అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?

ఫొటో సోర్స్, Shri Ram Janmbhoomi Teerth Kshetra / thanjavur.nic.in
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఆలయం నిర్మాణ శైలి ఏమిటి? అయోధ్య ఆలయంతోపాటు ఉత్తర భారతదేశంలోని ఆలయాలు, దక్షిణ భారతదేశంలోని ఆలయాల ఆర్కిటెక్చర్‌లో తేడాలు ఏమిటి?
‘పరమాత్మ దేహమే దేవాలయం’ అని హిందూ మత పెద్దలు చెబుతారు. దీనికి తగినట్టుగా దేహాన్ని ప్రతిబింబించేలా ఆలయాల నిర్మాణం ఉంటుందని అంటారు.
ఆలయ ప్రవేశద్వారం పైన ఉండే గోపురాన్ని పాదాలుగాను, మధ్యలోని ధ్వజస్తంభాన్ని నడుము భాగంగానూ, గర్భాలయాన్ని శిరోభాగంగానూ ఆగమాలు, హిందూ సంప్రదాయం భావిస్తుంటాయి.
అయోధ్య రామాలయం కూడా ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉత్తర భారతంలో ఎక్కువగా పాటించే నాగరి శైలిలో నిర్మితమవుతోంది.
‘‘ఉత్తర భారత నాగరి శైలిలో అయోధ్య రామాలయం నిర్మాణమవుతోంది. సోమనాథ్, ద్వారక వంటి ఆలయాలు ఈ శైలిలోనే నిర్మాణమయ్యాయి. సోమనాథ్ దేవాలయాన్ని తీర్చిదిద్ధిన స్థపతి సోంపుర మనవడు ఈ అయోధ్య ఆలయానికి రూపకర్త’’ అని బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ చెప్పారు.
అయోధ్యలోని రామ మందిరం 2.7 ఎకరాల విస్తీర్ణంలో నాగరి శైలిలో నిర్మితమవుతోంది.
నాగరం అనేమాట నాగరిగా స్థిరపడింది. ఈ నాగరం పదం కూడా నగరం నుంచి పుట్టిందే అంటారు.

ఫొటో సోర్స్, ANI
ఆర్కిటెక్చర్: భారత్‌లో ఏయే శైలులు ఉన్నాయి?
భారతదేశంలోని ఆలయాలు ప్రధానంగా మూడు నిర్మాణశైలులను కలిగి ఉంటాయి. ఇవి నాగరి, ద్రవిడ, వేసర శైలులు అని తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ(ఎస్వీయూ) రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రస్తుతం తిరుమల మ్యూజియం బాధ్యతలు చూస్తున్న నాగోలు కృష్ణారెడ్డి బీబీసీతో చెప్పారు.
నాగరి శైలిని ఉత్తర భారత ఆలయాలలో ఎక్కువగా చూస్తాం.
హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల మధ్య నాగరి శైలిని అనుసరిస్తారని ఏపీ ఆర్కియాలజీ, మ్యూజియం రిటైర్డ్ డైరక్టర్ ఈమని శివనాగిరెడ్డి బీబీసీకి తెలిపారు.
గుప్తుల కాలంలో ఈ నిర్మాణ శైలి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల వరకు నాగరం, వింధ్య పర్వతాల నుంచి కృష్ణా నది వరకు వేసరం, కృష్ణా నది నుంచి కన్యాకుమారి వరకు ద్రవిడ నిర్మాణ శైలిని అనుసరించాలని కాశ్యప శిల్పశాస్త్రం చెబుతోందని ఆయన తెలిపారు.
ఆలయ పునాది భాగం నుంచి శిఖర భాగం వరకు నలుచదరంగా ఉంటే దానిని నాగరం అంటారు. ప్రస్తుతం అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయాన్ని శేఖరి నాగరి అంటారని శివనాగిరెడ్డి చెప్పారు.
ఆలయంపై భాగాన ఉండే శిఖరం లాంటి నిర్మాణాలే చిన్నవిగా పక్క పక్కనే ఉండటాన్నే శేఖరి నాగరి అంటారని ఆయన తెలిపారు.
ఆలయంలోని శిఖర భాగాన్ని మేరుపర్వతానికి ప్రతీకగా భావిస్తారు. ఆలయంలోని చిన్నభాగంలో గర్భగుడిని నిర్మిస్తారు. అంతరాలయం కూడా ఉంటుంది. గోపురంపై కలశ నిర్మాణం ఉంటుంది.
ఈ ఆలయ నిర్మాణంలో కూడా మహామండపం, అర్ధ మండపాలు ఉంటాయి కానీ దక్షిణాదిలోలా పెద్దవిగా ఉండవు. ఆలయాన్ని ఎత్తైన వేదికపై నిర్మిస్తారు. మూలమూర్తిని ప్రతిష్ఠించే గర్భాలయం ఉంటుంది. గర్భాలయంపై శిఖరం ఉంటుంది. ఉపాలయాలు కూడా ఉంటాయి.

