అయోధ్య రూపురేఖలు ఎలా మారిపోయాయి?

అయోధ్యలో స్ట్రీట్‌ఫుడ్ తింటున్న ఒక మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయోధ్యలో స్ట్రీట్‌ఫుడ్ తింటున్న మహిళ
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో, అయోధ్యలో విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి.

ఎక్కడ చూసినా దుకాణాలపై ‘జై శ్రీరాం’ అని రాసి ఉంది. రాముని కీర్తనలు, భజనలు వినిపిస్తున్నాయి.

పెద్ద ఎత్తున తరలివస్తున్న జనాలతో అయోధ్య సందడిగా కనిపిస్తోంది.

నగరంలో భద్రతా బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు.

మరోవైపు ఇప్పుడిప్పుడే విస్తరణ పూర్తి చేసుకుంటున్న కొన్ని దారులు, విస్తరణలో తొలగించిన దుకాణాలు దర్శనమిస్తున్నాయి.

స్థానికులతో మాట్లాడుతున్నప్పుడు గతంతో పోలిస్తే అయోధ్య రూపురేఖలు చాలా మారిపోయాయని చెబుతున్నారు.

విశాలమైన రహదారులు, అత్యాధునిక సౌకర్యాలు గల రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటితో అయోధ్య కొత్తగా కనిపిస్తోంది.

హనుమంతుడి చిత్రాలు, స్వస్తిక్, నామాలు.. ఇలా వివిధ బొమ్మలు షట్టర్లపై వేసి ఉన్నాయి.

అయోధ్య వీధులు

ఫొటో సోర్స్, Getty Images

విశాలమవుతున్న దారులు

2011 జనాభా లెక్కల ప్రకారం అయోధ్య జిల్లా జనాభా 24.70 లక్షలు.

ప్రస్తుతం 30 లక్షలకు చేరుకుందని అంచనా. రామమందిర నిర్మాణంతో అయోధ్యకు నెలకు 25-30 లక్షల మంది వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు, సందర్శకులు రావాలంటే రోడ్లు, రవాణా వంటి మౌలిక సౌకర్యాలు బాగా ఉండాలి.

ఇందులో భాగంగా రోడ్లను నాలుగు వరుసలుగా వెడల్పు చేస్తున్నారు.

ముఖ్యంగా కొత్తగా కట్టిన గుడికి వెళ్లే దారులన్నింటిని భారీగా విస్తరిస్తున్నారు.

చాలావరకు దుకాణాలను కూలగొట్టారు. 8-10 నెలల సమయంలోనే అయోధ్యలో రహదారులను విస్తరించారు.

వీటిల్లో కొన్ని రహదారుల విస్తరణ పూర్తికాగా మరికొన్నింటి పనులు జరుగుతున్నాయి.

‘‘గతంలో రహదారులన్నీ చాలా ఇరుకుగా ఉండేవి. ఒకే వరుసలో ఉండేవి. ఇప్పుడు రామ మందిరానికి వెళ్లే దారులు విశాలంగా మారాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేవు’’ అని క్యాబ్ డ్రైవర్ అంకిత్ వర్మ అన్నారు.

అయోధ్యలో యాక్టర్ సుమన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయోధ్యలో నటుడు సుమన్

నాలుగు ప్రధాన రహదారులు

విస్తరిస్తున్న ఈ రోడ్డు మార్గాలకు ‘‘రామ్ పథ్, భక్తి పథ్, ధర్మ పథ్, రామజన్మభూమి పథ్..’’ ఇలా వివి‌ధ పేర్లను పెట్టారు.

వీటిల్లో అతిపెద్దది ‘‘రామ్ పథ్’’. సహదాత్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు 13 కిలోమీటర్ల మేర దీని విస్తరణ జరుగుతోంది. ఈ మార్గం కోసం సుమారు 500 దుకాణాలను తొలగింపు లేదా పాక్షికంగా కూలగొట్టామని అధికారులు చెబుతున్నారు.

మరో మార్గం ‘‘రామ జన్మభూమి పథ్’’. సుగ్రీవ్ కీలా నుంచి రామమందిరం వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఇక శృంగార్ హాట్ నుంచి రామ జన్మభూమి వరకు దాదాపు 750 మీటర్ల మేర ‘‘భక్తి పథ్‌’’ను నిర్మిస్తున్నారు.

మరో మార్గం ధర్మపథ్. లతా మంగేష్కర్ చౌక్ నుంచి లఖ్‌నవూ గోరఖ్‌పూర్ హైవే మీదుగా వేస్తున్నారు.

