గర్భాశయ క్యాన్సర్ నుంచి హెచ్‌పీవీ వ్యాక్సీన్ కాపాడుతుందా? ఈ టీకా ఎవరు తీసుకోవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
సర్వికల్(గర్భాశయ) క్యాన్సర్ నివారణ కోసం భారత్‌లో 9 నుంచి 14 ఏళ్ల వరకు వయసున్న బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న చెప్పారు.
పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయం తెలిపారు.
భారత మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్‌ది నాలుగో స్థానం. ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి పైగా దీని వల్ల మరణిస్తున్నారు.
టీకా కార్యక్రమం గురించి కేంద్ర మంత్రి నిర్మల పూర్తి వివరాలను వెల్లడించలేదు.
సర్వికల్ క్యాన్సర్ కేసులను హెచ్‌పీవీ టీకా 90 శాతం వరకు తగ్గించనుందని ఇటీవల వెలువడిన ఒక పరిశోధన చెబుతోంది. అయితే ఈ క్యాన్సర్ నుంచి ఈ టీకా ఎలా రక్షిస్తుంది? ఎవరు ఈ టీకాను వేయించుకోవచ్చు? ఇలాంటి వివరాలను జనవరి 17న పబ్లిష్ అయిన ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఈ క్యాన్సర్ నుంచి హెచ్‌పీవీ టీకా ఎలా రక్షిస్తుంది?
తొమ్మిది రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌ల(హెచ్‌పీవీల) నుంచి ఈ హెచ్‌పీవీ టీకా కాపాడనుంది.
దీనిలో రెండు రకాలు గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమవుతుండగా.. కొన్ని జనానాంగాల క్యాన్సర్, ఆనల్ క్యాన్సర్, తల మరియు మెడ క్యాన్సర్లు వచ్చేలా చేస్తున్నాయి.
హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్లు సంక్రమించకుండా టీకా కనీసం పదేళ్ల పాటు రక్షిస్తుందని అధ్యయనాల్లో నిరూపితమైంది.
అయితే ఈ రక్షణ ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
గర్భాశయ క్యాన్సర్ కేసులను ఈ టీకా సుమరు 90 శాతం తగ్గించనుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
హెచ్‌పీవీ టీకా ఎవరికి ఇవ్వవచ్చు?
హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్లు సోకకముందే అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ టీకా ఇస్తే మంచిది.
ఎందుకంటే, ఈ టీకా ఇన్‌ఫెక్షన్ సోకకుండా సంరక్షించగలదు. కానీ, హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఈ టీకా కాపాడలేదు.
వైరస్‌లు చాలా వేగంగా వ్యాప్తిస్తాయి. పిల్లలు చురుకుగా లైంగికంగా పాల్గొనడాని కంటే ముందే ఈ వైరస్‌లను తట్టుకునే నిరోధక శక్తి వారి శరీరంలో ఉండాలి.
ఒకటి లేదా రెండు మోతాదుల్లో ఈ టీకాను ఇవ్వొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు రెండు లేదా మూడు మోతాదులు తీసుకోవాలని సూచించింది.
హెచ్‌పీవీ అంటే ఏమిటి?
హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌లనే హెచ్‌పీవీ అంటూ ఉంటారు. 100కి పైగా హెచ్‌పీవీ రకాలున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి కాగా, మరికొన్ని అంత ప్రమాదకరం కాదు.
హెచ్‌పీవీ అనేది చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా ఎలాంటి వ్యాధి లక్షణాలను కలిగించవు.
ఎలాంటి లక్షణాలు లేకుండానే హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. కొన్ని రకాల వైరస్‌ల వల్ల పులిపిరికాయలు కూడా వస్తుంటాయి. ఇవి మీ చేతులపై, కాళ్లపై, జననాంగాలపై, మీ నోట్లో వస్తుంటాయి.
