చోళులు: ఆ రాజు చనిపోయినప్పుడు అతనితో పాటు ముగ్గురు మహిళలను సజీవ సమాధి చేశారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాయాకృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకప్పుడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భర్త మరణానంతరం భార్యను కూడా చితికి పంపే ఆచారం ఉండేది. దక్షిణాదిలో చోళుల కాలంలో ఇలాంటిదే మరో వింత ఆచారం ఉండేది. రాజుల మృతదేహాలతో పాటు వారికి ప్రియమైన వారిని సమాధి చేసేవారు.
మరణానంతరం కూడా ఆ వ్యక్తితో కలిసి జీవించాలనే ఇలా చేసినట్లు చోళుల శాసనాల్లో రాశారు. ఈ వింత ఆచారం గురించి ఈ కథనంలో వివరంగా చూద్దాం.
కులోత్తుంగ చోళన్ రాజ్యంలో పృథిగంగన్ పాలించిన తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలోని ఈ విషయాలను తెలుసుకోవడానికి తామరైపాక్కం గ్రామానికి వెళ్లాం.

రాజుతో పాటు మహిళల సజీవ సమాధి
ఆలయంలోకి ప్రవేశించే ముందు తిరువణ్ణామలై జిల్లా హిస్టారికల్ సర్వే సెంటర్ కార్యదర్శి బాలమురుగన్ బీబీసీకి అక్కడి శాసనాలను వివరించారు.
పృథిగంగన్ అనే రాజు మరణించినప్పుడు ముగ్గురు కళాకారిణులను సజీవ సమాధి చేశారని, దీనికి సంబంధించి తామరిపాక్కంలోని అగ్నీశ్వర ఆలయంలో మూడు శాసనాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
తమరిపాక్కంలోని అగ్నీస్వరర్ ఆలయం ముందు హాలులో తూర్పున గల గోడ మీద స్తంభంపై ఉన్న 14-లైన్ల శాసనం మొదటిదన్నారు.
'శ్రీ కులోత్తుంగ చోళ దేవ్ స్వస్తి శ్రీ త్రిభువన చక్రవర్తి 10వ సోమనన పృథి. మన కూతడున్ దేవుడు పృథిగంగనుడితో పాలికొండ పాడే..' అని మొదలయ్యే శాసనాన్ని చదివి బాలమురుగన్ వివరించారు.

తమరిపాక్కం శాసనం అర్థం ఏమిటి?
క్రీస్తు శకం 1188 సంవత్సరంలో కులోత్తుంగ III పాలనలో స్థానిక రాజు పృథిగంగన్ మరణం అనంతరం ఈ శాసనాన్ని చెక్కించారని చెప్పారు
అంటే "చనిపోయిన పృథిగంగన్‌తో పాటు సజీవ సమాధి అయిన మహిళల పేరిట భూమిని పరిహారంగా ఇచ్చారు" అని శాసనం అర్థమని బాలమురుగన్ వివరించారు.
వారి రాజవంశం ఉన్నంత కాలం ఆ భూమిపై తీసుకున్నవారిదే హక్కు అని శాసనం చెబుతోంది. అంతే కాకుండా తరువాతి కాలంలో ఆయన వంశస్థులు ఆ భూమిలో కలగజేసుకోకూడదని తెలిపింది.
దీనికి సంబంధించిన శాసనాధారాలను తమిళనాడు పురావస్తు శాఖ ‘తామరైపాక్కం ఇన్‌స్క్రిప్షన్’ పేరుతో పుస్తకంగా ప్రచురించింది.
ఆలయ ముఖ మందిరం తూర్పు గోడపై 4 లైన్ల శాసనాన్ని చూపించారు బాలమురుగన్ .
అందులోని ‘‘స్వస్తి... మా దేవుడు పృథిగంగన్‌తో పల్లికొండ ఆడుం ఆళ్వార్కుం, సతుర్గదైపెరుమాళ్, నిరైతవన్ సెతల్‌తో నృత్యం చేసే పృథికంగ’’ అంటూ పంక్తులను చదివారు.
ముగ్గురు దేవరాదియార్ స్త్రీలు అయిన ఆడమ్ ఆళ్వార్, సతురనాదై పెరుమాళ్, నిరైతవంజేతల్‌లను పృథిగంగన్‌తో కలిసి సజీవ సమాధిలో ఉంచారని అర్థమని చెప్పారు. ఆ స్త్రీలకు సంతానం లేదని బాలమురుగన్ చెప్పారు.
ఈ శాసనంలో సజీవ సమాధి అయిన స్త్రీల పేర్లను స్పష్టంగా నమోదు చేశారు.