అంతేకాకుండా రూ.200 కోట్లతో 12 కిలోమీటర్ల పొడవైన ‘‘లక్ష్మణ్ పథ్’’ను నిర్మిస్తున్నారు. ఇది గుప్తార్ ఘాట్ నుంచి రాజ్ ఘాట్ వరకు ఉంటుంది.

రహదారుల విస్తరణ ప్రాజెక్టులో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు మళ్లీ డబ్బులు పెట్టి గోడలు కట్టించుకుంటున్నారు. షట్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

దాదాపు రూ. 31 వేల కోట్లతో అయోధ్య పునర్నిర్మాణం జరుగుతోందని ప్రభుత్వం ప్రకటిస్తోంది.

దీనికి సంబంధించి అయోధ్యలో పెద్ద సంఖ్యలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

అయోధ్యలో హోటళ్ల సంఖ్య పెరుగుతోంది. ఎన్నో హోటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా పనులు పూర్తి కాకపోయినా రూమ్‌లు బుక్ అయిపోతున్నాయి.

రానున్నరోజుల్లో అయోధ్య ఎలా ఉండనుందో దేశానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా అది ఏ మేరకు లాభం చేకూర్చనుందో ఈ తీరు ద్వారా ఊహించుకోవచ్చు.

అందుకు అనుగుణంగానే కేంద్రం ఇక్కడ వేల కోట్ల రూపాయలతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది.

వీడియో క్యాప్షన్, అయోధ్య రామాలయం: నగరం రూపురేఖలు ఎలా మారిపోయాయి?

విద్యుత్ దీపాలు, పూలతో మెరిసిపోతూ..

అయోధ్యలోని రామమందిరం లోపలికి ప్రస్తుతం ఎవరినీ అనుమతించడం లేదు.

‘‘రామ్ పథ్, భక్తిపథ్, జన్మభూమి పథ్’’ మార్గాల్లో వెళ్లే వారిని ప్రధాన రహదారుల గేట్ల వద్ద నిలిపివేస్తున్నారు. వీఐపీ పాసులున్న కొంతమందిని మాత్రమే గుడి వరకు అనుమతిస్తున్నారు.

ప్రస్తుతం గుడి కింది అంతస్తు.. అంటే ఎక్కడైతే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారో అక్కడి వరకు పూర్తయిందని ట్రస్టు చెబుతోంది. అదే సమయంలో మిగిలిన పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం నిర్మాణ పనులన్నింటినీ నిలిపివేశారు. గుడిని విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రి‌‍ళ్లు బంగారు వర్ణంలో గుడి వెలుగులీనుతోంది. బయట గేటు వద్ద పూలతో అలంకరించారు.

ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లే దారిలో పది అడుగుల ఎత్తు వరకు పూలతో అలంకరిస్తున్నారు. రాముడు, విల్లు చిత్రాలతోపాటు ‘‘జైశ్రీరాం’’ అనే పేరు కూడా పూలతో తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రధాన రహదారిలోనూ ఫుట్‌పాత్ పక్కన బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి ప్రధాని మోదీ, రాముడి ఆలయానికి రానున్నారు. దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంటుందీ మార్గం.

తాజాగా ఈ మార్గమంతా కూడా బంతిపూలతో అలంకరించారు. రెండు రోజుల ముందు నుంచే ఈ పనులు చేపట్టారు.

అయోధ్య

మోదీ, యోగి ఫ్లెక్సీలు

అయోధ్యలోనూ ఆ ప్రాంతానికి వచ్చే దారుల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల భారీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.

అయోధ్యలోనే కాకుండా ఫైజాబాద్‌లోని కొన్ని ఇళ్లు, భవనాలపై కాషాయ జెండాలు ఎగురవేశారు. ఈ పరిస్థితి అయోధ్యకే పరిమితం కాలేదు.

అయోధ్యకు దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది కోట్ సరయ్ అనే ఊరు.

ఫైజాబాద్ హైవే పక్కన ఉన్న ఈ ఊరిలో ఇళ్లు, భవనాలపై కాషాయ జెండాలు ఎగురుతూ కనిపిస్తున్నాయి.

అయోధ్య
ఫొటో క్యాప్షన్, అయోధ్య

మినీ నగరంగా తీర్థ క్షేత్రపురం..

అయోధ్యలో తీర్థ క్షేత్ర పురం అనేది ఇప్పుడొక మినీ నగరం. విశ్వహిందూ పరిషత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో మణిపర్వత్ ప్రాంతంలో తాత్కాలికంగా దీన్ని నిర్మించారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే సాధువులు, వారి సహాయకులు, సెక్యురిటీ సిబ్బంది కోసం మాత్రమే ఇక్కడ వసతి కల్పిస్తున్నారు. ఇక్కడ గేటు వద్ద ప్రత్యేకంగా బారీకేడ్లు పెట్టారు. పాస్ లు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్నారు. లేకపోతే గేటు వద్దనే వీహెచ్‌పీ కార్యకర్తలు నిలిపివేస్తున్నారు. పోలీసులతోపాటు వీహెచ్‌పీ కార్యకర్తలు భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు.

