రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?

రామనామీ తెగకు చెందిన ఓ వ్యక్తి

ఫొటో సోర్స్, DAILY CHHATTISHGARH

ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్‌లో నివసించే రామనామీలు శరీరమంతటా రామ నామాన్నే శాశ్వతమైన పచ్చబొట్లుగా రాయించుకుంటారు.
    • రచయిత, అలోక్ ప్రకాష్ పుతుల్
    • హోదా, బీబీసీ కోసం

ఛత్తీస్‌గఢ్‌లోని కస్‌డోల్‌కు చెందిన గులారామ్ రామనామీ ఇప్పుడు ‘బడే భజన్ మేళా’ కోసం సిద్ధమవుతున్నారు.

సుమారు వందేళ్లుగా ఏటా మహానది తీరాన ‘బడే భజన్ మేళా’ నిర్వహిస్తున్నారు.

మూడు రోజులపాటు జరిగే ఈ మేళాలో వేల మంది ఒకే చోట చేరి, రామచరిత మానస్‌ గురించి, రామ నామం గురించి భజన చేస్తారు. గీతాలాపన చేస్తారు.

ఈ సారి జనవరి 21 నుంచి 23 మధ్య బడే భజన్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

గులారామ్ రామనామీ మాట్లాడుతూ, “మూడు రోజులపాటు వేల మంది రామనామీలు వేర్వేరుగా, బృందాలుగా రామాయణంలోని కీర్తనలు ఆలపించి, రామాయణాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన నిర్వహిస్తారు. ఈసారి మేం మేళా నిర్వహించే సమయానికి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతోంది” అన్నారు.

రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగకు చెందిన వారు గులారామ్.

‘నఖశిఖ’ పర్యంతం అంటే తల మొదలుకొని కాలిగోరు వరకు శరీరంపై రామ నామాన్ని పచ్చబొట్లుగా వేయించుకుంటారు వీరు.

ఈ తెగలో ఉదయం పలకరింపు రామ్-రామ్ అంటూ మొదలవుతుంది. అక్కడి నుంచి రోజంతా, ఏ పని చేసినా, రామనామాన్ని స్మరించాల్సిందే.

విగ్రహారాధనను విశ్వసించని రామనామీ తెగలోని ప్రజలు నిర్గుణ రాముడి రూపాన్ని భజనల రూపంలో, రామచరిత్ మానస్‌లోని పద్యాలను ఆలపిస్తూ ఆరాధిస్తారు.

నిర్గుణ రాముడిని ఆరాధించే రామనామీలు

ఫొటో సోర్స్, DAILY CHHATTISHGARH

ఫొటో క్యాప్షన్, నిర్గుణ రాముడిని ఆరాధించే రామనామీలు

ఎక్కడి నుంచి వచ్చారు?

మధ్య భారతదేశంలో జరిగిన భక్తి ఉద్యమాల్లో నిర్గుణ భక్తి ఉద్యమాలు ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా సాగాయి.

వాటిలో ప్రధానంగా చెప్పుకునే మూడు ఉద్యమాల్లోనూ ‘అంటరానివారి’గా వివక్షకు గురైన వారే ఎక్కువగా భాగస్వామలయ్యారు.

భక్తి ఉద్యమకారుల్లో కబీర్ శిష్యులను కబీర్‌పంథ్‌లు అని పిలిచేవారు.

మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గడ్‌కు చెందిన కబీర్ పంథ్ గురు ధరమ్‌దాస్, ఆయన కుమారుడు గురు చురామన్‌దాస్‌ కబీర్ భక్తి ఉద్యమాన్ని మధ్య భారతదేశంలో విస్తృతంగా ప్రచారం చేశారు.

కబీర్‌పంథ్‌ల కోసం ఛత్తీస్‌గఢ్‌లోని దామాఖెడాలో పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి.

కబీర్‌ధామ్‌ జిల్లాలో కబీర్ శిష్యుల కోసం శిబిరాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కబీర్‌ను తమ గురువుగా భావించి, అనుసరించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు.

16వ శతాబ్దంలో కబీర్ శిష్యులైన జీవన్‌దాస్ ఉత్తరప్రదేశ్‌లో సత్నామి సమాజ్‌ను స్థాపించారని చెప్పే ఆధారాలున్నాయి.

అయితే, కొంత మంది చరిత్రకారులు సత్నామీ సమాజ్‌ స్థాపన 17వ శతాబ్దంలో జరిగిందని, దాదూ దయాల్‌ శిష్యులు జగ్జీవన్ దాస్ ఈ సమాజ్‌ను స్థాపించారని చెప్తారు.

సుమారు 1820ల కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో బాబా గురు ఘసీదాస్‌ సత్నామీ సమాజ్‌ను స్థాపించారు.

కబీర్ పంథ్, సత్నామీ సమాజ్‌ల స్థాపన సమయంలో ‘అంటరానివారికి’ ఆలయ ప్రవేశం లేదని పరశురాం అనే యువకుడిని దూరం పెట్టడంతో, ఆయన రామ నామాన్ని నుదుటిపై పచ్చబొట్టుగా వేయించుకుని, రామనామీల తెగకు మూల కారకుడిగా మారాడని చెప్తారు.

