అయోధ్యకు, థాయ్‌‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?

అయుతయలో పురాతన మందిరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయుతయలో పురాతన మందిరం
    • రచయిత, వందన
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1350లో ఏర్పడిన అయుతయ (అయుత్య, అయుత్తయ అని కూడా పలుకుతుంటారు) నగరం ఒకప్పుడు థాయ్ సామ్రాజ్య రాజధాని. ప్రస్తుత రాజధాని బ్యాంకాక్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయుతయ నగరంలోకి అడుగు పెట్టగానే, దాని భారీ శిథిలాలు నా దృష్టిని ఆకర్షించాయి.

అయుతయ అనే నగరం పేరు కూడా నన్ను ఆకర్షించింది. ఇది దాదాపు భారతదేశంలోని అయోధ్య పేరుకు దగ్గరగా ఉంది.

అయోధ్య సరయూ నది ఒడ్డున ఉన్నట్లే, ఈ అయుతయ నగరం చుట్టూ దాదాపు 3,500 కిలోమీటర్ల పరిధి మేర మూడు నదులు ఉంటాయి.

భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సూరత్ హోరాచయాకుల్ బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

“అయోధ్య, అయుతయ పేర్లు ఒకేలా ఉండటం యాదృచ్చికం కాదు. సంస్కృత పదాలను థాయ్‌లోకి మార్చడం ద్వారా ఇక్కడ కొత్త పేర్లు ఏర్పడ్డాయి. ప్రాచీన భారతీయ నాగరికత ఆగ్నేయాసియాపై గొప్ప ప్రభావాన్ని చూపింది. అయుతయ నగరం ఏర్పడే సమయానికి రామాయణం థాయ్‌లాండ్‌కు చేరుకుంది. ఏ యుగంలోనైనా ప్రజలు తమ సామ్రాజ్యం లేదా నగరానికి ఎప్పటికీ నిలిచి ఉండే పేరు పెట్టాలని కోరుకుంటారు. అయుతయ పేరు కొంతవరకు అయోధ్యను పోలి ఉంటుందని పలువురు చరిత్రకారులు చెబుతారు" అని సూరత్ హోరాచయాకుల్ తెలిపారు .

ప్రొఫెసర్ హోరాచయాకుల్ కుటుంబం ఉమ్మడి భారతదేశంలోని నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో నివసించింది. దేశ విభజనకు ముందు వాళ్లు థాయ్‌లాండ్‌ వలస వెళ్లారు.

హోరాచయాకుల్ భారత సంతతికి చెందిన మూడో తరం థాయ్ పౌరుడు.

బుద్ధుడి విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుద్ధుడి విగ్రహం

హిందూ మతంతో సంబంధం..

“అప్పట్లో థాయ్‌లాండ్‌లో రాజును విష్ణువు అవతారంగా భావించేవారు. అందుకే అక్కడి రాజులను రామ-1, రామ-2, రామ-10 వంటి పేర్లతో పిలుస్తారు. థాయ్‌లాండ్‌లో సంస్కృతం, పాళీ భాషల ప్రభావం కనిపిస్తుంది. (మన దగ్గర వందన అనే పేరు ఉంటే థాయ్‌లో కుర్వందనగా ఉంటుంది)” అని అన్నారు.

యునెస్కో ప్రకారం అయుతయ రాయల్ దర్బార్‌ను మొఘల్ రాయబారులు, జపాన్, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాల రాయబారులు సందర్శించారు.

డా. ఉదయ్ భాను సింగ్ ఆగ్నేయాసియా వ్యవహారాల్లో నిపుణులు, మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్‌ సంస్థతో కూడా సంబంధమున్న వ్యక్తి ఆయన.

''ఈ ఏడాదితో థాయ్‌లాండ్‌, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 77 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు శతాబ్దాల నుంచి ఉన్నాయి. థాయిలాండ్‌లో 1350లో అయుతయ నగరం ఏర్పాటుచేశారు. ఇది అయోధ్యతో ముడిపడి ఉంది. దీనిని కింగ్ రామతిబోధి-1 నెలకొల్పారు. నేడు అయుతయ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం" అని ఆయన అన్నారు.

థాయిలాండ్ బౌద్ధ ప్రాబల్యం ఉన్న దేశమైనప్పటికీ, ఇక్కడి రాజకుటుంబం హిందూ మతానికి సంబంధించిన అనేక ఆచారాలను అనుసరించింది.

చైనా వంటి దేశాల సంస్కృతి కంటే థాయ్‌లాండ్‌లో భారత సంస్కృతి గొప్ప ముద్ర వేసిందని సీనియర్ చరిత్రకారుడు డీపీ సింఘాల్ పలు కథనాల్లో రాశారు. రామాయణ కథలను థాయ్‌లాండ్‌లో రామకియన్‌గా పిలుస్తారు.

రామకియన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇప్పటికీ అయుతయలో రామకియన్ నాటకాన్ని ప్రదర్శిస్తారు.

రామాయణానికి రామకియన్‌కు ఉన్న పోలిక ఏమిటి?

శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశం నుంచి చాలామంది సముద్ర మార్గంలో థాయ్‌లాండ్‌ వెళ్లారు.

దీంతో రామాయణం కూడా ఇక్కడకు చేరుకుంది. థాయ్‌లాండ్‌‌లో రామాయణం అనేక వెర్షన్లు తయారయ్యాయి, అంతేకాకుండా థాయ్ రాజును రామ-1 అని రాసేవారు.

