బలూచిస్తాన్: పాకిస్తాన్, ఇరాన్‌లకు టార్గెట్‌గా మారిన ఈ ప్రాంతం ఎక్కడుంది? దీని చరిత్ర ఏమిటి

బలూచిస్తాన్‌లో దాడులు

ఫొటో సోర్స్, FAYYAZ AHMED/EPA-EFE/REX/SHUTTERSTOCK

    • రచయిత, ఫర్హత్ జావెద్
    • హోదా, బీబీసీ ఉర్దూ, బలూచిస్తాన్

పాకిస్తాన్‌లోనే అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పుష్కలమైన వనరులు ఉన్న ప్రాంతమే అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు.

బలూచిస్తాన్‌ అనే పేరును పాకిస్తాన్‌లోని రాష్ట్రానికే కాకుండా పొరుగునే ఇరాన్, అఫ్గానిస్తాన్‌లోనూ ఉన్న కొంత భూభాగాలతో కలిపి ఉన్న ప్రాంతం మొత్తాన్నీ సూచించడానికీ వాడుతుంటారు.

గతవారం ఇరాన్, పాకిస్తాన్‌ దేశాలు పరస్పరం క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఇరుదేశాల సరిహద్దుల్లోని మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించాయి.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు బలూచిస్తాన్ చరిత్ర ఏంటి? ఎక్కడుంది? అక్కడి సంస్కృతి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇరాన్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌ దేశం పాకిస్తాన్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.

బలూచిస్తాన్ ఎక్కడుంది?

బలూచిస్తాన్‌లోని ఎక్కువ భాగం నైరుతి పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% పైగా ఉన్నప్పటికీ, 241 మిలియన్ల మంది జనాభాలో కేవలం 6 శాతం మందికి మాత్రమే నివాసాన్ని కల్పిస్తోంది.

తిరుగుబాటు, తీవ్రవాదం, మానవహక్కుల ఉల్లంఘనలు వంటివి బలూచిస్తాన్ చరిత్రలో ఇమిడి ఉన్నాయి.

పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం, ఇరాన్, తాలిబాన్ పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లతో సరిహద్దులను కలిగి ఉంది.

శతాబ్దాలుగా ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన బలూచ్ తెగ పేరు మీదనే బలూచిస్తాన్ అనే పేరు వచ్చింది. అలా పష్తూన్‌ల తరువాత బలూచ్‌లు పెద్ద జాతిగా నిలిచారు. పొరుగుదేశాలైన ఇరాన్, అఫ్గానిస్తాన్‌లలో కూడా బలూచ్ జాతికి చెందినవారు ఉన్నారు.

సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ రాష్ట్రంలో పాకిస్తాన్‌లోనే వనరులు పుష్కలం. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్‌కు కూడా ఈ భూభాగమే కీలకం.

ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్‌లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు సమీపంలో ఉన్న గ్వాదర్‌లో సముద్ర జలాల్లో పోర్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ కీలకమైన చెక్ పాయింట్‌గా మారనుంది.

బలూచిస్తాన్‌లోని మైనింగ్ ప్రాజెక్టులు, గ్వాదర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపడుతోంది. అయితే, పాకిస్తాన్‌లోని తిరుగుబాటు గ్రూపులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

బలూచిస్తాన్‌లోని రెకో డిఖ్ అనే మైన్‌లో బార్రీక్ గోల్డ్ పేరుగల కెనడా గ్రూపుకు 50% వాటా ఉంది. ఇక్కడ కాపర్, బంగారం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి.

బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2000ల తరువాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలు మళ్లీ చురుగ్గా మొదలయ్యాయి.

ఉద్రిక్తతలకు కారణమేంటి?

బలూచిస్తాన్‌‌ను స్వతంత్య్ర దేశంగా మార్చాలన్న లక్ష్యం కోసం దశాబ్దాలుగా పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని కొన్ని గ్రూపులు పోరాడుతున్నాయి.

ఇటీవల సీమాంతర ఉద్రిక్తతలు మరోసారి తలెత్తాయి.

జనవరి 16వ తేదీన ఇరాన్ నుంచి పాకిస్తాన్ సరిహద్దులపై జరిగిన క్షిపణి దాడుల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారని పాకిస్తాన్ ప్రకటించింది.

అనంతరం ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది పాకిస్తాన్. ఇరాన్‌పై పాకిస్తాన్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది.

ఈ దాడులపై ఇరు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి.

ఇరాన్‌పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జైష్ అల్ అదల్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఆ దేశం ప్రకటిస్తే, పాకిస్తాన్ తాను జరిపిన ప్రతిదాడులకు సంబంధించి, రెండు మిలిటెంట్ గ్రూపుల రహస్య స్థావరాలపై దాడులు చేశామని తెలిపింది.

ఆ రెండు మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), రెండోది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్).

1980ల తరువాత ఇరాన్ భూభాగంపై పాకిస్తాన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. మధ్యప్రాచ్యంలో గాజా యుద్ధం ఉద్రిక్తతలను పెంచుతున్న తరుణంలో ఇరాన్ దేశం ఇరాక్, సిరియాలపై కూడా దాడులు చేసింది. అదే వారంలో పాకిస్తాన్‌పైనా దాడులు చేసింది.

బలూచిస్తాన్‌లో ఉన్న వనరుల్ని దోచుకుంటూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం విస్మరిస్తోందని బలూచిస్తాన్‌లోని స్థానిక ప్రజలు, ముఖ్యంగా బలూచ్‌లు ఆరోపిస్తున్నారు.

