అయోధ్య 'హిందూ వాటికన్ సిటీ'గా అవతరిస్తోందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా ప్రతినిధి
హిందువులు రామ జన్మభూమిగా విశ్వసించే అయోధ్యలో భారీ రక్షణ వలయం మధ్య నిర్మాణంలో ఉన్న మందిరాన్ని దర్శించుకున్న యోగేంద్ర గురు తిరుగు ప్రయాణంలో ఎముకలు కొరికే చలిలో, ఎటూ కదల్లేని స్థితిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
దాదాపు 1,800 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అయోధ్య రామ మందిర భారీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాతి దర్వాజాలు, భారీ శిలాతోరణాలతో నిర్మితమవుతున్న ఈ భారీ ఆధ్యాత్మిక కేంద్రం భక్తులకు స్వాగతం పలుకుతోంది. వందల కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఈ హిందూ దేవాలయం నగర రూపురేఖలను మార్చేయడంతో పాటు, హిందూ జాతీయవాద నాయకుల భావనలో అయోధ్య నగరం 'హిందూ వాటికన్'గా అవతరిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లా నుంచి తీర్థయాత్రలో భాగంగా ఇరవై మందికిపైగా కుటుంబ సభ్యులతో 14 గంటల ప్రయాణం చేసి గురు అయోధ్యకు వచ్చారు.
''ఎట్టకేలకు నూతన రామ మందిరాన్ని చూసి ఉప్పొంగిపోయా. హిందువులు గత అనుభవాల నుంచి మేల్కొన్నట్లు, ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంతకుముందు అణచివేతకు గురయ్యామని నేను ఫీలవుతున్నా'' అని గురు నాతో చెప్పారు.
భారత్‌లోని అత్యంత వివాదాస్పదమైన మతపరమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయాన్ని వచ్చే వారం ప్రారంభించి, హిందూ జాతీయవాదుల దశాబ్దాల కలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రామ మందిరాన్ని కూల్చివేసి, ఆ శిథిలాలపై మసీదును నిర్మించారంటూ గతంలో ఆ ప్రదేశంలో ఉన్న 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును 1992లో హిందువుల గుంపు కూల్చివేసింది. అప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
మసీదు కూల్చివేత 'రూల్ ఆఫ్ లా' ఉల్లంఘనగా పేర్కొన్నప్పటికీ, దశాబ్దాలుగా హిందూ, ముస్లింల మధ్య కొనసాగుతున్న స్థల యాజమాన్య వివాదం 2019లో స్థలాన్ని హిందువులకు కేటాయిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ముగిసిపోయింది. అలాగే, అయోధ్యలో మసీదు నిర్మాణానికి మరో చోట స్థలాన్ని కేటాయించింది.
దేశంలో సాధారణ ఎన్నికలకు నెల రోజుల ముందు నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి విజయంపై కన్నేసింది. ''రామ మందిరం దేశాన్ని ఏకం చేస్తుంది'' అని ఆయన చెప్పారు కూడా. రామ మందిరం భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటుతుందని, జాతికి గర్వకారణమని సీనియర్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సమయానికి మతపరమైన ప్రాముఖ్యత కంటే, రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోందని, ఎన్నికల ముందు ఆలయ ప్రాణ ప్రతిష్ఠతో హిందూ జాతీయవాదం ఊపందుకుంటుందని విమర్శకులు అంటున్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీని ప్రముఖంగా నిలబెట్టడంలో రామ మందిర ఉద్యమం ప్రధాన అంశమని వారు చెబుతున్నారు.
''ఒక సాధారణ టెంటులో దశాబ్దాల పాటు ఉన్న రాముడికి ఇప్పుడు శాశ్వత మందిరం సాకారమైంది. ఇది మనందరి సహనానికి పరీక్ష లాంటిది'' అని రామమందిరం ప్రధాన అర్చకులు, 86 ఏళ్ల సత్యేంద్ర దాస్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఒక చిన్న రాముడి విగ్రహం ఆ ప్రదేశంలో ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
రామ మందిర నిర్మాణం అద్భుతంగా సాగుతోంది. దాదాపు 2.7 ఎకరాల విస్తీర్ణంలో, మూడంతస్తుల్లో, గులాబీవర్ణపు ఇసుక రాళ్లు, నల్లని గ్రానైట్‌తో, ఎత్తైన స్తంభాలతో, 70 వేల చదరపు అడుగుల పాలరాయితో నిర్మాణం జరుగుతోంది. గర్భగుడిలో పాలరాతి పీఠంపై 4.25 అడుగుల (51 అంగుళాల) రాముడి విగ్రహం కొలువుదీరనుంది.
జనవరి 22న మోదీ గ్రౌండ్ ఫ్లోర్‌ను మాత్రమే ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి, రోజుకు 1,50,000 మంది భక్తులకు దర్శనాలు కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అది ప్రస్తుతం అనుమతిస్తున్న సంఖ్య కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.
సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యను ''భక్తులు, పర్యాటకులు వచ్చేందుకు వీలుగా ప్రపంచ స్థాయి నగరం''గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, అధికారులు అన్ని చర్యలూ చేపడుతున్నారు.
దాదాపు 3.85 బిలియన్ డాలర్లు, అంటే సుమారు 31,991 కోట్ల రూపాయలతో మిరుమిట్లు గొలిపే విమానాశ్రయం, అతిపెద్ద రైల్వే స్టేషన్, బహుళ అంతస్తుల కార్ పార్కింగ్, రోడ్ల విస్తరణ వంటి అధునాతన హంగులు అద్దుకుంటోంది అయోధ్య నగరం. ఆలయానికి వెళ్లే రహదారి విస్తరణ పనులు చేపట్టారు. 13 కిలోమీటర్ల ఉండే ఈ రహదారి విస్తరణ కోసం దాదాపు 3000 ఇళ్లు, దుకాణాలు, మతపరమైన నిర్మాణాలను పాక్షికంగా, లేదా పూర్తిగా తొలగించారు. నగరంలోని భవనాలు లేత పసుపు వర్ణంలో, ఒకేరూపులో కనిపిస్తూ ఆకర్షిస్తున్నాయి.
రాడిసన్, తాజ్ వంటి సంస్థలు హోటళ్లు నిర్మిస్తున్నాయి. 50 వరకూ కొత్త హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం జరుగుతోంది. దీంతో భూముల ధరలు ఇప్పటికే మూడింతలు పెరిగిపోయాయి.
''ఇప్పుడు ఈ నగరం చాలా మారిపోయింది. మీరు గుర్తుపట్టలేరు. ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది'' అని 2016 నుంచి అయోధ్యను సందర్శిస్తున్న 'అయోధ్య:సిటీ ఆఫ్ ఫెయిత్, సిటీ ఆఫ్ డిస్కార్డ్' రచయిత వలయ్ సింగ్ అన్నారు.
కాలినడకన తిరుగుతూ అయోధ్య విశేషాలు తెలుసుకునేలా 'హెరిటేజ్ వాక్', ఇక్కడ రాముడి జీవితాన్ని వర్ణించేలా 162 చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సరయూ నది మధ్యలో ఉన్న భూభాగంలో వేద నాగరికతా కేంద్రం, వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక ప్రదేశం, ప్రకృతి వైద్య కేంద్రం వంటి అదనపు హంగుల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు ఉన్నాయి.
''అయోధ్యను ప్రపంచంలోని అత్యంత సుందర నగరంగా తీర్చదిద్దాలనుకుంటున్నాం'' అని అయోధ్యకు చెందిన సీనియర్ అధికారి గౌరవ్ దయాళ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్యలో ప్రతి ఒక్క విషయం విశ్వాసంపై ముడిపడి ఉంటుంది. నగరంలో అడుగడుగుకూ ఆలయం, వేల మంది సాధువులు వీధుల్లో తిరుగుతుంటారు. ఏడాదికి రెండుసార్లు నగరం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వీధుల్లో కోతులు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. అక్కడి వీధులు పూలు, గంధం, భక్తి పుస్తకాలు, దేవతల ప్రతిరూపాల వంటి మతపరమైన వస్తువులను విక్రయించే వ్యాపారులతో నిండిపోయి ఉంటాయి.
''ఇదొక భక్తుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ''గా రచయిత సింగ్ అభివర్ణించారు. ''నిజంగా చెబుతున్నా, ఇదో పురాతన నగరం. కానీ, ఇక్కడి ప్రజలు భక్తిభావంతో ఉండడంతో ఇంకా మనగలుగుతోంది. అక్కడి ప్రజలు దేవుడిపై విశ్వాసంతో ఉన్నారు'' అని ఈశాన్య ప్రాంతమైన షిల్లాంగ్‌కి చెందిన లైఫ్ సైన్సెస్ విద్యార్థిని దిశా చక్రవర్తి నాతో చెప్పిందని ఆయన అన్నారు.
అది నిజమే, వేల సంఖ్యలో ఉన్న పెద్ద, చిన్న ఆలయాలు, దాదాపు 45 వరకూ మసీదులు, పండుగలు, జాతరలు జరిగే ఈ నగరంలో కొత్త, పాత సంస్కృతుల మేళవింపు జరుగుతోంది.
అయోధ్యలో టాటూ పార్లర్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. డార్క్ క్లౌడ్ వంటి రెస్టారెంట్లు, స్టైలిష్ చాంద్ మెన్స్ పార్లర్ వంటి సెలూన్లు కనిపించాయి. రాత్రిళ్లు లేజర్ షోలు కూడా ఉన్నాయి. యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వారితో అక్కడంతా బిజీగా ఉంది.

ఫొటో సోర్స్, BIMAL THANKACHAN
అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అనంతరం భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నారు. నగరం ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనక అసంతృప్తి జ్వాలలు వ్యాపించి ఉన్నాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బుల్డోజర్లు పంపి నగరంలో ఇళ్లు, దుకాణాలను తొలగించారు.
