నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'

ఫొటో సోర్స్, vm2002/Alamy
‘‘నువ్వులు తిని నూరేళ్లు బతుకు, తీపి తిని తియ్యగా మాట్లాడు’’ అంటూ మకర సంక్రాంతి సందర్భంగా తమ ఇంటికి వచ్చిన ఆడపడుచులకు నువ్వులు బెల్లం లేదా నువ్వులు చక్కెరతో చేసిన లడ్డూలను ఇచ్చిపుచ్చుకుంటారు తెలుగింటి మహిళలు.
మహారాష్ట్రలో కూడా ఇలాగే నువ్వుల ఉండలను పంచుతూ ‘‘తిల్‌గుడ్ గ్యా, గోడ్-గోడ్ బోలా’’ అంటూ చెబుతారు. దీనర్థం కూడా నువ్వుల లడ్డూ తిని తియ్యటి మాటలు మాట్లాడు అని.
దయగల, సంతోషకర జీవనానికి మంత్రంగా ఈ మాటల్ని చెబతుంటారు.
తిల్ గుల్ అంటే నువ్వులు, బెల్లం, నెయ్యితో చేసే ఆహారపదార్థం. లడ్డూ, పాప్డీ, బర్ఫీ, రేవ్డీ, గజక్ ఇలా పలు రూపాల్లో ఈ ఆహారపదార్థాన్ని తయారు చేస్తారు.
చిన్నతనంలో కజిన్లతో కలిసి ఈ ఉండలను తింటూ సంక్రాంతి సమయంలో ఆటపాటల్లో మునిగి తేలేదాన్ని. ఆ సమయంలో ఈ లడ్డూల గొప్పదనం మాకు తెలియదు.
ఈరోజు ఒక తల్లిగా ఈ మాటల అంతరార్థాన్ని గ్రహిస్తున్నా. కఠినమైన ఈ ప్రపంచంలో దయతో, మంచితనంతో జీవించడానికి ఉన్న ప్రాముఖ్యం ఇప్పుడు అర్థం అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చాంద్రమానానికి బదులుగా సౌర క్యాలెండర్ ఆధారంగా జరుపుకునే ఏకైక హిందూ పండుగ మకర సంక్రాంతి.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.
జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యంతో పాటు మకర సంక్రాంతికి పంటల పండుగ అనే పేరు కూడా ఉంది. రైతులు పంట చేతికొచ్చాక భూమాతకు కృతజ్ఞత తెలుపుతూ చేసుకునే పండుగగా మకర సంక్రాంతికి పేరుంది.
దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే, తెల్ల నువ్వులు లేకుండా ఈ పండుగ అసంపూర్ణం. నువ్వులనే హిందీలో తిల్ అంటారు.
నువ్వులతో వేర్వేరు రూపాల్లో రకరకాల మిఠాయిలను తయారు చేస్తారు. ఉత్తర భారతంలో ముఖ్యంగా పంజాబ్‌లో లోహ్రీ పేరుతో జరుపుకునే పండుగ సందర్భంగా నువ్వులతో చేసిన రేవ్డీ మిఠాయిని తింటారు. నువ్వులు, బెల్లంతో చేసిన ఈ వంటకం నాణేం ఆకారంలో ఉండి కరకరలాడుతుంది.
బిహార్, జార్ఖండ్‌లలో రెండు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో పవిత్ర నదీ స్నానాలు ఆచరించడంతో పాటు బోగి మంటలు వేస్తారు. నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు.
కర్ణాటకలో పంటల పండుగను సుగ్గీ పేరుతో జరుపుకుంటారు. వీరు ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారు. వేయించిన వేరుశెనగలు, బెల్లం, ఎండు కొబ్బరితో కలిపి తెల్ల నువ్వులను వీరు ఇచ్చిపుచ్చుకుంటారు.
గుజరాత్‌లో ఉత్తరాయణ్ పేరుతో జరుపుకునే ఈ పండుగ సందర్భంగా ఆకాశమంతటా గాలిపటాలు కనిపిస్తాయి. అక్కడివారు నువ్వులు, బెల్లం కలిపి తిల్‌గుల్ చిక్కీ అనే తినుబండారాన్ని తయారు చేస్తారు.

