అయోధ్య: రామమందిరం ప్రాణప్రతిష్ఠపై అక్కడి ముస్లింలు ఏమంటున్నారు?

- రచయిత, నితిన్ శ్రీవాత్సవ
- హోదా, బీబీసీ కరస్పాండెంట్, అయోధ్య
జనవరి 22వ తేదీన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న రామమందిర కమిటీ 4000 మందికి ఆహ్వానం పంపింది. ఏడువేల మంది సాధువులు, పండితులు హాజరుకానున్నారు.
అదే సమయంలో, 70 ఎకరాల విస్తీర్ణమున్న రామ మందిర ప్రాంగణం వెనుక ఓ ప్రాంతముంది. ఆ ప్రాంతం పేరు కట్రా. అక్కడున్న ఓ చిన్న ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.
రామమందిర ప్రాణప్రతిష్ఠ దగ్గర పడుతుండటంతో ఆ కుటుంబం రాత్రీపగలూ తేడా లేకుండా కష్టపడుతోంది.
ఆ ఇంట్లో తరతరాలుగా స్వీట్ బాక్సుల తయారీ కొనసాగుతోంది. అక్కడ తయారైన బాక్సులను రామమందిర ప్రాంగణం చుట్టూ ఉన్న మిఠాయి దుకాణాలకు సరఫరా చేస్తారు. భక్తులు రాముడికి సమర్పించే మిఠాయిలు ఆ బాక్సుల్లోనే ఆలయానికి చేరతాయి.
స్వీట్ బాక్సుల వ్యాపారం నిర్వహిస్తున్న ఫూల్ జహాన్ 31 ఏళ్ల క్రితం అక్కడ జరిగిన అల్లర్లలో తండ్రిని కోల్పోయారు.

ఫూల్ జహాన్‌కు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు ఆగ్రహంతో ఉన్న ఓ మూక వారి ఇంటిపై దాడి చేసి, ఫూల్ జహాన్ తండ్రి ఫతే మొహమ్మద్‌ను హత్యచేశారు.
ఆ ఘటనను గుర్తుచేసుకుని ఫూల్ జహాన్ భావోద్వేగానికి గురయ్యారు.
“నా తండ్రి చాలా సాధారణమైన వ్యక్తి. ఎలాంటి ఆర్భాటాలకు పోరు. దుకాణాలకు పంపిణీ చేయడానికి కోసం స్వీట్ బాక్సులను తయారుచేసేవారు. ఆయన హత్యకు గురైన దగ్గరి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. మేం పెద్ద దిక్కును కోల్పోయాం” అన్నారు.
“ఇప్పుడు మేం అయోధ్యలోనే ఎలాంటి సమస్యలూ లేకుండా జీవిస్తున్నాం. చాలా పెద్ద మైలురాయిని దాటుతున్నాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. అయోధ్యలో ఏమైనా జరుగుతుందేమో అనే భయం ఉండేది. ఇప్పుడు మాత్రం అంతా బాగానే ఉంది. ఏ సమస్యా లేదు” అన్నారు.

ఫొటో సోర్స్, అయోధ్య కేసు
ఫూల్ జహాన్ ఇంటికి యాభై మీటర్ల దూరంలో హఫీజ్ ఉర్ రెహ్మాన్ నివాసం ఉంది. 31 ఏళ్ల క్రితం అయోధ్యలో జరిగిన అల్లర్లలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ హిందూ కుటుంబం ఇంట్లో ఆశ్రయం పొందారు హఫీజ్.
అల్లర్లలో హఫీజ్ తన సోదరుడిని, బంధువునూ కోల్పోయారు. ఆయన మాట్లాడుతూ, “ఆ ఘటన తర్వాత నుంచి ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది. కానీ, అయోధ్యలో పెద్ద కార్యక్రమం ఉందని, లక్షలాది జనం ఇతర ప్రాంతాల నుంచి వస్తారని తెలిసినప్పుడు మాకు భయం భయంగా ఉంటుంది. అందరూ ప్రశాంతంగానే ఉంటారని మాత్రం ఆశ ఉంది“ అన్నారు.
16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినప్పటి నుంచి శతాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది.
1992లో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ ఘటనతో దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. అయోధ్యతోసహా ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో రెండు వేల మంది చనిపోయారు.

