పాకిస్తాన్-ఇరాన్: రెండు దేశాలు యుద్ధం వరకు వెళతాయా...పరస్పర దాడుల వెనక ఉద్దేశాలు ఏంటి?

పాకిస్తాన్, ఇరాన్ వివాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రుహాన్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దులకు ఇరువైపులా వేర్పాటువాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇరు దేశాలకూ సవాళ్లు విసురుతున్నాయి.

దక్షిణ ఇరాన్‌లో సిస్తాన్-బలూచిస్థాన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో 'టెర్రరిస్టుల రహస్య స్థావరాల'పై దాడి చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది.

జనవరి 18న జరిగిన ఈ దాడుల్లో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందినట్లు నిర్ధరించారు.

ఇరాన్‌లోని పాక్ వ్యతిరేక గ్రూపులే లక్ష్యంగా దాడులు చేశామని, ‘మర్గ్ బర్ సర్మచార్’ పేరిట ఆపరేషన్ నిర్వహించినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది.

అంతకుముందు ఇరాన్ క్షిపణులు పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని 'జైష్ అల్ అదిల్' స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి.

ఇరాన్ దాడుల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

అయితే ఇరాన్, పాక్ ఇలా ఒకరి ప్రాంతంలో మరొకరు దాడులు చేసినప్పటికీ, వీటి లక్ష్యం ఉగ్రవాదులేనని, సామాన్య పౌరులు కాదని రెండు దేశాలు వాదిస్తున్నాయి.

తిరుగుబాటుదారుల స్థావరాలపైనే దాడి చేశామని ఇరు దేశాలు చెబుతున్నాయి. ఇంతకీ ఇరాన్, పాకిస్తాన్‌లు ఒక్కసారిగా ఇలా దాడులకు ఎందుకు దిగాయి?

ఇరాన్‌లో పాక్ దాడి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బలూచిస్తాన్ తిరుగుబాటు దారులున్నారంటూ ఇరాన్‌లో పాక్ దాడి చేసింది.

ఆ రెండు గ్రూపులే కారణమంటూ..

ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా ఇరాన్‌లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ), బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది.

ఈ రెండు గ్రూపులు తమ దేశంలో దాడులకు పాల్పడుతున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

ఈ దాడుల్లో ఆత్మాహుతి డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలు ఉపయోగించినట్లు ఆర్మీ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తన ప్రకటనలో తెలిపింది.

ఈ స్థావరాలపై కొందరి నియంత్రణ ఉందంటూ ఆర్మీ పలువురి పేర్లను కూడా ప్రకటించింది.

"పాకిస్తాన్‌కు, దాని ప్రాదేశిక సమగ్రత, పౌరుల భద్రత చాలా ముఖ్యమైనవి" అని సైన్యం పేర్కొంది.

స్థానిక కాలమానం ప్రకారం 4:05 గంటలకు దాడి జరిగిందని ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ జనరల్ అలీ రెజా మర్హమతి అక్కడి మీడియాతో చెప్పారు.

ఈ ప్రదేశం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1,800 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బలూచిస్తాన్ వేర్పాటువాదులు

ఫొటో సోర్స్, BLF/BLA

ఫొటో క్యాప్షన్, అల్లా నాజర్ బలూచ్ (ఎడమ), బషీర్ జెబ్ (కుడి).

ఇరా‌న్, పాకిస్తాన్ దేశాల గొడవేంటి?

విస్తీర్ణం పరంగా పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. అయితే దేశంలోని ఇతర నాలుగు ప్రావిన్సులతో పోలిస్తే దాని జనాభా అతి తక్కువ. దీని సరిహద్దులు ఇరాన్, అఫ్గానిస్తాన్‌తో ఉన్నాయి.

మొత్తం బలూచిస్తాన్‌‌లో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్‌లోని నిమ్రూజ్, హెల్మాండ్‌ సహా కొన్ని ప్రాంతాలున్నాయి.

