అయోధ్య: రామమందిరంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే, ఇన్నేళ్ళుగా పూజలు అందుకుంటున్న రామ్‌లల్లాను ఎక్కడ ఉంచుతారు?

ఫొటో సోర్స్, SARVAN KUMAR
- రచయిత, అనంత్ ఝణాణే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాముడి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
కానీ, ముందు నుంచి పూజలందుకుంటున్న రామ్‌లల్లా విగ్రహాన్ని ఏం చేస్తారు? చాలా మంది మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న ఇది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కొన్ని రోజుల క్రితం ఇదే ప్రశ్న అడిగారు.
ఇక్కడ 1949 డిసెంబర్ 22-23 తేదీల్లో విగ్రహం వెలిసిందని, అది దైవికమని మొదట జనసంఘ్ తర్వాత బీజేపీ, సంఘ్ పరివార్ నిరంతరం చెబుతూనే వస్తున్నాయి.
స్వయంభువుగా రామ్‌లల్లా విగ్రహం వెలిసిందని చెప్పేవారంతా, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన వారందరిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.
రామ్‌లల్లా వెలిసినప్పుడు జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు అప్పటి కలెక్టర్ కేకే నాయర్, గీతాప్రెస్ డైరెక్టర్ హనుమాన్ ప్రసాద్ పొద్దార్‌లు చాలా ముఖ్య పాత్ర పోషించారని చెబుతుంటారు.
గత 74 ఏళ్లుగా రామ్‌లల్లా రూపంలో ఆ విగ్రహానికే పూజలు, అర్చనలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, CHAMPAT RAI
స్వాతంత్య్రానికి ముందు కథ
నిజానికి, 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత నవాబుల పాలన ముగియడంతో బ్రిటిష్ చట్టం, పాలన, న్యాయ వ్యవస్థ అమల్లోకి వచ్చాయి.
ఈ సమయంలోనే హిందువులు, మసీదు వెలుపలి భాగాన్ని స్వాధీనం చేసుకొని ఒక గద్దెను నిర్మించి భజనలు-పూజలు చేయడం ప్రారంభించారని, ఆ తర్వాత నుంచే అక్కడ గొడవలు మొదలయ్యాయని నమ్ముతారు.
దీనికి సంబంధించి ఇరు పక్షాల మధ్య చాలా గొడవలు, కేసులు అయ్యాయి. ఈ వ్యవహారం 90 ఏళ్లకు పైగా నడిచింది. హిందూ సన్యాసులు 1949 నవంబర్ 24న మసీదు సమీపంలోని శ్మశానాన్ని శుభ్రం చేసి అక్కడ యజ్ఞాలు, రామాయణ పారాయణాలను మొదలుపెట్టారు. దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారు. గొడవలు ముదురుతుండటం చూసి అక్కడ ఒక పోలీస్ పోస్టును ఏర్పాటు చేశారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలను (పీఏసీ) మోహరించారు.
పీఏసీని మోహరించిన తర్వాత 1949 డిసెంబర్ 22-23 రాత్రి మసీదు లోపల రామ్ లల్లా అవతరించాడంటూ మహంత్ అభయ్ రామ్‌దాస్ ఒక ప్రకటన చేశారు.
రాముడు అక్కడ వెలిసి తన జన్మస్థలంపై పట్టు నిలుపుకున్నాడంటూ ఆ తర్వాత నుంచి ఒక ప్రచారం మొదలైంది.
తర్వాత అయోధ్యలో భూ యజమాన్యం విషయం కోర్టుకు చేరినప్పుడు భగవాన్ రామ్‌లల్లా విరాజ్‌మాన్ ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా మారాడు.
రామ్‌లల్లా విగ్రహం ఎలా వెలిసింది? రామమందిరానికి సంబంధించిన ఆందోళనలో ఆ విగ్రహం ఎలాంటి పాత్ర పోషించింది? ఈ విషయాలను తెలుసుకోవడానికి మేం 1992 నుంచి రామ జన్మభూమి మందిరంలో ముఖ్య పూజారిగా ఉన్న ఆచార్య సత్యేంద్ర దాస్‌తో మాట్లాడాం.