‘‘మొత్తం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 8 వేల మందికి ట్రస్టు తరఫున ఆహ్వానాలు పంపించారు. వారిలో 4 వేల మంది సాధువులు ఉన్నారు. మరో రెండు, మూడువేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తీర్థ క్షేత్రపురం అనేది పూర్తిగా సాధువులు ఉండేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిటీ’’ అని విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ బీబీసీకి చెప్పారు.

ఈ తీర్థ క్షేత్ర పురంలో రేకులతో టెంట్ల తరహాలో నిర్మాణాలు కనిపిస్తాయి. 45 ఎకరాల్లో ఉన్న తాత్కాలిక నిర్మాణాలివి. మొత్తం 14,500 మూడు పడకల గదులు, మరో 500 ఇతర పడకల గదులు ఏర్పాటు చేశారు. ఈ పురాన్ని ఆరు నగరాలుగా విభజించారు. ప్రతి నగరంలో రూములు వేర్వురుగా ఉంటాయి.ఇందులో రెండు, మూడు మంచాలు వేసి ఉన్నాయి. సాదువులు ఉండేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లున్నాయి.

ప్రతి నగరంలో ప్రత్యేకంగా భోజనశాలలు ఉన్నాయి.

ఇక్కడి మూడో నగరంలో తెలంగాణలోని సిద్ధిపేట నుంచి వచ్చిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్వర్యంలో మూడు పూటల టిఫిన్లు, భోజనాలు వడ్డిస్తున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా నెల రోజులపాటు ఈ నిర్మాణాలు కొనసాగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది ‌‍భక్తులు బీబీసీతో మాట్లాడారు.

మిర్యాలగూడకు చెందిన ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ఆరు రోజులపాటు ఉండేందుకు వచ్చాం. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయ్యాక దర్శనం చేసుకుని వెళ్లాలని అనుకుంటున్నాం.’’ అని చెప్పారు.

అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉండేందుకు వీలుగా ట్రస్టు తరఫున హోటళ్లు, గెస్ట్ హౌస్ లు వంటివి సిద్ధం చేసి ఉంచారు.

అయోధ్య

ఫొటో సోర్స్, Getty Images

పొడవైన సోలార్ మార్గంతో ఆహ్వానం

అయోధ్య చుట్టుపక్కల కూడా అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

నగరానికి వచ్చే ఫైజాబాద్ హైవేలో ఉన్నలతా మంగేష్కర్ చౌరస్తాను పూర్తిగా ఆధునికీకరించారు.

ఇప్పుడు అదొక సెల్ఫీ స్పాట్ గా కూడా మారింది. అయోధ్యకు వస్తున్న వారు ముందుగా అక్కడ దిగి, ఫొటోలు తీసుకోవడం కనిపిస్తుంది. ఇప్పుడా చౌరస్తా సందడిగా ఉంటోంది.

ఇక్కడ నుంచి అయోధ్య నగరంలోకి చేరుకునే దారిలో పెద్దసంఖ్యలో సొలార్ దీపాలు ఏర్పాటు చేశారు.

10.2 కిలోమీటర్ల పొడవైన దారిలో 470 సొలార్ దీపాలను ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది.

ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సొలార్ దీపాల మార్గంగా ప్రభుత్వం చెబుతోంది.

ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని మల్హంలో 9.7 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 468 సొలార్ దీపాలు ఉన్న మార్గం అతిపెద్దదిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది.

ఇప్పుడు దాని కంటే పొడవైన మార్గాన్ని అయో‌‍ధ్యలో ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్ర‌‍‌భుత్వం చెబుతోంది.

అయోధ్య వీధులు

ఫొటో సోర్స్, Getty Images

అయోధ్యలో కనిపించిన మరో మార్పు ఎలక్ట్రిక్ బస్సులు.

అయోధ్య వీధుల్లో పరుగులు పెడుతున్నాయి. ఆకారంలో చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ వీధులు చిన్నవిగా ఉన్నందున బస్సులు కూడా చిన్న సైజువి ప్రవేశపెట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే.. వంద ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

అలాగే మరో 25 ఇ-ఆటోలను కొత్తగా అనుమతించారు.

బస్సుల్లో దూరాన్ని బట్టి రూ.10 నుంచి టికెట్ ఉంటోంది. దాదాపు అన్ని బస్సులు కూడా రామ మందిరం నుంచి వెళ్లేలా తిప్పుతున్నారు.

