ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి 230 ఏళ్ళు పడుతుందా?

ఆక్స్‌ఫామ్ నివేదిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని పేదరికాన్ని రూపుమాపడానికి 229 ఏళ్లయినా పడుతుందని ఆక్స్‌ఫాం నివేదికలో ప్రచురించింది.
    • రచయిత, ఆశయ్ యెడ్గే
    • హోదా, బీబీసీ మరాఠీ కరస్పాండెంట్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులెవరు? ఎవరి దగ్గర ఎంత డబ్బుంది? ఫలానా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ రోజులో ఎన్ని గంటలు నిద్రపోతారు? ప్రతి గంటకు ఫలానా ధనవంతుడు ఎంత చొప్పున సంపాదిస్తారు?

మార్క్ జూకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ వంటి సంపన్నుల గురించి చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు.

పేదరికం గురించిన చర్చ మాత్రం చాలా తక్కువగానే తెరమీదకు వస్తుంటుంది.

ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల సంపద వేగంగా రెట్టింపవుతుంటే, పేదరికం మాత్రం అందుకు కొన్ని వందల రెట్లు పెరుగుతోంది.

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని తొలిరోజు సదస్సులో ఆక్స్‌ఫామ్ సంస్థ వార్షిక 'అసమానతల నివేదిక'ను విడుదల చేసింది.

ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు, ధనిక-పేదల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నాయో ఆ నివేదికలో పేర్కొన్నారు.

ప్రపంచంలోని ఐదుగురు సంపన్నులంతా కలిసి రోజుకు 8 కోట్ల 29 లక్షల 89 వేల 650 రూపాయల చొప్పున ప్రతిరోజూ ఖర్చుచేస్తే, మొత్తం వారి సంపదనంతా వెచ్చించడానికి 476 సంవత్సరాల సమయం పడుతుందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది.

2020 నుంచి ఐదుగురు ధనవంతులు తమ సంపదను రెట్టింపు చేసుకుంటే, ఐదు బిలియన్ల మంది పేదరికంలో కూరుకుపోయారని నివేదిక చెప్తోంది.

ఆక్స్‌ఫామ్ నివేదిక

ఫొటో సోర్స్, Getty Images

నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు...

  • ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని ధనవంతుల సంపద ఇదే స్థాయిలో పెరుగుతూ వెళ్తే, వచ్చే పదేళ్లలోనే మొదటి ట్రిలీనియర్‌ను ఈ ప్రపంచం చూస్తుంది.
  • గడిచిన మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, కోవిడ్ వంటి సంక్షోభ పరిస్థితుల వల్ల జీవన ప్రమాణ వ్యయం పెరుగుతోంది. ఇది కేవలం ధనిక, పేదల మధ్యనున్న అంతరాలను పెంచడం మాత్రమే కాదు, ప్రపంచంలోని సంపదంతా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకే వెళ్లేలా చేస్తోంది.
  • ఆర్థికరంగంలో గుత్తాధిపత్యంతోపాటు, గ్లోబల్ కార్పొరేట్ సంస్థల ప్రభావం క్రమంగా పెరుగుతోన్న కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోందని నివేదికలో పేర్కొన్నారు.
  • యజమానుల గరిష్ట ఆదాయాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆయా సంస్థలు అనుసరిస్తున్న వ్యూహంతో వారి సంపద పెరుగుతోంది.
  • 2020 నాటికి ప్రపంచంలోని తొలి ఐదుగురు సంపన్నుల మొత్తం 405 బిలియన్ డాలర్ల నుంచి 869 బిలియన్ డాలర్లకు చేరింది. వీరు ప్రతి గంటకు 1.4 మిలియన్ డాలర్లు సంపాదిస్తుంటే, మరోవైపు ఐదు బిలియన్ల మంది పేదరికం బారిన పడుతున్నారు.
  • ఇదే ట్రెండ్ కొనసాగితే, వచ్చే పదేళ్లలో ప్రపంచం ఓ వైపున తొలి ట్రిలీనియర్‌ను చూస్తుంది. అదే సమయంలో పేదరికాన్ని రూపుమాపడానికి పట్టే సమయం 229 ఏళ్లకు పెరుగుతుంది.
  • ప్రపంచంలోని సంపదలో 43 శాతం సంపద ఒక్క శాతం మంది జనాభా దగ్గరే ఉంది. ఆసియాలోని మొత్తం సంపదలో 50 శాతం సంపద ఒక్కశాతం మంది జనాభా దగ్గరే ఉంది. ఐరోపాలోని మొత్తం సంపదలో 47 శాతం సంపద ధనవంతుల దగ్గరే ఉంది.
ప్రపంచ బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

