మహిళా రెజ్లర్ల నిరసనలకు ఏడాది... ఇప్పటివరకూ ఏం జరిగింది, భారత రెజ్లింగ్ భవిష్యత్తు ఏంటి?

ఫొటో సోర్స్, @BAJRANGPUNIA
- రచయిత, శారదా ఉగ్ర
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ
భారత రెజ్లింగ్ చాంపియన్లు అనూహ్యంగా తమ ఫెడరేషన్‌కు, ఫెడరేషన్ అధిపతికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు ప్రారంభించారు.
సరిగ్గా ఏడాది తర్వాత, భారత రెజ్లింగ్‌ను పరిశీలిస్తే స్వయంకృతాపరాధాలతో సమస్యల సుడిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా - డబ్ల్యూఎఫ్‌ఐ), అప్పటి దాని అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ విజేతలైన సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజ్‌రంగ్ పూనియా కొనసాగిస్తున్న నిరసన కొనసాగుతోంది. దానికి ఇప్పటికీ పరిష్కారం లభించలేదు.
నూతనంగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ కార్యవర్గంపై యువజన, మంత్రిత్వ వ్యవహారాల శాఖ సస్పెన్షన్ విధించినప్పటికీ, ఆ సస్పెన్షన్‌ను కార్యవర్గం నిరాకరించింది. ఈ వారంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించింది.
సీనియర్ నేషనల్స్‌కు పూణెలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సస్పెండైన డబ్ల్యూఎఫ్‌ఐ ఒక తేదీని ప్రకటించగా, జైపూర్‌లో ఎంపికలు జరుగుతాయని క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన అడ్ - హక్ ప్యానెల్ మరో తేదీని ప్రకటించింది.
ఆరోపణలు - ప్రత్యారోపణల నడుమ, ఏడాది కాలంగా కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన దేశంలో క్రీడలపై యువ అథ్లెట్లు, సామాన్య ప్రజల దృక్పథాన్ని మార్చేశాయి.

ఎలాంటి సందేశం పంపారు?
పతకాలు సాధించిన విజేతలను, చాంపియన్లను నగదు బహుమతులు, పురస్కారాలు, సన్మానాలు, పూలదండలతో ముంచెత్తకపోయినా ఫర్వాలేదు. కానీ, అటు పాలకులు గానీ, ఇటు స్పోర్ట్స్ అసోసియేషన్లు గానీ వాళ్లకు ఇసుమంతైనా విలువ ఇవ్వడం లేదు.
క్రీడా సంఘాల నిర్వహణలో రాజకీయ నేతల ప్రమేయం, దేశంలో క్రీడారంగానికి అంత మంచిది కాదన్న విషయం రెజ్లర్ల ప్రదర్శనతో స్పష్టంగా అర్థమైంది.
అధికార పార్టీలో, ప్రభుత్వంలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, ఫెడరేషన్ చీఫ్‌పై బెదిరింపులు, వేధింపులు, అధికార, నిధుల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకల గురించిన ప్రశ్నలను రెజ్లర్లు లేవనెత్తారు.
ఆ తర్వాత, దేశం గౌరవప్రదంగా చూసుకోవాల్సిన రెజ్లర్లపై ప్రభుత్వ వర్గాల స్పందనను కూడా అందరూ చూశారు. చేతుల్లో త్రివర్ణ పతాకంతో ఉన్న రెజ్లర్లను దిల్లీ పోలీసులు రోడ్డుపై పడేసిన దృశ్యాలు, ఆ తర్వాత వ్యాన్‌లోకి ఎక్కించిన దృశ్యాలు దేశమంతా చూసింది. భారత్‌కు ఏకైక ఒలింపిక్ పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్ తన బూట్లు టేబుల్‌పై పెట్టి రిటైర్మెంట్ కూడా ప్రకటించింది.
ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సాధించిన విజేతలు తమ అవార్డులను ప్రధాన మంత్రి కార్యాలయంలో అందజేసేందుకు వెళ్తుండగా అడ్డుకోవడంతో, వారు తమ పతకాలను, ప్రభుత్వం అందించిన అవార్డులను సెంట్రల్ దిల్లీలో ఫుట్‌పాత్‌పై వదిలేశారు.
రాష్ట్రపతి భవన్‌కు సమీపంలోనే ఇది జరిగింది. ఆ తర్వాత పది రోజుల్లోనే 2023 ఏడాదికి గానూ అర్జున, ఖేల్‌రత్న అవార్డుల ప్రదానోత్పవం జరిగింది.

