ఆత్మవిశ్వాసంతో మానసిక బలంతోపాటు శారీరక సామర్థ్యం, ఎలాగంటే..

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

“నాకు క్యాన్సర్ వచ్చిందని తెలియగానే, కొద్దిసేపు నా మెదడు పనిచేయలేదు. కానీ, ప్రాణాలు తీసే ఈ జబ్బును వీలైనంత త్వరగా వదిలించుకోవాలని మరుసటి క్షణంలోనే నిర్ణయించుకున్నా.'' - దిల్లీకి సమీపంలోని గాజియాబాద్‌కి చెందిన అనితా శర్మ చెప్పిన మాట ఇది.

తనకు రొమ్ము క్యాన్సర్ అని తెలియగానే షాక్‌కి గురయ్యానని ఆమె చెప్పారు. "నా కుటుంబం కూడా దిగ్భ్రాంతికి గురైంది. ఈ వ్యాధి నా జీవితాన్ని ప్రభావితం చేయకూడదని నిర్ణయించుకున్నా. వారం తర్వాత ఆపరేషన్ అయింది. ఆ తర్వాత ఏదో తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నాననే ఆలోచనను దరిచేరనివ్వలేదు'' అని ఆమె తెలిపారు.

2013లో అనితకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఆమె సాధారణ జీవితం గడుపుతున్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆమె కేవలం వ్యాయామం చేయడమే కాకుండా, యోగా, మెడిటేషన్ (ధ్యానం) సాధన చేయిస్తుంటారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

వ్యాయామంతో కండరాల సామర్థ్యం పెరుగుదల

అనితా శర్మ సంకల్పం ఎప్పుడూ ఆమెను బలహీనపరచలేదు. ఆమెకు వచ్చిన జబ్బు పెద్ద సవాల్‌తో కూడుకున్నదని ఆమెకు తెలుసు. అయినా ఆత్మవిశ్వాసంతో జబ్బును ధైర్యంగా ఎదుర్కోగలిగారు.

మీపై మీకు నమ్మకం ఉంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవ్వచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.

ఆత్మవిశ్వాసం వ్యక్తిగతంగా ప్రేరణ ఇ్వవడంతోపాటు సానుకూల ప్రభావం చూపుతుందని మిసిసిప్పి స్టేట్ యూనివర్సిటీలో ఎక్సర్సైజ్ ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్‌కి చెందిన డాక్టర్ జకేరి ఎం.గిలెన్ అభిప్రాయపడ్డారు.

"ఇది శక్తిమంతంగా ఉన్నామనే ధైర్యాన్ని పెంచే ఎపినెఫ్రిన్, అడ్రినలిన్, నోరాడ్రినలిన్ హార్మోన్ల స్థాయులను భారీగా పెంచుతుంది'' అని బీబీసీ రీల్స్‌తో మాట్లాడుతూ గిలెన్ చెప్పారు.

''మీరు పూర్తి విశ్వాసంతో వ్యాయామం చేస్తే కండరాల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. అథ్లెట్ల సామర్థ్యం పెరుగుదల వెనుక నిజమైన రహస్యం అదే'' అని ఆయన అన్నారు.

“కండరాలు ఎంత పెద్దగా ఉంటే, శరీరం అంత బలంగా, శక్తిమంతంగా ఉంటుంది. అథ్లెట్ల కండరాల పరిమాణం పెద్దగా ఉంటుంది, అందుకే అంత శక్తిమంతంగా కూడా ఉంటారు'' అని గిలెన్ చెప్పారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

సానుకూల దృక్పథంతో లక్ష్య సాధన

''శరీర అవసరాలకు అనుగుణంగా కండరాలు తమ పనిని తాము నిర్ణయించుకోగలవు. ఒక సామాన్య వ్యక్తి అథ్లెట్ తరహాలో అద్భుతంగా రాణించలేకపోవచ్చు, కానీ క్రమంగా అతను తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు తన ప్రదర్శనను కూడా మెరుగుపరచుకోగలడు. దానితో పాటు సానుకూల దృక్పథం కూడా ఉంటే, ఏకాగ్రతతో తన లక్ష్యం వైపు సాగేందుకు సాయపడుతుంది'' అని డాక్టర్ గిలెన్ చెప్పారు.

అనితా శర్మ విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. క్యాన్సర్‌ చికిత్స సమయంలో ఆమె కుడి చెయ్యి దెబ్బతింది.