భారత్, పాకిస్తాన్‌ల విభజన సమయంలో తమను బలవంతంగా పాక్‌లో విలీనం చేశారని బలూచిస్తాన్‌ ప్రజల అభిప్రాయం. తాము కూడా స్వతంత్ర దేశంగా మారాల్సిన అవసరం ఉందని ఆందోళన చేస్తుంటారు.

అప్పటి నుంచి వారు స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలా బలూచిస్తాన్‌లో చాలా వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చాయి.

ఈ వేర్పాటువాద సంస్థలు పాకిస్తాన్‌లోని భద్రతా బలగాలు, పోలీసులు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలపై భీకర దాడులు చేస్తున్నాయి.

వాటిలో రెండు ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి. డాక్టర్ అల్లా నాజర్ బలూచ్ నేతృత్వంలోని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్), బషీర్ జెబ్ నేతృత్వంలోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఎ).

ఈ వేర్పాటువాద సంస్థలతో సంబంధం ఉన్న కొందరు తిరుగుబాటుదారులు సరిహద్దు దాటి ఇరాన్‌లో తలదాచుకుంటున్నారని గత కొన్నేళ్లుగా పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు.

'జైష్ అల్ అదిల్' (ఆర్మీ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ) అనేది ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటైన సాయుధ తిరుగుబాటు గ్రూపు.

ఇరాన్ సిస్తాన్-బలూచిస్తాన్‌లో క్రియాశీలంగా ఉన్న ఈ సంస్థ, సున్నీ ముస్లింల హక్కులను పరిరక్షించడమే ధ్యేయంగా పేర్కొంటోంది.

ఇటీవల సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఇరాన్ భద్రతా దళాలపై జరిగిన దాడులకు 'జైష్ అల్ అదిల్' బాధ్యత వహించింది.

పాకిస్తాన్‌లో ఉన్నాయని భావిస్తున్న ఈ సంస్థ స్థావరాలనే ఇరాన్ తాజాగా లక్ష్యంగా చేసుకుంది.

మరోవైపు 'జైష్ అల్ అదిల్' సంస్థకు అమెరికా, ఇజ్రాయెల్‌ల మద్దతు ఉందని ఇరాన్‌ ఆరోపిస్తోంది.

2005లో ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదీ నెజాద్‌పై జరిగిన దాడికి ఈ సంస్థకు సంబంధం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఆరోపణ.

కాగా, 2009లో 'జైష్ అల్ అదిల్' అధినేత అయిన అబ్దుల్ మాలిక్ రెగిని ఇరాన్ అరెస్టు చేసింది. ఇరాన్ భద్రతా దళాలపై బాంబు దాడులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన అమెరికా, యూకే ఏజెంట్‌ అని ఇరాన్ ఆరోపించింది. అబ్దుల్‌కు 2010లో ఇరాన్ మరణశిక్ష కూడా విధించింది.

అబ్దుల్ మాలిక్ రెగి అరెస్టులో పాకిస్తాన్ ప్రముఖ పాత్ర పోషించిందని ఇరాన్‌లో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త మహ్మద్ అబ్బాసీ తెలిపారు.

ఇరాన్ దాడులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌‌లోని 'జైష్ అల్ అదిల్' స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ చెబుతోంది.

ఇప్పుడేం జరుగుతోంది?

ప్రస్తుతం ఇరాన్‌పై చాలా ఒత్తిడి ఉందని బీబీసీతో విశ్లేషకులు సయ్యద్ మహ్మద్ అలీ తెలిపారు. గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఇరాన్‌పై అంతర్గతంగానే కాకుండా, హమాస్, హిజ్బుల్లా, హూతీ తిరుగుబాటుదారుల నుంచి కూడా ఒత్తిడి ఉందని అభిప్రాయపడ్డారు.

అంతర్గత సమస్యలు, మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చడానికే ఇరాక్, సిరియా, పాకిస్తాన్‌లపై ఇరాన్ దాడి చేసిందని ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఇరాన్ క్షిపణులను ప్రయోగించిన రోజు రాత్రే దావోస్‌లో పాక్, ఇరాన్ అధికారులు సమావేశమయ్యారని సయ్యద్ మహ్మద్ అలీ చెప్పారు.

