జపాన్-స్లిమ్: చంద్రునిపై సురక్షితంగా దిగిన ఈ మిషన్ కొన్ని గంటల్లోనే పనికి రాకుండా పోతుందా...ఏం జరిగింది?

చంద్రుడిపైకి స్లిమ్

ఫొటో సోర్స్, JAXA

    • రచయిత, జోనాథన్ అమోస్
    • హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్

జపాన్‌ తన మూన్ మిషన్‌ ‘స్లిమ్’ను చంద్రుడి మీదకి విజయవంతంగా దించింది. అయితే, సోలార్ పవర్ సిస్టమ్‌లో కొన్ని లోపాలు తలెత్తడంతో అది కొన్ని గంటలపాటే పని చేస్తుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.

స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ (స్లిమ్ ) అని పిలిచే ఈ మిషన్ చంద్రుని ఉపరితలం మీద క్షేమంగా (సాఫ్ట్ ల్యాండింగ్) దిగిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అయితే, కొద్దిగంటలు మాత్రమే పని చేయగలదన్న అంచనాతో ఈ మిషన్ నుంచి వీలైనంత ఎక్కువ డేటాను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సైంటిస్టులు.

ఈ ల్యాండింగ్‌తో అమెరికా, రష్యా, చైనా, భారత్‌ల తర్వాత చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ చేసిన ఐదో దేశంగా జపాన్ రికార్డుల కెక్కింది.

స్లిమ్ మిషన్‌లోని సోలార్ ప్యానెల్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని, అలా ఎందుకు జరిగిందో ఇంకా అర్ధం కాలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సౌర పలకాలు పని చేయకపోవడంతో స్లిమ్ మిషన్ పూర్తిగా బ్యాటరీల మీద ఆధారపడి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అవి త్వరలోనే డిశ్చార్జ్ అవుతాయి. ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే భూమి నుంచి కమాండ్స్‌ను తీసుకోదు, అలాగే ఏ సిగ్నల్స్‌ను పంపించదు.

శాస్త్రవేత్తలు ప్రస్తుతం దానితో వీలయినంత వరకు పని చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు హీటర్‌లను ఆపేసి, ఇప్పటి వరకు ఈ క్రాఫ్ట్ తీసిన ఫోటోలను కూడా భూమికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ల్యాండింగ్‌కు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ ఏ మేరకు పని చేసిందో తెలుసుకునేందుకు డేటాను కూడా సేకరిస్తున్నారు.

ఒకవేళ ‘స్లిమ్’ పని చేయడం మానేసినా, దానిని అంతటితో వదిలేయరాదన్నది జపాన్ శాస్త్రవేత్తల ఉద్దేశం.

సూర్యకాంతి పడకుండా ఏర్పడిన అడ్డంకుల నుంచి సౌర పలకాలు ఏదో విధంగా పక్కకు వచ్చే అవకాశాలు ఉన్నాయనీ, చంద్రుడి మీద పడే సూర్య కిరణాల కోణం మారే అవకాశం ఉంటుంది కాబట్టి, ‘స్లిమ్’ ఎప్పటికైనా తిరిగి పని చేయగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

జపాన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపైకి ‘స్లిమ్’ సురక్షితంగా దిగడంతో జపాన్ ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.

సేఫ్ ల్యాండింగ్ అయినట్లేనా?

ఈ మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యిందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చారు జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) వైస్ ప్రెసిడెంట్ హితోషి కునినాక.

అలా జరిగి ఉండకపోతే మిషన్ చంద్రుడి ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టి ఉండేదని, అలాంటి పరిస్థితిల్లో అది పని చేయకుండా పోయే ప్రమాదం ఏర్పడేదని ఆయన చెప్పారు.

‘‘ప్రస్తుతం మిషన్ మాకు డేటా పంపుతోంది. సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రయత్నాలు విజయవంతమయ్యాయి’’ అని ఆయన చెప్పారు.

స్లిమ్ మిషన్ రెండు చిన్న రోవర్‌లను తీసుకెళ్లింది. అది ఉపరితలాన్ని తాకడానికి ముందే వాటిని బయటకు వచ్చినట్లు టెలీమెట్రీ ద్వారా తమకు తెలిసినట్లు హితోషి చెప్పారు.

ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను మోసుకెళ్లిన ఈ క్రాఫ్ట్ రాబోయే 15 రోజుల్లో అక్కడి నేలను అధ్యయనం చేయవలసి ఉంది. అయితే, బ్యాటరీలు పని చేసినంత కాలంలోనే దీనిని ఎంత వరకు సాధించగలరనేదానిపై అస్పష్టత ఏర్పడింది.

రోవర్లు

ఫొటో సోర్స్, JAXA

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపై హోపర్, రోలింగ్ (బంతి ఆకారంలోని) రోవర్లు

చంద్రుడి మీద దిగడం అంత కష్టమా?

ఇప్పటి వరకు ఉన్న గణాంకాలనుబట్టి చూస్తే చంద్రుడి మీద దిగడం చాలా కష్టమైన పని. చాలా ప్రయత్నాలు జరిగినా, అందులో సగం మాత్రమే సక్సెస్ అయ్యాయి.

