అయోధ్య: ప్రాణ ప్రతిష్ఠకు జనవరి 22నే ముహూర్తం ఎందుకు, బాల రాముడినే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు?

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అయోధ్య ఆలయం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు తుది ఘట్టానికి చేరుకున్నాయి.

సాధువులు, ఆహ్వానితులు అయోధ్యకు చేరుకుంటున్నారు. వీరి వసతి కోసం ప్రత్యేకంగా తీర్థ క్షేత్ర పురం పేరిట తాత్కాలిక నగరాన్ని నిర్మించింది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.

ఈ తీర్థ క్షేత్ర పురం బాధ్యతలు తెలుగు వ్యక్తి అయిన విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ చూస్తున్నారు.

అయోధ్యతో తనకు దాదాపు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉన్నట్లు ఆయన చెప్పారు.

రామ మందిర నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ వచ్చానని ఆయన చెప్పారు. ఇపుడు ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ విశేషాలు, అక్కడి ప్రత్యేకతలు, విగ్రహ ఎంపిక వంటి విషయాలపై ఆయన బీబీసీతో మాట్లాడారు.

అయోధ్య రామ మందిరం

ఫొటో సోర్స్, SHRI RAM JANMBHOOMI TEERTH KSHETRA

బీబీసీ: అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి.. మందిరంలోని ప్రత్యేకతలను వివరిస్తారా?

కోటేశ్వర శర్మ: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ ట్రస్టు దేవాలయ నిర్మాణం, నిర్వహణకు ఉద్దేశించినది.

ఉత్తర భారత నాగరి శైలిలో ఆలయం నిర్మాణమవుతోంది. సోమనాథ్, ద్వారక వంటి ఆలయాలు ఈ శైలిలోనే నిర్మాణమయ్యాయి.

సోమనాథ్ దేవాలయాన్ని తీర్చిదిద్ధిన స్థపతి సోంపుర మనవడు ఈ అయోధ్య ఆలయానికి రూపకర్త.

1991లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయ నమూనా తయారు చేసి.. దానికి తగ్గట్టుగానే శిల్పాలు చెక్కారు. ఆ తర్వాత బాధ్యతలు ట్రస్టు తీసుకుని.. నమూనాలో స్వల్ప మార్పులు చేసి ఆలయం నిర్మించింది.

అలాగే దాదాపు 2వేల సంవత్సరాల క్రితం రామ జన్మభూమిని ఆనుకుని సరయు నది ప్రహహించేదని, అందుకే ఈ రోజుకీ కూడా భూమి పొరల్లో జల ప్రవాహాలు ఉన్నాయని సర్వేల్లో తేలింది.

భూ ప్రకంపనలు తట్టుకునేలా.. వెయ్యేళ్లు నిలిచి ఉండేలా డిజైన్ చేసి నిర్మాణం చేశారు. అందుకు అవసరమైన విధంగా పునాదిని నిర్మించారు.

కోటేశ్వర శర్మ

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు?

కోటేశ్వర శర్మ: ఈ కార్యక్రమానికి ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంది. దేవాలయం నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి, అక్కడ ఉన్న స్థలానికి తగ్గట్టుగా 8 వేల మంది అతిథులనే ఆహ్వానించారు.

వారిలో నాలుగు వేల మంది సాధువులు ఉన్నారు. దేశంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులనూ ఆహ్వానించారు.

సాధువులు, వారి వెంట వచ్చే వారి కోసం టెంట్‌ సిటీ రూపంలో తాత్కాలిక నిర్మాణం ఉంది.

ప్రముఖులకు అయోధ్య, ఫైజాబాద్‌లో ఉండే హోటళ్లు, ఆశ్రమాలు, గెస్ట్ హౌస్‌లు, తదితర చోట్ల వసతి ఏర్పాట్లు చేశారు.

అయోధ్యకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా 30-35 చోట్ల భోజన వసతి ఏర్పాటు ఉంది.

ఇప్పటివరకు ఉన్న ఆలయంలో 19వ తేదీ సాయంత్రం నుంచి దర్శనాలు నిలిపి వేస్తున్నారు. అక్కడి విగ్రహాలను కొత్త ఆలయంలోకి తరలించే ధార్మిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

20, 21, 22వ తేదీల్లో దర్శనాలు ఉండవు.

22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆహ్వానితులకే దర్శనం.

23వ తేదీ ఉదయం నుంచి సాధారణ భక్తులకు దర్శనం ఉంటుంది.

అయోధ్య రామ మందిరం

ఫొటో సోర్స్, CHAMPAT RAI

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు దాదాపు 70 ఎకరాల భూమి ఉంది. అయినప్పటికీ.. అందులో ఒక మూలకు 2.7 ఎకరాల్లోనే ఆలయ నిర్మాణం చేయడానికి కారణమేమిటి?

