ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోవద్దు.. కేంద్రం కొత్త నిబంధనలు

కోచింగ్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం, బోధనలో సమగ్రత, ఫీజుల నియంత్రణను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను రూపొందించారు.

విద్యార్థుల ఆత్మహత్యలు, తరగతి గదుల్లో అగ్ని ప్రమాదాలు, సౌకర్యాలు లోపించడం వంటి వాటిని కూడా ఈ నిబంధనలు రూపొందించేటప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. చట్టవిరుద్ధంగా సాగుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వ్యవహారాన్ని ప్రస్తావించింది.

ఎలాంటి నియంత్రణా లేకపోవడం వల్ల దేశంలో చట్టవిరుద్ధంగా సాాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది.

అలాంటి సెంటర్లు విద్యార్థుల నుంచి ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చి వారు ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయాలు ఎన్నోసార్లు చర్చకు వస్తున్నాయని, పార్లమెంట్‌లో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని చెప్పింది.

వీటన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ల కోసం నియమ, నిబంధనలను రూపొందించింది.

Teacher

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఒక బ్యాచ్‌లో ఎంతమంది విద్యార్థులుంటారో ముందే చెప్పాలి

ఫీజులు, క్లాస్ రూమ్(భవంతి), బోధన పద్ధతులు, అధ్యాపకులు, తరగతుల వ్యాపార ప్రకటనల నిబంధనలను కేంద్రం తన రెగ్యులేషన్‌ ఆదేశాలలో స్పష్టం చేసింది.

  • క్లాస్‌లో లేదా ఒక బ్యాచ్‌లో ఎంత మంది విద్యార్థులుంటున్నారో ఆ విషయాన్ని ప్రాస్పెక్టస్‌లో, వెబ్‌సైట్‌పై తప్పనిసరిగా తెలియజేయాలి.
  • తరగతుల్లో బోధనలు ప్రారంభమైన తర్వాత విద్యార్థుల సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీలు లేదు. ట్యూటర్ల(అధ్యాపకుల) విద్యార్హతలు, పాఠ్యాంశ వివరాలు, కోర్సు పూర్తవడానికి పట్టే కాల వ్యవధి, హాస్టల్ సౌకర్యం, ఫీజుల వివరాలతో కోచింగ్ సెంటర్లకు వెబ్‌సైట్ ఉండాలి.
  • ఏదైనా కోచింగ్ తరగతులను బోధించే అధ్యాపకుని కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. కేసు దాఖలైన అధ్యాపకుల్ని ఉద్యోగులుగా నియమించుకోవడానికి వీలు లేదు.
కోచింగ్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

టెన్త్ క్లాస్ తరువాతే

  • 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థులు కోచింగ్ తరగతులలో పేరు నమోదు చేసుకోవడానికి కుదరదు. లేదా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(ఎస్ఎస్సీ) తర్వాతనే పేర్లను నమోదు చేసుకోవాలి.
  • పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయి, సిలబస్ ఏమిటి? కోర్సులో అడ్మిషన్ పొందేందుకు ఏ విధంగా సిద్ధమవ్వాలి? వంటి విషయాలు ముందుగానే విద్యార్థులకు తెలియజేయాలి.
  • విద్యా వాతావరణం, స్కూల్ పరీక్షలకు సిద్ధమవ్వడం, పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడం వంటి విషయాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
  • ఇంజనీరింగ్, వైద్య రంగాల్లో అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు ఇతర కెరీర్ ఎంపికలను కూడా అందుబాటులో ఉంచాలి. దీంతో, భవిష్యత్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా, విద్యార్థులు ఇతర ప్రత్యామ్నాయ కెరీర్‌లను ఎంపిక చేసుకునే వీలుంటుంది.
విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

  • విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు మాక్ టెస్టులు నిర్వహించాలి. విద్యార్థుల సామర్థ్యం గురించిన అంచనాలను కోచింగ్ తరగతుల వారు తల్లిదండ్రులకు తెలియజేయాలి.
  • కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ పొందడమంటే ఇంజనీరింగ్, వైద్యం, లా, మేనేజ్‌మెంట్ లేదా ఇతర పోటీ పరీక్షలలో కచ్చితంగా విజయం సాధిస్తామన్న గ్యారెంటీ కాదు. ఈ అవగాహనను విద్యార్థులకు, తల్లిదండ్రులకు కల్పించాలి.
  • విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సైక్రియాటిస్టులతో కలిసి క్రమం తప్పకుండా వర్క్‌షాపులను, సెషన్లను కోచింగ్ తరగతుల వారు నిర్వహించాలి.
  • పెడగాలజీపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు కోర్సు కాల వ్యవధి, కోచింగ్ సెంటర్లలో అందుబాటులో ఉండే సౌకర్యాలపై కోచింగ్ సెంటర్లు తెలియజేయాలి.
  • అనవసరమైన ఒత్తిడి, అంచనాల భారం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై తల్లిదండ్రులు పిల్లలకు కౌన్సిలింగ్ కోరవచ్చు.
  • కోచింగ్ సెంటర్ నిర్వహించే అసెస్‌మెంట్ టెస్ట్ ఫలితాలను బయటికి తెలియజేయకూడదు. అసెస్‌మెంట్ టెస్ట్ ఫలితాలను గోప్యంగా ఉంచుతూ.. విద్యార్థుల ప్రతిభను క్రమం తప్పకుండా అనాలసిస్‌ చేసేందుకు వాడాలి.
  • అకాడమిక్ పర్‌ఫార్మెన్స్(చదువుల్లో వారు చూపించే ప్రతిభ) తగ్గుతున్న విద్యార్థులకు మార్గదర్శకాలలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫీజుల గురించిన నిబంధనలు

పలు కోర్సులకు విధించే ఫీజులు పారదర్శకుండా, సమంజసంగా ఉండాలి. విద్యార్థులు ఫీజులను చెల్లించిన తర్వాత రశీదులు తప్పనిసరిగా వారికి అందించాలి.

ఒకవేళ విద్యార్థులు ఎవరైనా కోర్సును మధ్యలో వదిలేస్తే, ‘ప్రో-రోటా’ బేసిస్‌లో 10 రోజుల లోపల మిగిలిన మొత్తాన్ని కోచింగ్ క్లాస్‌లు రీఫండ్ చేయాలి. ఒకవేళ విద్యార్థి హాస్టల్‌లో నివసిస్తున్నట్లు అయితే, దానిలో హాస్టల్, మెస్ ఫీజులు కూడా కలిసి ఉండాలి.

ఒకసారి పేరు నమోదు చేసుకున్న తర్వాత, ఫీజులు, కోర్సులను పెంచకూడదు. కోచింగ్ క్లాస్ భవంతి కచ్చితంగా ‘ఫైర్ సేఫ్టీ కోడ్’ను, ‘బిల్డింగ్ సేఫ్టీ కోడ్’ను అనుసరించాలి.

విద్యార్థుల అవసరమైనప్పుడు సాయపడేలా ప్రాథమిక చికిత్సా కిట్, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా కోచింగ్ సెంటర్లలో ఉండేలా చూసుకోవాలి.

కోచింగ్ సెంటర్ బిల్డింగ్‌లో ప్రతి తరగతి గదికి వెంటిలేషన్ ఉండాలి. బయట నుంచి వచ్చే శబ్దాలు, వేడిమి నుంచి తరగతి గదులకు రక్షణ ఉండాలి. అవసరమైన సూర్య కాంతి తరగతి గదిలో పడేలా చూసుకోవాలి.

అదేవిధంగా, మంచినీటి సదుపాయం, ఫిర్యాదుల బాక్స్, సీసీటీవీ కెమెరాలు, పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా వేరువేరుగా మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కోచింగ్ సెంటర్లలో ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)