చాలా మందికి వారు వైరస్ బారిన పడినట్లు కూడా తెలియదు. ఎలాంటి చికిత్స లేకుండానే కొందరి శరీరంలో నుంచి ఈ వైరస్‌లు వెళ్లిపోతాయి.
అయితే అత్యంత ప్రమాదకరమైన రకానికి చెందిన హెచ్‌పీవీ అయితే, శరీరంలో టిస్యూలు పెరిగి, అవి క్యాన్సర్‌కు దారితీస్తాయి.
ఎవరికి హెచ్‌పీవీ వస్తుంది? ఇది లైంగికంగా సంక్రమిస్తుందా?
హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ చాలా తేలికగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. సన్నిహితంగా శారీరక సంబంధాలున్నప్పుడు ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంటుంది. 25 ఏళ్ల వయసులోనే 80 శాతం మంది హెచ్‌పీవీ బారిన పడుతున్నారు.
లైంగిక సంబంధాల వల్ల సంక్రమించే వ్యాధి అని సాంకేతికంగా చెప్పలేం. గానొరియా లాంటి వ్యాధుల మాదిరి లైంగిక ద్రవాల నుంచి ఇది సంక్రమించదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రభావమెంత?
డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం దాదాపు 90 శాతం గర్భాశయ క్యాన్సర్ వ్యాధుల మరణాలు పేద, మధ్య తరగతి ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయి.
ఈ దేశాల్లో గర్భాశయ క్యాన్సర్‌ను అంత వేగంగా గుర్తించలేకపోతున్నారు. దీని లక్షణాలు మరింత పెరిగి, అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకునేంత వరకు ఈ క్యాన్సర్ వచ్చినట్లు తేలడం లేదు.
హెచ్‌పీవీ టీకా కవరేజ్‌ను 2030 నాటికి 90 శాతం వరకు పెంచి వచ్చే శతాబ్దం లోపల ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ అంతకుముందు తెలిపింది.
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా సబ్-సహారన్ ఆఫ్రికాలో(24 శాతం), ఆ తర్వాత లాటిన్ అమెరికాలో, కరేబియన్‌లో(16 శాతం), తూర్పు యూరప్‌లో(14 శాతం), ఆగ్నేయాసియాలో(14 శాతం) వస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.

స్క్రీనింగ్ ప్రొగ్రామ్‌లు సరిగ్గా లేకపోవడం, చికిత్సలు పరిమితంగా అందుబాటులో ఉండటం, టీకాల కొరత వంటివి ఈ కేసులు పెరిగేందుకు కారణమవుతున్నాయి.
ఆఫ్రికాలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ క్యాంపెయిన్‌ను ప్రవేశపెట్టిన తొలి దేశంగా రువాండా ఉంది. 2011లోనే రువాండా ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. చిన్న వయసులోనే అమ్మాయిలు ఈ టీకా వేయించుకోవాలని, మహిళలు గర్భాశయ స్క్రీనింగ్ చేసుకోవాలని ఇది ప్రచారం చేపట్టింది.
తొలి ఏడాదిలో ప్రతి 10 మంది అమ్మాయిలో 9 మంది టీకా వేయించుకోవడానికి అర్హత పొందారు. దీంతో, ఇతర దేశాలకు ఇది ఆదర్శంగా నిలిచింది.
గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలను ఈ టీకా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నప్పటికీ, అన్ని రకాల హెచ్‌పీవీల నుంచి ఇది రక్షించలేదు.
ప్రతి మహిళా 25 ఏళ్లు వచ్చిన తర్వాత రెగ్యులర్‌గా గర్భాశయ స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి వద్దకు వెళ్ళిన 24 మంది వ్యోమగాముల్లో సజీవంగా ఉన్న 8 మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు 100 రోజులు... ఈ యుద్దం ఎటు వెళ్తోంది?
- సర్గాస్సమ్ ఆల్గే: టన్నుల కొద్దీ పెరిగే ఈ సముద్రపు నాచుతో ఎన్ని కష్టాలో తెలుసా?
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














