హూతీలు: ఈ పేద దేశపు రెబెల్స్‌కు అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమీరా మదాబీ
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
యెమెన్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. షియా ముస్లింలకు చెందిన హూతీ తిరుగుబాటుదారులు రాజధాని సనాను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. 2014 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది.
హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి చేపట్టిన దాడులతో ఆ దేశం మరింత కష్టాల్లో చిక్కుకుపోయింది. పేదరికం విపరీతంగా పెరిగిపోయింది.
అయినప్పటికీ, వెనక్కి తగ్గని హూతీలు వారి బలాన్ని ప్రపంచానికి నిరూపించుకునేందుకు నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో వెళ్తోన్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు.
ఈ దాడులపై వెనక్కి తగ్గాలని అమెరికా, దాని మిత్ర దేశాలు హూతీ తిరుగుబాటుదారులను హెచ్చరించాయి. అయినప్పటికీ, హూతీ రెబల్స్ వెనక్కి తగ్గలేదు. దీంతో, ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సైన్యాలు హూతీలు తిరుగుబాటుదారులున్న యెమెన్ స్థావరాలపై దాడులు చేపట్టాయి.
ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారనున్నాయి.

యెమెన్ ఎక్కడుంది, ఎందుకు ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమైంది?
హూతీలు అడ్డుకుంటోన్న సముద్ర రవాణాలలో ఎక్కువ భాగం వారి నియంత్రణలో ఉన్న సముద్ర ప్రాంతం వద్దే చేపడుతున్నారు. అక్కడే వారు తమ బలం, అధికారాన్ని చూపిస్తున్నారు.
యెమెన్‌లో ఎక్కువ భాగం హూతీల నియంత్రణలోనే ఉంది. యెమెన్ రాజధాని సనా, ఆ దేశ ఉత్తర భాగం, ఎర్ర సముద్ర తీర ప్రాంతమంతా 2014 నుంచి వీరి ఆధీనంలో ఉంది. ఇదే వారికి బాబ్ అల్ మండెబ్ జలసంధిపై ఆధిపత్యాన్ని కల్పించింది.
యూరప్ నుంచి ఆసియాకు చేరుకునేందుకు ఇదే సులువైన మార్గం. కానీ, ఈ మార్గంలో వెళ్లే నౌకలపై ప్రస్తుతం హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.
ఈజిప్టులోని సూయజ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను ఆనుకుని ఉండే బాబ్ అల్ మండెబ్ జలసంధి వరకూ 1,930 కిలోమీటర్ల పొడవున ఎర్ర సముద్రం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
హూతీలు ఎర్ర సముద్రంలోని నౌకలపై ఎందుకు దాడులు చేస్తున్నారు?
అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ అంచనాల ప్రకారం నవంబర్ 19, 2023 నుంచి దక్షిణ ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా వెళ్తోన్న వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు మొత్తంగా 26 సార్లు దాడులు చేశారు.
హమాస్‌కు మద్దతుగా, ప్రధానంగా ఇజ్రాయెల్‌కు వెళుతున్న సరకు రవాణా నౌకలపై తాము ఈ దాడులు చేస్తున్నట్లు హూతీలు చెబుతున్నారు.
అయితే, నౌకలపై ఇటీవల జరిగిన చాలా దాడుల్లో ఇజ్రాయెల్ నౌకలతో సంబంధం లేకుండా జరిగాయని విమర్శకులంటున్నారు.
తమ పాపులారిటీని పెంచుకునేందుకు గాజాలో పరిస్థితులను వారు వాడుకుంటున్నారని అన్నారు. తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు, తాము సమర్థవంతమైన భాగస్వామి కాగలమని ఇరాన్‌కు నిరూపించుకునేందుకు ఈ దాడులను హూతీలు చేపడుతున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హూతీ రెబల్స్ సైనిక సామర్థ్యాలేంటి?
ఎర్ర సముద్రంలో నౌకలపై హూతీలు తాము ఇటీవల చేసిన దాడులలో క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు(అన్‌నేమ్డ్ ఏరియల్ వెహికిల్స్), సాయుధ రహిత ఉపరితల నౌకలు(యూఎస్‌వీలు) ఉపయోగించారు.