ఫొటో సోర్స్, www.gujarattourism.com
నాగరి శైలి ఎన్ని విధాలు?
నాగరి నిర్మాణ శైలిలో మూడు ముఖ్యమైన శైలులు ఉన్నాయన్నారు ఈమని శివనాగిరెడ్డి. వీటిలో రేఖా నాగరి, కాదంబర నాగరి, శేఖరి నాగరి.
అయోధ్య రామాలయాన్ని శేఖరి నాగరి నిర్మాణ శైలిని అనుసరిస్తూ నిర్మిస్తున్నారని, నాలుగో శతాబ్దంలో దేవ్‌గర్‌ను గుప్తులు ఈ పద్ధతిలోనే కట్టారని ఆయన తెలిపారు.
దక్షిణాదిలోనూ నాగరి శైలిలో నిర్మితమైన ఆలయాలు ఉన్నాయని శివనాగిరెడ్డి ప్రస్తావించారు.
కాదంబర నాగరి శైలికి శ్రీశైల ఆలయం, రేఖా నాగరి నిర్మాణానికి ఆలంపూర్ ఆలయం ఉదాహరణలు అని వివరించారు.
అలాగే భుమిజ నాగరి ఆలయ నిర్మాణమంటే గుడి పూర్తి నక్షత్రాకారంలో ఉంటుందని చెప్పారు.

ఫొటో సోర్స్, thanjavur.nic.in
ద్రవిడ నిర్మాణ శైలి ఎలా ఉంటుంది?
ద్రవిడ శైలిలో నిర్మితమైన ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. ఈ శైలి దక్షిణ భారతానికి చెందినది.
పల్లవులు ఈ శైలిని ప్రారంభించారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని అత్యధిక ఆలయాలు ఈ శైలిలో నిర్మితమైనవే.
‘‘భక్తి ఉద్యమం మొదలైన తరువాత ప్రజలకు పూజలు, పునస్కారాలు ఎక్కువయ్యాయి. విగ్రహారాధన పెరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలో కల్యాణోత్సవ మండపం, పోటు (వంటశాల) తదితర అదనపు హంగులు కూడా వచ్చి చేరాయి.
ప్రజలలో పెరిగిన భక్తికి అనుగుణంగా ఆలయాలను మరింత విస్తరించారు. అందుకే దక్షిణాదిన పెద్ద పెద్ద ఆలయాలు కనిస్తాయి. దేవునికి సకల భోగాలు సమర్పించాలనే ఉద్దేశంతో ఆలయాన్ని విస్తరించారు ’’ అంటారు ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవిడ శైలిలో నిర్మించే ఆలయాలన్నీ సాధారణంగా విశాలంగా, పెద్దవిగా ఉంటాయి.
ఆలయంలో ప్రవేశ ద్వారం (దీనినే గోపురం అని పిలుస్తారు), బలిపీఠం, ధ్వజస్తంభం, వాహనమండపం (శివాలయాలలో నందీశ్వరుడు, వైష్ణవాలయాలలో గరుత్మంతుడు), మహామండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. తరువాత చుట్టూ ప్రాకార మండపాలు, నాట్య మండపాలు కనిపిస్తాయి.
గర్భగుడి పైభాగాన్ని విమానం లేదా శిఖరమని పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
నాగరి, ద్రవిడ శైలుల మధ్య ప్రధాన తేడాలు ఏమిటి?
నాగరి శైలి,ద్రవిడ శైలికి ప్రధానమైన తేడా గోపురాలే అంటారు కిరణ్. నాగరి శైలిలో నిర్మితమైన ఆలయాలలో ప్రవేశద్వారం వద్ద గోపురాలు బదులు తోరణం లేదా ఆర్చిలాంటివి ఉంటాయి.
ద్రవిడ శైలిలో గోపురాలను మూడు అంతస్తుల నుంచి 13 అంతస్తుల వరకూ నిర్మిస్తారు. తదనుగుణంగా పైన కలశాలను కూడా ఏర్పాటు చేస్తారు .
నాగరి శైలిలో ప్రవేశద్వారాన్ని ప్రతోళి అని పిలుస్తారని, సరళంగా చెప్పుకోవాలంటే దీనిని ‘తోరణం’ అనొచ్చని కిరణ్ చెప్పారు.
నాగరి విధానంలో ప్రాకారం లేదని, తరువాత కాలంలో ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
ద్రవిడ నిర్మాణ శైలిలో ఆలయాలన్నీ భారీగా, విశాలమైన ఆవరణలో నిర్మితమవుతాయి.
నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇక దక్షిణాదిన ఆలయాలు సాధారణంగా కొండలు, నది ఒడ్డు ప్రాంతాల్లో నిర్మిస్తే, నాగరి శైలిలో ఎక్కువగా మైదానప్రాంతాలలో నిర్మితమవుతాయి. నాగరి శైలిలో ఆలయం లోపల అంతస్తులు కూడా ఉంటాయి.