పాకిస్తాన్‌పై ఇరాన్ దాడితో ప్రతిస్పందన వచ్చింది, పాక్ కూడా దాడి చేసిందని తెలిపారు.

"పాకిస్తాన్ ఇరాక్‌‌తో వ్యవహరిస్తున్నట్లు ఇరా‌న్‌తో ఉండాలనుకోవడం లేదు. అందుకే పాక్ స్పందించింది" అని వాషింగ్టన్‌లోని న్యూ లైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీ అండ్ పాలసీకి చెందిన డా. కమ్రాన్ బుఖారీ అన్నారు.

ఇరాన్, పాక్ సరిహద్దులకు ఇరువైపులా వేర్పాటువాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులు విస్తరించి ఉన్నాయని, ఇవి రెండింటికీ సవాలుగా మారాయని బీబీసీతో కాయద్-ఎ-అజామ్ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగం ప్రొఫెసర్ కందిల్ అబ్బాస్ చెప్పారు.

ఇరు దేశాలు పరస్పర సమ్మతితో సరిహద్దు వెంబడి తిరుగుబాటుదారుల స్థానాలను లక్ష్యంగా చేసుకున్నాయని, అయితే ఆ దేశాల అధికారులు దానిని ధ్రువీకరించడం లేదు, తిరస్కరించడమూ లేదని అబ్బాస్ తెలిపారు.

2013 వరకు సరిహద్దు చుట్టు గల వెయ్యి కిలోమీటర్ల మేర మానవ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసాత్మక కార్యకలాపాలు చోటుచేసుకున్నప్పటికీ ఇరాన్, పాకిస్తాన్లు బలగాలను మోహరించలేదని ఆయన గుర్తుచేశారు.

పాకిస్తాన్, ఇరాన్ రెండూ తిరుగుబాటు సంస్థ 'జైష్ అల్ అదిల్'ని ముప్పుగా పరిగణిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుకే ఇరు దేశాలూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయని తెలిపారు.

ఇరాన్, పాక్ వివాదం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఇరాన్, పాకిస్తాన్ వివాదంపై టీవీలో వార్త చూస్తున్న వీక్షకుడు

ఉద్రిక్తతలు పెరిగే అవకాశం..

ఇరు దేశాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తత అనేది మిడిల్ ఈస్ట్ ప్రాంతంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

"రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ దాడులు ముగిశాయి. బంతి ఇపుడు ఇరాన్ కోర్టులో ఉంది. పాకిస్తాన్ దాడి తర్వాత అది ఎలా స్పందిస్తుందో చూడాలి" అని కమ్రాన్ బుఖారీ అన్నారు.

ఇకపై దాడులు ఉండవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇరాన్ గడ్డపై ఉన్న సాధారణ పౌరులపై కాకుండా, ఇరాన్‌లోని పాకిస్తాన్ వ్యతిరేక గ్రూపులపైనే దాడులకు దిగుతున్నామంటూ పాక్ చెబుతుండటం రెచ్చగొట్టేలా లేకున్నా, ఉద్రిక్తతకు దారితీసేలా ఉందని ఆయన భావిస్తున్నారు.

భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రం కావొచ్చని పాక్ సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు బాకీర్ సజ్జాద్ అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌లోని ప్రతీకార దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంత తేలికగా తగ్గే అవకాశం కనిపించడం లేదని ఆయన బీబీసీతో అన్నారు.

"పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ఛాందసవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చు. అటువంటి పరిస్థితిలో బలూచిస్తాన్ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులు మరోసారి క్రియాశీలకంగా మారవచ్చు. ఇది ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుంది." అని బాకీర్ తెలిపారు. తాజా పరిస్థితి ఇరు దేశాల్లో భద్రతను కూడా క్లిష్టతరం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)