ఇజ్రాయెల్‌లో ఉద్యోగం ప్రమాదకరమని తెలిసినా భారతీయ యువకులు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు?

నిరుద్యోగం- ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ జాబ్స్ కోసం ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కు ఎదురు చూస్తున్న అభ్యర్ధులు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది హరియాణాలోని ఒక యూనివర్సిటీ క్యాంపస్. గతవారంలో ఓ రోజు ఉదయం... బాగా చలిగా ఉన్నవేళ...యూనివర్సిటీ క్యాంపస్ ముందు అనేకమంది యువకులు చలికి వణుకుతూ క్యూలో నిలబడి ఉన్నారు.

ప్లాస్టరింగ్, టైల్స్ , స్టీల్ ఫిక్సర్ ( బిల్డింగ్‌ నిర్మాణంలో ఇనుప కడ్డీలను ఒకదానికొకటి కట్టే పని) వంటి నిర్మాణ సంబంధం పనులు చేసే ఈ యువకులు ప్రాక్టికల్ ఎగ్జామ్‌ కోసం అక్కడ వేచి చూస్తున్నారు.

వారి వీపులపై లంచ్ బ్యాగ్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు ఉన్నాయి. వీళ్లంతా ఇజ్రాయెల్ వెళ్లేందుకు ఈ టెస్టులకు హాజరవుతున్నారు.

ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో రంజిత్ కుమార్ ఒకరు. ఆయన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. టీచర్‌ పోస్టుకు క్వాలిఫై అయిన వ్యక్తి. కానీ సరైన ఉద్యోగం దొరక్క ఆయన క్యాజువల్ లేబర్ గా అంటే రోజు కూలీగా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు.

పెయింటింగ్, వెల్డర్, ఆటోమొబైల్ టెక్నీషియన్, అప్పుడప్పుడు సర్వేయర్‌గా కూడా పని చేస్తుంటారు రంజిత్ కుమార్. ఈ ఎగ్జామ్ పాస్ కావడం ఆయనకు చాలా అవసరం.

31 ఏళ్ల వయసున్న రంజిత్ కుమార్ దగ్గర రెండు డిగ్రీలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్‌గా పని చేసేందుకు అవసరమైన ట్రేడ్ టెస్ట్‌లో కూడా ఆయన అర్హత సాధించారు. కానీ, రోజుకు రూ.700 కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నారు.

అదే అర్హత ఉన్నవాళ్లు ఇజ్రాయెల్ వెళితే, వసతి, ఆరోగ్య సదుపాయలతోపాటు నెలకు దాదాపు రూ.137,000 సంపాదించగలరు. అంటే రోజుకు దాదాపు నాలుగున్నర వేల రూపాయలన్నమాట.

ఏడుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని పోషించడానికి ఇజ్రాయెల్ వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. గత సంవత్సరమే ఆయనకు పాస్ పోర్ట్ వచ్చింది. అక్కడికి వెళ్లి స్టీల్ ఫిక్సర్‌గా పని చేయాలన్నది ఆయన కోరిక.

‘‘ఇక్కడ సరైన జాబ్ దొరకడం లేదు. ధరలు పెరుగుతున్నాయి. తొమ్మిదేళ్ల కిందటే నేను డిగ్రీలు పాసైనా ఆర్ధికంగా ఇంకా కుదురుకోలేదు’’ అన్నారు రంజిత్.

నిరుద్యోగం- ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL

ఫొటో క్యాప్షన్, రంజిత్ కుమార్, ఆయన స్నేహితుడు సంజయ్ వర్మ(కుడి)...ఇద్దరూ గ్రాడ్యుయేట్లు. కానీ, సరైన ఉద్యోగం లేదు.

ఇజ్రాయెల్ అవసరం ఏంటి?

హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో నిర్మాణ పనులకు అవసరమైన నిపుణుల అవసరం పెరిగింది. ఇటీవల రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించిన నివేదిక ప్రకారం, భారత్, చైనా తదితర దేశాల నుంచి 70 వేలమంది వర్కర్లను రప్పించాలని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు.

తమ దేశం నుంచి కనీసం 80 వేలమంది పాలస్తీనియన్లను తిప్పి పంపేయడంతో ఇజ్రాయెల్‌లో నిర్మాణ కార్మికుల కొరత పెరిగింది.

భారత్ నుంచి కనీసం 10వేలమంది కార్మికులను రిక్రూట్ చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే, దీనిపై స్పందించడానికి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం నిరాకరించింది.

ప్రస్తుతం హరియాణాలోని రోహ్‌తక్ పట్టణంలో ఉన్న మహర్షి దయానంద్ యూనివర్సిటీ ఇందుకు అవసరమైన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. ఉత్తర ప్రదేశ్, హరియాణాలకు చెందిన వేలమంది అభ్యర్ధులు ఇందుకు దరఖాస్తు చేసుకున్నారు.

నిరుద్యోగం- ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి.

రిస్క్ తీసుకుంటున్నారా?