‘‘బౌద్ధ స్థూపాల నుంచి స్ఫూర్తి పొంది ఇలా అంతస్తుల ఆలయాలు నిర్మించారని’’ కిరణ్ వివరించారు.
‘‘వీటిని మేడ గుళ్ళు అంటారు. చాళుక్యులు కూడా ఇలాంటివి నిర్మించారు. ద్రాక్షారామం, తంజావూరులోని బృహదీశ్వరాలయం లాంటివే ఇందుకు తార్కాణం. ద్రాక్షారామంలో శివలింగం కొనభాగం రెండో అంతస్తులో ఉంటుంది. అమరేశ్వరంలోనూ అంతే’’ అని చెప్పారు.
భక్తి ఉద్యమ ప్రభావంతో ఆలయం విస్తరించడం మొదలయ్యాక, అమ్మవారిని పూజించే సంస్కృతి కూడా పెరిగిందని, 11వ శతాబ్దం నుంచి అమ్మవారి ఆలయం కూడా గర్భాలయం పక్కన నిర్మించడం మొదలైందని కిరణ్ తెలిపారు.
ఇక ఆలయాలకు పెద్ద పెద్ద ప్రహరీలు నిర్మించడమనేది చోళులు, పాండ్యులు, విజయనగర రాజుల కాలంలో ఎక్కువైంది. వీరికాలంలో విమాన గోపురం ఎత్తు తగ్గి, చుట్టూ ఉండే గోపురాల ఎత్తు పెరిగింది.
ఈ గోపురాలను రాజదర్పానికి ప్రతీకగానూ భావించేవారు.
ఈ కారణంగానే దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలోని తంజావూరు, మధుర, శ్రీరంగం, రామేశ్వరం, శ్ర తదితర పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలన్నీ విశాలంగా, భారీ ప్రాకారాలతో గోపురాలతో దర్శనమిస్తుంటాయి. అలాగే శ్రీకాళహస్తి, తిరుమల ఆలయాలు కడా ద్రావిడ శైలిలో నిర్మితమైనవే. ద్రవిడ శైలిలో నిర్మితమయ్యే ఆలయాలకు పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర, దక్షిణ సంగమం వేసరశైలి
నాగరి, ద్రవిడ శైలుల సంగమమే వేసర శైలి అని చెప్పారు శివనాగిరెడ్డి. కర్ణాటక ప్రాంతంలో చాళుక్యుల కాలంలో ఇది మొదలైంది. ఇందులో ఆలయం కొద్దిగా తక్కువ ఎత్తులో ఉంటుంది.
‘‘ఉత్తర భారతం నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్స్ ఈ ప్రాంతంలో ఆలయాలు నిర్మించడం వల్ల దక్షిణాదికి ఇది పరిచయమైనట్టు చరిత్రకారుల భావనగా ఉంది’’ అని తిరుమల మ్యూజియం డైరక్టర్ కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, PIB
ఈ వేసర శైలి బాదామి చాళుక్యుల కాలంలో పురుడుపోసుకుందంటారు. ద్రవిడ, నాగరి శైలిని మిళితం చేసి బాదామిలో చాళుక్యులు ఆలయాలు నిర్మించారు.
బేలూరు, హలేబీడులోని హోయసలల ఆలయాలు ఈ శైలికి మరో ఉదాహరణ.
హోయసల పాలనలో వేసరి శైలి బాగా అభివృద్ధి చెందింది.
తెలంగాణలోని రామప్పదేవాలయం కూడా వేసర శైలిలో నిర్మితమైనదే.
వేసరశైలిలో నక్షత్ర ఆకారంలో నిర్మించే ఆలయంలో ప్రధాన మందిరానికి అనుబంధంగా మిగిలిన మందిరాలు ఉంటాయి.
ఈ ఆలయాలలో ఎక్కువగా మహాభారత, రామాయణ ఇతివృత్తాలు చెక్కుతారు. అలాగే దక్షిణాది ఆలయాలకు ఉన్నట్టుగా వేసర శైలిలో నిర్మించే వాటికి ఎక్కువగా గోపురాలు ఉండవు.
దేవాలయాలలో ఒకటి కంటే ఎక్కువ మందిరాలు ఉంటాయి. సాధారణంగా మూడు పుణ్యక్షేత్రాలు ఉండేవి కూడా ఉంటాయి.
ఆలంపూర్‌లోని కొన్ని ఆలయాలు, కర్ణాటకలోని పట్టడకల్, ఈ వేసరశైలి నిర్మాణానికి ప్రతీక అని చెప్పారు కృష్ణారెడ్డి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో వైభవంగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ..పాల్గొన్న ప్రధాని మోదీ
- పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- అయోధ్య రూపురేఖలు ఎలా మారిపోయాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