రామనామీలు

ఫొటో సోర్స్, DAILY CHHATTISHGARH

ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్‌లో నివసించే రామనామీలు శరీరమంతటా రామ నామాన్నే శాశ్వతమైన పచ్చబొట్లుగా రాయించుకుంటారు.

రామనామీ తెగ ఉనికిలోకి ఎలా వచ్చింది?

రామనామీల తెగలోని కొంత మంది పెద్దలు చెప్పినదాని ప్రకారం, ‘‘పరశురాం 19వ శతాబ్దం మధ్యకాలంలో జాంజ్‌గీర్-చంపా జిల్లాలోని చార్‌పారా గ్రామంలో జన్మించారు. తండ్రి నుంచి ప్రేరణ పొంది, రామ చరిత మానస్‌ను చదవడం నేర్చుకున్నారు. 30 ఏళ్ల వయసులో చర్మ సంబంధిత వ్యాధి బారిన పడ్డారు.

అదే సమయంలో రామనంది సాధు రామ్‌దేవ్‌ను కలుసుకున్నాక, అతడి ఛాతీపై రామ్-రామ్ అని రామనామంతో పచ్చబొట్టు ప్రత్యక్షమైంది. అప్పుడే ఆ చర్మ వ్యాధి కూడా తగ్గిపోయింది. ఆ తరువాతి నుంచి రామ్-రామ్ అంటూ రామనామాన్ని స్మరించడం మొదలుపెట్టారు పరశురాం.’’

ఆయనిచ్చిన ప్రేరణతో, అక్కడి గ్రామంలోని ప్రజలంతా వారి నుదుటిపై ‘రామ్-రామ్’ అని పచ్చబొట్లు వేయించుకున్నారని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆ గ్రామస్థులంతా ఖాళీ సమయాల్లో రామనామాన్ని స్మరించడం కొనసాగించారని చెప్తారు.

ఇతర సాధువుల్లానే వారు కూడా మాంసాహారం, మత్తుపానీయాలు మానేసి, శాకాహారం మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అలా 1870ల కాలంలో రామనామీల తెగ ఉనికిలోకి వచ్చింది.

రామనామీలు వారు ధరించే దుస్తులపై కూడా రామనామాన్ని రాయడం మొదలుపెట్టారు. అలా వారికి సంబంధించిన ఏ విషయమైనా, వారి జీవన విధానమైనా రామనామంతో నిండిపోయింది.

రామనామీలు

ఫొటో సోర్స్, DAILY CHHATTISHGARH

శరీరమంతా పచ్చబొట్లు ఎందుకు?

రామనామీల తెగకు చెందిన చైత్‌రామ్ మాట్లాడుతూ, “మా బాబా ఎప్పుడూ చెప్తుండేవారు. గతంలో వారు నుదుటిపై రామ నామం పచ్చబొట్టుగా వేయించుకున్నామని, చాలా మంది ఆగ్రహంతో దాడులకు పాల్పడేవారని చెప్పారు. శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్న చోట వాతలు పెట్టేవారని, దుస్తులు చించి, వాటికి నిప్పంటించేవారని మా గురువులు చెప్పేవారు. అలాంటి వారు ఎన్ని చేసినా, మనసులో లిఖించుకున్న రామ నామాన్నైతే చెరిపేయలేరు కదా అని ఆయన మాతో చెప్పేవారు” అన్నారు.

అలా తమకు ఎదురవుతున్న వివక్షను ప్రశ్నించి, నిరసనను విలక్షణ రీతిలో తెలిపేందుకు, శరీరమంతటా రామ నామాన్ని శాశ్వతంగా పచ్చబొట్లుగా వేయించుకోవడం మొదలైందని చైత్‌రామ్ చెప్పారు.

రామనామీ తెగ

ఫొటో సోర్స్, Getty Images

‘రామనామాన్ని ధరించినందుకు న్యాయ పోరాటం’

గులారామ్ మాట్లాడుతూ, “ఆ కాలంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. శూద్రులకు ఆలయాల్లో ప్రవేశాలను నిరాకరించారు. కనీసం రాముడి నామాన్ని స్మరించే హక్కు కూడా వారికి లేదు.

రామనామీల తెగ ఏర్పడ్డాక, మాకూ రాముడిని పూజించే హక్కు వచ్చింది. రామాయణం వల్ల మా పూర్వీకులు చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఆ కాలంలో శూద్రులకు చదువుకునే హక్కు కూడా లేదు. రామాయణం అక్షరాస్యతకు ప్రధాన కారణమైంది.

రామనామాన్ని పలికినందుకు, శరీరంపై పచ్చబొట్లు వేయించుకున్నందుకు తమ పూర్వీకులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చింది’’ అని చెప్పారు.

రాముడి నామాన్ని ధరించడం వల్ల ఆ పవిత్రతను పోగొడుతున్నారని వారిపై అభియోగం మోపారని చెప్పారు.

