ప్రాచీన కాలం నాటి సామూహిక నిద్ర అలవాటు ఎలా కనుమరుగైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జరియా గోర్వెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పందొమ్మిదో శతాబ్దం మధ్య కాలంలో ఎక్కువ మంది కలిసి ఒకే చోట పడుకోవడం అనేది సాధారణ విషయంగా ఉండేది.
ఇతరులతో కలిసి పడుకోవడానికి ప్రజలు పెద్దగా ఇబ్బందిపడేవారు కాదు.
స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబసభ్యులే కాదు పరిచయం లేని వ్యక్తులతోనూ కలిసి పడుకోగలిగేవారు.
అలాంటి ఈ అలవాటు క్రమంగా ఎలా కనుమరుగైంది?
మధ్యయుగాల నాటి యువరాజు రిచర్డ్ 1187లో తన విలాసవంతమైన చెక్క మంచం మీద వాలిపోయాడు. రాగి రంగులో మెరుస్తున్న దట్టమైన పొడవాటి కురులతో మంచంపై పడుకున్న ఆ యుద్ధ వీరుడి పక్కనే మరో వ్యక్తీ ఉన్నారు.
ఆయన ఎవరో కాదు రిచర్డ్‌కు ఒకప్పటి శత్రువు, 1180 నుంచి 1223 వరకు ఫ్రాన్స్‌ను పాలించిన రెండో ఫిలిప్.
మొదట ఈ ఇద్దరు రాజ వంశీకులూ జట్టు కట్టాక కలిసి భోజనం చేయడం వంటివి జరిగాయి.. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి మిత్రులుగా మారిపోయారు.
తమ మధ్య, తమ దేశాల మధ్య బంధం బలోపేతం చేసుకునేలా ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకొచ్చారు.
అంతేకాదు.. ఇద్దరూ ఒకే మంచంపై నిద్రించాలనీ నిర్ణయించారు.
ఆధునిక కాలంలో ఇద్దరు మగవాళ్లు కలిసి పడకెక్కితే వేర్వేరు అర్థాలు తీయొచ్చేమో కానీ ఆ కాలంలో ఇలాంటిది వింతేమీ కాదు.
ఇంగ్లండ్ సమకాలీన చరిత్రలో చాలా సాధారణంగా కనిపించే ఈ ఘటన ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ఇద్దరు రాజ వంశీకుల మధ్యనున్న బంధాన్ని చరిత్రకారులు.. నమ్మకానికి, సోదరభావానికి ప్రతీకగా చూశారు.
వారి మధ్య భాగస్వామ్యానికి మంచి నిర్వచనాన్ని ఇచ్చారు.
అయితే, అందరూ కలిసి ఒకే దగ్గర పడుకోవడమనే ప్రాచీన సమాజపు అలవాటు కాలక్రమంలో కనుమరుగైంది.
కొన్ని వేల సంవత్సరాల క్రితం రాత్రిపూట స్నేహితులు, తోటి ఉద్యోగులు, బంధువుల పక్కనే మంచంపైన పడుకోవడం చాలా సాధారణ విషయంగా ఉండేది.
పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి ఆ చోటుని పంచుకునేవారు.
అలాంటివారిలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉండేవారు. రోడ్ల మీద తరచుగా పరిచయం లేని వ్యక్తులు కలిసి నిద్రపోతున్న సందర్భాలు తారసపడేవి.
వారిలో దురదృష్టవంతులకు మాత్రం పక్కవారి నుంచి దుర్వాసన, నిద్రలో గురక శబ్దం, ఒక్కోసారి నగ్నంగా పడుకోవడం లాంటి అనుభవాలు ఎదురయ్యేవి.
కొన్నిసార్లు ఈ సంప్రదాయం పడకల కొరత సమస్యను తీర్చే ఆచరణాత్మక పరిష్కారంగా ఉండేది.
రాజవంశీయులు కూడా తరచుగా పడక పంచుకునే వ్యక్తులతో రాత్రంతా చీకటిలో కబుర్లు చెబుతూ ఉండేవారే.
కానీ ఈ ప్రాచీన అలవాటు ఎందుకని కనుమరుగైంది?