సరైన ఉద్యోగం దొరక్క, దొరికినా చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్న రంజిత్ కుమార్ లాంటి అనేకమంది యువకులు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం దరఖాస్తు చేశారు. పరిస్థితులు బాగా లేక విదేశాలలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నామని అతనిలాంటి అనేకమంది ఉద్యోగార్ధులు చెబుతున్నారు.

2016 నాటి నోట్ల రద్దు వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఆ తర్వాత వచ్చిన కోవిడ్ ఇలాంటి వారి జీవితాలను దుర్భరంగా మార్చింది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైనా పదే పదే పేపర్ లీక్ వ్యవహారాలతో నిరుద్యోగులలో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి.

ఎలాగైనా విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే వారు అమెరికా, కెనడా లాంటి దేశాలకు వెళ్లడానికి ముందుకొస్తున్నారు. అయితే, ఏజెంట్లకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన డబ్బు వారి దగ్గర ఉండదు.

‘‘యుద్ధ పరిస్థితులు ఉన్నా మేం రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని వారు చెబుతున్నారు.

నిరుద్యోగం- ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL

ఫొటో క్యాప్షన్, కరోనా మహమ్మారి తర్వాత నిరుద్యోగులైన వారిలో అంకిత్ ఉపాధ్యాయ(మధ్యలో) ఒకరు.

సంజయ్ వర్మ అనే యువకుడితో మాట్లాడినప్పుడు, తాను 2014లో డిగ్రీ పూర్తి చేశానని, పోలీసుల, పారామిలిటరీ, రైల్వే సహా కనీసం 12సార్లు ప్రభుత్వోద్యోగాలకు దరఖాస్తు చేసినా జాబ్ రాలేదని చెప్పారు. (కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఉద్యోగాల ఖాళీలకు దాదాపు 20 రెట్లమంది దరఖాస్తు చేస్తున్నారు).

2017లో ఆయన ఓ ఏజెంట్‌ను కలిశారు. ఇటలీలో నెలకు 900 యూరోలు ( నెలకు సుమారు రూ.81 వేలు ) ఇచ్చే ఫామ్ జాబ్ (తోటల్లో చేసే కూలి పని) ఉద్యోగం ఇప్పిస్తానని ఆ ఏజెంట్ చెప్పారు. అందుకు రూ. 140000 డిమాండ్ చేశారు. కానీ, అంత డబ్బు ఇచ్చే స్థోమత సంజయ్ వర్మకు లేదు.

నోట్ల రద్దు, లాక్ డౌన్ కారణంగా తమ జీవితంలో అనిశ్చితి నెలకొందని పర్బత్ సింగ్ చౌహాన్ అనే యువకుడు అన్నారు. రాజస్థాన్‌కు ఈయన, ఎమర్జెన్సీ అంబులెన్స్ డ్రైవర్‌గా రోజూ 12 గంటలపాటు పని చేసినా, నెలకు 8వేల రూపాయలు మాత్రమే సంపదించగలుగుతున్నానని చెప్పారు.

చిన్న చిన్న కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్‌లు, టాక్సీల నుంచి మొబైల్ ఫోన్ రిపేర్ల వరకు అనేక పనులు చేశానని, కానీ, ఏవీ తనకు సరైన ఆదాయాన్ని ఇవ్వలేదని చౌహాన్ చెప్పుకొచ్చారు.

‘‘2016 ముందు వరకు పరిస్థితి కాస్త బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ, లాక్ డౌన్ కారణంగా సర్వం పోయింది. అప్పులు భరించ లేక కార్లను అమ్ముకున్నాను. ఇప్పుడు అంబులెన్స్‌లు నడుపుతున్నాను’’ అని చౌహాన్ చెప్పారు.

నిరుద్యోగం- ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లో మంచి ఉద్యోగం సంపాదించాలని హర్ష్ జాట్ భావిస్తున్నారు.

‘ఆదాయం సరిపోవడం లేదు’

హరియాణాకు చెందిన టైల్ సెట్టర్ ( భవనాల్లో టైల్స్ అతికించే పని )గా పనిచేస్తున్న రామ్ అవతార్‌కు జీవితం ఎలా నెట్టుకు రావాలన్నదానిపై ఆందోళన ఎక్కువగా ఉంది. రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్నాయి కానీ, ఆదాయం పెరగడం లేదు.

పిల్లలకు చదువుకు డబ్బు సమకూర్చడంపై ఆయన ఆందోళన చెందుతున్నారు. ఆయన కూతురు సైన్స్ డిగ్రీ చదువుతుండగా, కొడుకు సీఏ చదవాలని భావిస్తున్నాడు. అందుకే మంచి ఆదాయం కోసం దుబాయ్, ఇటలీ, కెనడాలలో ఉద్యోగం ప్రయత్నించారు. కానీ, ఏజెంట్లు చెప్పే ఖర్చును భరించే శక్తి ఆయనకు లేదు.

‘‘ఇజ్రాయెల్‌లో యుద్ధం జరుగుతోందని తెలుసు. కానీ, నేను చావుకు కూడా భయపడను. మేం ఇక్కడైనా చచ్చిపోతాం’’ అని ఆయన అన్నారు.