కోర్టులో జరిగిన వాదనల్లో రామానామీలు ఆరాధించేది నిర్గుణ రాముడినని, ఆ రాముడు అంతటా ఉన్నాడని, అంతేకానీ, వారు స్మరించేది అయోధ్య దశరథ కుమారుడైన రాముడు, సుగుణ రాముడి గురించి కాదని తమ పూర్వీకులు వాదించారని గులారామ్ చెప్పారు.

ఇరుపక్షాల వాదనలు విన్న రాయ్‌పూర్‌లోని సెషన్స్ కోర్టు 12 అక్టోబర్ 1912న ఇచ్చిన తీర్పులో రామనామీలు ఆలయాలకు వెళ్లడం గానీ, హిందూ ప్రతిమలను పూజించడం గానీ చేయడం లేదని, అందువల్ల వారి మతపరమైన కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఏ కారణమూ లేదని చెప్పింది. అంతేకాకుండా, రామనామీల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.

గులారామ్ మాట్లాడుతూ, “దశరథుడి కుమారుడు రాముడు జన్మించక ముందు కూడా ఈ సృష్టిలో రాముడు ఉన్నాడని నమ్ముతాం. ఆయనే నిర్గుణ రాముడు. మా దేహమే దేవాలయం. మేం కూడా నాలుగు వేదాలు, పురాణాలను చదివాం” అని చెప్పారు.

రామనామీల్లో పండితులంటూ వేరే ఉండరు. ఆలయాలు, విగ్రహారాధనలు ఉండవు. గురు-శిష్యుల సంప్రదాయం కూడా పాటించరు. పురుషులు, స్త్రీల మధ్య బేధం ఉండదు. అందరూ సమానమే.

రామనామీల తెగ పెద్ద మాట్లాడుతూ, “కొన్ని దశాబ్దాల క్రితమే మా తెగలో ‘రామ రసిక గీత’ను రాశారు, అయితే, రామ్-రామ్ నినాదంతో పోలిస్తే, అది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు” అని చెప్పారు.

ఆయన మాట్లాడుతూ, “మా భజనల్లో రామచరిత మానస్ లేదా రామాయణంలోని ఘట్టాలను ప్రదర్శిస్తాం. అయితే, కొన్ని భాగాలను మేం వ్యతిరేకిస్తాం. మాకు రామాయణ గాథపై ఆసక్తి లేదు. రామ నామం ప్రాముఖ్యం తెలిపే బాలకాండంలోని నామ్ మహాత్మ, ఉత్తరకాండంలోని కొన్నింటిని ఆలపిస్తాం” అని చెప్పారు.

ఈ సంప్రదాయం ఎందుకు తగ్గిపోతోంది?

శరీరమంతటా రామనామాన్ని పచ్చబొట్లుగా వేయించుకునే సంప్రదాయం వారి తెగలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. అలా శరీరమంతా పచ్చబొట్లు వేయించుకోవడానికి సుమారు నెల రోజుల సమయం పడుతుంది. ఆ తెగలోని వారే, ఆ పని చేస్తారు.

అలా పూర్తిగా పచ్చబొట్లు వేయించుకున్నవారిని ‘నఖ శిఖ’ అని వ్యవహరిస్తారు. కొత్త తరం భజనల్లో పాల్గొంటున్నప్పటికీ, పచ్చబొట్లు వేయించుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు.

రామజతన్ అనే యువకుడు మాట్లాడుతూ, “గతంలో మా తెగవారు వ్యవసాయంపైనే ఆధారపడే వారు కాబట్టి, అలా శరీరమంతటా పచ్చబొట్లు వేయించుకోవడం వల్ల ఏ ఇబ్బందీ ఎదురయ్యేది కాదు. ఇప్పుడు కొత్తతరంలోని వారికి పూట గడవాలంటే, ఉద్యోగాలు చేయాల్సిందే. శరీరమంతా పచ్చబొట్లు వేసుకుంటే పని దొరకడం కష్టమవుతుంది. దీనికితోడు పచ్చబొట్లు వేయించుకోవడం వల్ల చాలా ఉద్యోగాలకు అర్హత కోల్పోతాం. అందుకే వారు దూరంగా ఉంటున్నాం” అని చెప్పారు.

అయితే, ఆ అంశంపై రామనామీల్లో ఎలాంటి వివాదాలు, వివక్షలూ లేవు. రామ్-రామ్ ఆరాధనే అన్నింటికన్నా ముఖ్యమని వారు భావిస్తారు.

అయితే, సామాజిక, రాజకీయ రంగాల్లో వీరు రాణించేందుకు అంతగా ఆసక్తిని కనబరచట్లేదు.

1967లో సారంగఢ్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు రామనామీలకు చెందిన కుంజ్‌రామ్.

జన్‌సంఘ్ తరఫున ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంతారామ్‌కు 2,601 ఓట్లు రాగా, కుంజ్‌రామ్‌కు 19,904 ఓట్లు వచ్చాయి. అలా రికార్డు స్థాయిలో 67.23 % శాతం తేడాతో కుంజ్‌రామ్ గెలుపొందారు. అయినప్పటికీ, తరువాత మరెవరూ రాజకీయాల్లోకి రాలేదు.

ప్రస్తుతం రామనామీలు ‘బడే భజన్ మేళా’కు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)