ఫొటో సోర్స్, ANI
రామ్‌లల్లానే ముఖ్యం
రామ్‌లల్లా విరాజ్‌మాన్ అత్యంత కీలకమంటూ చెప్పిన ఆచార్య సత్యేంద్ర దాస్ ఇలా అన్నారు.
‘‘కొత్త రాముని కోసం గొప్ప ఆలయం నిర్మితమైంది. కానీ, 1949లో వెలిసిన రామ్‌లల్లాకే ఎక్కువ మహత్యం ఉంటుంది’’ అని చెప్పారు.
‘‘న్యాయవాది దేవకీ నందన్, రామ్‌లల్లా విరాజ్‌మాన్ స్నేహితుడి హోదాలో అలహాబాద్ కోర్టులో కేసు వేశారు. బాలుని రూపంలో రామ్‌లల్లా అక్కడ వెలిశారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టులో ఇచ్చారు. కోర్టు ఈ రామ్‌లల్లా విరాజ్‌మాన్ ఆధారంగానే ఇది రామజన్మభూమి అంటూ నిర్ణయం వెలువరించింది. ఆ తర్వాతే రామ మందిర నిర్మాణం మొదలైంది.
ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన వివాదాలన్నీ, కోర్టులో పోరాడిన కేసులన్నీ రామ్‌లల్లా విరాజ్‌మాన్ పేరుతోనే జరిగాయి. ఆ పేరు మీదు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు రామమందిరం నిర్మాణం అయింది. ఇంతకుముందు రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు ఎలా పూజలు, అర్చనలు జరిగాయో అలాగే ఇక ముందు కూడా జరుగుతాయి’’ అని ఆయన వివరించారు.
కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే దగ్గరే, పాత రామ్‌లల్లా విగ్రహాన్ని కూడా ఉంచుతారని ఆయన చెప్పారు.
‘‘తొలుత విగ్రహం మసీదు గోపురం కింద ఉండేది. 1992 డిసెంబర్ 6న గోపురాన్ని కూల్చినప్పుడు ఈ విగ్రహాన్ని ఒక టార్పాలిన్‌లో ఉంచి అక్కడే పూజలు చేశారు. ప్రస్తుతం ఇది చెక్కతో కట్టిన మందిరంలో ఉంది. ఈ మందిరంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే రామ్‌లల్లాకు పూజలు జరుగుతున్నాయి. భక్తులు రామ్‌లల్లాను దర్శించుకుంటున్నారు. తర్వాత ఈ విగ్రహాన్ని కొత్త ఆలయంలోకి తీసుకెళ్తారు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఉత్సవ మూర్తి’’గా పాత విగ్రహం
రామ్‌లల్లా విరాజ్‌మాన్ విగ్రహాన్ని కదిలే విగ్రహంగా భావిస్తారని ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. దీన్నే ఉత్సవ మూర్తిగా పరిగణిస్తారు. అంటే దీనర్థం, ఇప్పుడు ప్రతిష్టించబోయే 51 అంగుళాల విగ్రహం అచల మూర్తిగా ఉంటుంది. దాన్ని కదిలించలేరని ఆయన అన్నారు.
‘‘రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ను ఏ ఉత్సవంలోకైనా తీసుకెళ్లవచ్చు. ఉత్సవం అయ్యాక మళ్లీ తిరిగొస్తాడు. అయోధ్యలోని మణి పర్వతం మీద ఊయల ఉత్సవం జరిగినప్పుడు రామ్‌లల్లాను అక్కడికి తీసుకెళ్తారు.
ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే కొంతమంది వ్యక్తులు తమ కార్యక్రమంలోకి రామ్‌లల్లా విగ్రహం రావాలని కోరుకుంటే అక్కడికి కూడా రామ్‌లల్లా విగ్రహాన్ని తీసుకెళ్తారు. అక్కడే రామ్‌లల్లాకు పూజలు, అర్చనలు జరుగుతాయి. తర్వాత విగ్రహాన్ని మళ్లీ మందిరానికి తీసుకొస్తారు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, SARVAN KUMAR
రామ్‌లల్లాకు దుస్తులు కుట్టే కుటుంబం
భగవత్ ప్రసాద్ పహాడీ 1985 నుంచి రామ్‌లల్లా విగ్రహానికి దుస్తులు కుడుతున్నారు. ఆయనకు బాబూలాల్ టేలర్స్ పేరుతో దుకాణం ఉంది.
‘‘మా నాన్నతో పాటు ఇద్దరం అన్నదమ్ములం, మా ముగ్గురు కుమారులు, ఒక కోడలు కలిసి రామ్‌లల్లాకు దుస్తులు కుట్టే సేవ చేస్తున్నాం. రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు, భక్తుల తరఫు నుంచి రామ్‌లల్లాకు దుస్తులు కుట్టాలంటూ మాకు ఆర్డర్లు వస్తాయి’’ అని ఆయన చెపారు.
రామ్‌లల్లా మసీదు గోపురం కింద ఉన్నప్పుడు ఏడాదికి ఒకే డ్రెస్ వేసేవారని ఆయన అన్నారు.
‘‘గోపురాన్ని కూల్చేసి దేవుడిని టెంట్‌లోకి తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున ఏడాదికి ఏడు సార్లు దుస్తుల ఆర్డర్లు వచ్చేవి. రామ్‌లల్లా విగ్రహం 7 లేదా 8 అంగులాలు ఉంటుంది. రాముడితో పాటు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ ఒకే పరిమాణంలో ఉంటారు. బాల రూపంలో మోకాళ్లపై కూర్చొని ఉంటారు’’ అని చెప్పారు.
చెక్క మందిరంలోకి రాముని విగ్రహాన్ని తరలించినప్పటి నుంచి ట్రస్టుతో పాటు భక్తుల నుంచి కూడా దేవుడి కోసం వస్త్రాలు తయారు చేయాలంటూ ఆర్డర్లు రావడం మొదలయ్యాయని భగవత్ ప్రసాద్ చెప్పారు.
దేవుడికి రోజూ కొత్త వస్త్రాలు, తాజా ప్రసాదాలు రోజూ అందించాలని భగవత్ ప్రసాద్ అన్నారు.
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజ కోసం దేవుడికి కొత్త వస్త్రాలకు సంబంధించి ట్రస్టు నుంచి ఎలాంటి ఆర్డర్లు ఇంకా తమకు అందలేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త విగ్రహం ఎలా ఉంటుంది?
రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర కార్యదర్శి చంపత్ రాయ్ కొన్ని రోజుల క్రితం ఒక సమావేశంలో కొత్త రాముని విగ్రహం గురించి మాట్లాడారు.
కొత్త రాముని విగ్రహం రాతితో తయారైందని, అయిదేళ్ల బాలుని రూపంలో నిలబడి ఉంటుందని చెప్పారు.
‘‘కళ్లు, శరీరం, ముఖం అయిదేళ్ల బాలుడు కోమలంగా నవ్వుతున్నట్లుగా ఆ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంలో దైవత్వం ఉంది. అది దేవుడి అవతారం, విష్ణు స్వరూపం. అలాంటి విగ్రహం తయారైంది’’ అని ఆయన వెల్లడించారు.
విగ్రహం ఎత్తు 51 అంగుళాలు, బరువు 150 కిలోలు ఉంటుందని పూర్తిగా రాతితో తయారైందని ఆయన చెప్పారు.
విగ్రహానికి నీళ్లు, పాలతో అభిషేకాలు చేసిన ఎలాంటి ప్రభావం పడకుండా, ఆ నీరు తాగితే శరీరంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లుచెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు
- మాల్దీవులు దూకుడుపై భారత్ మౌనం ఎందుకు?
- పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- ఇరాన్ క్షిపణి దాడుల్లో తమ చిన్నారులు చనిపోయారన్న పాకిస్తాన్, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