దశాబ్దాల కాలంగా బలూచిస్తాన్‌లో నెలకొన్న అశాంతికి, తిరుగుబాటుకు అదే ప్రధాన కారణమని వారు చెప్తున్నారు.

బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందాక 1948లో భారత్, పాకిస్తాన్‌ల విభజన జరిగినప్పటి నుంచి బలూచ్ ప్రజలు తమకు స్వతంత్య్ర దేశం కావాలన్న నినాదంతో పాకిస్తాన్ ప్రభుత్వం, మిలటరీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు.

తరువాతి దశకాల్లోనూ బలూచ్‌ల సాయుధ దళ పోరాటం కొనసాగింది. 1970ల తరువాత ప్రాబల్యం తగ్గింది.

దశాబ్దాల అనంతరం పాకిస్తాన్‌లో సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారం చేపట్టిన నాటి నుంచి మళ్లీ తిరుగుబాటు మొదలైంది.

పర్వేజ్ ఆ తిరుగుబాటు అణిచివేతకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో ప్రముఖులైన బలూచ్ నాయకులు నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ హత్య అత్యంత వివాదాస్పదంగా మారింది.

తిరుగుబాటు అణిచివేతకు పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రక్తపాతాన్ని సృష్టించాయి.

బలూచిస్తాన్ రాష్ట్రంలో ఈ అణిచివేత వల్ల పదివేల మందికి పైగా అదృశ్యమయ్యారు.

పాకిస్తాన్ భద్రతా దళాలు హింసకు పాల్పడిందని, చాలామందిని చంపిందని ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

వాయిస్ ఫర్ బలూచ్ మిస్సింగ్ పర్సన్స్ (వీబీఎంపీ) లెక్కల ప్రకారం సుమారు 7 వేల మందికి పైగా అదృశ్యమయ్యారు.

కానీ, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ ఎన్‌ఫోర్స్‌డ్ డిజప్పియరెన్సెస్ విభాగం మాత్రం బలూచిస్తాన్‌లో అక్టోబర్ 2023 నాటికి 454 కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపింది.

దీనిపై పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ సంఖ్యను ఎక్కువ చేసి చూపారని, బలూచిస్తాన్‌లో కేవలం 50 మంది మాత్రమే అదృశ్యమయ్యారని తెలిపారు.

వాటిలో కొన్ని కేసులు సుప్రీం కోర్టులో ఉన్నాయి. బలూచిస్తాన్‌లో హత్యలు, కిడ్నాప్‌లను పూర్తిగా అరికట్టాలని, అదృశ్యమైన వారిని గుర్తించి, తీసుకురావాలని కోరుతూ ఇస్లామాబాద్‌లో వారి కుటుంబ సభ్యులు, మహిళలు నిరసనలు చేస్తున్నారు.

ఎన్ని గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నాయి?

బలూచిస్తాన్‌లో చాలా మిలిటెంట్ గ్రూపులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ ముఖ్యంగా బీఎల్ఎఫ్, బీఎల్ఏ మిలిటెంట్ గ్రూపులు మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండూ పాకిస్తాన్‌ భూభాగం నుంచే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.

వాటికి ఇరాన్, అఫ్గానిస్తాన్‌లలో రహస్య స్థావరాలు కూడా ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

ఇరాన్ ప్రభుత్వం ఈ గ్రూపుల కీలక నాయకులకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేసింది. ఇరాన్ ఆ ఆరోపణలు ఖండించింది.

అంతేకాకుండా బలూచిస్తాన్‌లోని కొన్ని గ్రూపులకు భారత్ ఆర్థిక సాయం చేస్తోందని పాక్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది.

గత రెండేళ్లుగా బీఎల్ఏ, ది పాకిస్తానీ తాలిబన్ గ్రూపులు సంయుక్తంగా దాడులు చేస్తున్నాయని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది.

పాకిస్తానీ తాలిబన్ సంస్థ అఫ్గాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న చాలా గ్రూపుల వెనక ఉంది.

బీఎల్ఏ మిలటరీ గ్రూప్‌ను నియంత్రించడం పాకిస్తాన్‌కు సవాల్‌గా మారింది. యూకే, యూఎస్‌తోసహా పలు పశ్చిమ దేశాలు బీఎల్‌ఏను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా గుర్తించాయి.

ఇటీవలి కాలంలో బీఎల్‌ఏ దాడుల తీవ్రత పెరిగింది. బలూచిస్తాన్‌లోని పాకిస్తాన్ భద్రతా దళాలనే కాకుండా, ఆ ప్రాంతంలో చైనా భాగమైన పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.

బలూచిస్తాన్‌లోని గ్యాస్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఎఫ్ మిలిటెంట్ గ్రూప్ తరచూ దాడులకు దిగుతోంది.

2011 నుంచి ఈ గ్రూప్ పాకిస్తాన్ భద్రతా దళాలు, విదేశీ కార్మికులు, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలు, జర్నలిస్టులపై దాడులు చేస్తోంది.

బీఎల్ఎఫ్ 1964లో సిరియాలో మొదలైంది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లోని బలూచ్ తిరుగుబాటుదారులు ఏకమైయ్యారు.

ఐదేళ్లపాటు జరిగిన ఘర్షణల అనంతరం జరిగిన చర్చలతో ఇరాన్‌ షాతో ఒప్పందం కుదుర్చుకుని పోరాటాన్ని ఆపారు.

అనంతరం జరిగిన పరిణామాలతో ఇతర బలూచ్ గ్రూపులతో కలిసి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. 1970ల నుంచి అఫ్గానిస్తాన్‌లో శరణార్థులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)