పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, SHAWN MILLER
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, సైన్స్ ప్రతినిధి, బీబీసీ న్యూస్
పీతలకు ప్లాస్టిక్ వ్యర్థాలు ‘రక్షణ కవచం’గా మారడంపై శాస్త్రవేత్తలు విచారం వ్యక్తంచేస్తున్నారు.
హెర్మిట్ క్రాబ్స్ తమ శరీరానికి రక్షణ కవచాలుగా నత్త గుల్లల(షెల్స్) బదులు ప్లాస్టిక్ బాటిల్ మూతలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను ధరించాల్సి వస్తోందని తాజాగా వెల్లడైంది.
జీవవైవిధ్య ఔత్సాహికులు తీసిన ఫోటోలు, ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసిన ఆధారాలను బట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మనం వాడి పడేసిన వ్యర్థాల్లో ఈ ప్రాణులు నివసించడం చూసి తమ హృదయం ముక్కలైందంటూ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తంచేశారు.
హెర్మిట్ క్రాబ్స్ ఆయుర్దాయం గరిష్ఠంగా 40 ఏళ్లు ఉంటుందని నేషనల్ జాగ్రఫిక్ వెబ్‌సైట్ చెబుతోంది.

ఫొటో సోర్స్, SHAWN MILLER
మనుషులు వాడి పడేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులను ‘కృత్రిమ కవచాలుగా’ ధరించిన మూడింట రెండొంతుల పీతల దృశ్యాలు వెలుగులోకి వచ్చాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెప్పారు.
సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి.
సోషల్ మీడియా, ఫోటో షేరింగ్ వెబ్‌సైట్లను ఈ అధ్యయనం ఉపయోగించుకుంది.
‘‘మేం పూర్తిగా అసాధారణమైన దాన్ని గమనించడం ప్రారంభించాం’’ అని పరిశోధకులలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ వార్సా అర్బన్ ఎకాలజిస్ట్ మార్టా సుల్కిన్ వివరించారు.
‘‘అద్భుతమైన నత్తల చిప్పలను ధరించడానికి బదులు, పీతలు వాటికి వెనకాల ఎరుపు రంగులో ఉన్న బాటిల్ మూతలను లేదా లైట్ బల్బులను ఉపయోగించడం మేం చూశాం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, SHAWN MILLER
తమ పరిశీలనలో మొత్తం 386 పీతలు ఈ కృత్రిమ కవచాలను వాడుతున్నాయని, ముఖ్యంగా ప్లాస్టిక్ మూతలను ఇవి ధరించినట్లు గుర్తించామని మార్టా సుల్కిన్, తన సహోద్యోగులు గుర్తించారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా తీరంలో, తీరానికి దగ్గరగా బతికే 16 హెర్మిట్ క్రాబ్ జాతుల్లో పది జాతుల వరకు పీతలు ఈ కృత్రిమ కవచాల ద్వారానే రక్షణ పొందుతున్నాయని మేం గుర్తించాం. అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది గమనించాం’’ అని ప్రొఫెసర్ సుల్కిన్ అన్నారు.
అయితే, ఈ వస్తువులు పీతలకు ప్రమాదకరమా? లేదా చిన్న, రక్షణ కవచాలు దొరకక ప్రమాదంలో ఉన్న వాటికి ఇవి సాయమా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
‘‘ఈ ఫోటోలను తొలిసారి చూసినప్పుడు, నా హృదయం ముక్కలైనట్లు అనిపించింది’’ అని బీబీసీ రేడియో 4 ఇన్‌సైడ్ సైన్స్‌కు ప్రొఫెసర్ సుల్కిన్ చెప్పారు.
భిన్నమైన కాలంలో మనం బతుకుతున్నామన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సి ఉందని, జంతువులు, జీవులు వాటికి అందుబాటులో ఉన్నవాటిని ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు.
ప్లాస్టిక్‌పై యుద్ధానికి 175 దేశాల అంగీకారం
జీవుల్లో ఈ కృత్రిమ కవచాల వాడకం ప్రపంచ పరిణామంగా మారిందని ఇంటర్నెట్ ఆధారిత జీవావరణ అధ్యయనం వెల్లడించింది.