''దాదాపు 1600 మంది ఆశ్రయం కోల్పోయారు. ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లలేం. దెబ్బతిన్న ఇళ్లు, దుకాణాలకు కేవలం లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. ఆలయ పునర్నిర్మాణం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసింది'' అని స్థానిక దుకాణదారుల అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఆనంద్ కుమార్ గుప్తా చెప్పారు.
రోడ్ల విస్తరణలో భాగంగా నగరంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి చెందిన 30కి పైగా ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పైపులు లీకేజీ కారణంగా మురుగు వీధుల్లో ప్రవహిస్తోంది. మురుగు కాల్వలపై వెదురుబొంగులతో ఏర్పాటు చేసిన వంతెనలు ప్రమాదకరంగా ఉన్నాయి. మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది. రోడ్ల విస్తరణలో ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొంతదూరంలో ప్లాట్లు కేటాయించారు.
తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆరుగదుల ఇల్లు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేశారని విశాల్ పాండే చెప్పారు. ''దాదాపు 7 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఇది మాకు కోలుకోలేని దెబ్బ. స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు'' అని పాండే చెప్పారు.

ఫొటో సోర్స్, BIMAL THANKACHAN
''చివరికి రాముడికి సొంతచోటు దొరికినందుకు సంతోషం. అయితే, ఈసారి బాధ మా వంతు అయింది. ఎక్కడ ధ్వసం జరుగుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో'' అన్నారాయన.
సగం ఇల్లు కోల్పోయిన కాంతి దేవి పూర్తిగా కుంగిపోయారు. ''మేము ఏమాత్రం సంతోషంగా లేము'' అని ఆమె చెప్పారు. ''మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతాన్నామని అధికారులు కూడా చెబుతున్నారు. మందిరం నిర్మాణం మంచిదే, కానీ దాని వల్ల మాకేం ఉపయోగం? భక్తుల కోసం మా ఇల్లు పడగొట్టారు'' అని ఆమె అన్నారు.
కూల్చివేసిన ఇళ్లు, దుకాణదారులకు నష్టపరిహారం అందజేసినట్లు, కొత్త ఇళ్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ''పూర్తి పరిహారం చెల్లించాం. కుటుంబ వివాదాల కారణంగా కొనసాగుతున్న వ్యాజ్యాలతో కొందరికి చెల్లింపుల్లో ఆలస్యమైంది. ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు'' అని దయాళ్ చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
రాబోయే భక్తుల కోసం అయోధ్యలో చాలా మార్పులు జరిగాయి. ఇక్కడ ముస్లింలు, హిందువులు చాలా ఏళ్లుగా నివసిస్తున్నారు. 1992 డిసెంబర్‌లో ముస్లింలపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో 18 మంది ముస్లింలు చనిపోయారు. వారి ఇళ్లను తగులబెట్టారు. మతపరమైన హింసకు ఆనవాలుగా మిగిలిన నగరం ఇది.
''ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం. ఆ సంఘటనలు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది'' అని సామాజిక కార్యకర్త ఖలీక్ అహ్మద్ ఖాన్ అన్నారు.
అయోధ్యలో హిందువులు, ముస్లింలు ఎంతోకాలంగా కలసిమెలసి ఉంటున్నారని, శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని ఖాన్ చెప్పారు. ''రాముడిపై హిందువుల భక్తి ముస్లింల మద్దతుతో ముడిపడి ఉంది. ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల్లో, ముస్లింల వ్యాపారాలు కీలకపాత్ర పోషిస్తాయి. రెండు వర్గాలూ విడదీయరానివి'' అని ఆయన అన్నారు.
కాలేజీ ప్రొఫెసర్ రఘువంశ్ మణి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ''గొడవలు బయటి వర్గాల నుంచి వచ్చాయి. వాటిలో స్థానికుల ప్రమేయం తక్కువ'' అని ఆయన అన్నారు.
అయోధ్య రామ మందిరానికి రానున్న భక్తులు ఇక్కడి స్థానికుల జీవితాలను ప్రభావితం చేస్తున్నారనే భావన స్థానికుల నుంచి వ్యక్తమైంది.
''దీనికి కాలమే సమాధానం చెప్పాలి'' అని పాండే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్సోరీ హోటల్లో ఒంటరి మహిళ హత్య అగాథా క్రిస్టీ క్రైమ్ నవలకు ఎలా ప్రేరణగా మారింది?
- భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు
- సచిన్ తెందూల్కర్‌కు ఆ వైరల్ వీడియో మీద ఎందుకు కోపం వచ్చింది?
- నా సామిరంగ రివ్యూ: నాగార్జున సంక్రాంతి 'హిట్' సెంటిమెంట్ ఈసారి కలిసొచ్చిందా? వింటేజ్ హీరో కనిపించాడా?
- మాల్దీవులు చైనాతో కలిసి భారత్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