ఫొటో సోర్స్, ANI
రాజకీయ ఉద్దేశాలు, రెజ్లర్ల వాస్తవాలు
రెజ్లర్లపై ఫెడరేషన్‌లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడితే ఫర్వాలేదు కానీ, రెజ్లర్ల ఉద్దేశాలపై ప్రభుత్వమే (క్రీడా మంత్రిత్వ శాఖ) ప్రశ్నలు లేవనెత్తింది.
ప్రతి యువ క్రీడాకారుడు ఆ ఫోటోలు చూసి ఆందోళనకు గురయ్యారు. క్రీడా రంగంలో కెరీర్‌ను ఎందుకు కొనసాగించాలనే పరిస్థితికి అది కారణమైంది.
యువ క్రీడాకారుల తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవని క్రీడాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వారు కొందరు నాతో చెప్పారు. ''మా పిల్లలకు ఇలాగే జరిగితే ఏం చేయాలి? ఫెడరేషన్ వాళ్లకేమవుతుంది? మమ్మల్ని ఎవరు కాపాడతారు? మీరు ఏం చేయగలరు?'' అని అడిగేవారని చెప్పారు.
రెజ్లర్ల నిరసనలో ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలు చూస్తోందని వాపోతున్నారని వారు చెప్పారు.
రెజ్లర్ల రాజకీయ ఉద్దేశాలు ఏమైనప్పటికీ, గత ఎన్నికల వరకు డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయం బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ అధికారిక బంగ్లాలోనే కొనసాగింది.
బ్రిజ్ భూషణ్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసేందుకు దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాలు సరిపోతాయి.
తమ పిల్లలను క్రీడలకు పంపుతున్న తల్లిదండ్రులు తప్పకుండా వీటన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాంపియన్లతో ఎలా ప్రవర్తించారో కూడా అందరూ చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రీడాకారుల భవిష్యత్తు
''విలువైన ఏడాది కాలంలో క్రీడాకారుల ప్రదర్శన దెబ్బతింది'' అని సస్పెన్షన్‌కు గురైన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ సంజయ్ సింగ్ చెప్పారు.
అయితే, ఎన్నికలు సకాలంలో జరగకపోవడం వల్ల రెజ్లింగ్ గవర్నర్ బాడీ, యునైటెడ్ వరల్డ్ ఆఫ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) ఆగస్టులోనే డబ్ల్యూఎఫ్‌ఐను సస్పెండ్ చేశాయి.
ఈ సస్పెన్షన్ కారణంగా అక్టోబర్‌లో అల్బేనియాలో జరిగిన యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ అండర్ -23 పోటీల్లో పతకాలు సాధించిన తొమ్మిది మంది విజేతలతో పాటు భారత రెజ్లర్లందరూ జాతీయ జెండాకు బదులు యూడబ్ల్యూడబ్ల్యూ జెండాతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది.
ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులోనూ అదే పని చేయాల్సి వస్తుంది.
ఇది ఒలింపిక్ సంవత్సరం. సెప్టెంబర్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ పోటీల్లో అంతిమ్ పాంగల్ రజత పతకం సాధించి పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
ఇదే కాకుండా, భారత టాప్ రెజ్లర్లు ఏషియన్, ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో మరిన్ని స్థానాలు సాధించేందుకు పోటీ పడతారు.
వారిలో టోక్యోలో వెండి పతకం సాధించిన రవి దహియా, వరల్డ్ చాంపియన్‌షిప్ అండర్ - 23 పోటీల్లో, 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అమన్ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా ఉన్నారు.
మహిళల్లో, 76 కేజీల విభాగంలో అండర్ -23 వరల్డ్ కప్ చాంపియన్ రితిక, 62 కేజీల విభాగంలో సోనమ్ మాలిక్ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దీని ప్రభావం 2025లో..
క్రీడాకారుల ప్రదర్శనపై ప్రభావం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కనిపించకపోయినా, ఆ తర్వాత జరిగే ఏషియన్, ఒలింపిక్, ఇతర ప్రపంచ స్థాయి పోటీలకు జూనియర్స్ ముందుకొచ్చినప్పుడు కనిపిస్తుంది.
డబ్ల్యూఎఫ్‌ఐ ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే భారత టాప్ రెజ్లర్లు సిద్ధమయ్యారు.
కానీ, ఏడాది కాలంగా అగ్రశ్రేణి క్రీడాకారుల పేలవ ప్రదర్శనలతో భారత రెజ్లింగ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది?
ఎప్పటిలాగే క్రీడల కంటే రాజకీయ కుట్రలు రాజ్యమేలుతున్నాయి. అయితే, పాలకవర్గం, మంత్రివర్గంలో ఇప్పటికీ రెజ్లర్లు ఎందుకు నిరసన వీడడం లేదనే చర్చ జరుగుతోంది.
చివరికి వాళ్లు కావాలనుకున్నది సాధించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెండ్ చేసింది. ఫెడరేషన్ కార్యకలాపాల్లో ఆయనకు ఎలాంటి స్థానం లేదు. అలాగే, ఈ వ్యవహారం కోర్టులో ఉంది.
అదంతా నిజమే అయినప్పటికీ, బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రమేయం నేటికీ ఉందని రెజ్లర్లు గ్రహించారు. యువ రెజ్లర్లను రక్షించేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సమూల మార్పులు రావాలని రెజ్లర్లు కోరుకున్నారు.
ఇక్కడ వారి రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? లేదా ఈ డిమాండ్‌ను వాడుకుంటున్నారా? అనేది పట్టించుకోవాల్సిన అసవరం లేదు.
అథ్లెట్లు తాము సురక్షితంగా ఉన్నామని భావించగలిగితే అది వారికి, అలాంటి భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారికి విజయమే అవుతుంది.
ఒకవేళ మన అథ్లెట్లు సురక్షితంగా ఉన్నట్లు భావించకపోతే, అది పతకాలు సాధించి పెట్టి ఇప్పుడు నిరసనలు చేస్తున్న రెజ్లర్ల తప్పు ఏమాత్రం కాదు.
దారితప్పిన అధికార వ్యవస్థలను పట్టుకుని వేలాడేవారే దీనికి బాధ్యులవుతారు.
ఇవి కూడా చదవండి:
- మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్న బ్రిజ్ భూషణ్ ఎవరు
- అయోధ్య 'హిందూ వాటికన్ సిటీ'గా అవతరిస్తోందా?
- హర్దిత్ సింగ్ మాలిక్: యుద్ధ విమానానికి 400 బుల్లెట్లు తగిలినా బతికి బయటపడ్డ పైలట్ కథ
- ఇండియా-అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డబుల్ సూపర్ ఓవర్’కు ఎలా వెళ్లింది? థ్రిల్లింగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవి బిష్ణోయ్ భారత్‌ను ఎలా గెలిపించారు?
- ఫాస్టాగ్ కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలి? 31లోపు చేసుకోకపోతే ఏమవుతుంది?