థాయ్‌లాండ్‌లో రామకియన్‌ నాటకాలు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. దీనికి రామాయణంతో చాలా పోలికలు ఉన్నాయి. అయితే స్థానిక సంస్కృతి, బౌద్ధమత ప్రభావం వల్ల కొంత తేడాలు కనిపిస్తాయి.

రామకియన్‌లో తోత్సకన్ అనే పాత్ర రామాయణంలో రావణుడిలాగా ఉంటుందని చెబుతారు. ఇక్కడ తొసా అంటే పది అని అర్థం. రామకియన్‌లోని 'ఫ్రా రామ్', రాముడి పాత్రను పోలి ఉంటుందంటారు.

రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ వెబ్‌సైట్ ప్రకారం, 1872లో థాయిలాండ్ రాజు రామ-V సింగపూర్, యాంగాన్ మీదుగా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చారు.

1872 జనవరి 13న కలకత్తా చేరుకున్న తర్వాత రైలులో బరాక్‌పూర్, దిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లఖ్‌నవూలకు కూడా వెళ్లారు.

రామకియన్ నాటకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రామకియన్‌ నాటకంలో తోత్సకన్ పాత్రధారి

అయుతయ చరిత్ర ఏంటి?

సంపన్న రాజ్యమైన సియామ్‌కు 14,18వ శతాబ్దాల మధ్య నేటి అయుతయ రాజధాని. ఇది ప్రపంచంలోని ప్రధాన దౌత్య, వాణిజ్య కేంద్రంగా కూడా.

1767లో అయుతయపై బర్మా దాడి చేయడంతో నగరం చాలా వరకు ధ్వంసమైంది. ఆ తర్వాత పునర్నిర్మించలేదు. బ్యాంకాక్ పేరుతో కొత్త రాజధాని ఏర్పాటు చేశారు.

బ్యాంకాక్ అధికారిక పేరు నిజానికి అది కాదు, చాలారోజుల వరకు అయుతయ అనే పేరుతోనే ఉండేది. నగరం మధ్యలో 'అయుతయ రోడ్' అనే రహదారి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ గడిపిన ఒక్కరోజులో చారిత్రాత్మక దేవాలయాలను సందర్శించే అవకాశం లభించిందని బీబీసీ ప్రతినిధి చెబుతున్నారు.

ఇక్కడ ఉన్న పగోడాలు, మఠాల శిథిలాలు చూసినప్పుడు అప్పటి భవనాలు ఎంత ఎత్తుగా ఉండేవో అర్థమవుతుంది.

మొండెం లేని బుద్ధుడి విగ్రహాలు, పైకప్పులు లేని భవనాలు ఇలా ఎక్కడ చూసినా శిథిలాలే దర్శనమిస్తాయి. ఇక్కడ నిలబడితే ఎవరో దండెత్తి జనావాసాలున్న నగరాన్ని ధ్వంసం చేసినట్లు అర్థమవుతుంది.

విశ్రాంతి తీసుకుంటూ కనిపించే ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద బుద్ధ విగ్రహాలు ఉన్నాయి కానీ వాటిలో చాలావరకు తలలు లేవు.

నగరం ధ్వంసమైనప్పుడు విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయని, విగ్రహాల తలలను పగలగొట్టి ఐరోపాలో విక్రయించారని చెబుతారు.

అక్కడొక తల లేని బుద్ధుడి విగ్రహం ఉంది. శతాబ్దాల తర్వాత కూడా ఆ విగ్రహం పూర్తిగా చెట్టు వేర్ల మధ్యే ఉంది. ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంటూ, విదేశీలయులను ఆకర్షిస్తోంది.

అక్కడ నిల్చోని మీరు ఫోటో తీసుకోలేరు. కూర్చొని లేదా వంగి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్టు అయుతయలోని మాత్ మహత్ ఆలయంలో ఉంది.

బుద్ధుడి విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడి భవనాలలో 17వ, 18వ శతాబ్దాలకు చెందిన భారత్, చైనా, జపాన్, యూరప్ కళాత్మక శైలి కనిపిస్తుంది. రచయిత ఎస్‌డి దేశాయ్ హిందూయిజం ఇన్ థాయ్ లైఫ్ అనే తన పుస్తకంలో దీని గురించి వివరంగా రాశారు.

“థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరం రాముడి ప్రభావానికి సాక్షి, అయితే థాయ్‌లాండ్‌లో రాముడికి సంబంధించి పురావస్తు ఆధారాలు లేవు.

కానీ రాముడు, రామాయణం జానపద కళల ద్వారా శతాబ్దాలుగా ప్రజలకు చేరువయ్యాయి. థాయ్‌లాండ్‌లోని మరో నగరం లోప్‌బురి. ఈ నగరానికి రాముడి కుమారుడు లవ్ పేరు పెట్టారని అంటారు. ఈ నగరంలో ఒక వీధికి ఫ్రా రామ్ అని కూడా పేరు పెట్టారు'' అని పుస్తకంలో రాశారు దేశాయ్.

అయుతయలో ఆ కాలం మాదిరే ఈ రోజు కూడా ఏనుగులు కనిపిస్తాయి. తేడా ఏమిటంటే సైనికులకు బదులుగా ఇపుడు పర్యాటకులు వాటిపై తిరుగుతారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)