అయితే, కొత్త నావిగేషన్ టెక్నాలజీపై జాక్సా నమ్మకం పెట్టుకుంది. ల్యాండర్‌లోని ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ‘స్లిమ్’ మిషన్ చంద్రుడి ఉపరితలం మీద దిగడానికి అనువైన పరిస్థితులను తెలుసుకోవడంలో, ప్రమాదాలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించింది.

తాము లక్ష్యంగా పెట్టుకున్న ల్యాండింగ్ ప్రాంతానికి కనీసం 100 మీటర్ల సమీపానికి చేరుకోవాలని శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే, దానిని సాధించగలిగామా లేదా అన్నది స్లిమ్ పంపించే డేటాను బట్టి తెలుస్తుంది. ఇప్పటి వరకు అందులో ఉపయోగించిన అన్ని టెక్నాలజీలు సవ్యంగానే పని చేసినట్లు వారు అంచనాకు వచ్చారు.

‘‘అందిన డేటాను పరిశీలిస్తే, ‘స్లిమ్’ మిషన్ మేం గుర్తించిన పిన్ పాయింట్‌కు 100 మీటర్ల లోపలే ల్యాండింగ్‌ అయ్యిందని భావిస్తున్నాం. ఈ డేటాను పూర్తిగా విశ్లేషించడానికి ఒక నెల సమయం పడుతుంది" అని హితోషి చెప్పారు.

షియోలీ అనే బిలం సమీపంలో మిషన్ ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ సూర్యకాంతి సమృద్ధిగా ఉంది. అయితే, చంద్రుడి మీద రాత్రి ఈ నెలఖారుకు వస్తుంది. అప్పుడు ఉండే ఉష్ణోగ్రతలు మిషన్‌లో ఉండే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్‌లను దెబ్బతీయగల స్థాయికి పడిపోతాయి.

మూన్ మిషన్

ఫొటో సోర్స్, NASA/LRO

ఫొటో క్యాప్షన్, షియోలీ బిలం

చంద్రుడి మీదకు మనుషులను పంపే మిషన్

జాక్సా గతంలో రెండుసార్లు గ్రహశకలాలపై రోబోలను ల్యాండ్ చేసింది, కాబట్టి చంద్రునిపై దిగడమనేది జపాన్‌కు మరో విజయవంతమైన ప్రయోగం. ఇది అమెరికా స్పేస్ ఏజెన్సీ (నాసా)కి సంబంధించిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లలో కీలక భూమిక పోషిస్తోంది. 50 ఏళ్ల అనంతరం చంద్రుడి మీదకు మనుషులను పంపే ప్రయత్నాల్లో భాగమది.

గత సంవత్సరం ఐ స్పేస్ అనే ఒక ప్రైవేట్ జపనీస్ కంపెనీ ల్యాండింగ్‌‌కు ప్రయత్నించింది.

ఆన్‌బోర్డ్ కంప్యూటర్ చంద్రుడి ఎత్తు గురించి గందరగోళానికి గురవడంతో హకుటో-ఆర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది.

అమెరికన్ ప్రైవేట్ కంపెనీ అయిన ఆస్ట్రోబోటిక్ తయారు చేసిన పెరెగ్రైన్ ల్యాండింగ్ క్రాఫ్ట్‌ గతవారం చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి, విఫలమైంది.

క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్ లోపం కారణంగా దాని ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో ఈనెల 18న దానిని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేశారు.

పెరెగ్రైన్‌ కోసం యూకే ఓపెన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సిమియన్ బార్బర్ పనిచేశారు. జపాన్ ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.

"ఖచ్చితమైన ల్యాండింగ్ జరిగింది. ఇది చాలా పెద్ద విజయం. నేనే వారి స్థానంలో ఉంటే నిజంగా సంతోషిస్తాను" అని ఆయన బీబీసీతో చెప్పారు.

" అనేక సంస్థలు మూన్ మిషన్లను పంపే ప్రయత్నాల్లో ఉన్నాయి. మనం ఆ యుగంలో ఉన్నాం. ఈ ప్రయత్నాలలోవారికి అందిన డేటానంతా క్రోడీకరిస్తే, ఇప్పుడు సక్సెస్ అయినా, కాకపోయినా భవిష్యత్తులో మిషన్లను మరింత విజయవంతంగా ఎలా పంపాలో నేర్చుకుంటాం" అని సిమియన్ బార్బర్ అన్నారు.

ఈ విజయం జపాన్‌కు ఎంతో కీలకమని స్పేస్‌వాచ్ గ్లోబల్‌ డిజిటల్ మ్యాగజైన్‌కు చెందిన డాక్టర్ ఎమ్మా అన్నారు.

"ఇది వారికి చరిత్రాత్మకం. ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఒక దేశంగా జపాన్‌కు, వారి కృషికి ఇది ఒక మంచి ఫలితం. చైనా, అమెరికా వంటి పెద్ధ దేశం కాకున్నా, తామూ ఈ పని చేయగలమని రుజువు చేసుకున్నారు" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, 2023 ఇస్రోకు ఎందుకు అంత సక్సెస్ ఫుల్ ఇయర్‌గా నిలిచింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)