అయోధ్యలో వైభవంగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ...పాల్గొన్న ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI
అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ ప్రధాన పూజ మధ్యాహ్నం 12.29 గంటలకు మొదలైంది. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు ముగిసింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన పూజలు గర్భగుడిలో జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వెంటనే భారత వైమానిక దళం(ఐఏఎఫ్) హెలికాప్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపించాయి.
ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాముని విగ్రహానికి అభిషేకం కోసం 114 కుండలలో వివిధ తీర్థ స్థలాల నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, ANI
మోదీతోపాటు ఎవరెవరు ఉన్నారు?
ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని హెలికాప్టర్‌లో అయోధ్యకు చేరుకున్నారు. 12.09 నిమిషాలకు రాముడికి అందించాల్సిన ఆభరణాలు, దుస్తులను ఆలయ పూజారులకు అందించారు.
ప్రధాని మోదీపాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, ANI
వీఐపీలతో నిండిన అయోధ్య
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానం అందుకున్న రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు, రాయబారులు, మఠాధిపతులు అయోధ్యకు తరలి వచ్చారు.
అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రామ్ చరణ్, చంద్రబాబు నాయుడు, రజినీకాంత్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, అనిల్ అంబానీ, సునీల్ మిట్టల్, అనిల్ కుంబ్లే లాంటి అనేక మంది వీఐపీలు ఈ జాబితాలో ఉన్నారు.
వీఐపీల రాకతో అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయం సందడిగా మారింది.
‘‘ఇది ప్రజల చిరకాల స్వప్నం. 500 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఇది సాకారం కాబోతోంది. చాలా సంతోషంగా ఉంది’’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
దాదాపు 8 వేల మంది ప్రజలకు ఆహ్వానాలు పంపగా, అందులో సుమారు 5 వందల మంది వరకు వీవీఐపీలు ఉన్నారని ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసులు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒకపూట సెలవు దినంగా ప్రకటించింది. అనేక రాష్ట్రాలు కూడా ఈ రోజును సెలవు దినంగా పాటిస్తున్నాయి.
ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఎక్కడ చూసినా అయోధ్య ఆలయం బొమ్మ, శ్రీరాముడు ఉన్న జెండాల దర్శనమిచ్చాయి.

ఫొటో సోర్స్, ani
అయోధ్యలో భారీ భద్రత
పెద్ద సంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు రావడంతో అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
సుమారు 10 వేల సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న డ్రోన్లను నిఘా కోసం ఉపయోగించారు.
యూనిఫామ్‌తోపాటు మఫ్టీలో అనేక మంది పోలీసులు వివిధ ప్రాంతాలలో మోహరించారు.
అయోధ్య పట్టణంలో అనేక చోట్ల బారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యకు, థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