నివేదికలో ఇంకా ఏముంది?

ఆర్థిక వ్యవహారాల విశ్లేషకులు సంజీవ్ చందోర్కర్ మాట్లాడుతూ, "గత కొన్నేళ్లుగా ఆక్స్‌ఫామ్ చాలా ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తోంది.

ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరగడం కొత్త విషయమేం కాదు. పేదరికంతో కలిగే దుష్ఫ్రభావాలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పురుషులపై వాటి ప్రభావం ఏస్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి దేశంలోనూ ఆర్థిక పేదరికమనేది ఉంటుంది. అమెరికా అయినా అందుకు మినహాయింపేమీ కాదు.

ఆక్స్‌ఫామ్ నివేదికలో పేర్కొన్న గణాంకాలు ముఖ్యమైనవే. అవేమీ వ్యంగ్యం కోసమో, ఒకరినే నిందించే ఉద్దేశంతోనో రూపొందించలేదు" అన్నారు.

ఒక డేటాను సేకరించాక, దానిని శాస్త్రీయంగా సమాజంలోని ఆర్థిక అసమానతలు, పేదరికాన్ని ప్రతిబింబించేలా రూపొందించే నివేదిక మనకు నిష్పాక్షికమైన దృక్పథాన్ని చూపిస్తున్నాయని ఆయన అన్నారు.

పేదరికం, అసమానతల అంశాలకు వచ్చినప్పుడు సామాన్యుడు లేదా సామాజిక కార్యకర్తలు సమాజంలో నెలకొన్న పరిస్థితుల పట్ల అసంతృప్తితో ఉంటారని చందోర్కర్ అన్నారు.

ఆయన మాట్లాడుతూ “పేదరికంపై లోతైన విశ్లేషణ జరపాలంటే, మూలాలపై నిష్పక్షపాతంగా పరిశోధన జరగాలి.

ఆర్థిక అసమానతల మూలాలు ఆ దేశపు ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయి. వాటిపై కూడా అధ్యయనం జరిపి, సమస్యలను గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం ముఖ్యం. అదేపని ఆక్స్‌ఫామ్ చేస్తోంది” అన్నారు.

అంతేకాకుండా ప్రజలకు రాజకీయాలపై అవగాహన వచ్చేందుకు ఈ నివేదికలు ఉపకరిస్తాయని తెలిపారు చందోర్కర్.

“ఇలాంటి అంశాలపై ప్రజలు దృష్టి సారించినప్పుడు, ముఖ్యంగా భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో, అంతరాలను రూపుమాపేలా విధానాల్లో సవరణలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి నివేదికల ఆధారంగా ఎన్నికలు, ర్యాలీలు, నిరసనల ద్వారా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది” అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

పేదరికం వల్ల అసమానతలు ఎలా పెరుగుతాయి?

పేదరికానికి గల కారణాల గురించి చందోర్కర్ మాట్లాడుతూ, “అనుకోకుండా తలెత్తే కరోనా వంటి సంక్షోభాల కారణంతోనే ఇంతటి రీతిలో పేదరికం వెలుగులోకి రాలేదు. ఆ గణాంకాలు యాదృచ్ఛికం కాదు. గత 30 -40 ఏళ్లలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది” అన్నారు.

ఆయన విశ్లేషణ ప్రకారం..నియో లిబరల్ ఎకనామిక్ ఫిలాసఫీగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ పెట్టుబడీదారి ఆర్థిక విధానాలు గడిచిన 30-40 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపాయి.

