్యను సృష్టిస్తుంది. దీనివల్ల శరీరంలో గ్లూకోజు కొవ్వురూపంలో పేరుకుపోయి సమస్యలు సృష్టించడం మొదలుపెడుతుంది’’ అని తెలిపారు.

ఇలా షుగర్ స్థాయులు పెరగడం వలన శరీరంలో అనేక రుగ్మతలు తిష్టవేయడం మొదలుపెడతాయని ఈ డాక్టర్లు చెప్పారు. ఇది డయాబెటిస్, రక్తపోటు, గుండెజబ్బులు, ఇంకా క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతుంది.

డయాబెటిస్
diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

షుగర్ అంటే ఏమిటి?

షుగర్‌లో వివిధ రకాలు ఉన్నాయని శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో ఎండ్రోకైనాలజీ, మెటబాలిజం విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సురేంద్రకుమార్ వివరించారు.

‘‘షుగర్ అనేది చెరకుగడల నుంచి తయారవుతుంది. ఇందులో అత్యధిక కేలరీలు, తీపి ఉంటుంది. దీనిని సుక్రోజ్ అని కూడా పిలుస్తారు’ అని చెప్పారు.

గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్, ఫ్రుక్టోజ్ అనేవి ఇతర రకాలైన షుగర్స్.

‘‘పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలు, వెన్నలాంటి ఉత్పత్తుల్లో లాక్టోజ్ ఉంటుంది. తెనె,పండ్లలో కనిపించే గ్లూకోజ్ హానికారకమైనది కాదు’’ అని డాక్టర్ సురేంద్రకుమార్ తెలిపారు.

ఇక ప్రాసెస్డ్ షుగర్ అంటే సుక్రోజ్ జతచేసిన పదార్థాలు తీసుకుంటే అవి హాని కలిగిస్తాయి.

డయాబెటిస్
diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫైబర్ ఎంతవరకు అవసరం?

డాక్టర్లు సహజసిద్ధమైన చక్కెర ఉండే ఆహారపదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వమంటుంటారు.

ఎందుకంటే వీటినుంచి మనకు అనేక పోషకాలు అందుతాయి. పండ్లు, కూరగాయలలో ఫైబర్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. పాల ఉత్పత్తులు ప్రొటిన్లు, కాల్షియాన్ని అందిస్తాయి.

‘‘భారతదేశంలోని ఏ ప్రాంతంలోని ప్రజలైనా 75 నుంచి 80 శాతం కార్బోహైడ్రేట్లు తీసుకుంటారు. తీపిపదార్థాలను ఆహారంగా తీసుకునే ప్రజల శాతం కూడా ఎక్కువే’’. అంటారు డాక్టర్ రాజీవ్ కోవిల్.

మీరు కనుక మిల్లెట్ల్స్, జొన్నలు తీసుకుంటే వాటిల్లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. ఇవి మెల్లిగా జీర్ణమవుతాయి. దీనివల్ల షుగర్ క్రమపద్ధతిలో కరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలో షుగర్ హఠాత్తుగా పెరగదు. కానీ దీనికి విరుద్ధంగా, పిండికానీ, గోధుమ పిండితో కానీ తయారుచేసిన పదార్థాలను తీసుకుంటే అవి వెంటనే అరిగిపోయి, షుగర్‌గా తయారవుతాయి. అందుకే వాటిని తినొద్దని చెబుతారు అని ఉదాహరణగా వివరించారు.

పెద్ద ఎత్తున షుగర్ ఉన్న పదార్థాలను తీసుకోగానే, శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా తయారవడం మొదలవుతుంది.

ఇది ఆకలి వేయడానికి కారణమవుతుంది. ఇలా ఇదో సైకిల్‌లా తయారవుతుంది. అంటే పదేపదే తినేలా మార్చుతుందన్నమాట. దీని తరువాత చాలా రకాలైన సమస్యలు పుట్టుకొస్తాయి.

‘‘షుగర్ ఉన్న ఆహారపదార్థాలు తింటే వెంటనే కార్బోహైడ్రేట్లే కాకుండా శరీరానికి బోలెడు కాలరీలు కూడా అందుతాయి. ఇవి మనకు శక్తిని, సంతోషాన్ని కూడా ఇస్తాయి’’ అని రాజీవ్ కోవిల్ తెలిపారు.

diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

షుగర్‌తో సంతోషం

సంతోషకర సందర్భాలు ఎక్కువగా తీపితోనే ముడిపడి ఉంటాయి. పండుగల సమయంలోనే కాదు దేవుడికి పూజలో సమర్పించే ప్రసాదం కూడా స్వీటే అయి ఉంటుంది.

మన శారీరక, మానసిక ఆరోగ్యానికి షుగర్ ఎంతో మంచిది. దీనిని కనుక మనం గ్లూకోజ్ లాంటి రూపంలో తీసుకుంటే అది మనకు వెంటనే శక్తిని ఇస్తుంది. అలాగే సంతోషాన్నీ కలిగిస్తుంది.