కీమో థెరపీ సమయంలో మందులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఒక్కసారిగా ఆమె చెయ్యి వాచిపోయి, మూడు వేళ్లు పనిచేయడం మానేశాయని అనిత చెప్పారు.

ఇక ఈ చేత్తో ఏ పనీ చేయలేనని అనుకున్నానని అనిత చెప్పారు. అయినా ఆమె నమ్మకం కోల్పోలేదు. వేళ్లను నెమ్మదిగా కదిలిస్తూనే ఉన్నారు. వేళ్లు వంకరగా ఉన్నప్పటికీ పిండి పిసకడం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి రోజువారీ పనుల్లో ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

నిస్సహాయంగా ఎప్పుడూ భావించొద్దు

ఎవరైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమని తాము నిస్సహాయులుగా భావించొద్దని, ఆత్మవిశ్వాసం అనేది చాలా గొప్ప శక్తి అని బలంగా నమ్ముతారు అనిత. ఆపరేషన్ తర్వాత ఏదో జరిగిపోయిందని మంచానికే పరిమితం కాకపోవడానికి అదే కారణం.

రొమ్ము క్యాన్సర్‌ వచ్చిందని అనితకు 2013లో తెలిసింది. ఆ తర్వాత వారంలోనే ఆపరేషన్ అయింది. ఆ మరుసటి రోజు నుంచే బాత్రూమ్‌కి వెళ్లేందుకు కూడా ఆమె ఎవరి సాయం తీసుకోలేదు.

సానుకూల దృక్పథాన్ని ఆమె బలంగా నమ్ముతారు.

వ్యాయాయంతో శరీరం బలపడుతుందని, సానుకూల దృక్పథంతో మానసికంగా దృఢంగా తయారవుతామని, అప్పుడు ఏ కష్టమైనా, ఏ ఇబ్బందైనా చిన్నదిగా అనిపిస్తుందని ఆమె చెప్పారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మానసిక వ్యాధులపైనా వ్యాయామం ప్రభావం

మరీ తీవ్రం కాని మానసిక సమస్యలను యోగా, వ్యాయామంతో చాలా వరకూ నియంత్రించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"శారీరక దృఢత్వం కండరాలను బలోపేతం చేయడం ద్వారా శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, మానసిక ఆరోగ్యపరంగానూ ఇది చాలా ప్రధానమని నిరూపితమైంది'' అని డెహ్రాడూన్‌లోని గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజీలో సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జేఎస్ బిస్త్, బీబీసీప్రతినిధి ఆర్.ద్వివేదీతో చెప్పారు.

''డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను అధిగమించేందుకు వ్యాయామం కంటే మెరుగైనది ఏదీ లేదు'' అని డాక్టర్ బిస్త్ అన్నారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి వ్యాయామం మంచిది?

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని వేరుచేసి చూడాల్సిన పని లేదని, అందులో ఆత్మవిశ్వాసం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ బిస్త్ చెప్పారు.

అవి రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది.

చాలా మంది సైకియాట్రిస్టులు తమ రోగులకు మందులతో పాటు రోజూ వ్యాయామం చేయమని సలహా ఇస్తుంటారని, శారీరకంగా చురుగ్గా ఉంటే మానసిక సమస్యలను అధిగమించడం సులువవుతుందని ఆయన చెప్పారు.

వ్యాయామానికి వయసుతో సంబంధం లేదని, వ్యాయామం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అవేంటంటే-

  • వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా మారడంతో పాటు వాటి సామర్థ్యం పెరుగుతుంది.
  • రోజూ చేసే జాగింగ్, ఏరోబిక్స్, రోప్ జంపింగ్ వంటివి ప్రయోజనకరంగా ఉంటాయి.
  • బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటల వల్ల కూడా శారీరక సామర్థ్యం పెరుగుతుంది. అలాంటివి కుదరకపోతే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు.
  • తేలికపాటి వ్యాయామం కూడా వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మెరుగవడానికి ఉపయోగపడుతుంది.

''మీకు ఆత్మవిశ్వాసం ఉంటే, వ్యాయామం ద్వారా కండరాలను దృఢంగా మార్చుకోవడంతో పాటు అథ్లెట్‌ అంతటి సామర్థ్యం కూడా సాధించొచ్చు. అయితే, ఆత్మవిశ్వాసం మంచిదే కానీ, అతి విశ్వాసానికి పోకుండా ఉండడం ముఖ్యం'' అని డాక్టర్ గిలెన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)