ఇటీవల దాడుల్లో హూతీలు చిన్న బోట్లు, హెలికాప్టర్లను వాడుతూ నౌకలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం, లేదా వాటిల్లోకి దూకడం చేశారు.
యూఏవీలు లేదా కామికాజ్ డ్రోన్లుగా పిలిచే వాటిని హూతీలు ఖాసెఫ్ డ్రోన్ల మాదిరి మోహరించి ఈ దాడులు చేపడుతున్నారు. సౌదీ అరేబియాపై దీర్ఘకాలికంగా సాగుతున్న ఘర్షణలలో హూతీలు వాడుతున్న లాంగ్ రేంజ్ సమద్‌లను కూడా ఈ దాడులలో ఉపయోగిస్తున్నారు.
వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నియర్ ఈస్ట్ పాలసీ ప్రకారం, హూతీల వద్ద పలు నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులున్నాయి. 80 నుంచి 300కి.మీల రేంజ్‌లో ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు.
అంతేకాకుండా, 300 కి.మీల దూరం వరకున్న టార్గెట్లపై కూడా ఈ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు దాడులు చేయగలవని ఈ ఇన్‌స్టిట్యూట్ చెప్పింది.
ఈ క్షిపణుల దాడులను అడ్డుకొనడం కష్టతరం. ఇవి ఒక్కసారిగా పైకి లేచి, వేగంగా దాడి చేయగలవు. గరిష్ఠ దూరంలో ఉంచిన లక్ష్యాన్ని ఈ క్షిపణులు కచ్చితత్వంతో చేరుకోగలవు.
అయితే, సమయానికి అనుకూలంగా వీటిని ఎక్కుపెట్టే తెలివితేటలు కావాల్సి ఉంటుందని వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రోన్లతో పోలిస్తే బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు మరింత భయంకరమైనవని సముద్రయాన చరిత్రకారుడు సాల్ మెర్కోగ్లియానో బీబీసీకి చెప్పారు. ఎందుకంటే, పెద్ద వార్‌హెడ్స్‌తో, కెనటిక్ ఫోర్స్‌తో ఇవి రూపొందుతాయి.
వన్ వే డ్రోన్లు ప్రస్తుతం లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయని మెర్కోగ్లియానో చెప్పారు. ఇవి చౌక అయినవి, తేలికగా ఒక దగ్గర్నుంచి ప్రయోగించడానికి వీలుగా ఉంటాయని చెప్పారు. అయితే, ఇవి చాలా నిదానంగా లక్ష్యాలవైపుకి సాగుతాయి.
నౌక వాటర్‌లైన్ పైనుంచి ఈ డ్రోన్లు దాడి చేస్తాయి. ఇవి సృష్టించే మంటలు ఆందోళనకరంగా మారాయి.
ప్రస్తుత ఘర్షణలలో హూతీలు తొలుత జనవరి 4న పేలుళ్ల పదార్థాలతో ఉన్న వన్ వే సాయుధ రహిత ఉపరితల నౌకలను వాడినట్లు అమెరికా నౌకాదళం పేర్కొంది. అంతర్జాతీయ నౌకా మార్గాలలో వీటిని పెద్ద ధ్వనితో హూతీలు పేల్చారు.
‘‘అదృష్టవశాత్తు ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు. ఏ నౌకలు ప్రభావితం కాలేదు. కానీ, ఈ వన్ వే సాయుధ రహిత ఉపరితల నౌకలతో దాడి చేయడం ఎర్ర సముద్రంలో ఆందోళనకరంగా మారింది’’ అని అమెరికా నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు.
సౌదీ ఫ్రిగేట్ అల్-మదినాహ్‌పై దాడి చేసినప్పుడు 2017 జనవరిలో హూతీలు యూఎస్‌వీలను వాడారు. 2020 మార్చిలో మరోసారి యెమెన్‌లో ఏడెన్ వైపుగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై దీని ద్వారా దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS
హూతీలకు ఎలాంటి మద్దతు ఉంది?