‘‘మన మెదడు పనితీరు 80శాతం గ్లూకోజ్‌పైనే ఆధారపడి ఉంటుంది.అందుకే తక్కువ పరిమాణంలో షుగర్ తీసుకుంటే కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి’’ అని రాజీవ్ కోవిల్ చెప్పారు.

‘‘షుగర్ తినడం వల్ల కూడా ఒకరకమైన సంతోషం కలుగుతుంది. షుగర్ తినగానే దానిని మెదడు గ్లూకోజ్ రూపంలో స్వీకరించి, ఎండార్ఫిన్స్ ను విడుదలచేస్తుంది. దీనివల్ల మనకు సంతోషంగా అనిపిస్తుంది. అంటే అని దీనర్థం తరచూ స్వీట్లు తినమని కాదు.

షుగర్ ఉన్న ఆహారపదార్థాలు తిని ఎటువంటి శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకుండా కూర్చుంటే అనేక రకాల సమస్యలు వస్తాయి.

diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఎంతవరకు షుగర్ తీసుకోవచ్చు?

వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2035 నాటికల్లా ప్రపంచంలో 51 శాతం లేదా నాలుగువందల కోట్లమంది అధికబరువు, లేదా స్థూలకాయంతో బాధపడుతుంటారు.

అలాగే పిల్లల్లో కూడా స్థూలకాయ సమస్య రెండింతలవుతుంది. ఇక ఆడపిల్లల్లో అయితే ఈ సమస్య మగపిల్లల కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది.

భారతదేశంలో 2035 నాటికల్లా 11 శాతం మంది పెద్దవారు ఊబకాయ బాధితులుగా మారతారు. ఇది ఆర్థిక వ్యవస్థకు 13వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తుంది.

ఎవరైనా ప్రతిరోజూ 36 గ్రాములు లేదా 150 కాలరీలు ఉన్న చక్కెరను మాత్రమే వినిగియోగించాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది.

మహిళలు 25 గ్రాములు, లేదా 100 కేలరీల షుగర్‌ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

సహజంగా చక్కెరను అభివృద్ధి చెందిన దేశాలు వినియోగిస్తుంటాయి. ఇండియాలో దీని వాడకం ఎక్కువే అంటారు డాక్టర్ రాజీవ్ కోవిల్.

1980,1990 మధ్య ప్రాంతాలలో సంపన్న కుటుంబాలు మాత్రమే బరువుపెరగడం, మధుమేహంతోనూ బాధపడేవి. ఎందుకంటే వీరికి ఆహారమనేది ఓ ఖర్చుతో కూడిన వినోదంలా ఉండేది.

కానీ గడిచిన 15 ఏళ్ళుగా అనేక రకాలైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండటం వల్ల చిన్నపిల్లలు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

కొవ్వును నిల్వచేసే జన్యువులు

అనేక దశాబ్దాల కిందట ప్రజలలో కొవ్వును నిల్వ చేసే జన్యువులు అభివృద్ధి చెందినట్టు నేషనల్ లైబ్రరీలో ప్రచురితమైన సమాచారం తెలియజేస్తోంది.

ప్రజలు ఆహారం కోసం కష్టపడుతున్న రోజులలోనే ఈ జన్యువులు అభివృద్ధి చెందాయని ఈ ఇద్దరు డాక్టర్లు చెప్పారు. ఆ పరిస్థితులలో ప్రజలు తీసుకున్న ఆహారం కొవ్వురూపంలో ఈ జన్యువులలో నిల్వ ఉండేది.

కరువులాంటి సంక్షోభ సమయాలలో ఆహారం దొరకనప్పుడు ఈ కొవ్వు కరిగి ప్రజలకు శక్తిని అందించేది. ఇందుకు ఉత్తర అమెరికా ఎలుకలు ఓ మంచి ఉదాహరణ అంటారు డాక్టర్ సురేంద్రకుమార్.

ఇవి ఏడాదిలో ఆరునెలలు మాత్రమే ఆహారం తీసుకుంటాయి. మిగిలిన ఆరునెలలు ఏమీ తినకండా ఉండిపోతాయని చెప్పారు.

అయితే మనకు మేలు చేయడానికి ఏర్పడిన ఈ జన్యువే ఇప్పుడు హాని కలిగిస్తోందని ఈ ఇద్దరు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ప్రజలకు అనేకరకాలైన ఆహార పదార్థాలు తినే వెసులుబాటు ఉంది. అయితే ఈ జన్యువు మునుపటిలానే కొవ్వును నిల్వచేస్తోంది. ప్రజలు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ తరువాత వారెటువంటి శారీరక శ్రమ లేదా వ్యాయమాలు చేయడం లేదు అని తెలిపారు.

diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

అతిగా తింటే సమస్య ఏంటి?

అతిగా స్వీట్లు తినడం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ముందుగా వచ్చే సమస్య ఊబకాయం, తరువాత అనేక సమస్యలు ఏర్పడతాయి.