హర్ష్ జాట్‌ది మరోరకం సమస్య. 2018లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మొదట్లో ఓ కార్ల కంపెనీలో మెకానిక్‌గా పని చేశారు. తర్వాత పోలీస్ వాహనాలకు డ్రైవర్‌గా పని చేశారు. తర్వాత గుర్గావ్‌లోని ఓ పబ్‌లో బౌన్సర్‌గా నెలకు 40 వేల రూపాయలు సంపాదించారు.

‘‘మరో రెండు మూడు సంవత్సరాలు పోతే మమ్మల్ని ఈ ఉద్యోగాల నుంచి తోసేస్తారు. మాకు ఉద్యోగ భద్రత లేదు’’ అన్నారు హార్ష్ జాట్.

ఉద్యోగం ఉండదన్న ఆందోళన కారణంగా ఆయన తమ ఊరికి తిరిగొచ్చారు. ఊళ్లో ఆయనకు 8 ఎకరాల భూమి ఉంది. ‘‘ఈ రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు’’ అన్నారు హర్ష్. ఆయన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఆయన ఊళ్లోనే కొందరు రూ. 60 లక్షల వరకు చెల్లించి అమెరికా, కెనడాల్లో స్థిరపడ్డారు. వారు అక్కడి నుంచి డబ్బు పంపుతుండటంతో ఇక్కడ వాళ్ల కుటుంబీకులు సంతోషంగా ఉన్నారు. చాలామంది ఫ్యాన్సీ కార్లు కూడా కొనుకున్నారని హర్ష్ చెప్పారు.

‘‘నేను ఎలాగైనా విదేశాలకు వెళ్లి మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాలి. మన పక్కింటి వాళ్లకు మంచి కారు ఉంది. మనకెందుకు లేదు అని మా అమ్మాయి అడుగుతోంది.’’ అని హర్ష్ అన్నారు.

‘‘నాకు యుద్ధమంటే భయం లేదు’’ అన్నారాయన.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్‌ ఉద్యోగం కోసం భారతీయ యువకులు రిస్క్ తీసుకుంటున్నారా?
నిరుద్యోగం- ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MANSI THAPLIYAL

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఉద్యోగాల కోసం వేలమంది దరఖాస్తు చేసుకుంటున్నారు.

భారత్‌లో నిరుద్యోగం పెరిగిందా, తగ్గిందా?

భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించి పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పడుతోంది. 2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత, 2021-22 నాటికి 4 శాతానికి తగ్గింది.

అయితే, జీతంలేని పనిని కూడా ఉద్యోగంగా ప్రభుత్వం డేటాలో పేర్కొనడం వల్లే ఈ తగ్గుదల కనిపిస్తోందని డెవలప్‌మెంట్ ఎకనామిస్ట్, యూనివర్శిటీ ఆఫ్ బాత్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంతోష్ మెహ్రోత్రా చెప్పారు.

"ఉద్యోగాలు రావడం లేదని నేను అనడం లేదు. కానీ, ఉద్యోగాలు వ్యవస్థీకృతంగా అంతంత మాత్రంగానే పెరుగుతున్నాయి. అదే సమయంలో ఉద్యోగాల కోసం వెతికే యువకుల సంఖ్య కూడా పెరుగుతోంది’’ అని ప్రొఫెసర్ మెహ్రోత్రా అన్నారు.

నిరుద్యోగిత తగ్గుముఖం పడుతున్నా, ఇప్పటికీ ఎక్కువగానే ఉందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ తాజా స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.

2004 నుంచి రెగ్యులర్‌గా వేతనాలు పొందే ఉద్యోగుల సంఖ్య మగవాళ్లలో 18-25 శాతం వరకు, మహిళల్లో 10-25 శాతం వరకు పెరిగిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. అయితే, కరోనా దీనిపై పెను ప్రభావం చూపింది. రెగ్యులర్‌గా జీతాలు పొందే ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

పాతికేళ్లలోపు నిరుద్యోగులుగా ఉన్న గ్రాడ్యుయేట్ల సంఖ్య దాదాపు 42శాతం ఉన్నట్లు తేలింది.

ఏజెంట్లకు డబ్బు చెల్లించి తాను కువైట్‌లో తాను ఎనిమిదేళ్ల పాటు స్టీల్ ఫిక్సర్‌గా పని చేశానని, అయితే, కరోనా రాకతో తన ఉద్యోగం పోయిందని అంకిత్ ఉపాధ్యాయ అనే వ్యక్తి చెప్పారు.

‘‘నాకు ఎలాంటి భయం లేదు. ఇజ్రాయెల్‌లో పని చేయగలను. ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఆర్ధిక భద్రత లేదు’’ అన్నారాయన.

వీడియో క్యాప్షన్, అమెరికా అనుసరిస్తున్న విధానాలతో భయపడుతున్న లిటిల్ పాలస్తీనా వాసులు....

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)