న్యాయ పోరాటం
ఈ వివాదంపై సుదీర్ఘమైన న్యాయ పోరాటం నడిచింది. తొలుత అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీం కోర్టులోనూ కేసు నడిచింది. హిందువులు, ముస్లిం పక్షాలు తమ తమ వాదనలు వినిపించాయి.
బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో రామ మందిరం ఉండేదని హిందువులు వాదించారు.
చివరికి, 2019లో సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసులో తీర్పునిచ్చింది.
“బాబ్రీ మసీదు కూల్చివేత చట్టవిరుద్ధం” అని చెప్పింది. ఆ వివాద స్థలంలో రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చని తీర్పు ఇచ్చింది.
కోర్టు ఆదేశాలను అనుసరించి, అయోధ్యకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్‌లో నూతన మసీదు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
రామమందిర ప్రాంగణం చుట్టూ డజనుకు పైగా మసీదులు, మదర్సాలు, సమాధులు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రార్థనలు జరుగుతున్నాయి.
రామ మందిర ప్రాంగణం పరిసరాల్లో ఉన్న వాటిలో తహరీబజార్ జోగి కి మసీదు, ఖాన్‌ఖాహె ముజఫ్ఫరియా, దొరాహీ కువా మసీదు, కజియానా మసీదు, బదర్ పంజీటోలా మసీదు, మదార్ షాహ్ మసీదు, ఇమామ్‌బారా మసీదులు ప్రముఖమైనవి.
అయోధ్యలో ముస్లింలు ఎంతమంది?
అయోధ్య జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉంటే, వారిలో ముస్లింలు ఐదు లక్షల వరకూ ఉన్నారు. కొత్తగా నిర్మితమైన రామాలయం పరిసరాల్లో నివసించేవారు ఐదువేల దాకాఉన్నారు.
రామ మందిర ప్రాణప్రతిష్ఠ పూర్తయితే, నెలకు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
అయితే, మైనారిటీ వర్గాల్లో గతంలో జరిగిన నష్టం తాలూకూ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
అయోధ్యకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఫజియాబాద్‌లో మహమ్మద్ ఖలీద్ కుటుంబం తరాలుగా నివాసముంటోంది.
ఆయన మాట్లాడుతూ, “వారం, పదిరోజుల క్రితం అయోధ్య నుంచి తాత్షా మసీదుకు కొంతమంది వచ్చారు.
అయోధ్యలో పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారని, తాము అక్కడ ఉండలేమని, ఇళ్లు వదిలి వచ్చినట్లు చెప్పారు. మసీదు పెద్దలు వారికి నచ్చజెప్పారు. అలా ఇళ్లు వదిలి రావడం సరికాదని, స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. అనంతరం కొంతమంది పోలీసులు వారిని అడ్డుకుని, రక్షణ కల్పిస్తామని, అయోధ్యను వదిలి వెళ్లొద్దని వారికి నచ్చజెప్పారు” అని వివరించారు.
“ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో కొన్ని ముస్లిం కుటుంబాలు అయోధ్యను వదిలి వెళ్తున్నారు” అని వార్తలు వచ్చాయి..
అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నొక్కిచెప్పాయి.