ఫొటో సోర్స్, British Library
ప్రాచీన సంప్రదాయం
దక్షిణాఫ్రికాలోని సిబుడు గుహలో అత్యంత జాగ్రత్తగా భద్రపరిచిన ఒక పొరను గుర్తించారు పురాతత్వ శాస్త్రవేత్తలు.
క్రిటోకార్యా వుడీ అని పిలిచే అటవీ వృక్షానికి సంబంధించిన ఆకుల శిలాజ అవశేషాలు ఆ పొరలో కనిపించాయి.
ఈ ఆకులను 77 వేల ఏళ్ల నాటి రాతియుగంలో నిద్రపోయేందుకు పరుపులాగా ఉపయోగించేవారు. అయితే ఈ ఆకులను కుటుంబమంతా ఒకేచోట నిద్రపోయేందుకు వీలుగా పెద్ద పరుపుల్లాగా వేసేవారని తవ్వకాల్లో పాల్గొన్న ప్రాజెక్టు లీడర్ లిన్ వాడ్లీ భావిస్తున్నారు.
అందరూ కలిసి ఒకే చోట నిద్రపోయినట్లు చూపించే ఆధారం నేరుగా లభించకపోవచ్చు కానీ ఈ సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి ఉందని నమ్ముతున్నారు.
చారిత్రక కోణం నుంచి చూసినపుడు ఆధునిక కాలంలో మనిషి ఒంటరిగా, ప్రైవేట్‌గా నిద్రపోవడం కాస్త విడ్డూరంగా అనిపించొచ్చు.
పురాతన కాలం నుంచి సమాజంలో కాలక్రమంగా మార్పులు వస్తుండటంతో అందరూ ఒంటరిగా పడుకోవడం మొదలైంది.
ఇది ఏస్థాయికి చేరుకుందంటే క్లుప్తంగా చూస్తే, ఉన్నత వర్గాల్లోని వ్యక్తులు వివాహం తర్వాత కూడా ఒంటరిగా పడుకునేవారు. ఈ అలవాటు మధ్యయుగాల వరకూ కొనసాగింది.
ఆధునిక కాలం ప్రారంభ దశలో అంటే 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య, అందరూ కలిసి ఒక చోట నిద్ర పోయినట్లు చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ కాలంలో పడకలను పంచుకోవడం చాలా సాధారణంగా మారింది.
ప్రభువులు, వ్యాపారస్థులు, పెద్ద మనుషులను మినహాయించి సమాజంలోని చాలా మంది ప్రజలకు రాత్రి పడుకునే సమయంలో పడకమీద తోడుగా మరొకరు ఉండేవారు. అలా లేని పక్షంలో వింతగా భావించే పరిస్థితి ఉండేదని హిస్టరీ ప్రొఫెసర్ రోజర్ ఎక్రిచ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘’మధ్య తరగతి వారు, సంపన్న వర్గాల వారు ప్రయాణాలు చేస్తున్న సమయంలో లాడ్జీల్లో, విశ్రాంత ప్రదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ పడుకునే మంచాలు పంచుకోవడం చాలా సాధారణ విషయం’’ అని యూనివర్సిటీ ఆఫ్ మంచెస్టర్‌లో మోడర్న్ హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సాషా హ్యాండ్లీ అన్నారు.
ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలు పడుకునేందుకు పడకని పంచుకుంటే ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన నిర్వచనాలు వేరుగా ఉండొచ్చు.
కానీ మధ్యయుగ కాలంలో ముగ్గురు మేధావులు తరచుగా కలిసి పడుకునేవారని బైబిల్ చెబుతోంది.
వాళ్లు కొన్నిసార్లు నగ్నంగా, కొన్నిసార్లు ఒకర్నొకరు కౌగలించుకుని అత్యంత దగ్గరగా పడుకునేవారని అందులో ఉంది.
అయితే వాళ్లు లైంగిక చర్యల్లో పాల్గొన్నారని చెప్పడం అసంబద్ధమైన విషయంగా నిపుణులు వాదిస్తున్నారు.
అయితే అందరూ కలిసి ఒకే చోట పడుకోవడం చాలా అవసరం అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సమాజంలోని సామాజిక వర్గాల మధ్య అడ్డంకులను ఇది ఛేదించిందని చెబుతున్నారు.