కోటేశ్వర శర్మ: మొత్తం ఖాళీ స్థలంలో ఆలయ నిర్మాణం జరగడం లేదు. రాముడు జన్మించిన స్థలమనేది ఈ 72 ఎకరాల్లోని వాయవ్య దిశలో ఉందని.. ఆ స్థలాన్నే ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు. దానికి అనుబంధంగా దేవాలయాలు, ఉప దేవాలయాలు నిర్మించనున్నారు.

ముందుగా ఆలయానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని నిర్మించారు.

మిగిలిన స్థలంలో ట్రస్టు తరఫున యాత్రికులకు సౌకర్యాలు, అన్నదాన మండపం, మ్యూజియం వంటివి ‌నిర్మిస్తారు.

ప్రాణ ప్రతిష్ఠ కోసం జనవరి 22నే ఎందుకు మూహూర్తంగా ఎంచుకున్నారు?

కోటేశ్వర శర్మ: జ్యోతిషం, ఆగమ శాస్త్రాల అనుగుణంగా ఉత్తమమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తారు.

ఆ ముహూర్తం అనేది 22వ తేదీన 12.22 గంటల నుంచి 12.40 నిమిషాల వరకు ఉందని నిష్ణాతులు నిర్ణయించారు. ఇది ఎంతో పటిష్టమైన ముహూర్తం.

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ

ఫొటో సోర్స్, ANI

బాల రాముడి విగ్రహాన్నే ప్రతిష్ఠించడానికి కారణం?

కోటేశ్వర శర్మ: గతం నుంచి కూడా బాల రాముడి విగ్రహాలే ఉన్నాయి. అయోధ్య అనేది రాముడి జన్మస్థలంగా కొలుస్తున్నందున బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదు సంవత్సరాల వయసులోని బాలరాముడి విగ్రహం ఉంటుంది.

ఈ శిల్పం ఎత్తు సుమారుగా నాలుగున్నర అడుగులు.

గతం నుంచి పూజలందుకుంటున్న రాముడు, అన్నదమ్ముల విగ్రహాలు కూడా ఉంటాయి.

మొదటి అంతస్తు (ఫస్ట్ ఫ్లోర్)లో రామదర్బార్ ఉంటుంది. అక్కడ మనం పూజించే ఫొటోలో ఉన్నట్లుగా రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు, శత్రుజ్ఞులను ఏర్పాటు చేశారు.

అలాగే సూర్య తిలకం ఆలోచనతో... రామనవమి రోజున సూర్యుడి కిరణాలు బాల రాముడి నుదుటిపై రిఫ్లెక్షన్ ద్వారా ప్రసరించేలా ఆలయాన్ని డిజైన్ చేశారు.

సిమెంటు, స్టీల్ వాడకుండా ఆలయం నిర్మించామని ట్రస్టు చెబుతోంది. అందుకు కారణాలేమిటి?

కోటేశ్వర శర్మ: ప్రాచీన దేవాలయాలన్నీ రాతి కట్టడాలే. 1,000, 1,200, 1,500 సంవత్సరాల క్రితం నిర్మాణమైన దేవాలయాలు ఈ రోజుకూ యథాతథంగా ప్రతి ఆటుపోట్లకు తట్టుకుని నిలబడి ఉన్నాయి.

శ్రీరంగం దేవాలయం, శ్రీశైలం, రామప్ప.. ఇలా అన్ని దేవాలయాలు రాతి కట్టడాలే. రాతికి ఉన్న లైఫ్ ఎక్కువకావడంతో .. రాతి కట్టడంగా నిర్మాణం చేయడంతో వందల సంవత్సరాలు ఉంటుందన్న ఉద్దేశంతో నిర్మిస్తున్నారు.

ఇనుము తుప్పు పట్టి పాడైపోతుంది. అలా దేవాలయానికి సిమెంటు, ఇనుము వాడకూడదని భావించి, దానికి తగ్గట్టుగానే నిర్మించారు. సోమనాథ్, ద్వారకా, రామేశ్వరం ఆలయాలు కూడా రాతి కట్టడాలే.

కోటేశ్వర శర్మ

మందిర నిర్మాణం పూర్తి కాకుండా ప్రారంభిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై వీహెచ్‌పీ తరఫున మీరేం చెప్పదలచుకున్నారు?

కోటేశ్వర శర్మ: సోమనాథ్ ఆలయానికి 1951లో రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. అప్పటికీ దాని నిర్మాణం పూర్తికాలేదు.

వాస్తు, ఆలయ శాస్త్రాల ప్రకారం అలా దేశంలో జరుగుతూనే ఉన్నాయి. పద్ధతి ప్రకారం జరుగుతున్నదే తప్ప శాస్త్రవిరుద్ధంగా జరుగుతున్నదేమీ కాదు. ఈ విమర్శలపై ఆలయానికి సంబంధించిన వారు ఇప్పటికే సమాధానం చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)