యెమెన్‌లోని షియా ముస్లిం తెగ జైదీలకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులనే ‘హూతీ రెబెల్స్’గా పిలుస్తారు.
1990లలో నాటి యెమెన్ అధ్యక్షుడు అబ్దుల్లా సాలేహ్ ప్రభుత్వంలో అవినీతిపై పోరాడేందుకు వీరు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు.
ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడైన హుస్సేన్ అల్ హూతీ పేరునే వీరు తమ గ్రూపునకు పెట్టుకున్నారు. వీరినే అన్సర్ అల్లా, ‘ద పార్టిసాన్స్ ఆఫ్ గాడ్’ అని కూడా పిలుచుకుంటారు.
‘‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’’లో వీరు కూడా భాగమని తమకు తాము ప్రకటించుకున్నారు. దీనిలో లెబనాన్‌లో హిజ్‌బుల్లా, సిరియాలోని అస్సాద్ పాలన, గాజాలో హమాస్‌లు, ఇరాన్‌కు చెందిన ఇతర గ్రూప్‌లు భాగం. వీరందరూ ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకం.
సౌదీ అరేబియా, యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై దాడి చేసేందుకు హూతీలు వాడిన క్షిపణి వ్యవస్థలు అక్రమంగా వారి చేతికి వచ్చినవని, ఇరాన్ దేశంతో వీటికి సంబంధాలున్నట్లు తెలియజేసే ఆధారాలను బ్రిటన్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ఐరాస ముందు ఉంచింది.
ఇరాన్ దక్షిణం వైపున సముద్ర జలాల్లో స్పీడ్ బోట్లతో ఆయుధాలు అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్ల నుంచి రాయల్ నేవీ నౌక హెచ్ఎంఎస్ మాంట్రెస్ 2022 మొదట్లో రెండుసార్లు ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
అలా స్వాధీనం చేసుకున్న వాటిలో భూతలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, భూతల లక్ష్యాలను ఛేదించే క్రూజ్ మిసైల్స్ ఇంజిన్లు, క్వాడ్‌కాప్టర్ డ్రోన్లు ఉన్నాయని బ్రిటన్ వివరించింది.

ఫొటో సోర్స్, REUTERS
అమెరికా నేతృత్వంలో జరుగుతున్న దాడులు హూతీలను ఆపగలవా?
ఎర్ర సముద్రంలో, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ఎదురవుతున్న భద్రతా సవాళ్లను పరిష్కరించేందుకు 2023 డిసెంబర్‌లో ‘‘ఆపరేషన్ ప్రొస్పెరిటీ గార్డియన్’’ పేరుతో బహుళ జాతీయ దళం ఏర్పడింది.
అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు హూతీలు చేస్తోన్న దాడులకు వ్యతిరేకంగా దీన్ని ఏర్పాటు చేశాయి. జనవరి 11 గురువారం రాత్రి, ఈ కూటమి హూతీలపై దాడులు ప్రారంభించింది.
‘‘యూకే, ఆస్ట్రేలియా, కెనడా, బెహ్రయిన్, హోల్యాండ్‌ల సహకారంతో అమెరికా దళాలు యెమెన్‌లో హూతీ రెబల్స్‌కు చెందిన 16 ప్రాంతాల్లో 60కి పైగా దాడులు చేశాయి’’ అని అమెరికా రక్షణ దళం ప్రకటించింది.
కానీ, ఏళ్లుగా హూతీలపై సౌదీ, దాని మిత్రదేశాలు చేస్తున్న దాడులు విఫలమవుతూనే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ పులులు: ఆధిపత్య పోరులో అంతమవుతున్నాయా? విషప్రయోగాలకు బలవుతున్నాయా
- కర్ణాటక : హిందూ యువకుడితో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు గ్యాంగ్ రేప్ చేశారన్న ముస్లిం మహిళ, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం
- అభినందన్ వర్ధమాన్ : ఈ భారత పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో తెరవెనుక ఏం జరిగింది?
- హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
- బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా ఎందుకీ ఘర్షణలు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















