ఆంధ్రప్రదేశ్: అనకాపల్లిలో తవ్వకాల్లో బయటపడిన బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం ప్రత్యేకత ఏంటి?

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఒక కొండ మొత్తాన్ని తొలిచి, స్థూపాలుగా చెక్కిన బౌద్ధ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఉంది. కొండపై బుద్ధుని విగ్రహాలు చెక్కడంతో పాటు రెండు అంతస్థుల నిర్మాణంగా ఈ కొండను తొలచడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ బౌద్ధ క్షేత్రాన్ని మోడల్‌గా తీసుకుని విదేశాల్లో సైతం బౌద్ధక్షేత్రాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అదే అనకాపల్లి జిల్లా శంకరంలోని బొజ్జన్నకొండ.
ఉత్తరాంధ్రలో సముద్రతీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నింలో ఎక్కడ చూసినా బౌద్ధ చరిత్రకు చెందిన ఆనవాళ్లు ఉంటాయని చరిత్రకారులు, బౌద్ధ ఉపాసకులు చెబుతుంటారు.
అలాంటి వాటిలో విశాఖలో బొజ్జన్నకొండ, బావికొండ, తొట్ల కొండ, పావురాల కొండ ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా కూడా ఉన్నాయి. బొజ్జన్నకొండపై లింగాకారంలో కొన్ని స్థూపాలు ఉన్న ప్రాంతాన్ని లింగాలకొండ అని పిలుస్తుంటారు.
రాతితో చెక్కిన నాలుగు గుహాలయాల సముదాయమే బొజ్జన్న కొండ.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
ఏమిటి ఈ కొండ ప్రత్యేకత...
క్రీస్తు శకం 4వ శతాబ్దం కాలంలో బౌద్ధం ఇక్కడ విశేషంగా విరాజిల్లిందని ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.
“ఇక్కడి కొండపై అందంగా చెక్కిన గౌతమ బుద్ధుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ గుహాలయాలకు దగ్గర్లో బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మాణాలు కూడా ఉంటాయి. బౌద్ధంలోని మూడు దశలైన మహాయాన, హీనయాన, వజ్రయానలకు సంబంధించి ఇక్కడి గుహాలపై, చైత్యాలపై, స్థూపాలపై అనేక వివరాలు కనిపించడం ఈ బొజ్జన్న కొండ మరో ప్రత్యేకత” అని సూర్యనారాయణ చెప్పారు.
ఇక్కడ కొండను తొలిచి నిర్మించిన ఆరామాలు, గుహలు, బుద్ధుని విగ్రహాలు కనిపిస్తాయని, ఇది నిర్మాణపరంగా, చరిత్రపరంగా కూడా ప్రత్యేకమైనదని సూర్యనారాయణ చెప్పారు.
ఏటా కనుమ పండుగ సందర్భంగా దేశవిదేశాల నుంచి ఇక్కడికి బౌద్ధ భిక్షువులు రావడం, వారిని కలిసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు, బౌద్ధమత ఆరాధకులు ఇక్కడకి రావడమే కాదు, ఆ సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరగడం వంటివి ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చాయని అన్నారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
వందేళ్ల కిందట తవ్వకాల్లో బయడపడ్డ బొజ్జన్నకొండ..
1906 నుంచి 1908 మధ్య జరిగిన పురావస్తు తవ్వకాల్లో బొజ్జన్నకొండ బయటపడింది. దీనిలో కొంతభాగంలో లింగాల ఆకారంలో స్థూపాలు ఎక్కువగా ఉండడాన్ని అప్పటి పరిశోధనకులు గమనించారు. దీంతో ఆ ప్రాంతం లింగాలకొండగా పేరు పొందింది. బొజ్జన్న కొండ, లింగాలకొండ సముదాయంలో మట్టిపాత్రలు, పెద్ద పెద్ద ఇటుకలు, బంగారు, వెండి, రాగి నాణేలు వంటి ఎన్నో అరుదైన వస్తువులు ఇక్కడ లభించాయి.
వీటి ఆధారంగా అప్పుడు తవ్వకాలు చేపట్టిన అలెగ్జాండర్ రియో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో, ఈ కట్టడాలు క్రీస్తు శకానికి ముందే నిర్మించి ఉండవచ్చని పేర్కొన్నారని బుద్ధిస్ట్ మాన్యూమెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కొత్తపల్లి వెంకటరమణ బీబీసీతో చెప్పారు.
భారతదేశంలో ఇలాంటి కట్టడం మరొకటి లేదనే విషయాన్ని చాలా మంది చరిత్రకారులు ఒప్పుకున్నారని రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
తాము బొజ్జన్నకొండకు సంక్రాంతి సమయంలో వస్తామని నాగ్‌పూర్ నుంచి ఈ ఏడాది బొజ్జన్న కొండకు వచ్చిన బౌద్ధ భిక్షువు జ్జానధీప్ మహాథేరో బీబీసీతో అన్నారు. బౌద్ధ క్షేత్రాలలో ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, అందుకే ఏటా జరిగే బౌద్ధ తీర్థానికి అనేక మంది బౌద్ధ భిక్షువులు క్రమం తప్పకుండా బొజ్జన్న కొండ వస్తారని ఆయన చెప్పారు.
