లెనిన్: ఈ సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడి గురించి తెలుసుకోవాల్సిన 3 విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గొంజాలో కెనడా
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
అది 1917వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ రాత్రి. పెట్రోగ్రాడ్ (సెయింట్ పీటర్స్‌బర్గ్)లోని ఫిన్లాండ్ స్టేషన్ ప్లాట్‌ఫాంపై వేలాది మంది ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఓ వ్యక్తి రైలు మెట్లు దిగి వచ్చి, అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.
''ప్రజలకు శాంతి కావాలి, తినడానికి తిండి కావాలి, భూమి కావాలి''
అక్కడ వింటున్న వాళ్లు రష్యన్లు. ప్రసంగిస్తున్న వ్యక్తి వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియనోవ్. ఆయన మరో పేరు లెనిన్.
యూరప్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి, రష్యా చరిత్రను శాశ్వతంగా మార్చేసేందుకు వచ్చిన 20వ శతాబ్దపు గొప్ప నాయకుల్లో ఒకరు. ఆయన్ను ఎంత ఆరాధిస్తారో, అంతే భయపడేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన జారిస్ట్ రష్యన్ సామ్రాజ్యం (జార్ చక్రవర్తుల రాజ్యం)లోనే జన్మించినప్పటికీ తన జీవితంలో ఎక్కువ కాలం దేశానికి వెలుపలే గడిపారు. కానీ 1917లో ఆ రాత్రి ఆయన దేశానికి తిరిగిరావడం అప్పటికే విప్లవాలతో మరిగిపోతున్న దేశపు పునాదులను కదిలించింది.
ఆ తర్వాత ఐదేళ్లలో ఆయన సోవియట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా ఎదిగారు.
కానీ, కేవలం ఏడేళ్లలోపు కాలంలోనే ఆయన రష్యాను విప్లవం వైపు ఎలా నడిపించగలిగారు? ఆయన ప్రపంచానికి చాటిచెప్పిందేంటి? వంటి వాటిలో మూడు విషయాల గురించి ఇక్కడ చర్చిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1.దేశంలో ఒకే పార్టీ విధానం
రష్యాలోని వోల్గా నదీతీరంలోని సింబిర్‌స్క్ పట్టణంలో 1870లో వ్లాదిమిర్ జన్మించారు. ఆ తర్వాత ఆ పట్టణాన్ని లెనిన్ గౌరవార్థం ఆయన ఇంటిపేరుతో ఉల్యనోవ్‌గా మార్చారు.
ఆయన సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రారంభం నుంచే తిరుగుబాటు వ్యక్తిత్వం ఉండేది. కానీ, ఒక సంఘటన ఆయనలోని పెట్టుబడుదారీ వ్యతిరేక మనస్తత్వాన్ని మేల్కొలిపింది. అదే ఆయన అన్న అలెగ్జాండర్ ఉరిశిక్ష.
అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్ IIIని హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ ఉలియనోవ్స్ కుటుంబంలోని పెద్ద కుమారుడిని 1887లో ఉరితీశారు.
ఆ కాలంలో రష్యన్ సామ్రాజ్యంలో సామాన్యుల జీవితం దుర్భరంగా ఉండేది. ముఖ్యంగా వ్యవసాయాధారిత వర్గాలు ఆకలి బాధలతో అల్లాడిపోయాయి.
ఆ సమయంలోనే లెనిన్ విప్లవం వైపు తన మొదటి అడుగులు వేశారు. సోషలిస్ట్ ప్రజాస్వామికవాదాన్ని (సోషల్ డెమొక్రటిక్ ప్రాపగాండ) ప్రచారం చేస్తున్నందుకు ఆయన్ను 1895లో జైలుకి పంపారు.
ఏడాది తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైనప్పటికీ, బహిష్కరణ కారణంగా సైబీరియాలోని ఒక మారుమూల ప్రాంతంలో మూడేళ్లు గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత జెనీవాకు పారిపోయి 1900 వరకూ ఉన్నారు. అక్కడే ఇతర సోషల్ డెమోక్రాట్లతో కలిసి తన మొదటి భారీ ప్రాజెక్ట్ అయిన 'వార్తాపత్రిక ఇస్క్రా'ను ప్రారంభించారు.