‘‘ఈ భూమిపై ఉన్న అన్ని పీతల్లో మూడింట రెండొంతులు ఈ కవచాలలో రక్షణ పొందుతున్నట్లు మేం చూశాం’’ అని ప్రొఫెసర్ సుల్కిన్ చెప్పారు. పర్యాటకులు తీసిన ఫోటోల ఆధారంగా తాము ఈ విషయాన్ని గుర్తించామన్నారు.
ఈ తీర ప్రాంత జీవులు ఎలా ప్లాస్టిక్‌ను వాడుతున్నాయనే దానిపై సరికొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు చెప్పారు.
వీటి వల్ల ఆ జీవులకు ఏమైనా హాని జరుగుతుందా అనేది అర్థం చేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.
వాటి జీవ పరిణామంపై ఇవెలా ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పనిచేయాలనుకుంటున్నారు.
ఈ పీతలన్నీ పెళుసుగా ఉండే తమ శరీరాలను కాపాడుకునేందుకు నత్త గుల్లలను కవచంగా వాడుకునేవి. కానీ, ఈ నత్త గుల్లల కొరత ఏర్పడటంతో, పీతలు ప్లాస్టిక్ వ్యర్థాల వైపు మరలినట్లు తెలుస్తుంది.
సహజంగా లభించే నత్త గుల్లలు తగ్గిపోవడంతో, కృత్రిమ కవచాలు దొరికించుకోవడం వీటికి తేలికవుతుండవచ్చని పరిశోధకులు చెప్పారు.
బరువు తక్కువున్న ప్లాస్టిక్ కవచాలు, చిన్న పీతలకు సాయపడుతుండవచ్చు. వీటిని మోయడం తేలిక కాబట్టి బలహీనమైన పీతలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు.
మహా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ మేర ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించిన తాజా అధ్యయనం 171 ట్రిలియన్ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలపై తేలియాడుతున్నట్లు గుర్తించింది.
ప్లాస్టిక్ వ్యర్థాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఈ వ్యర్థాలు 2040 నాటికి మూడింతలు పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ముగింపు పలికేందుకు 2024 ముగిసేలోగా ఒక చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవాలని 175 దేశాలు ఇంతకుముందు అంగీకరించాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఈ ఒప్పందంపై ప్రపంచ దేశాలు ఈ ఏడాది సంతకాలు చేస్తాయనే ఆశాభావం ఉంది.
వెలుగులోకి వచ్చిన ఈ చిత్రాలలో కూడా మనుషులకు ఒక పాఠముందని యూనివర్సిటీ కాలేజీ లండన్ మెటీరియల్స్, సొసైటీ ప్రొఫెసర్ మార్క్ మియోడౌనిక్ తెలిపారు.
పీతల మాదిరే, మనం కూడా ప్లాస్టిక్స్‌ను వాడి పడేయడానికి బదులు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తిరిగి వాడుకోవాలని ఆయన సూచించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ పీతలకు ఉన్న ముప్పు ఎంత?
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల హెర్మిట్ క్రాబ్స్‌కు ఎదురవుతున్న ముప్పు తీవ్రతను 2020లో ఒక అధ్యయనం తెలియజేసింది.
దక్షిణ పసిఫిక్‌లోని రెండు ఉష్ణమండల దీవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల్లో చిక్కుకొని ఏటా సుమారు 5.7 లక్షల హెర్మిట్ క్రాబ్స్ చనిపోతున్నట్టు ‘జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్’లో పబ్లిష్ అయిన అధ్యయనం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- పద్మ విభూషణ్ - చిరంజీవి: ‘ఇది కదా నా ప్రపంచం. ఇది కదా నిజమైన సంతోషం’ అని ఆయన ఎప్పుడన్నారు?
- హరిద్వార్: క్యాన్సర్ బాధిత చిన్నారిని తల్లి గంగా నదిలో ముంచి చంపేశారంటూ వీడియో వైరల్, అసలేం జరిగింది?
- పాకిస్తాన్: ఎస్సీలు తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనూ రాజకీయ శక్తిగా ఎందుకు ఎదగలేకపోతున్నారు?
- ‘సులభ్’ బిందేశ్వర్ పాఠక్‌కు పద్మవిభూషణ్: భారత్‌లో టాయిలెట్లు కట్టే ఆయన్ను అమెరికా ఎందుకు సాయం కోరింది?
- ‘డిసీజ్ ఎక్స్’ అంటే ఏమిటి? కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