ఎవరా ఐదుగురు?
అదేవిధంగా ఆలయ ముఖ మందిర దక్షిణ గోడపై ఐదు లైన్ల శాసనం ఉంది.
"శ్రీ కులోత్తుంగ చోళదేవ 10వ ఆదుమ్ ఆళ్వారుమ్ కొరకు స్వస్తి శ్రీ త్రిభువన చక్రవతిలు.." అని మొదలయ్యే ఈ మూడో శాసనాన్ని బాలమురుగన్ చదివి వివరించారు.
దేవరాదియార్ వంశానికి చెందిన ముగ్గురు కళాకారిణులు ఆళ్వార్, సతుర్గదై పెరుమాళ, నిరైతవంజేతల్‌లు రాజు పృతిగంగన్‌తో పాటు సమాధి అయినందున తిరువంగీశ్వరంలోని ఐదుగురు ఆలయ దేవరాదియార్లకు భూమి ఇచ్చామని, దానిని రాజ వంశస్తులు ఎవరైనా ఆశిస్తే పాపం చుట్టుకుంటుందని దానర్థం.
అయితే, ఇక్కడ ముగ్గురు మహిళల పేర్లు మాత్రమే ఉన్నాయని, పరిహారంగా భూమిని తీసుకున్న ఐదుగురు దేవరాదియార్ల పేర్లను ఇక్కడ పేర్కొనలేదని, తమరిపాక్కం ఆలయ శాసనాలు కొద్దిగా వింతగా ఉన్నాయని బాలమురుగన్ అన్నారు.
ఈ ఎపిగ్రాఫికల్ మూలాధారాల ద్వారా అప్పటి స్త్రీలు, వారి సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. మహిళలు అన్ని యుగాల్లోనూ కష్టాలు పడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ఆచారం
ఇలాంటి ఆచారాలు, సంప్రదాయాలు చరిత్రలో చాలానే ఉన్నాయని విల్లుపురం అన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ హిస్టరీ విభాగం ప్రొఫెసర్ రమేష్ అంటున్నారు.
''ఈ ఘటనలకు సంబంధించిన శాసనాలు కొన్నివెలుగులోకి వచ్చాయి. ఒక్క తమిళనాడులోనే కాదు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో కూడా ఇటువంటి శాసనాలు ఉన్నాయి" అని అన్నారు.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో గల హూండీ గ్రామ చెరువు వద్ద కనిపించిన 24 లైన్ల శాసనంలో ఇలాంటి ప్రస్తావనే ఉంది.

అదేవిధంగా, బళ్లారి జిల్లా కలకోడ్ గ్రామానికి దక్షిణంగా ఒక స్లాబ్‌పై చెక్కిన 25 లైన్ల కన్నడ శాసనంలో చనిపోయిన రాజుతో పాటు ఒక సైనికుడిని పూడ్చిపెట్టినట్లు ఉందని ప్రొఫెసర్ రమేష్ తెలిపారు.
ఇటువంటి శాసనాలు విదేశాలలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆనాటి ప్రజల మితిమీరిన ఆత్మవిశ్వాసం లేదా రాజుల అధికారానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చని అంటున్నారు రమేష్.
అలాగే ‘‘అప్పట్లో రాజులను దేవుడితో సమానంగా చూసేవారు. వారి మాటను దేవుడి మాటగా గౌరవించడం కూడా ఒక కారణం" అని ప్రొఫెసర్ రమేష్ అన్నారు.
ఇలాంటి వింత సంఘటనలు, అలనాటి వ్యక్తుల వింత అలవాట్ల గురించి మానసిక వైద్యుడు ఉదయకుమార్ స్పందిస్తూ, ''ఆత్మాహుతి చేసుకోవడం వంటి సంఘటనలు మానసిక వైకల్యాలను ప్రతిబింబిస్తాయి '' అని అన్నారు.
వీటిని మూఢనమ్మకాల పరాకాష్టగా పేర్కొంటూ.. వెలకట్టలేని జీవితాన్ని వదులుకోవడం బాధాకరమని అన్నారు.
మరణానంతరం తనకిష్టమైన వారితో కలిసి జీవించగలిగే మరో ప్రపంచం ఉంటుందని వారు నమ్మడం కూడా దీనికి కారణం కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
"తమకిష్టమైన వస్తువులను మృతదేహంతో పాతిపెట్టినట్లే తమకిష్టమైన వారినీ పాతిపెట్టారు. ఇది మూఢనమ్మకం కాకపోతే మరేంటి" అని అన్నారు ఉదయ్ కుమార్.
ఇవి కూడా చదవండి:
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- CEO సుచనా సేథ్: నాలుగేళ్ళ తన కొడుకుని ఈమె ఎందుకు చంపారు, పోలీసులు ఎలా కనిపెట్టారు?
- నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