అంటే అధిక రక్తపోటు, కొవ్వు, డయాబెటిస్, గుండెసంబంధిత జబ్బులు వస్తాయి. అయితే ఎక్కువ స్వీట్లు తినడం వల్ల వెంటనే ఊబకాయం రాదని, కానీ అంతకుముందు అనేక సమస్యలు వస్తాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

పీసీఓడి లాంటి సమస్యలున్న మహిళలకు శరీరంపై నలుపు, లేదా పిగ్మంటేషన్ రావొచ్చు.

శరీరంలో ఇన్సులిన్ పరిమాణం ఎక్కువగా ఉండటం క్యాన్సర్ రావడానికి ఒక కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

క్యాన్సర్ కు, షుగర్‌కు సంబంధం ఏంటి?

క్యాన్సర్ రోగులు తీపి పదార్థాలు తినకూడదని చెప్పడానికి ఎటువంటి మార్గదర్శకాలు లేవని డాక్టర్ రాజీవ్ కోవిల్ చెప్పారు.

కానీ శరీరంలో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటే క్యాన్సర్‌కు అనువైన వాతావరణం ఉంటుందని తెలిపారు.

ఊబకాయం, మధుమేహంతో క్యాన్సర్‌కు సంబంధం ఉందని, ఇలాంటివారిలో క్యాన్సర్ ముప్పు 20 శాతం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

క్యాన్సర్ రోగులకు డయాబెటిస్ లేదా రక్తపోటు ఉంటే, వారు ఎక్కువ గ్లూకోజును భరించలేరు. అందుకే వారు స్వీట్లు తీసుకోకుండా ఉండాలి.

కానీ క్యాన్సర్ రోగులకు అటువంటి లక్షణాలు లేకపోతే తక్కువ మొత్తంలో స్వీట్లు తినొచ్చు అని డాక్టర్ సురేంద్రకుమార్ పేర్కొన్నారు.

‘‘ఎవరైనా ఐస్ క్రీమ్ తినాలకుంటే, ఒకేసారి స్కూప్ మొత్తం తినకూడదు. ముందు ఓ స్పూన్ ఐస్ క్రీమ్ తినాలి. ఆ తరువాత విడతలవారీగా వివిధ సమయాలలో ఐస్‌క్రీమ్‌ను పూర్తి చేయవచ్చు. డయాబెటిక్ రోగులకు కూడా ఇదే వర్తిస్తుంది’’ అని ఉదాహరణగా చెప్పారు.

‘‘క్యాన్సర్ రోగులైనా, లేదా డయాబెటిస్ బాధితులైనా ఒకేసారి పెద్దమొత్తంలో తీపిపదార్థాలు తింటే వారి శరీరం అంతటి షుగర్‌ను భరించలేకపోవచ్చు. అదే విడతలవారీగా కొద్ది కొద్దిగా తింటే శరీరంలోని ఇన్సులిన్ దానిని భరించగలుగుతుంది’’ అని డాక్టర్ సురేంద్రకుమార్ కొంచెం కొంచెంగా ఎందుకు తినాలో వివరించారు.

diabetes

ఫొటో సోర్స్, GETTY IMAGES

కృత్రిమ షుగర్‌కు దూరంగా

జామ్, బ్రెడ్ లాంటి అనేక పదార్థాలలో షుగర్ వాడుతుంటారు. జామ్‌లో ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటే అది సహజమైనదే అని నిపుణులు చెబుతున్నారు.

అలా కాకుండా షుగర్‌ను ప్రత్యేకంగా జతచేసినవి దీర్ఘకాలం తింటే అవి హాని కలగచేస్తాయంటున్నారు.

ఇలాంటివి తినడం మంచిది కాదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇవి పదేపదే తినాలనిపించడం కూడా హాని కలిగిస్తుందని, శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

వీలున్నంతవరకు కృత్రిమంగా షుగర్ కలిపిన పదార్థాలను తినకుండా ఉండటమే మేలని డాక్టర్లు చెబుతున్నారు. మీరు కనుక డయాబెటిక్ బాధితులు అయితే షుగర్ ఫ్రీ పదార్థాలను ఎంపిక చేసుకోవడానికి అలవాటు పడాలి.

శాకాహార, మాంసాహార పదార్థాలకు ఆకుపచ్చ, ఎరుపు వృత్తాలు ఇవ్వాలని, అలాగే డయాబెటిక్ రోగులకు హాని చేయని ఆహారపదార్థాలకు నీలంరంగు మార్క్ ఇవ్వాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు డాక్టర్ రాజీవ్ కోవిల్ చెప్పారు.

భారతదేశ ప్రజలకు ఆహార పొట్లాలపై ఉండే లేబుల్స్ చూసి ఎంపిక చేసే చైతన్యం తక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

అలాగే ఆరోగ్య సమాచారం పట్ల కూడా తగినంత పరిజ్ఞానం లేదన్నారు. ప్రజలు కేవలం ఆహార ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ మాత్రమే చదువుతారు.

కానీ, వాటిమీదున్న మిగిలిన విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ మిగిలిన విషయాలే ముఖ్యమైనవని, లేబుల్స్ పూర్తిగా చదవాలని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)