ఫొటో సోర్స్, Teja Lele
భారతీయ జానపదాల్లో నువ్వులను దేవుడితో అనుసంధానించి చెప్పే కథలు పుష్కలంగా ఉన్నాయి.
పాలసముద్ర మథనం సమయంలో సృష్టికర్త బ్రహ్మ నుదురు నుంచి రాలిన చెమట చుక్కలే నువ్వులుగా మారాయని ఒక కథలో చెబుతారు.
నువ్వులు అమరత్వానికి చిహ్నం అని మరో పురాణం చెబుతుంది. నువ్వులతో మృత్యుదేవత అయిన యమున్ని ప్రసన్నం చేసుకోవచ్చని అందులో చెబుతారు.
నువ్వులతో చేసిన మిఠాయిలను ఇచ్చిపుచ్చుకోవడం భారతీయ వేడుకల్లో అంతర్భాగం. దయతో జీవించడం, క్షమాపణలకు గుర్తుగా మహారాష్ట్రలో ఈ స్వీట్లను పంచుకుంటారు. ఇతరులతో బేదాభిప్రాయాలను మర్చిపోయి మరింత ఆనందంగా జీవించే భాగ్యం కలిగించే పండుగగా పేర్కొంటూ ఇక్కడి అమ్మమ్మలు, నాన్నమ్మలు తరాలుగా నువ్వుల మిఠాయిలను పంచుతున్నారు.
‘‘తీపి తిని, తియ్యటి మాటలు మాట్లాడండి’’ అని చెప్పడం వింటుంటే చిన్నతనంలో తనకు ఎంతో థ్రిల్‌గా అనిపించేదని చెఫ్ చినూ వాజ్ గుర్తు చేసుకున్నారు.
గోవాలో నివసించే చినూ వాజ్, గార్మెట్ క్యాటరింగ్ కంపెనీ ‘గియా గార్మెట్’ సహ వ్యవస్థాపకురాలు.
‘‘నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వులు, బెల్లంతో తయారు చేసే తిల్‌గుల్ లడ్డూలు ఎంతో కరకరలాడుతూ రుచిగా ఉండేవి. వీటి తయారీ విధానం ద్వారా పాకశాస్త్ర నిపుణుల్ని సులభంగా గుర్తు పట్టొచ్చు. ఈ లడ్డూలను పంచుతూ ‘తీపి తిని తియ్యగా మాట్లాడండి’ అని చెప్పడం నాకెంతో నచ్చింది’’ అని చినూ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చేతికొచ్చిన పంటను, రాబోయే వసంతకాలాన్ని వేడుకగా చేసుకునే పండుగగా మకర సంక్రాంతిని మన పూర్వీకులు జరుపుకునేవారని కుక్‌బుక్ రచయిత, టీవీ హోస్ట్ చినూ అన్నారు.
శీతాకాలం ఇంకా పూర్తిగా ముగియనందున వెచ్చదనం, రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆహార పదార్థాల అవసరం చాలా ఉంటుందని వారికి తెలుసు అని ఆమె అన్నారు.
‘‘నువ్వులు, బెల్లం తినండి. ఈ రెండు శీతాకాలపు ఆహారపదార్థాలు శరీరానికి వెచ్చదనం ఇవ్వడంతో పాటు శరీరంలోని అగ్నిని రగిలించి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి పెరుగుదలకు సహాయపడతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల జలుబు-ఫ్లూ సీజన్‌లో అద్భుతంగా ఉపకరిస్తుంది’’ అని ఆమె చెప్పారు.
నువ్వులను బెల్లంతో కలిపి తినడం వల్ల ఈ సీజన్‌లో బాగా పని చేస్తుందని పుణేకు చెందిన పోషకాహార నిపుణురాలు అమితా గాడ్రే చెప్పారు.
‘‘నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మంచి కొవ్వులు ఉంటాయి. నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. బెల్లంతో కలిపినప్పుడు వాటి నుంచి స్థిరమైన శక్తి విడుదల అవుతుంది’’ అని అమితా అన్నారు.
నువ్వులు, బెల్లానికి నెయ్యిని కూడా జోడించడం వల్ల ఒమేగా 3, 6, 9 ల మధ్య సమతుల్యత ఉంటుందని చినూ చెప్పారు.
పండుగ సందర్భంగా నువ్వుల లడ్డూలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కొత్త ఏడాదిలో మంచి మాటలు మాట్లాడటం, మంచి పనులు చేయడం, మంచి దారిలో నడవమని చెబుతుంది.

ఫొటో సోర్స్, Chinu Vaze
నువ్వుల లడ్డూలు (తిల్‌గుల్ రెసిపీ) తయారీ విధానం
చెఫ్ చినూ వాజ్ సంప్రదాయక నువ్వుల లడ్డూల తయారీ విధానాన్ని చెప్పారు.
కావాల్సిన పదార్థాలు
- సగం కప్పు పల్లీలను వేయించి పొట్టు తీసి బరకగా మిక్సీ పట్టాలి
- సగం కప్పు నువ్వుల్ని వేయించి, అందులో సగం నువ్వుల్ని మెత్తగా గ్రైండ్ చేసి మిగతా సగాన్ని అలాగే ఉంచాలి
- సగం కప్పు పీనట్ బటర్
- రెండు టేబుల్‌స్పూన్ల కోకో పౌడర్ (cacao powder)
- పావు కప్పు తురిమిన బెల్లం
- ఒక టేబుల్ స్పూన్ పాలు
- సగం టేబుల్ స్పూన్ నెయ్యి
- చిటికెడు ఉప్పు
చాకోలెట్ డిప్పింగ్ కోసం కావాల్సిన పదార్థాలు
- పావు కప్పు డార్క్ చాకోలెట్
- రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె
- కాసిన్ని నువ్వులు
తయారీ విధానం
మొదట పల్లీలు, నువ్వులను వేయించి సగం నువ్వులను పక్కన పెట్టుకొని మిగతా వాటిని గ్రైండ్ చేయాలి.
కడాయిలో నెయ్యి, బెల్లం తీసుకొని కరిగించాలి. బెల్లం నుంచి బుడగలు వస్తుండగా పాలు పోయాలి. మిగతా అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత వేడిగా ఉండగానే ఉండలుగా చుట్టుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చాలి.
ఆ తర్వాత డబుల్ బాయిలర్ పద్ధతిలో చాకోలెట్, కొబ్బరినూనెను కరిగించి లడ్డూలను అందులో ముంచాలి. ఆ తర్వాత నువ్వుల్లో దొర్లించాలి.
రచయిత: తేజ లెలె
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