అయోధ్యకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో నిండి కనిపిస్తున్నాయి. అక్కడ బ్యాటరీతో నడిచే బైక్ ట్యాక్సీలు కూడా తిరుగుతున్నాయి.

‘‘మందిర నిర్మాణం మొదలయ్యాక భక్తుల రాక పెరిగింది. దాన్ని చూసేందుకు వచ్చేవారు ఎక్కువయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది.

గతంలో బైకు ట్యాక్సీ నడుపుతూ నేను రోజుకు రూ.1,000-1,500 సంపాదించేవాడిని. ఇప్పుడు నా సంపాదన రూ.3,000కు పెరిగింది’’ అని అదిత్ సింగ్ అనే డ్రైవర్ బీబీసీకి చెప్పారు.

జై శ్రీరామ్ అని నుదుటిపై రాసుకున్న బాలిక

ఫొటో సోర్స్, Getty Images

స్టేషన్, ఎయిర్ పోర్టు అందంగా ముస్తాబు

అయోధ్యకు రైళ్లలో ఎక్కువగా మంది వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా

రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించినట్లుగా రైల్వే శాఖ చెబుతోంది. గత డిసెంబరులో మోదీ ప్రారంభించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడే నిర్మాణ పనుల్లో ఉన్న దాదాపు వంద మీటర్ల ఎత్తున ఒక క్రేనుపై రాముడి చిత్రపటంతో ఉన్న కాషాయ జెండా ఎగురుతూ కనిపించింది.

మొదటి దశ కోసం రూ.240 కోట్లు వెచ్చించారు. ముందు భాగంలో సూర్యచక్రం ఏర్పాటు చేసి ఒక మందిరం తరహాలో రైల్వేస్టేషన్ ను పునర్మించారు.

రాత్రిళ్లు ఫోకస్ లైట్లు పెడుతుండటంతో రైల్వేస్టేషన్ వెలిగిపోతోంది.

నిత్యం 50వేల మంది ప్రయాణికులు వచ్చినా సరిపడే విధంగా అయోధ్య స్టేషన్ ను తీర్చిదిద్దుతున్నారు.

అయోధ్యలోని విమానాశ్రయం మొదటి దశను రూ.1,450 కోట్లతో ఏటా పది లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా తీర్చిదిద్దారు. అయోధ్య రామ మందిరాన్నితలపించేలా విమానాశ్రయాన్ని పునరుద్ధరించారు.

‘‘ఓన్లీ వెజ్ మాత్రమే’’

అయోధ్యకు సంబంధించి కనిపిస్తున్న మరొక స్పష్టమైన మార్పు ‘ఆహారపు అలవాట్లు’.

చాలా హోటళ్లు నాన్-వెజ్‌ వంటకాలను తీసేసి పూర్తిగా శాకాహార వంటకాలను వడ్డిస్తున్నాయి.

‘‘ఇంతకుముందు మా హోటల్‌లో వెజ్, నాన్-వెజ్ రెండూ ఉండేవి. అయోధ్య వెళ్లే వారు నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే మా హోటల్‌ను పూర్తిగా వెజిటేరియన్‌గా మార్చాల్సి వచ్చింది’’ అని అలాపూర్‌కు చెందిన ఏకే సింగ్ బీబీసీతో అన్నారు

అయోధ్యలో భద్రతా బలగాలు
ఫొటో క్యాప్షన్, అయోధ్యలో భద్రతా బలగాలు

యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్

అయోధ్యలో ఎక్కడ చూసినా పోలీసుల పహారా కనిపిస్తోంది.

అడుగడుగునా సాయుధ పోలీసులు కనిపిస్తున్నారు. వీరి కోసం రహదారుల పక్కన ఫుట్‌పాత్‌పై చిన్నగా టెంట్లు కూడా వెలి‌‍శాయి.

ఫైజాబాద్ నుంచి అయోధ్యకు వచ్చే ప్రధాన రహదారిలో ప్రవేశం వద్ద బారికేడ్లు కనిపిస్తున్నాయి. వాటిని ఏర్పాటు చేసి పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు.

అయోధ్యలోనూ రామ మందిరానికి వెళ్లే ప్రధాన రహదారుల్లోనూ పాస్ ఉన్న వాహనాలకే అనుమతి ఉంటోంది.

ఈ కారణంగా స్థానిక ప్రజలు వేర్వేరు దారులన్నీ తిరిగి తాము వెళ్లాల్సిన చోటకు చేరుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే 30 వేల మంది పోలీసులను అయోధ్యలో భద్రతకు వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.

10వేల సీసీ కెమెరాలు అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య దారుల్లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) కమాండోలు కవాతు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)