ఆ వార్తాపత్రిక పేరును ఇంగ్లిష్‌లో 'ది స్పార్క్'గా చెప్పొచ్చు. ఇది రష్యన్ సోషల్ డెమొక్రటిక్ ఉద్యమాన్ని విదేశాల నుంచి సమన్వయం చేసేందుకు ప్రయత్నించింది.
ఈ బహిష్కృత సమయంలో ఆయనకు విప్లవ భావాలు కలిగిన భార్య నదియా క్రుప్స్కాయ కూడా జతకలిశారు. జర్మన్ కార్ల్ మార్క్స్ మార్క్సిస్ట్ విధానాలను వారు ఇష్టపడేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అయితే, 1903 వరకూ లెనిన్‌పై పెద్దగా రాజకీయ ప్రభావం లేదు. కానీ, ఆయన లండన్‌లో కొద్దికాలం ఉన్నప్పుడు, అదే సమయంలో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీ సెకండ్ కాంగ్రెస్ (రెండో సమావేశం) అక్కడే జరిగింది. దానికి ఆయనే నాయకత్వం వహించారు.
జారిజం, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకించిన రష్యన్లను ఏకం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే, ఈ కాంగ్రెస్ ద్వారా రెండు వాదనలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి.
ఒకవైపు మెన్షవిక్‌లు, ఆధునిక భావాలున్న వీరు యూరోపియన్ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థకు మొగ్గు చూపారు. మరోవైపు బోల్షవిక్‌లు, సిద్ధాంతపరంగా లెనిన్‌తో ఏకీభవించిన వీరు అధికారంలోకి వచ్చేందుకు సిద్ధాంతపరంగా మరోదారిని ఎంచుకున్నారు.
''మెన్షవిక్‌ల ఆలోచన పాశ్చాత్య యూరోపియన్ సమాజానికి దగ్గరగా ఉంటే, కేంద్రీకృత విధానాలు, బలమైన భావజాలం కలిగిన బలమైన పార్టీగా అవతరించడం వంటి భావన బోల్షవిక్స్‌లో ఉండేది. ఇందులో పార్టమెంటరీ విధానాల ద్వారా అధికారం చేజిక్కించుకోవడంపై అంతగా ఆసక్తి ఉండదు'' అని కాంటెంపరరీ హిస్టరీ ప్రొఫెసర్ జులియన్ కెసనోవా బీబీసీతో చెప్పారు.
కాలక్రమంలో బోల్షవిక్ విధానానికి స్వస్తి చెప్పిన తర్వాత వారు కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. 1922 డిసెంబర్ 30న సోవియట్ యూనియన్ ఏర్పాటుతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఏక పార్టీ విధానం అమల్లోకి రావడంతో పాటు దానికి మొదటి నాయకుడు అయ్యారు వ్లాదిమిర్ లెనిన్.
మరి బోల్షవిక్‌లు ఈ మోడల్‌ను ఎలా రూపొందించారు?

ఫొటో సోర్స్, Getty Images
2.హింస, అణచివేత
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, రష్యన్ చరిత్రను శాశ్వతంగా మార్చేసిందని మనం మొదట్లో చెప్పుకున్న 1917కు వెళ్లాల్సిందే.
ఆ సమయంలో లెనిన్ బహిష్కరణలో ఉన్నారు. అప్పటికీ రష్యాలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పాల్గొనడం గ్రామీణ ప్రాంతాల్లో కరువుకు, పరిశ్రమలలో శ్రమ దోపిడీకి కారణమైంది.
అలా రష్యా క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో, సాధారణ క్యాలెండర్ ప్రకారం మార్చి, 1917లో ఫస్ట్ గ్రేట్ రివల్యూషన్ ( మొదటి విప్లవం) వచ్చింది. అది అప్పటికే ప్రజాదరణ కోల్పోయిన జార్ నికోలస్ II పదవీచ్యుతుడు కావడానికి కారణమైంది. రష్యన్ రాచరికానికి ముగింపు పలికింది.
ఈ విప్లవం తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది. ఇందులో పెట్రోగ్రాడ్ సోవియట్‌లు (అప్పట్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌గా పిలిచేవారు) ఉన్నప్పటికీ, మెన్షవిక్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నారు.
