ఇండియా-అఫ్గానిస్తాన్‌ మ్యాచ్ ‘డబుల్ సూపర్ ఓవర్‌’కు ఎలా వెళ్లింది? థ్రిల్లింగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవి బిష్ణోయ్ భారత్‌ను ఎలా గెలిపించారు?

Ravi Bishnoi

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రవి బిష్ణోయి

అఫ్గానిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

ఫలితాన్ని తేల్చడానికి రెండుసార్లు సూపర్ ఓవర్లు ఆడాల్సి రావడం ఈ మ్యాచ్‌ను అత్యంత రసవత్తరంగా మార్చింది.

2020 అక్టోబరులో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చేందుకు డబుల్ సూపర్ ఓవర్ల అవసరం ఏర్పడింది. అప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది.

చిన్నస్వామి స్టేడియంలో ఏం జరిగింది?

బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారత్-అఫ్గాన్ మ్యాచ్‌లో- నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 212 పరుగుల భారీ స్కోరు సాధించడంతో గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు అభిమానులు.

కానీ అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి అంతే దూకుడుగా ఆడడంతో చివరి ఓవర్ వచ్చేసరికి భారత అభిమానుల్లో గెలుపుపై నమ్మకం తగ్గిపోయింది. అయితే అప్పుడు మ్యాచ్ అనుకోని మలుపు తిరిగింది.

ముకేశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముకేశ్ కుమార్

‘టై’ ఎలా అయ్యింది?

గెలుపు కోసం చివరి ఓవర్‌లో 19 పరుగులు చేయాల్సిన అఫ్గానిస్తాన్ 18 పరుగులు మాత్రమే చేసింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.

చివరి ఓవర్ వేసిన ముకేశ్ కుమార్ వైడ్‌ల రూపంలో రెండు ఎక్స్‌ట్రా రన్స్ ఇవ్వడంతోపాటు ఫస్ట్ డౌన్‌లో వచ్చి నిలకడగా ఆడుతూ చివరి వరకు ఉన్న అఫ్గాన్ బ్యాటర్ గుల్బాదిన్ నయీబ్ ఆ ఓవర్లో ఒక ఫోర్, ఒక భారీ సిక్సర్ కూడా కొట్టాడు.

దాంతో చివరి రెండు బంతుల్లో అఫ్గానిస్తాన్ ఐదు పరుగులు చేస్తే విజయం అందుకునే అవకాశం వచ్చింది.

అయితే, నయీబ్ చివరి రెండు బంతులను బౌండరీకి తరలించడంలో విఫలం కావడం.. అయిదో బంతికి రెండు పరుగులు, ఆరో బంతికి రెండు పరుగులు మాత్రమే చేయగలగడంతో మ్యాచ్ టై అయింది.

రన్ అవుట్ చేస్తున్న సంజూ శాంసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రన్ అవుట్ చేస్తున్న సంజూ శాంసన్

తొలి సూపర్ ఓవర్‌లో ఏమైంది?

మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ అవసరమైంది.

సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు ఆటగాడు గుల్బాదీన్ నయీబ్ ఎదుర్కొన్న తొలి బంతికి ఒక పరుగు తీసి రెండో పరుగు చేసే ప్రయత్నంలో రన్ అవుట్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ బంతిని సంజూ శాంసన్ వైపు విసరడంతో నయీబ్ రెండో పరుగు పూర్తి చేసేలోగా రన్ అవుట్ చేశారు.

రహమనుల్లా గుర్బాజ్ ఒక ఫోర్, మొహమ్మద్ నబీ ఒక సిక్సర్ బాదడంతో అఫ్గాన్ జట్టు ఆరు బంతుల్లో 16 పరుగులు చేసింది.

భారత్ తన తొలి సూపర్ ఓవర్లో అన్నే పరుగులు చేసింది.

రోహిత్ శర్మ రెండు సిక్సర్లతో 13 పరుగులు, యశస్వి జైస్వాల్ రెండు పరుగులు చేయగా, మరో రన్ ఎక్స్‌ట్రా రూపంలో వచ్చింది.

రెండు జట్లూ సూపర్ ఓవర్లో సమానంగా పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్ అవసరమైంది.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

రెండో సూపర్ ఓవర్ ఎలా సాగింది?

రెండో సూపర్ ఓవర్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ 3 బంతులు ఆడి ఒక ఫోర్, సిక్సర్‌తో 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

భారీ షాట్లు ఆడగలడన్న అంచనాతో సూపర్ ఓవర్ ఓపెనింగ్‌లో తీసుకొచ్చిన రింకూ సింగ్ ఎదుర్కొన్న తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ వెంటనే వచ్చిన సంజూ శాంసన్ కూడా ఎదుర్కొన్న తొలి బంతికే రన్ అవుట్ అయ్యాడు. అది ఓవర్లో అయిదో బంతి.

రెండు వికెట్లు కోల్పోయిన భారత్, రెండో సూపర్ ఓవర్లో అయిదు బంతులకు 11 పరుగులే చేయగలిగింది.

ఆ వెంటనే అఫ్గాన్ బ్యాటర్లు రెండో సూపర్ ఓవర్ బ్యాటింగ్‌కు దిగారు. అయితే భారత స్పిన్నర్ రవి బిష్ణోయి తన మాయాజాలంతో మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసి ఫలితాన్ని తేల్చాడు.

మొదటి బంతి ఆడిన మొహ్మద్ నబీ రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

దాంతో క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మన్ కరీం జనాత్ రెండో బంతికి ఒక పరుగు తీశాడు. మూడో బంతి ఆడిన రహమనుల్లా గుర్బాజ్ ఆడిన బంతిని రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో అఫ్గాన్ జట్టు రెండో వికెట్ కూడా కోల్పోయింది.

దీంతో రెండో సూపర్ ఓవర్లో మూడు బంతుల్లో రెండు వికెట్ల నష్టానికి ఒక పరుగు మాత్రమే చేసిన అఫ్గాన్, ఓటమి పాలైంది.

భారత్ 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

Rinku singh

ఫొటో సోర్స్, Getty Images

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌’ రోహిత్ శర్మ

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసి భారత్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ 121 పరుగులు, రింకూ సింగ్ 69 పరుగులు చేశారు.

కోహ్లీ, సంజూ శాంసన్‌ పరుగులేమీ చేయకుండానే అవుట్ కాగా, యశస్వి జైస్వాల్ 4, శివమ్ దూబె 1 పరుగు చేశారు.

అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.

213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టులో రహమనుల్లా గుర్బాజ్ 50, ఇబ్రహీం జద్రాన్ 50, నయీబ్ 55, మొహ్మద్ నబీ 34 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్, కులదీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో, రెండుసార్లు సూపర్ ఓవర్లలో సత్తా చాటిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌’గా ఎంపికయ్యాడు.

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)