మణిపుర్ హింసాకాండ: 9 నెలలైనా ఆరని మంటలు, ఈ చావులు గుండెల్ని తొలిచేస్తున్నాయంటోన్న బాధితులు- గ్రౌండ్ రిపోర్ట్

షుమిలా
ఫొటో క్యాప్షన్, ఓనామ్ రేమెన్ సింగ్ సోదరి థావూదాన్ షుమిలా లేమా
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్‌లో హింస మొదలై దాదాపు తొమ్మిది నెలలు గడుస్తోంది. మరణాలపై అక్కడి నుంచి రిపోర్టులు ఇంకా వస్తూనే ఉన్నాయి.

కొన్నిరోజుల కిందట జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలతో పాటు సామాన్య పౌరులు చనిపోయారు. హింస కారణంగా ఇప్పటివరకు 200 మంది చనిపోయినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన హోం మంత్రిత్వ శాఖ బృందం, అక్కడి నాయకులు, అధికారులు, సంస్థలతో మాట్లాడింది.

ఈ హింసాత్మక వాతావరణంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జనవరి 14న భారత్ న్యాయ్ జోడో యాత్రను మొదలుపెట్టారు.

ఈ యాత్రలో భాగమైన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘8 నెలల నుంచి ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన కనీసం గంట సేపు కూడా ఇంఫాల్‌కు రాలేదు’’ అని అన్నారు.

రేమన్ తల్లిదండ్రులు
ఫొటో క్యాప్షన్, ఓనామ్ రేమన్ సింగ్ తల్లిదండ్రులు

గ్రామంలో విషాదం

ఇంఫాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో, మెయితీ ఆధిపత్యం ఉండే ఆకశోయి గ్రామానికి మేం చేరుకున్నాం. ఆ గ్రామం అంతా విషాదంలో ఉంది.

ఈ ఊరుకు చెందిన నలుగురు వ్యక్తులు ఇళ్లకు తిరిగి రాకపోవడంతో జనవరి 10న అక్కడ ఆందోళన నెలకొంది. తర్వాత దగ్గర్లోని ఒక కొండ ప్రాంతంలో వారి శవాలు దొరికాయి.

ఓనామ్ రేమన్ సింగ్, అహంతెన్ దారా మెయితీ, థావూదామ్ ఇబోమచా మెయితీ, ఆయన కుమారుడు థావూదామ్ ఆనంద్ సింగ్‌ అనే నలుగురు వ్యక్తులు కట్టెలు అమ్ముతూ రోజుకు 100-200 సంపాదిస్తూ తమ కుటుంబాలను నడుపుతుంటారు. సాయుధ తీవ్రవాదులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మేం వారి ఇళ్లకు చేరుకున్నప్పుడు, ఇళ్ల బయట మృతి చెందిన వారి ఫోటోలు కనిపించాయి. దారా మెయితీ భార్య ఏడ్చీ ఏడ్చీ స్పృహ కోల్పోవడంతో కుటుంబీకులు ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు.

ఓనామ్ రేమన్ సింగ్ మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన భార్య ప్రమోదినీ లేమా అన్నం తినడం మానేశారు. ఇంట్లోని ఒక మంచం మీద ఆమె పడుకొని ఉండగా వైద్యులు సెలైన్ ఎక్కిస్తున్నారు. పిల్లలు భయం భయంగా ఉన్నారు.

పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే నచ్చినది కొనిస్తానని పిల్లలకు ఓనామ్ మాటిచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరు.

నివాళి
ఫొటో క్యాప్షన్, మృతులకు నివాళిగా ఉంచిన పూలు

అందరి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తల్లి లేంబీ లేమా మాట్లాడుతూ బోరున ఏడ్చేశారు.

చనిపోయిన వారిలో ఆమె అల్లుడు థావూదామ్ ఇబోమచా మెయితీ, మనవడు థావూదామ్ ఆనంద్ సింగ్ ఉన్నారు.

‘‘నేను ఎవరి కోసమని ఏడవాలి? నా కొడుకు చనిపోయినందుకు నా కోడలిని తలుచుకొని ఏడవాలి? లేక భర్త, కుమారుడిని కోల్పోయిన నా కూతురి దీనస్థితికి ఏడవాలా?

చాలా కిరాతకంగా ఈ హత్యల్ని చేశారు. కొట్లాటలో చనిపోయి ఉంటే మేం ఏమీ అనకపోయేవాళ్లం. కానీ, నిరాయుధులైన వారిపై దాడి చేసి చంపడం చాలా దారుణం.’’ అని ఆమె అన్నారు.