ఈ సోవియట్‌కు బోల్షవిక్‌లు నాయకత్వం వహించారు, ''అయితే జారిజం పతనంలో వీరికి ఎలాంటి సంబంధం లేదు'' అని కెసనోవా స్పష్టంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి విప్లవం గురించి సమాచారం అందుకున్న తర్వాత, లెనిన్ తన బహిష్కరణను లెక్కచేయకుండా స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్ మీదుగా సుదూర రైలు ప్రయాణం చేసి రష్యా చేరుకున్నారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఫిన్లాండ్ స్టేషన్ కు వచ్చారు. రైలు దిగిన ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఆయన ప్రసంగం ఇలా సాగింది.
''మనం సామాజిక విప్లవం కోసం పోరాడాలి, శ్రామికవర్గం విజయం కోసం, చివరి వరకూ పోరాడాలి, ఇంటర్నేషనల్ సోషల్ రివల్యూషన్ వర్ధిల్లాలి.''
రష్యన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్, సాధారణ క్యాలెండర్ ప్రకారం నవంబర్‌లో రష్యాలో 'సెకండ్ గ్రేట్ రివల్యూషన్' వచ్చింది. అప్పటికే బలహీనంగా, స్థిరత్వం లేని తాత్కాలిక ప్రభుత్వాన్ని పడగొట్టి బోల్షవిక్ సోవియెట్స్ నియంత్రణలోకి తీసుకున్నారు.
లెనిన్ తన ప్రసంగంలో శాంతి, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వెనక్కి రావడం, బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందానికి ధన్యవాదాలతో మొదటి లక్ష్యాన్ని అధిగమించారు.
కానీ, అన్నిదారులూ మూసుకుపోయిన తర్వాత శాంతి దొరకడం ఎండమావే. ఎందుకంటే, అక్టోబర్ విప్లవం తర్వాత రష్యన్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. రక్తపాతం జరిగింది. ఒకవైపు బోల్షవిక్‌ల 'రెడ్ ఆర్మీ', మరోవైపు కన్జర్వేటివ్స్, లిబరల్స్, మోడరేట్ సోషలిస్టుల 'వైట్ మూమెంట్' మధ్య ఈ యుద్ధం జరిగింది.
ఆ ఘర్షణల్లో లక్షల మంది చనిపోయారు. అందులో బోల్షవిక్‌లు మాజీ జార్ నికోలస్ IIను, ఆయన కుటుంబాన్ని ఉరితీశారు. వాటిని క్రూరమైన ఘర్షణలుగా కెసనోవా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
''బోల్షవిక్‌లలోని ప్రధాన వర్గం, జార్ చక్రవర్తి సైనికులలోని హింసా ప్రవృత్తి ఈ అంతర్యుద్ధంలో జరిగిన దారుణాలకు పరాకాష్ట. ఇది కేవలం రాజకీయ, సైద్ధాంతిక అసమ్మతివాదులపై జరిగిన హింస కాదు, రెడ్ ఆర్మీ బలపడుతుండడంతో వ్యవసాయాధారిత వర్గాలు, లెనిన్ ప్రధానమని భావిస్తున్న రష్యన్ జనాభా లేని సోవియట్ రిపబ్లిక్ ప్రాంతాలపై కూడా ఈ హింసాకాండ సాగింది.''
దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇంతకుమించి మరో మార్గం లేదంటూ అంతర్యుద్ధంలో భాగంగా జరిగిన హింస, అణచివేతను లెనిన్ సమర్థించారు. హింసకు గురైన వారిలో మేధావులు, రష్యన్ సంప్రదాయవాదులు ఉన్నారు.
చివరికి రెడ్ ఆర్మీ విజయం సాధించింది. 1922లో లెనిన్ అధ్యక్షుడిగా సోవియట్ యూనియన్ ఏర్పాటైంది. అయితే, ఆయన ఏడాదికి మించి కొద్దికాలం మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. 1924 జనవరిలో ఆయన స్ట్రోక్‌తో చనిపోయారు.
మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో లెనిన్ అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, ఆయన భౌతికకాయానికి ఎంబామింగ్ చేశారు. ఇప్పటికీ ఆయన శరీరం అలాగే ఉంది. ఆయనను ఖననం చేయాలని ఇటీవల కొన్ని డిమాండ్లు వచ్చాయి. కానీ, ఆయన మృతదేహాన్ని ఇప్పటికీ అక్కడ చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3.అంతర్జాతీయ కమ్యూనిజం
మనం తెలుసుకోవాల్సిన మూడో విషయం లెనిన్ వారసత్వం. ఆయన సోషలిస్టు ఉద్యమాన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలనుకున్నారు.
ఆయన ప్రసిద్ధ ప్రసంగంలో చివర్లో అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలి: ''ఇంటర్నేషనల్ సోషల్ రివల్యూషన్ వర్ధిల్లాలి.''
లెనిన్ విధానం మార్క్సిజం సిద్ధాంతాలపై ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలి. అయితే, మార్క్స్, ఏంగెల్స్ ప్రతిపాదించిన ''డిక్టేటర్‌షిప్ ఆఫ్ ది ప్రొలేటేరియట్''(శ్రామికవర్గ ఆధిపత్యం) జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు. కానీ, రష్యా వంటి వెనకబడిన దేశాల కోసం కాదు.
కానీ లెనిన్ దానిని పట్టించుకోలేదు. ఆయన వరకూ రష్యన్ విప్లవమే ప్రపంచంలో మొదటి సోషలిస్టు విప్లవం. సోషలిజం అభివృద్ధి చెందిన దేశాలకు కూడా వ్యాప్తి చేయాలన్నదే ఆయన లక్ష్యం.
అందులో భాగంగా లెనిన్, ప్రపంచవ్యాప్తంగా కొందరు మార్క్సిస్టులతో 1919లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ పేరుతో ''మూడో అంతర్జాతీయ సమావేశం'' నిర్వహించారు. అప్పటి నుంచి దాని సభ్యులను కమ్యూనిస్టులుగా పిలవడం ప్రారంభమైంది.
అయితే, సోషలిజం వ్యాప్తి చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు. అదెలాగో కెసనోవా వివరించారు. ''అంతర్జాతీయంగా వ్యాప్తి చేసే ప్రక్రియ కొనసాగిన 1918, 1919, 1920 సంవత్సరాల్లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీలో తిరుగుబాట్లు జరిగాయి. ఆ తర్వాత బోల్షవిక్‌ల తరహాలో అధికారం చేజిక్కించుకున్న ఏకైక దేశం బ్లా కున్.''
''కానీ అలా ప్రయత్నించిన విప్లవాలన్నీ రక్తపాతం సృష్టించాయి. శక్తివంతమైన సైన్యం ఉన్న దేశాల్లోనూ, బోల్షవిక్ వ్యతిరేక, సోషలిస్టు వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక దేశాల్లోనూ ఇలాగే జరిగింది. ఎందుకంటే, అధికారం అంటే కేవలం నిర్బంధం, నియంతృత్వం, పెట్టుబడిదారీ విధానం మాత్రమే కాదు.''
లెనిన్ తన హయాంలో అనుకున్నంత స్థాయిలో సోషలిజం విస్తరణ సాధించలేకపోయినా, సోవియట్ యూనియన్‌గా మారడానికి మాత్రం పునాదులు వేశారు. ప్రపంచంపై ఆధిపత్యం కోసం పోటీకి వచ్చిన ఒక సూపర్ పవర్, ఆ తర్వాత 70 ఏళ్లలో తనదైన ముద్ర వేసింది.
ఇవి కూడా చదవండి:
- మహిళా రెజ్లర్ల నిరసనలకు ఏడాది... ఇప్పటివరకూ ఏం జరిగింది, భారత రెజ్లింగ్ భవిష్యత్తు ఏంటి?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- Direct To Mobile: సిమ్ కార్డ్, ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్లలో నేరుగా లైవ్ టీవీ ప్రసారాలు, భారత్‌లోనే తొలిసారిగా...
- హర్దిత్ సింగ్ మాలిక్: యుద్ధ విమానానికి 400 బుల్లెట్లు తగిలినా బతికి బయటపడ్డ పైలట్ కథ
- ఎన్టీఆర్ వర్ధంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