అలాంటి ఆర్థిక విధానాలు అమలు వల్ల పేదరికంలో కూరుకుపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఆ ఆర్థిక విధానాలే ఇందుకు కారణం.

గడిచిన కొన్నేళ్లలో అన్ని రంగాల్లో ఉత్పాదకత పెరిగింది. ఫలితంగా ప్రపంచదేశాల జీడీపీ వంద ట్రిలియన్ డాలర్లకు చేరడం, ఆదాయం పెరగడం వెనుక బిలియన్ల మంది ప్రజల కృషి ఉంది.

అయితే, అదనపు ఆదాయం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు.

కార్పొరేట్ వ్యవస్థలో భాగమైన కొద్దిమందికే ఆ సంపదంతా చేరింది.

కార్పొరేట్ రంగం ఆర్థికపరంగా కన్నా రాజకీయపరంగా శక్తివంతంగా మారింది. ఆ ఫలితంగా కార్పొరేట్ శక్తుల ఆర్థిక విధానాలే అమలవడంతోపాటు అవే వ్యవస్థను నియంత్రిస్తున్నాయి.

“కేవలం కొద్దిమంది చేతుల్లో ఆర్థిక విధానాలు ఉండటాన్ని వ్యతిరేకిస్తూ, దానిని ప్రజాస్వామ్యబద్ధం చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది”అన్నారు చందోర్కర్.

సంపన్నులు

ఫొటో సోర్స్, Getty Images

బిలీనియర్ల సంఖ్య పెరగడం ప్రమాదకరమా?

ప్రపంచంలోని ధనవంతులెవరు? వారి సంపద ఎంత? అన్న వివరాలు ఎప్పటికప్పుడు మీడియాలో ప్రసారమవుతుంటాయి. అంతేకాకుండా మీడియా లేదా యువత ఎక్కువగా సక్సెస్ స్టోరీలపై మక్కువ చూపుతుంటారు.

ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? మంచి సంపాదన కావాలంటే ఏం చేయాలి? అనే విషయాలపై ఆసక్తి ఉంటుంది.

అందుకే, ప్రపంచంలో స్పూర్తిదాయక పుస్తకాలు, ప్రసంగాలకు డిమాండ్ పెరుగుతోంది. పట్టుదలతో, కష్టపడి పనిచేస్తే ధనవంతులు కావొచ్చన్న అభిప్రాయం ఉంది.

దీనిపై చందోర్కర్ మాట్లాడుతూ, “కొన్నేళ్ల క్రితం వరకు కృషి, పట్టుదల, స్థిరత్వంతోపాటు నిజాయితీతో కూడిన ప్రయాణమే ధనవంతుల్ని చేస్తుందని నమ్మేవారు.

రోజూ గంటల తరబడి అవిశ్రాంతంగా పని చేయడం వల్ల ఎవరైనా ధనవంతులు కావొచ్చని చెప్పడం, అలాంటి వారి స్ఫూర్తివంతమైన కథనాలను చదవడం యువతకు చాలా నచ్చుతుంది. కానీ ఇప్పుడు ధనవంతుల పట్ల ఉన్న దృక్పథం మారింది. ఆ లెక్కలు మారిపోయాయి. ఇక్కడే యువతరం గుర్తుంచుకోవలసింది ఏంటంటే, కేవలం కష్టపడటం ద్వారానే సంపద సృష్టి జరగడం లేదని” పేర్కొన్నారు చందోర్కర్.

ధనవంతులు తమకు కావలసినట్లుగా ఆర్థిక విధానాలు, రాయితీలను పొందే రీతిలో వారి దగ్గర సంపద పోగవుతోందని అన్నారు చందోర్కర్.

ఆయన మాట్లాడుతూ, ఇప్పటి కాలంలో స్టాక్ మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు పలు ఊహాగానాలపై కూడా ఆధారపడి మారిపోతున్నాయి. ఇక్కడ కృషి లేదా వ్యవస్థాపకతతో సంబంధం లేకుండా గణాంకాలు మారిపోతుంటాయి, పలు కారకాలు సంపద పెరగడానికి, లేదా తగ్గడానికి కారణమవుతాయి.