థావూదామ్ ఇబోమచా మెయితీ భార్య, ఓనామ్ రేమెన్ సింగ్ సోదరి థావూదాన్ షుమిలా లేమా మాట్లాడుతూ, ‘‘మాకు బతకాలనే ఉంది. కానీ ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? మేం ఎప్పుడు చనిపోతామో, చావు ఎలా వస్తుందో అనే భయంతో బతుకుతున్నాం’’ అని అన్నారు.

బీదరికంలో ఉన్న ఈ కుటుంబాల భవిష్యత్ అనిశ్చితిలో ఉంది. శాంతిభద్రతల సమస్యలతో వారి ఆందోళన మరింత పెరిగింది. అక్కడక్కడ మాకు డేరాలు కనిపించాయి. ఈ డేరాల్లో రాత్రి పూట కాపలా ఉంటారని మాకు చెప్పారు.

ఈ హింస నిరుటి మే నెలలో మొదలైంది. రాష్ట్రంలో ప్రభావవంతమైన మెయితీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఈ హింసకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

మణిపుర్‌లోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కుకీ తెగ ప్రజలు ఉన్నారు.

సహాయక శిబిరం
ఫొటో క్యాప్షన్, సహాయక శిబిరంగా మారిన ప్రభుత్వ పాఠశాల

హింసతో భయానక పరిస్థితులు

ఆకశోయి గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో హావూతక్ టాంఫాఖునావ్ గ్రామం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా పర్వతాలు, చెట్లతో నిండి ఉంది.

గ్రామంలో నిశ్శబ్ధం ఆవరించి ఉంది. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. అక్కడ కొంతమంది వ్యక్తులతో కలిసి ఉన్న సునీల్ మైస్నమ్‌ను మేం కలిశాం. వ్యవసాయం మీద ఆధారపడి 400 మంది వ్యక్తులు జీవించే ఈ మెయితీ గ్రామంలో బాంబు దాడులు, కాల్పుల తర్వాత కేవలం వంద మంది మాత్రమే మిగిలారని ఆయన చెప్పారు.

‘‘ఇక్కడి ఆడవాళ్లు, పిల్లలు అందరూ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు మగవాళ్లు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఎక్కడ నుంచి బుల్లెట్లు వస్తాయో అనే భయంతో అందరూ అప్రమత్తం అయ్యారు. మేం కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మా ఇళ్లను తగులబెట్టేస్తారేమో అని భయంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

రేవికా సింగ్
ఫొటో క్యాప్షన్, రేవికా

అక్కడి నుంచి తిరిగి వస్తూ, దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ఇంటికి మేం చేరుకున్నాం. అక్కడ 45 నుంచి 50 మంది మహిళలు, పిల్లలతో కలిసి ఆశ్రయం పొందుతున్నారు.

హడావిడిగా ఇళ్లనుంచి వచ్చేశామని అక్కడ ఆశ్రయం పొందుతున్న రేవికా మాకు చెప్పారు.

‘‘మేం కనీసం దుస్తులు, దుప్పట్లు కూడా తెచ్చుకోలేదు. రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు దుప్పట్ల మీద నీళ్లు వస్తుంటాయి. అంత చలి ఉంటుంది. ఇక్కడ ఉండటం చాలా కష్టంగా ఉంది’’ అని ఆమె చెప్పారు.

సహాయక శిబిరాలు

సహాయక శిబిరాల్లో జీవితం

వేలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఉండాల్సి వస్తోందని స్థానికులు చెప్పారు. అయితే, కచ్చితమైన సంఖ్య మీద స్పష్టత లేదు.

ఇంఫాల్‌లోని ఒక సహాయక శిబిరంలో ఉంటోన్న 26 ఏళ్ల మైబ్రామ్ విక్టోరియా చాను ఇటీవలే అగ్రికల్చర్‌లోమాస్టర్స్ పూర్తి చేశారు. శిబిరంలోని ఒక పెద్ద హాలులో ఇతర కుటుంబాలతో కలిసి ఆమె జీవిస్తున్నారు.