బీజేపీ ఎంపీ ఏమన్నారు?
“మైనారిటీ కమ్యూనిటీ వారు ఏ ఒక్కరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరికీ భద్రత కల్పిస్తాం” అన్నారు అయోధ్య ఎంపీ, బీజేపీ నాయకులు లల్లూ సింగ్.
అయోధ్యలోని ఇతర ప్రజల మాదిరిగానే మైనారిటీ ప్రజలూ నివసిస్తున్నారని, పరస్పర సోదర భావం కొనసాగుతుందని అన్నారు.
“మన ప్రధాని చేసే అభివృద్ధి పనులు అందరి కోసం. ఫలానా మతానికి ఎక్కువ లబ్ధి కలిగిందని, ఫలానా మతానికి తక్కువ లబ్ధి కలిగిందని ఎవరూ చెప్పలేరు. అందరూ భారతీయులే. ఎవరినీ దూరం పెట్టమని మా పార్టీ మాకు చెప్పలేదు” అన్నారు.
కొంతకాలం క్రితం రామ మందిరానికి సమీపంలో ఉన్న ఓ మదర్సాకు బీబీసీ బృందం వెళ్లింది. ఆ సమయంలో మదర్సా హజీ హఫీజ్ సయ్యద్ ఎఖ్లాక్ మాట్లాడుతూ, “ఆ ప్రాంగణం చుట్టూ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన భూములు ఉన్నాయి. కానీ వారు ఎంతకాలంపాటు అక్కడ ఉండగలమో అనే సంగ్ధిగ్ధంలో ఉన్నారు” అని చెప్పారు.
గురువారం మేం ఆయన్ను కలిసేందుకు వెళ్లిన సమయంలో, ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. గేటు వద్ద ఉన్న ఉద్యోగి, “హజీ సాహెబ్ మీడియాతో మాట్లాడరు” అని చెప్పారు.

గంగా- జమునా సంస్కృతి
అయోధ్యలోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మొహమ్మద్ ఆజాం ఖాద్రితో మాట్లాడిన సందర్భంలో, అయోధ్యలోని మైనార్టీలు తమ అభిప్రాయాలకు ఎక్కువగా విలువివ్వలేదని అనుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఆయన మాట్లాడుతూ, “ఒకవేళ మా ప్రార్థనా మందిరాలను కూడా బాగు చేసుంటే, మేమూ చాలా సంతోషపడేవాళ్లం. గంగా-జమునా సంస్కృతిని ప్రతిబింబిస్తోందని, ప్రధాని అన్ని వర్గాలకు చెందిన వారని అంగీకరించేవాళ్లం” అన్నారు.
“ఇక్కడి కమ్యూనిటీ ఎలాంటి రాజకీయాల్లో పాల్గొనేందుకు ఇష్టపడదు. ఏ విధంగానూ రాజకీయాల్లోనూ భాగం కావాలని కోరుకోదు. ఎందుకంటే, వీటిల్లో ఏదైనా సరే, హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు దారి తీయడమో లేదంటే, మాపై రాజకీయాలకు ఆస్కారమో ఇవొచ్చు. అందరూ సురక్షితంగా ఉండాలి. ఇక్కడి ప్రజలు కోరుకునేది కూడా ఇదే” అన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ జరిగాక, రామాలయ నిర్మాణం పూర్తవడానికి రెండేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అయోధ్యలోని షియా వక్ఫ్ కమిటీ అధ్యక్షులు, చౌక్ ఇమామ్‌బరా సమీపంలో నివసించే హమీద్ జాఫర్ మీసమ్ మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చాక ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణం చేపడుతున్నారు. ముస్లింలకు దీనిపై ఎలాంటి అభ్యంతరమూ లేదు” అన్నారు.
“కానీ, కొంతమంది మీడియావారు జనవరి 22వ తేదీన మీరేం చేస్తారు? అని ముస్లింలను అడుగుతున్నారు. అది సరికాదు. వారందరికీ ఇదే చెప్తున్నాను. 21వ తేదీన మేమేం చేస్తామో అదే పని 22వ తేదీన కూడా చేస్తాం” అన్నారు.
ఇవి కూడా చదవండి..
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- మనుషులు పాలు, కూరగాయలు కూడా అరిగించుకోలేని రోజులవి.. 5 వేల సంవత్సరాల కిందట ఏం జరిగింది
- చంద్రుడి వద్దకు వెళ్ళిన 24 మంది వ్యోమగాముల్లో సజీవంగా ఉన్న 8 మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- మకరజ్యోతి నిజమా, కల్పితమా? ట్రావెన్కోర్ దేవాస్వాం బోర్డు ఏం చెప్పింది?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