ఉదాహరణకు ఒక కార్మికుడు, ఒక ఔత్సాహిక వ్యాపారవేత్త ఇద్దరూ 12 గంటలపాటు శ్రమిస్తే వారికి లభించే వేతనంతో భారీ వ్యత్యాసం ఉంటుంది. కార్మికుడు పొందే వేతనంతో పోలిస్తే అతడు పొందే ఆదాయంలో వందల రెట్లు తేడా ఉంటుందని పేర్కొన్నారు చందోర్కర్. మిలీనియర్లు, బిలీనియర్లన కథనాలు ప్రభావవంతమైనవి.

చందోర్కర్ చెప్పిన దాని ప్రకారం, ఇప్పటికీ కోట్లాది మంది యువత కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, అందుకు అనుగుణమైన ఆర్థిక విధానాలు గానీ, స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు గానీ, వారి కోసం ఏ ప్రభుత్వాలూ అమలు చేయడం లేదు.

"ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, యువతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఆర్థిక విధానాలు అమలు చేయకపోవడం వల్ల ఆర్థికపరమైన అంతరాలు పెరుగుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో రాజకీయ, ఆర్థిక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల ఈ అంతరాలను తగ్గించొచ్చు" అని చెప్పారాయన.

అసమానతలు తొలగించేందుకు ఏం చేయాలి?

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కొన్ని సూచనలు చేసింది ఆక్స్‌ఫామ్ నివేదిక.

ప్రభావవంతమైన, ధీటైన వ్యవస్థల రూపకల్పనతో కార్పొరేట్ వ్యవస్థల ప్రభావాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు సూచించింది.

వ్యక్తులు, సంస్థలకే ఎక్కువ శాతం రాబడి పొందేలా ఉన్న ఆర్థిక విధానాలను సవరించి, ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చూడాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది.

కార్పొరేట్ రంగంలో సంపద కేంద్రీకృతం అవడానికి గల కారణాల్ని కూడా నివేదికలో ప్రస్తావించారు.

కార్మికులకు ప్రయోజనం అందించకుండా కేవలం సంపన్నులకే లబ్ధి చేకూర్చే విధానాలు, అత్యంత సంపన్నుల్లో కొందరి పన్ను ఎగవేతలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలు.. ఇలా కొన్ని ప్రధాన కారణాలను నివేదికలో పేర్కొన్నారు.

దీనిపై చందోర్కర్ మాట్లాడుతూ, “ఆక్స్‌ఫామ్ నివేదికను, అందులో చెప్పిన అంశాలను మనం పక్షపాత వైఖరితో చూడకూడదు. చాలామంది ఆక్స్‌ఫామ్ ఆర్థిక విధానాన్ని కాలం చెల్లినదిగా చెప్తారు కానీ అది సరికాదు” అన్నారు.

భారత్‌పై నివేదికలో ఏముంది?

నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, దేశంలోప్రైవేటీకరణ పెరుగుతున్న తరుణంలో దళితులు ప్రైవేటు విద్య, వైద్యం కోసం ఎదుర్కొనేందుకు ఎక్కువ డబ్బును ఖర్చుచేయాల్సి వస్తోంది.

ప్రపంచ బ్యాంకు తరపున భారత్‌లో పెట్టిన పెట్టుబడుల గురించి కూడా నివేదికలో ప్రస్తావించారు. గత కొన్ని దశాబ్దాల్లో బిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలో చెప్పారు. అయితే, గత 25 ఏళ్లలో ఆ పెట్టుబడులపై విశ్లేషణ మాత్రం వెల్లడించలేదు.

ప్రపంచ బ్యాంకు ప్రైవేట్ ఆసుపత్రులు లేదా వైద్యరంగంలో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల పేదలకు నేరుగా ప్రయోజనం చేకూరదని నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)