Direct To Mobile: సిమ్ కార్డ్, ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్లలో నేరుగా లైవ్ టీవీ ప్రసారాలు, భారత్‌లోనే తొలిసారిగా...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి సిమ్ కార్డు లేకుండా, డేటా కనెక్షన్ లేకుండా నేరుగా టీవీ ప్రసారాలు చూసేయొచ్చు.
దేశంలో 5జీ సేవలు విస్తృతమయ్యాక గడచిన రెండేళ్లలో స్మార్ట్ ఫోన్లలో టీవీ కంటెంట్ చూసే యూజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న మొబైల్ నెట్ వర్క్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పూర్తి స్థాయిలో బ్రాడ్ కాస్టింగ్ సేవల్ని అందించేందుకు డైరెక్ట్ టు మొబైల్ అనే సాంకేతికతను భారత ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది.
అంటే, దీని ద్వారా డేటా కనెక్షన్, సిమ్ కార్డ్ లేకుండానే స్మార్ట్ ఫోన్‌లో నేరుగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించడానికి వీలుటుంది.
మీకు డీటీహెచ్ తెలుసు కదా... డైరెక్ట్ టు హోం సేవల ద్వారా ఎక్కడ ఉన్నా డిష్ యాంటెన్నా ద్వారా నేరుగా టీవీ ప్రసారాలు పొందవచ్చు. అదే విధంగా డైరెక్ట్ టూ మొబైల్‌లో మీ స్మార్ట్ ఫ్లోన్లనోనే టీవీ ప్రసారాలను చూడవచ్చు.
ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో...
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మొబైల్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లలో లైవ్ టీవీని చూసేందుకు వీలు కల్పిస్తుంది 'డైరెక్ట్ టూ మొబైల్'.
ఈ కొత్త సాంకేతికతపై టెలికమ్యూనికేషన్స్ విభాగం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఐఐటీ కాన్పూర్ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి. ప్రసారభారతి, టెలీకమ్యూనికేషన్స్ డెవలప్ మెంట్ సొసైటీ ఇండియా సహకారంతో ఈ డైరెక్ట్ టూ మొబైల్ బ్రాడ్ కాస్టింగ్ సేవలపై 2023 జూన్ 1న ఐఐటీ కాన్పూర్‌లో శ్వేత పత్రం విడుదల చేశారు.
అందులో ఈ డైరెక్ట్ టూ మొబైల్ సేవల్ని నెక్ట్స్ జెన్ బ్రాడ్ కాస్టింగ్‌గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరీక్షల దశలోనే ఉంది. ఇది పూర్తిగా భారత్ స్వయంగా తయారు చేసిన టెక్నాలజీ.
త్వరలోనే దేశంలోని 19 నగరాల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. 2023లో ఐఐటీ కాన్పూర్ సదస్సు తర్వాత.. దీనిని బెంగళూరు, దిల్లీలోని కర్తవ్యపథ్, ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాల్లో ఈ టెక్నాలజీని పరీక్షించే పైలట్ ప్రాజెక్టులు చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, YT/Prasar Bharati
D2M ప్రయోజనాలు అమోఘం
యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నేరుగా స్మార్ట్ ఫోన్లలో మల్టీ మీడియా కంటెంట్ ట్రాన్స్ మిట్ చేయగల సామర్థ్యం ఈ టెక్నాలజీ సొంతం. మొబైల్ సెంట్రిక్‌గానే కాదు.. నిరంతరం కంటెంట్ అందించగలగడం, హైబ్రీడ్ బ్రాడ్ కాస్టింగ్‌ను, రియల్ టైంలో ట్రాన్స్‌మిట్ చేయడం, వీటితో పాటు ఆన్ డిమాండ్ కంటెంట్, ఇంకా ఇంటరాక్టివ్ సేవలు ఈ డీటుఎం టెక్నాలజీ ప్రత్యేకతలు.
నెక్ట్స్ జెన్ బ్రాడ్ కాస్టింగ్‌లో భాగంగా తీసుకువస్తున్న ఈ డీటూఎంలో గరిష్ట ఫలితాలను తీసుకురావడానికి మరిన్ని టెక్నాలజీలను సమ్మిళితం చేస్తున్నారు.