ఈ శిబిరంలో మొత్తం 79 మంది ఉంటున్నారు. కుకీ ఆధిపత్యం ఉండే చురాచాంద్‌పూర్‌లో ఒక మెయితీ కుటుంబంలో పుట్టారు విక్టోరియా. తాను కుకీ, మిజో కమ్యూనిటికీ చెందిన స్నేహితులతో కలిసి పెరిగానని ఆమె చెప్పారు. కానీ, హింస వల్ల తమ ఇల్లు ధ్వంసమైందని తెలిపారు.

‘‘ఇది చాలా విచిత్రం. మేం ఇంతకాలం కలిసే ఉన్నాం. ఆ ఘటన తర్వాత సంబంధాలు చెదిరిపోయాయి. మా మధ్య దూరం పెరుగుతోంది. ఏం జరుగనుందో తెలియట్లేదు’’ అని ఆమె అన్నారు.

తమ జీవితాలు ఇలా అవుతాయని తొమ్మిది నెలల క్రితం ఈ కుటుంబాలు ఊహించి ఉండవు. మాతో మాట్లాడుతూ చాలా మంది ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మణిపుర్ భద్రతా సలహాదారు, జర్నలిస్టులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ, ‘‘నేనెందుకు రాజీనామా చేయాలి? నా విధులకు న్యాయం చేయలేదని నాకు అనిపించినప్పుడు లేదా మీరు నిరూపించి చూపినప్పుడు రాజీనామా చేస్తాను. రోజులోని 24 గంటల్లో నిద్ర, తినడాన్ని మినహాయించి మిగతా సమయం అంతా భద్రతా దళాల మధ్య సమన్వయం, మోహరింపు, ఆపరేషన్ల మీదే నేను పనిచేస్తున్నా’’ అని అన్నారు.

భద్రతను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అక్కడ హింస కొనసాగుతూనే ఉంది.

రిటైర్డ్ బ్యూరోక్రాట్, కాలమిస్ట్ డాక్టర్ ఆర్కే నిమాయి సింగ్ మాట్లాడుతూ, ‘‘భారత్‌లో జాతి హింస ఒక వారానికి మించి కొనసాగడం మీరెప్పుడైనా చూశారా? గరిష్ఠంగా మూడు లేదా నాలుగు రోజులు అది కొనసాగుతుంది. మణిపుర్‌లో మాత్రమే ఎనిమిది, తొమ్మిది నెలలుగా హింస జరుగుతోంది. అక్కడ చేయాల్సినంత చేయలేదని దీనిద్వారా అర్థం అవుతోంది’’ అని అన్నారు.

చురాచాంద్‌పూర్

చురాచాంద్‌పూర్‌లో పరిస్థితులు

ఇంఫాల్ నుంచి అనేక సెక్యూరిటీ చెక్ పాయింట్లను దాటుకొని మేం చురాచాంద్‌పూర్‌కు చేరుకున్నాం. అక్కడ భారీగా గుమిగూడిన జనం కనిపించారు. ఒకరి తర్వాత ఒకరు అక్కడ మాట్లాడుతున్నారు. వారు చేతుల్లో పట్టుకున్న బ్యానర్ల ద్వారా వారంతా బీరేన్ సింగ్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నట్లు అర్థమైంది.

ప్రతీ వారం ఇలాంటి ప్రదర్శనలు జరుగుతున్నాయని అక్కడి వారు మాకు చెప్పారు.

హింస మొదలైనప్పుడు లింగనెకీ లుంగ్డిన్ తన భర్తతో కలిసి ఇంఫాల్‌లో ఉన్నారు. మూడు రోజుల ముందే వారికి పాప పుట్టింది. మే 4న తన భర్త, సోదరుడిపై ఒక మూక దాడి చేసిందని, చాలా కష్టమ్మీద వారు దాన్నుంచి బయటపడగలిగారని ఆమె చెప్పారు.

మే 3వ తేదీన తన మేనల్లుడు నెహ్మినలున్‌ను ఒక గుంపు చుట్టుముట్టి చంపేసిందని జాంగలెట్ హావోకిప్ అనే మరో వ్యక్తి తెలిపారు.

‘‘ఆ ఘటన గురించి ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. మేం అనుభవించిన బాధలు, కష్టాలను మాటల్లో చెప్పడం కష్టం. భవిష్యత్ గురించి ఆలోచిస్తే మరింత ఆందోళన కలుగుతోంది’’ అని నెహ్మినలున్ బంధువు జాంగలెట్ హావోకిప్ చెప్పారు.

చురాచాంద్‌పూర్

సామాన్య పౌరుల సమస్యలకు పరిష్కారం ఏంటి?