విశాఖలోని మరో బౌద్ధ క్షేత్రం తొట్లకొండ 1975లో తూర్పు నౌకదళం చేపట్టిన ఒక సర్వేలో బయటపడింది.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
ఇతర దేశాలకు బొజ్జన్నకొండ ఒక మోడల్..
బొజ్జన్నకొండపై రెండు అంతస్తుల్లో నిర్మించిన చైత్యాలయాలు, మహాచైత్య పునాదులు, మహా స్థూప వేదిక, గుహాలయాలు, ఇటుక నిర్మాణాలు వంటి ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బౌద్ధమత అధ్యయనం కోసం సముద్ర మార్గం ద్వారా చైనా, బర్మా, తైవాన్ వంటి అనేక దేశాల నుంచి విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ఏళ్లు తరబడి బౌద్ధ మత అభ్యాసాలు చేసేవారు. వారు ఇక్కడి నిర్మాణశైలిని చూసి అదే తరహా నిర్మాణాలను అయా దేశాల్లో కూడా చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.
అనకాపల్లిలోని బొజ్జన్న కొండ చూసి, ఆ తరహాలోనే ఇతర దేశాల్లో బౌద్ధ క్షేత్రాల నిర్మాణాలు చేపట్టారని రిటైర్డ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ చెప్పారు.
''దానికి ఉదాహరణ ఇండోనేషియాలోని బొరొబుదూర్ బౌద్ధక్షేత్రమేనని అన్నారు. దీనిని 9 శతాబ్ధంలో బొజ్జన్నకొండకు వచ్చిన ఇండోనేషియాకు చెందిన తురుమ రాజులు.. బొజ్జన్నకొండ శిల్పకళా సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. దాంతో వాస్తు శిల్పులను తీసుకు వచ్చి.. సుమారు ఏడాది పాటు ఇక్కడే ఉండి.. ఛాయాచిత్రాల్ని గీశారు. బొజ్జన్నకొండ తరహాలోనే బొరొబుదూర్ బౌద్ధక్షేత్రాన్ని నిర్మించారని 1909లో బొజ్జన్నకొండలో తవ్వకాలు జరిపిన ప్రొఫెసర్ అలెగ్జాండర్ రియా తెలిపారు” అని విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
బుద్ధుని కొండే.. బొజ్జన్న కొండ
బొజ్జన్న కొండ అనకాపల్లి జిల్లాలోని శంకరం అనే గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ ప్రాంతంలో బౌద్ధ చిహ్నాలు, ఆధారాలు క్రీ.శ. 4వ, 9వ శతాబ్దానికి మధ్య నాటివని చరిత్రకారులు చెబుతారు.
కొన్ని శతాబ్దాల క్రితం శంకరం గ్రామం బౌద్ధ సంస్కృతికి, బోధనకు కేంద్రంగా వెల్లివిరిసేది. ప్రస్తుతం శంకరం అని పిలుస్తున్న ఈ గ్రామం అసలు పేరు సంఘరామ. బౌద్ధ భిక్షువులు ఉండే ప్రదేశాన్ని బౌద్ధులు సంఘరామగా పిలుస్తారు. అదే కాలక్రమంలో సంఘరామం, అది కాస్తా శంకరంగా మారింది.
అలాగే, బొజ్జన్నకొండ అసలు పేరు బుద్ధిని కొండ అని విశాఖ బుద్దిస్ట్ మన్యూమెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ చెప్పారు. బుద్ధుని కొండ కాలక్రమంలో బొజ్జన్నకొండగా మారిందని తెలిపారు. కొందరు బొజ్జన్నకొండపై చెక్కిన కూర్చుని ఉన్న బుద్ధుని ఆకారం వలన బుద్ధుడినే స్థానికులు బొజ్జన్నగా పిలుస్తారనే ఒక ప్రచారం కూడా ఉందని చెప్పారు.
రాతిని ఏక శిలగానే తొలచిన ఒక గుహను, నాలుగు స్తంభాలతో చెక్కిన బుద్ధుని విగ్రహాన్ని, మరోగుహలో తొమ్మిది స్తంభాలతో చెక్కిన మరో విగ్రహాన్ని ఈ కొండపై చూడొచ్చు. అలాగే కొండపై నీటిని నిల్వ చేసుకోవడానికి రాతిని తొలచిన బావులు, గుహలు కూడా కనిపిస్తాయి. సన్యాసులకు, శిష్యుల కోసం విహారాలు కూడా ఉన్నాయి. గుహ ద్వారం వద్ద బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం. బొజ్జన్న కొండపై ద్వారపాలకులు కూడా కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
కనుమ పండుగ రోజే భౌద్ధ భిక్షువులు ఎందుకు వస్తారు?