దేశంలో 80 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులున్నారు. వారిలో అత్యధికులు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే, వీరందరికీ నేరుగా కంటెంట్ డెలివరీ చేయడానికి ఈ డీ టు ఎం టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
వరదలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు ముందుగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. అప్పుడు ప్రజలకు సరైన సమాచారం అందించడం కష్టమవుతుంది.
కానీ, డీ టూ ఎం టెక్నాలజీ ద్వారా... ప్రజలకు నేరుగా సమాచారాన్ని అందించవచ్చు. సహాయక చర్యలు, ఇతర సమాచారం, వాతావరణ హెచ్చరికలు వంటివి జారీ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీంతో పాటు మారుమూల గ్రామాలకు ఈ టెక్నాలజీ ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లకు ఎడ్యుకేషన్ కంటెంట్ ప్రసారం చేయవచ్చు.
ఇలా నేరుగా లైవ్ ఛానెళ్లను ఎక్కడ ఉన్నా నేరుగా మొబైల్ ఫోన్లలోనే చూడగలిగే సౌలభ్యం ఈ టెక్నాలజీ కల్పిస్తోంది. ఇంటర్నెట్, సెల్యులార్ ఆపరేటర్ల నెట్ వర్క్ లేని ప్రాంతాలకు కూడా నేరుగా, విశ్వసనీయమైన ఎమర్జెన్సీ అలర్ట్స్ అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
విపత్కర పరిస్థితుల్లో శాటిలైట్ సేవలు నిలిచిపోయినప్పుడు కీలకమైన వ్యూహాత్మక, జాతి ప్రయోజనాలను నిర్దేశించే సమాచారాన్ని బ్రాడ్ కాస్ట్ చేయడానికి ఈ సేవలు ఉపయోగపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇదెలా పని చేస్తుంది?
మీకు ఎఫ్ఎం రేడియో తెలుసు కదా..? అదెలా పనిచేస్తుంది. పట్టణాల్లో ఉండే ఎఫ్ఎం బ్రాడ్ కాస్టర్లు వివిధ ఫ్రీక్వెన్సీల్లో తమ వాయిస్ ప్రసారాలు చేస్తాయి. వాటిని ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకోవడం ద్వారా ఎఫ్ఎం రేడియోల్లో మనం ఆ ప్రసారాలు వినవచ్చు.
డైరెక్ట్ టూ మొబైల్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది.
ఇది అడ్వాన్స్‌డ్ బ్రాడ్ కాస్టింగ్, బ్రాండ్ బ్యాండ్‌ల కలయికతో వాయిస్ ప్రసారాలకు బదులుగా మల్టీ మీడియా కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. ఎఫ్ఎం రేడియోల్లో వచ్చే వాయిస్ ప్రసారాల్ని వాటికి అమర్చిన స్పీకర్లు, లేదా హెడ్ ఫోన్ల ద్వారా వినవచ్చు. అదే విధంగా డైరెక్ట్ టూ మొబైల్ సేవల్లో ప్రసారం చేసే మల్టీ మీడియా సిగ్నళ్లను స్మార్ట్ ఫోన్లలో చూడవచ్చు.
ఐపీఎల్, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు వంటి వాటిని మొబైల్ ఫోన్లలో చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ను కోట్ల మంది మొబైళ్లలో చూశారు.
ఓ పాతికేళ్ల కిందట ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతా టీవీల ముందు గుమిగూడేవారు. ఇందుకోసం ఆఫీసులకు సెలవులు కూడా పెట్టేవారు. కానీ, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాంలు లైవ్ మ్యాచ్‌ను టెలికాస్ట్ చేస్తుండటంతో ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ మ్యాచ్‌లు చూస్తున్నారు. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లలో టీవీ కంటెంట్ చూసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
డీ టూ ఎం అనేది కంటెంట్ డెలివరీలో, ముఖ్యంగా వీడియో కంటెంట్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. దీని ద్వారా ఎంటర్ టైన్‌మెంట్ ప్రసారాలు చూసేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు డేటా ప్లాన్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ సేవలు 526 మెగా హెర్ట్జ్‌ల నుంచి - 582 మెగాహెర్ట్జ్ ల మధ్య ఫ్రీక్వెన్సీలో మొబైల్, బ్రాడ్ కాస్ట్ సర్వీసులతో సమన్వయంతో పనిచేస్తుంది. ఈ బ్యాండ్‌పై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన సదస్సులో టెలికం శాఖ కార్యదర్శి కె.రాజారామన్ తెలిపారు.