ఇప్పటికీ పరిస్థితి ఎందుకు చక్కబడట్లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా రాజధాని ఇంఫాల్, కుకీ ఆధిపత్య చురాచాంద్‌ఫూర్ మధ్య సంబంధాల పునరుద్ధరణ జరుగలేదు.

బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న 47 ఏళ్ల చినాఖోనెంగో వంటి ప్రజల్ని ఇది ప్రభావితం చేస్తోంది. చినాఖోనెంగో సహాయక శిబిరంలో నివసిస్తున్నారు.

చికిత్స కోసం ఆమె ఆస్తులన్నీ ఆమ్మేశారు. చికిత్స కోసం ముందుగా ఇంఫాల్ వెళ్లే ఆమె ఇప్పుడు ఐజ్వాల్ మీదుగా రోడ్డు మార్గాన గువాహతికి వెళ్లాల్సి వస్తోంది.

చికిత్స కోసం ముందు రెండు గంటలు చేయాల్సిన ప్రయాణం ఇప్పుడు దాదాపు రెండు రోజులు తీసుకుంటోంది. ఫలితంగా చాలా అలసిపోయి వారం పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

‘‘భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. మునుపటిలా నా జీవితం లేదు. ఇక్కడి వారు చాలా దయతో ఉంటారు. సహాయపడతారు. ఇక్కడ నివసించే అందరికీ కలిపి రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఇదొక ప్రభుత్వ పాఠశాల. ఎంతకాలం మేం ఇక్కడ ఉండగలం? జబ్బుతో ఉన్న నాలాంటి వాళ్లకు ఇది మంచిది కాదు’’ అని ఆమె చెప్పారు.

బాధితురాలు
ఫొటో క్యాప్షన్, క్యాన్సర్ బాధితురాలు చినాఖోనెంగో

ప్రత్యేక పరిపాలన వచ్చేంత వరకు చురాచాంద్‌పూర్‌లో పరిస్థితులు మెరుగుపడవని అక్కడి స్థానికలు అంటున్నారు.

ఈ పరిస్థితి వల్ల ఇక్కడి విద్య, ఆర్థిక రంగాలు కూడా దెబ్బతిన్నాయి. బాటిళ్లలో పెట్రోల్ అమ్ముతుండటాన్ని మేం దారిలోచూశాం. నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయి చాలా కష్టంగా ఉందంటూ స్థానికులు వాపోతున్నారు.

ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వూల్‌జోంగ్ మాట్లాడుతూ, ‘‘ప్రత్యేక పాలన కావాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని నెరవేర్చాలి. ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా ఇక్కడ శాంతి నెలకొంటుంది’’ అని అన్నారు.

కానీ, మెయితీ వారు ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నారు.

మణిపుర్

శాంతి కోసం ఎదురుచూస్తోన్న ప్రజలు

మెయితీ, కుకీ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల భారాన్ని సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారని చెబుతున్నారు.

‘‘ఇరు వర్గాల వారు మొండిగా ఉండటం వల్ల పరిస్థితి దిగజారింది. మెయితీ, కుకీ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి వల్ల ఆర్థిక, ఆరోగ్య, విద్యారంగం ప్రభావితం అవుతోంది. చురాచాంద్‌పూర్‌లో వైద్యుల కొరతతో చిన్నారులు న్యుమోనియాతో చనిపోతున్నారు. ధరలు పెరిగాయి. నాయకులు బాగానే ఉన్నారు. కానీ, సామాన్యులు ఆ బాధలు అనుభవిస్తున్నారు’’ అని రిటైర్డ్ బ్యూరోక్రాట్ డాక్టర్ ఆర్కే నిమాయి సింగ్ అన్నారు.

సరిహద్దు చొరబాట్లు, ఆయుధాల వాడకం, మత్తు పదార్థాల పాత్ర కారణంగా చెలరేగిన హింస వల్ల మణిపుర్‌లోని ప్రతీ వర్గం ప్రభావితమైంది.

కానీ, ఇప్పుడు హృదయాల్లో దూరాలు పెరిగాయి. ఒకప్పుడు సుఖదు:ఖాల్లో కలిసి ఉన్నవాళ్లంతా ఇప్పుడు విడిపోయారు. ఈ రకమైన హింస వల్ల హృదయానికి అయ్యే గాయం చాలా లోతుగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, అంతులేని విషాదంలో వందల కుటుంబాలు....

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)