అందుబాటులో ఉన్న అనేక చారిత్రక ఆధారాలను చూస్తే.. సమాజంలో తమకంటే తక్కువ స్థాయి వ్యక్తులతోగానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో గానీ కలిసి పడుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించేవారని తెలుస్తోంది.
శిక్షణలో ఉన్నవారు తమ గురువులతోనూ, ఇళ్లలో పని చేసేవారు తమ యజమానులతోనూ, కిందివారు పైవారితోనూ కలిసి పడుకునేందుకు ఆసక్తి కనబర్చేవారు.
ఒక క్రైస్తవ మతపెద్ద రాసుకున్న డైరీలో, సందర్శకులు తమ సేవకులతో కలిసి పడుకుంటామని కోరేవారని తెలిపారు.

ఫొటో సోర్స్, Alamy
రాత్రిపూట ఒక మంచి నిద్ర
అందరూ కలిసి ఒక చోట నిద్ర పోయే సంప్రదాయానికి సంబంధించి సమగ్రమైన ఆధారం శామ్యూల్ పెపైస్ డైరీల్లో లభిస్తుంది. ఆయన రాసుకున్న వాటిలో 17వ శతాబ్దపు ప్రజల జీవనశైలి ఎలా ఉండేదో కళ్లకు కడుతోంది.
తర్వాతి తరాల కోసం శామ్యూల్ రాసుకున్న పేజీలను పుస్తకాలుగా వాల్యూమ్స్ ప్రచురించారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ లైబ్రరీల్లోని ఓక్ చెక్కలతో చేసిన అరల్లో ఆ పుస్తకాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
శ్యామ్యూల్ దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు ప్రతిరోజూ ఆ డైరీ రాసుకున్నారు.
రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాలనూ, స్త్రీల పట్ల వ్యామోహాన్ని సూచించే అసభ్య వివరణలూ, తరచుగా స్నేహితులతోనూ, సహోద్యోగులతోనూ, పరిచయం లేని కొత్తవారితోనూ పడుకునే సమయంలో పడకలను ఎలా పంచుకునేవారో ఆయన డైరీలో రాసుకున్నారు.
పడకలపైన చోటుని పంచుకోవడంలో విజయవంతమైన అనుభవాలు, విఫలమైన ఘటనలనూ రాసుకున్నారు.
పోర్ట్స్‌మౌత్‌లో ఒక సందర్భంలో, రాయల్ సొసైటీ ఆఫ్ లండన్‌లో శ్యామ్యూల్ కలిసి పని చేసిన డాక్టర్‌తో కలిసి పడుకునేవారు. అయితే వాళ్లు కలిసి పడుకునే సమయంలో మంచి సంభాషణలు జరిగేవి.
పొద్దుపోయే వరకూ కబుర్లు చెప్పుకునేవారు. కానీ క్రమంగా ఆ డాక్టర్ ప్లేగుకి బలయ్యారు. శ్యామ్యూల్‌ని ఒంటరి చేశారు.
కలిసి నిద్రపోయే వ్యక్తులు కొన్ని పొరల దుప్పట్లను కప్పుకుని, తలపైన టోపీలు పెట్టుకుని, రాత్రంతా చెప్పుకునే కబుర్లతోనే పొద్దుపోయేదని ఎక్రిచ్ వివరిస్తున్నారు.
ఒక్కోసారి నిద్రలో నుంచి మధ్యలో లేచి వాళ్లకొచ్చిన కలల గురించి కూడా మాట్లాడుకునేవారని చెప్పారు.
కొన్ని గంటలపాటు జరిగే సంభాషణతో సామాజిక బంధాలు బలపడేవని, రహస్యాలు మాట్లాడుకునేందుకు వ్యక్తిగత చోటు దొరికేదని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణగా ఒక టైలర్ కూతురు అనుభవం చెప్పొచ్చు. ఆమె పేరు సారా హిస్ట్. ఆమెకు నిద్రలో తోడుగా ఇష్టమైన కొందరు సహచరులుండేవారు. వారిపట్ల ఆమె అమితమైన ప్రేమాభిమానాలు పెంచుకుంది. వారిలో ఒకరు అనుకోకుండా చనిపోవడంతో సారా పడిన బాధను ఒక కవిత రూపంలో వ్యక్తం చేసింది.
ఇక రాణి ఎలిజబెత్ కూడా తన 44 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా ఒంటరిగా పడుకోలేదు. ప్రతి రాత్రి తన పడక గదిలో నమ్మకస్తులైన తన సేవకురాళ్లతో కలిసి పడుకునేవారు.
ఆ వ్యక్తితో ఆమె దినచర్య గురించి మాట్లాడుతూ ఒత్తిడిని, మానసిక భారాన్ని దించుకునేవారు.
రాణితో కలిసి పడుకునే వ్యక్తి ఒక రకమైన భద్రతాభావాన్ని రాణికి కల్పించేవారు.
ద క్వీన్స్ బెడ్: యాన్ ఇంటిమేట్ హిస్టరీ ఆఫ్ ఎలిజబెత్ కోర్ట్ – అనే పేరుతో రాసిన పుస్తకంలో, చరిత్రకారిణి ఆన్నా వైట్‌లాక్ అప్పటి విషయాలు వివరించారు.

ఫొటో సోర్స్, Alamy
ప్రవర్తనా నియమావళి
అయితే కలిసి పడుకోవడం సాధారణంగా మారిన కాలంలో, ప్రవర్తనా నియమావళిని అనుసరించడం కూడా సాధారణమవుతుంది.
అందరికీ సౌకర్యంగా నిద్ర పట్టేలా, గొడవలు కొట్లాటలు లేకుండా చూసేందుకు ప్రజలు కొన్ని ప్రవర్తనా నియమాలను అనుసరించేవారు.
కలిసి పడుకునేవాళ్లు ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. పక్కవారి వ్యక్తిగత సమయాన్ని గౌరవించేవారు. నిద్రలో ఎక్కువగా కదలకుండా ఉండేందుకు ప్రయత్నించేవారు.

ఫొటో సోర్స్, Alamy
క్రమంగా కనుమరుగైన సంప్రదాయం
పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలానికి బెడ్ షేరింగ్ అలవాటు తగ్గుతూ వచ్చింది. పెళ్లైన జంటలు కూడా క్రమంగా వేర్వేరుగా రెండు మంచాల మీద పడుకోవడం మొదలైంది.
చరిత్రకారిణి హిలరీ హిండ్స్ రాసిన ఎ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ట్విన్ బెడ్స్ పుస్తకంలో, ప్రజలు ఒంటరిగా పడుకోవడం పెరుగుతున్న తొలి క్రమాన్ని వివరించారు.
ప్రాచీన సంప్రదాయంగా వస్తోన్న అందరూ కలిసి ఒక చోట నిద్రపోయే సంప్రదాయాన్ని కుటుంబాలు సైతం విస్మరించడం మొదలైంది.
దాదాపుగా శతాబ్ది కాలంపాటు చాలా మంది పెళ్లైన జంటలు రెండు వేర్వేరు పడకల మీద పడుకునేవారు. ఈ పరిస్థితిలో కొంత మార్పు 1950లలో కనిపించింది.
ఎందుకంటే వేర్వేరు పడకలు వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తాయనే భావన బలపడింది. కానీ సామాజిక నిద్ర అనేది తిరిగి వాడుకలోకి రాలేదు.
మరి అందరూ కలిసి ఒక చోట నిద్రపోయే సంప్రదాయాన్ని మనం మిస్ అవుతున్నామా? ఆధునిక రాజకీయ నాయకులు కరచాలనం చేయడానికి బదులు, కలిసి ఫోటోలు దిగడానికి బదులు రిచర్డ్, రెండవ ఫిలిప్‌లు చేసిన విధంగా రాత్రిపూట కలిసి నిద్ర చేస్తే బావుంటుందా? పరిచయం లేని కొత్తవారితో కలిసి పడుకోవడం పర్యాటకులకు మంచిదేనా?వీటికి సమాధానాలు దొరకడం కష్టమే.
ఇవి కూడా చదవండి:
- మనుషులు పాలు, కూరగాయలు కూడా అరిగించుకోలేని రోజులవి.. 5 వేల సంవత్సరాల కిందట ఏం జరిగింది
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలనే అనుమానంతో సాధువులను కొట్టిన స్థానికులు... 12 మంది అరెస్ట్
- తెలంగాణ పులులు: ఆధిపత్య పోరులో అంతమవుతున్నాయా? విషప్రయోగాలకు బలవుతున్నాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