ప్రస్తుతం, బ్యాండ్ 526-582 మెగాహెర్ట్జ్ ల ఫ్రీక్వెన్సీని ప్రసారభారతి, టెరెస్ట్రియల్ టీవీ బ్రాడ్ కాస్టింగ్ ఉపయోగిస్తుంది. కానీ, ఈ టెక్నాలజీ మీద టెలికాం ఆపరేటర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఎందుకంటే. డేటా సర్వీసుల నుంచి వారికి వచ్చే ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది.
దేశంలో ఫస్ట్ జనరేషన్ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో మొబైల్ ఆపరేటర్లు ఇన్‌కమింగ్ కాల్స్‌కి కూడా ఛార్జ్ చేసేవారు. ఆ తర్వాత మొబైల్ సేవల విస్తృతి పెరిగే కొద్దీ ఇన్ కమింగ్ ఫ్రీ అయ్యింది. లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చింది. ఇప్పుడు 5జీ జనరేషన్లో అవుట్ గోయింగ్ కూడా అన్‌లిమిటెడ్‌గా అందిస్తూ, డేటా ప్యాక్‌లకు మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు డేటా సర్వీసులు అవసరం లేకుండానే నేరుగా లైవ్ టీవీ ప్రసారాలు అందితే, తమ డేటా ప్యాక్‌ల ఆదాయానికి గండి పడుతుందనే భయాలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ టెక్నాలజీ అవసరం ఏమిటి?
టీవీల నుంచి స్మార్ట్ ఫోన్లలో కంటెంట్ వినియోగం పెరుగుతూ వస్తోంది. టీవీలు కూడా స్మార్ట్ టీవీలుగా రూపాంతరం చెందండంతో వాటి ఉనికిని మరికొంతకాలం నిలుపుకోడానికి వీలుపడుతోంది.
అయితే, భారత్‌లో మొబైల్ ఫోన్లకు ప్రత్యక్ష ప్రసార సామర్థ్యాలను తీసుకురావడం కీలకంగా మారుతోంది.
హై క్వాలిటీ ఆడియో, వీడియో కంటెంట్‌ను ఇలా ప్రసారం చేయడం ద్వారా.. ప్రభుత్వం తనకు అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ పరిధిని గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా సెల్యూలార్ ఆపరేటర్ల మీద కూడా కొంత భారం తగ్గుతుంది.
అన్నింటికీ మించి ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో ఎక్కువవుతున్న ఫేక్ న్యూస్ వ్యాప్తిని కూడా ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
ఎందుకంటే, ఈ డైరెక్ట్ టూ మొబైల్ సేవల ద్వారా వాస్తవమైన ధృవీకృత కంటెంట్‌ను మాత్రమే ప్రసారం చేయగలం. కాబట్టి ప్రభుత్వాలకు, ప్రజలకు తలనొప్పిగా మారిన ఫేక్ న్యూస్ వ్యాప్తిని ఇది సమర్థంగా అరికట్టడానికి వీలుపడుతుంది.
అన్నింటినీ మించి సంక్షోభాల సమయంలో ప్రజలకు నేరుగా వాస్తవ సమాచారాన్ని అందించడానికి ఈ సేవలు మరింత సమర్థంగా ఉపయోగపడతాయి. కోవిడ్ 19 లాక్‌డౌన్ సమయంలో ఈ సేవలు అందుబాటులో ఉండి ఉంటే.. ఫేక్ న్యూస్ వ్యాప్తి కొంతమేర అరికట్టేందుకు వీలుపడేది.

ఫొటో సోర్స్, Getty Images
మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు దీనికి పనికొస్తాయా?
ఎఫ్ఎం, ఏఎమ్ రేడియో సేవల్లో రేడియో కేంద్రాలు ప్రసారం చేసే సిగ్నళ్లను రేడియోల్లో ఉన్న రిసీవర్లు స్వీకరించి వాటిని ఆడియో శబ్దాలుగా మారుస్తాయి.
అదే డీటీహెచ్‌లలో నేరుగా శాటిలైట్ల నుంచి ప్రసారమయ్యే టీవీ సిగ్నళ్లను ఇళ్లపై ఏర్పాటు చేసిన డిష్ ద్వారా రిసీవ్ చేసుకుని, వాటిని సెట్‌టాప్ బాక్సుల ద్వారా తిరిగి ఆడియో, వీడియో సిగ్నళ్లుగా మార్చి టీవీల్లో ప్రసారమయ్యేలా చేస్తాయి.
ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డైరెక్ట్ టూ మొబైల్ సేవలు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. అంటే, ఇందులో సిగ్నళ్లను రిసీవ్ చేసుకునేందుకు మన స్మార్ట్ ఫోన్లలో కూడా ఒక ఏర్పాటు ఉండాలి.
2022లో ఐఐటీ కాన్పూర్ ప్రచురించిన 'డీ టూ ఎం బ్రాడ్ కాస్ట్ 5జీ బ్రాడ్ కాస్ట్ కన్వర్జెన్స్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా' అనే పత్రంలో ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. అందులో ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు ఈ డీ టూ ఎం టెక్నాలజీని నేరుగా వినియోగించుకునేలా సపోర్ట్ చేయవని తెలిపింది.
మరి మొబైల్ ఫోన్లలో ఈ సేవలు పొందేలా చేసేందుకు ఒక ప్రత్యేకమైన చిన్న పరికరాన్ని మొబైల్‌కి అనుసంధానించాలి. అంటే, ఒక ప్రత్యేకమైన బేస్ బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్ అవసరమవుతుంది. దీనిలో సిగ్నళ్లను రిసీవ్ చేసుకోడానికి ఒక యాంటెన్నా, లో నాయిస్ యాంఫ్లీఫయర్, బేస్ బ్యాండ్ ఫిల్టర్లు, ఇంకా రిసీవర్ ఉంటాయి.
గత ఏడాది ఐఐటీ కాన్పూర్‌లో ఈ రిసీవర్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. దీని పరిమాణం కూడా చాలా చిన్నది మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ పోర్ట్‌కి నేరుగా అనుసంధానించేలా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి...
ప్రస్తుతానికి ఈ సేవలు ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన బేస్ బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే తప్ప... ఈ డైరెక్ట్ టూ మొబైల్ కంటెంట్ పొందేందుకు వీలుండదు. భవిష్యత్తులో ఈ డివైజ్‌లను నేరుగా మొబైల్ ఫోన్లలోనే ఏర్పాటు చేయడం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
గతంలో ఫస్ట్ జెనరేషన్ ఫోన్లలో ఉండే యాంటెన్నా మాదిరి యాంటెన్నాలను కూడా అమర్చాల్సి రావచ్చు. వాటిని పూర్తి స్థాయిలో స్మార్ట్ ఫోన్లలోనే అమర్చేలా తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
తొలినాళ్లలో చాలా పెద్దగా ఉండే మొబైల్ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లను సంతరించుకునే క్రమంలో చాలా నాజూగ్గా తయారయ్యాయి. కానీ డీ టూ ఎం సేవల్ని పొందేలా బేస్ బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్లు అమర్చినప్పటికీ, స్మార్ట్ ఫోన్లను నాజూగ్గా ఉంచాలంటే... అందుకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది.
అంతే కాదు.. ఈ సేవలు ప్రస్తుతం ఉన్న ఎల్‌టీఈ ఇంకా 5జి నెట్‌వర్క్‌లపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలోకి వినియోగంలోకి తెచ్చేందుకు టెలీకమ్యూనికేషన్ సంస్థలు కూడా ఏకతాటిపైకి రావాలి. ఇలా అన్ని ప్రైవేటు టెలికమ్యూనికేషన్ సంస్థలను అంగీకరింపజేయడం ప్రభుత్వం ముందున్న మరో పెద్ద సవాల్.
వీటన్నింటికీ తోడు... దేశంలోని ప్రతి మూలలో ఈ డైరెక్ట్ టూ మొబైల్ సిగ్నళ్లను ప్రసారం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుంది. ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని, మరికొన్ని సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తే అప్పుడు విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయి.
ఇవి కూడా చదవండి:
- పొగమంచు ఉంటే విమానాలు ఎందుకు ఆలస్యమవుతాయి, నిపుణులైన పైలట్లు లేరా?
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ముస్సోరీ హోటల్లో ఒంటరి మహిళ హత్య అగాథా క్రిస్టీ క్రైమ్ నవలకు ఎలా ప్రేరణగా మారింది?
- మాల్దీవులు దూకుడుపై భారత్ మౌనం ఎందుకు?
- అయోధ్య: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్ట పోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