ఏటా కనుమ పండుగ రోజున బొజ్జన్నకొండ వద్ద బొజ్జన్న తీర్ధం నిర్వహిస్తారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో బౌద్ధ భిక్షువులు తరలివస్తారు. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు ఆ రోజున ఇక్కడికి చేరుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. దేశం నలుమూలల నుంచి కనుమ రోజు వచ్చే బౌద్ధ భిక్షువులను కలుసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బౌధ్ద మత ఆరాధకులు కూడా వస్తుంటారు.
కనుమ పండుగ రోజున పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులకు స్థానికులు తమ పంటలను దానం ఇచ్చే ఆచారం ఇక్కడ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆచారం కనిపించకపోయినా బౌద్ధ భిక్షువులు రావడం, వారి నుంచి బౌద్ధమత ప్రవచనాలను వినడం ఇంకా కొనసాగుతుందని తెలిపారు.
“అనకాపల్లిని అనేకపంటల పల్లి అనేవారు. అదే కాలక్రమంలో అనకాపల్లిగా స్థిరపడిందనే ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతంలో మంచి పంటలు పండటంతో.. బౌద్ధమత వ్యాప్తి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే బౌద్ధ భిక్షువులకు తమ పంటలను సంక్రాంతి సమయంలో దానంగా ఇవ్వడం ఇక్కడ ఆచారంగా సాగేది. అయితే, దానం ఇవ్వటమనేది లేదు కానీ, ఈ ప్రాంతానికి కనుమ సందర్భంగా బౌద్ధ భిక్షవులు రావడం మాత్రం కొనసాగుతుంది” అని డిస్ట్రిక్ట్ మహాబుద్ధి సొసైటీ ప్రెసిడెంట్ గుణుపూడి బాబులు బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas/BBC
యునెస్కో వారసత్వ సందపగా గుర్తించాలి: ఇంటాక్
ఎంతో చరిత్ర ఉన్న బొజ్జన్న కొండను యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రకటించాలని చాలా కాలంగా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) డిమాండ్ చేస్తోంది. దీని వలన బౌద్ధ క్షేత్రాలకు రక్షణ ఏర్పడటంతో పాటు వీటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవకాశం ఉంటుందని ఆ సంస్థ చెప్తోంది.
అలాగే, కొందరికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంటోంది. ప్రస్తుతం బొజ్జన్నకొండ నిర్వహణ బాధ్యతలను జాతీయ పురావస్తు శాఖ చూస్తోంది.
బొజ్జన్నకొండకు ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దీని పరిస్థితి ఏటా దిగజారిపోతుందని బౌద్ధరామాలపై పరిశోధనలు చేసే యూవీ రావు బీబీసీతో అన్నారు. చాలా మంది బౌద్ధ భిక్షువులు ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ ఏడాది కనుమ పండుగ రోజున బొజ్జన్నకొండపై బౌద్ధ తీర్థం చూసేందుకు, ఇక్కడి విశేషాలు తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం భద్రాది కొత్తగూడెం నుంచి చంద్రలేఖ అనే బీటెక్ సివిల్ విద్యార్థిని వచ్చారు. బుద్ధుని విశేషాలు తెలుసుకోవడంపై ఆసక్తి ఉందని, తాను బౌద్ధ క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటానని చంద్రలేఖ చెప్పారు.
“బొజ్జన్నకొండలో చాలా ఎక్కువ స్థూపాలు కనిపిస్తున్నాయి. నేను గతంలో చూసిన బౌద్ధ క్షేత్రాలలో ఈ తరహా నిర్మాణాలు చూడలేదు. ఇక్కడ చాలా అత్యధిక స్థూపాలు చూశాను. బౌద్ధ క్షేత్రాలలో ఇదొక విశిష్టత. అయితే, ఈ క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది” అని చంద్రలేఖ బీబీసీతో చెప్పారు.
బొజ్జన్నకొండను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టాయని అనకాపల్లి ఎంపీ సత్యవతి చెప్పారు. ఈ పనులు త్వరలోనే పూర్తవుతాయని ఆమె చెప్పారు. బొజ్జన్నకొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని ఎంపీ సత్యవతి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఫాస్టాగ్ కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలి? 31లోపు చేసుకోకపోతే ఏమవుతుంది?
- ఇండియా-అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డబుల్ సూపర్ ఓవర్’కు ఎలా వెళ్లింది? థ్రిల్లింగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవి బిష్ణోయ్ భారత్‌ను ఎలా గెలిపించారు?
- ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి 230 ఏళ్ళు పడుతుందా?
- ఇండియన్ రైల్వేస్: చాలా రైళ్ళు రోజుల తరబడి ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయి?
- భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు















