పాకిస్తాన్: ఎస్సీలు తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనూ రాజకీయ శక్తిగా ఎందుకు ఎదగలేకపోతున్నారు?

- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్, ఉమర్‌కోట్ - సింధ్
తీర్థ్ సింగ్ మేఘ్వార్ తన మద్దతుదారులతో కలిసి సింధ్‌లోని ఉమర్‌కోట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు మద్దతుగా వారు నినాదాలు చేస్తున్నారు.
వారు దరఖాస్తు పూర్తి చేసి తమ ఎన్నికల గుర్తు కేటాయింపుల కోసం లోపల అందజేయాల్సి ఉంటుంది. కొన్ని ఎన్నికల గుర్తులను అక్కడి నోటీసు బోర్డులో ఉంచారు. తీర్థ్ సింగ్ స్లేట్ (పలక)ను తన ఎన్నికల గుర్తుగా ఎంచుకున్నారు.
తీర్థ్ సింగ్ ఒక హిందూ. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమర్‌కోట్ నుంచి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
తూర్పు సింధ్ ప్రాంతంలో ఉండే ఒక చిన్న పట్టణం ఉమర్‌కోట్. భారత సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంటుంది.
పాకిస్తాన్‌లోని హిందువుల్లో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లోనే ఉన్నారు. ముస్లిం ఆధిపత్య పాకిస్తాన్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగినప్పటికీ, సింధ్ ప్రాంతంలో చారిత్రక హిందూ సంప్రదాయాలు కనిపిస్తాయి.
ఉమర్‌కోట్‌ను గతంలో అమర్‌కోట్‌గా పిలిచేవారు. ఒక హిందూ రాజు పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది.
మొఘల్ చక్రవర్తి అక్బర్ అమర్‌కోట్ కోటలోనే 1542లో జన్మించారు. ఈ కోట 11వ శతాబ్దంలో నిర్మితమైంది.
అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ పట్టణానికి ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమర్‌కోట్‌లో ఇప్పటికీ హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.
దేశ విభజన సమయంలో ఇక్కడి జనాభాలో 80 శాతం హిందువులేనని స్థానికులు చెబుతున్నారు. అయితే, వారిలో బాగా ధనవంతులైన ఠాకూర్లు క్రమంగా భారత్‌కు వలస వెళ్లిపోయారు.
అయితే, షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) వర్గానికి చెందిన ప్రజలు తగినన్ని వనరులు లేకపోవడంతో వలస వెళ్లలేకపోయారు. అందువల్ల ఎక్కువ మంది ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడి హిందూ జనాభాలో దాదాపు 90 శాతం మంది ఎస్సీ వర్గానికి చెందిన వారే.
వారిలో తీర్థ్ మేఘ్వార్ ఒకరు.

రాజకీయ ప్రభావం అంతంతే
ఇక్కడ హిందూ ఎస్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, కానీ రాజకీయంగా వారికి తగిన ప్రాతినిధ్యం లేదని తీర్థ్ సింగ్ అన్నారు. దీనికి సంపన్న ‘అగ్రవర్ణాల వారే’ కారణమని వారు అంటున్నారు.
''అధికారం ద్వారానే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగలం'' అని తీర్థ్ సింగ్ అన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ అసమానతలను రూపుమాపేందుకే తమ వర్గానికి ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు.
''చాలా ఏళ్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు రిజర్వుడ్ సీట్లను బడా భూస్వాములు, వ్యాపారవేత్తలు, అగ్రవర్ణాలకు చెందిన ధనవంతులకు అమ్ముకుంటున్నాయి. దాని వల్ల రాజకీయంగా ప్రాధాన్యం లేకుండా పోయింది. దానిని బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుంది'' అని ఆయన అన్నారు.
గతంలో పాకిస్తాన్‌లో మైనార్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండేవి. కానీ 2000వ సంవత్సరంలో అప్పటి సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఆ వ్యవస్థకు స్వస్తి పలికి, మైనార్టీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చారు.
ఇప్పటికీ జాతీయ, ప్రావిన్స్ అసెంబ్లీల్లో (ఎంపీ, ఎమ్మెల్యే) మైనార్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. వారు కూడా ఇతర పౌరుల మాదిరిగా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఏ నియోజకవర్గం నుంచైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.
అయితే, ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ(జాయింట్ ఎలక్టోరల్ కాలేజ్) కారణంగా తమకు రాజకీయ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఉమర్‌కోట్ ప్రజలు భావిస్తున్నారు.
ఎన్నికల్లో హిందూ ఎస్సీ వర్గానికి చెందినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. ఎన్నికల్లో విజయం దక్కనప్పటికీ, 2013 నుంచి ఇప్పటివరకు చాలా మంది ఎస్సీ అభ్యర్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఆధిపత్యం వారిదేనా?
అగ్రవర్ణాలకు చెందిన శివరాం సుథార్ అనే కార్యకర్త మాట్లాడుతూ, ''దీనికి డబ్బే ప్రధాన కారణం. కానీ, నమ్మకం కూడా కీలకం. ఎస్సీ అభ్యర్థులు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చేతులెత్తేస్తారు, దీంతో వారిని నమ్ముకున్న మద్దతుదారులు నిరాశకు గురవుతారని శివరాం అన్నారు.
''అందుకే స్థానిక హిందూ ప్రజలు కూడా వాళ్లను నమ్మడానికి సిద్ధంగా లేరు. వారికి బదులుగా, తమకేదైనా అవసరమైతే ఆ పని చేసి పెట్టగలరని భావించే ముస్లిం అభ్యర్థులకు ఓట్లు వేస్తారు'' అని శివరాం చెప్పారు.
ఉమర్‌కోట్‌లో సమస్యల గురించి చెబుతూ, ఇక్కడ హిందూ, ముస్లింలకు ఒకే సమస్యలు ఉన్నాయని శివరాం అన్నారు.
''వేర్వేరు మతాలు కావడం వల్ల ఇబ్బందులు పడడం కాదు. నిజానికి, పోటీ చేసే అభ్యర్థి ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటుంది. పేదవారి సమస్య కూడా అదే. వారికి విద్య, వైద్యం వంటి సదుపాయాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఉన్న అవకాశాలు కూడా చాలా తక్కువ. హిందూ పేదలా, ముస్లిం పేదలా అనేది ఇక్కడ విషయం కాదు. అందరూ ఆ సమస్యలతో సతమతమవుతున్నారు'' అని శివరాం చెప్పారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ - హిందూ అభ్యర్థులు
లాల్ చంద్ ఒక లాయర్. ఆయన ఎంక్యూఎం (ముత్తహిదా ఖామి మూమెంట్) పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పార్టీ తరఫున ఎన్నికలో బరిలో నిలిచిన ముగ్గురు ఎస్సీ అభ్యర్థుల్లో ఈయన ఒకరు.
ఇక్కడ 52 శాతం హిందూ జనాభా ఉన్నప్పటికీ, ఉమర్‌కోట్ జనరల్ సీటు నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా హిందూ అభ్యర్థిని నిలబెట్టలేదని లాల్ చంద్ బీబీసీతో చెప్పారు.
''ప్రధాన పార్టీలన్నీ మా హక్కులను హరించాయి. వాళ్లు కేవలం పెట్టుబడిదారులు, భూస్వాములనే ప్రోత్సహిస్తారు. మాపై నమ్మకం ఉంచి, మాకు టికెట్ ఇచ్చిన ఎంక్యూఎం పాకిస్తాన్ పార్టీకి కృతజ్ఞతలు చెబుతున్నా'' అని ఆయన అన్నారు.
''ఇక్కడి భీల్, కోలీ, మేఘ్వార్ మల్హి, యోగి లాంటి కులాలకు చెందిన ప్రజలు బడా భూస్వాముల పొలాల్లో పనిచేస్తున్నారు. అందువల్ల, ఆ భూస్వామి చెప్పిన అభ్యర్థికే ఓటు వేస్తున్నారు. హిందూ అగ్రవర్ణాల వారికి మా బాధలు అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నవారితో వాళ్లు అంటకాగుతారు. మిగిలిన మెజార్టీ హిందువులు అన్యాయానికి గురవుతున్నారు'' అని లాల్ చంద్ అన్నారు.
''రాజకీయాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అన్ని పార్టీలకూ తెలుసు. అందువల్ల గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను బరిలో దింపాలని అనుకోవు. అయితే, ఇప్పుడు సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, అసెంబ్లీ, పార్లమెంట్‌కు చేరే అవకాశాలు చాలా తక్కువ'' అన్నారాయన.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ 'తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్' ఉమర్‌కోట్ ప్రావిన్షియల్ అసెంబ్లీ (అసెంబ్లీ), నేషనల్ అసెంబ్లీ (పార్లమెంట్) నియోజకవర్గాల నుంచి మల్హి వర్గానికి చెందిన ఇద్దరు సంపన్నులైన సోదరులను బరిలో నిలిపింది.
ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దీంతో ఇప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ప్రభుత్వం తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థులను టార్గెట్ చేసిందని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేసినట్లు ఆ పార్టీ అభ్యర్థి లేఖ్‌రాజ్ మల్హి బీబీసీతో చెప్పారు.
''మా ఇళ్లలో సోదాలు చేశారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ కేసులు పెట్టారు. మా అన్నయ్యని అరెస్టు చేశారు. ఇలా ఎన్నో బెదిరింపులు, ప్రతీకార దాడులకు దిగినా మేం ఇమ్రాన్ ఖాన్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. కేవలం ఆయన మాత్రమే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పంజా నుంచి ఉమర్‌కోట్‌ను తప్పించగలరు'' అని ఆయన అన్నారు.
అయితే, ఇప్పట్లో అది జరగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ పార్టీకి పంజాబ్, ఖైబర్ పంఖ్తుఖ్వాలోనే పట్టుంది. సింధ్ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
అయితే, షెడ్యూల్డ్ కులాలకు చెందిన హిందువులు ఎన్నికల్లో పోటీ చేయడం కచ్చితంగా మార్పుకు చిహ్నం.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














