అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ బీజేపీకి మరోసారి అధికారం కట్టబెడుతుందా?

- రచయిత, మయూరేశ్ కొన్నూర్
- హోదా, బీబీసీ కోసం
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తేదీని ప్రకటించినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోంది. మందిర నిర్మాణం పూర్తి కానప్పటికీ ప్రాణ ప్రతిష్ఠ తేదీని ఎందుకు ప్రకటించారు, అది కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎందుకు అన్నది ఆ చర్చ.
ప్రతిపక్షం ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించింది. శంకరాచార్యులు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, అనుబంధ పార్టీలు, సంస్థలు ప్రతి ఇంటిలో అక్షింతలు పంపిణీ చేశాయి. కలశ యాత్రలు, ర్యాలీలు నిర్వహించాయి. దేశంలోని చాలా ప్రాంతాలు కాషాయం రంగుతో నిండి భక్తి వాతావరణం కనిపిస్తోంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చారు. అందుకే ఈ కార్యక్రమానికి ముందు నుంచీ రాజకీయ కోణంలో చర్చ జరుగుతోంది.
సమకాలీన కాలంలో అయోధ్య కాండ కేవలం మతపరమైనది కాదు. అందులో రాజకీయం కలబోసి ఉంది.
రామమందిర ఉద్యమం హిందువుల్లో మెజారిటీ వర్గాన్ని ప్రభావితం చేయడమే కాదు భారత రాజకీయాల స్వభావాన్ని కూడా మార్చేసిందని చెప్పాలి.
అయోధ్యలో రామమందిర సమస్య రాజకీయాల్లోకి రావడంతో ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికపైనా దాని ప్రభావం కనిపించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
గత మూడు దశాబ్ధాలుగా బీజేపీ రాజకీయంగా బలంగా నిలవడానికి 'అయోధ్యలో రామమందిరం' అంశం తోడ్పడింది. ఇపుడు ‘రాముడి ప్రతిష్ఠాపన’ అంశం నరేంద్ర మోదీ నాయకత్వంలోని కాషాయం పార్టీకి మూడోసారి విజయం సాధించడానికి ఉపయోగపడగలదా?

ఫొటో సోర్స్, ANI
బీజేపీకి మరోసారి ప్రయోజనం ఉంటుందా?
గత మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర చూస్తే రామమందిరం అంశం ఎన్నికల సమయంలో బీజేపీకి లాభించింది.
బీజేపీ ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఇద్దరు ఎంపీలకే పరిమితమైన ఆ పార్టీ ఆ తర్వాత అది అధికారంలోకి వచ్చింది.
2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో హిందూ ఓటర్లలో జరిపిన సర్వేలో వెల్లడైన డేటాను సెఫాలజిస్ట్, లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
‘‘దేవాలయాలకు ఎక్కువగా వెళ్లేవారు, మత విశ్వాసం ఉన్న చాలామంది బీజేపీకి ఓటు వేశారు. ఈ ఓటింగ్ శాతం గణనీయంగా ఉంది. ఇలాంటి వాళ్లు దాదాపు 51 శాతం మంది 2019లో బీజేపీకి ఓటేశారు. 2014లో కూడా దాదాపు ఇంతే మద్దతు ఉంది. అదొక్కటే కాదు, పెద్దగా మత పట్టింపులేని, రోజూ గుడికి వెళ్లని వారిలో 32 శాతం మంది బీజేపీకి ఓటేశారు. మత విశ్వాసం ఉన్న అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని దీనర్థం’’ అని సంజయ్ కుమార్ అన్నారు.
కాబట్టి, రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పడే మతపరమైన వాతావరణం కారణంగా, రామమందిరంపై ఆసక్తి ఉన్నవారి ఓట్లు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది.
1980వ దశకంలో రామమందిరం అంశం ప్రాధాన్యం సంతరించుకున్నప్పటి నుంచి బీజేపీ ఈ ఓటర్ల మద్దతును ఎక్కువగా పొందతూ వచ్చింది.
2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, 2019లో పుల్వామా-బాలాకోట్ ఘటనల వంటి భిన్నమైన రాజకీయ వాతావారణం ఉన్నప్పటికీ, ఓటర్లపై మతపరమైన అంశాల ప్రభావం తగ్గలేదు'' అని కుమార్ చెప్పారు.
ఈ ఏడాది ఎన్నికల్లోనూ అదే జరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.
‘‘2024 ఎన్నికల్లో హిందుత్వ అంశంపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతుందని, దీనిలో రామమందిర అంశం ముందంజలో ఉంటుందని భావిస్తున్నాను. రామమందిర నిర్మాణం విషయంలో కనీసం ఉత్తర భారత ఓటర్లైనా బీజేపీకి ఓటేస్తారని నమ్ముతున్నాను’’ అని కుమార్ పేర్కొన్నారు.
అయితే, రామమందిర కార్యక్రమం పూర్తిగా మతం, విశ్వాసానికి సంబంధించినదనీ, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవనీ బీజేపీ నేతలు అంటున్నారు.
కానీ, ప్రజల మనోభావాలు ఈ స్థాయిలో ప్రభావితమైనప్పుడు దాని ఫలితం కూడా కనిపించవచ్చు.
‘‘ఇలాంటి ప్రజా ఉద్యమం దేశ నలుమూలకు చేరినపుడు ప్రజాభిప్రాయం ఒక దిశలో పయనిస్తుంటుంది. ఇది ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా ఆ ఫలితం కనిపిస్తుంది” అని మహారాష్ట్రలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ భండారీ చెప్పారు.
అయోధ్యలో గుడి కట్టిస్తానని, రామజన్మభూమి ఆందోళనలో పాలుపంచుకుంటానని వాగ్దానం చేయడం ద్వారా బీజేపీ ఏళ్ల తరబడి ఈ అంశాన్ని ప్రచారం చేస్తూనే ఉంది.
ఆలయ ప్రారంభోత్సవం ద్వారా అవే ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తున్నప్పటికీ, ఎన్నికల్లో కొన్ని విషయాలు మొత్తం వ్యవహారాన్ని మార్చేయవచ్చు.
“బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా హిందుత్వం ప్రతిచోటా ఆధిపత్యం చెలాయిస్తుందని, అన్ని చోట్లా బీజేపీ గెలుస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్, కాన్షీరామ్‌లు కలిసి రావడంతో బీజేపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది’’అని సీనియర్ జర్నలిస్టు రామ్‌దత్ తివారీ అన్నారు.
“రామమందిర ప్రభావంతో బీజేపీకి గరిష్టంగా 10 నుంచి 20 సీట్లు పెరుగుతాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి రామమందిరం ఒక్కటే కారణం కాదు. మీరు ఒకే ప్రోడక్టును మళ్లీ మళ్లీ అమ్ముకోలేరు. రామ మందిరాన్ని ప్రజలు ఆమోదించారు. ఇప్పుడు ప్రారంభం కూడా అయ్యింది. ఇది అందరికీ ముందే తెలుసు. కాబట్టి, బీజేపీకి దాని వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ రామమందిరం సృష్టించిన భావోద్వేగ వాతావరణాన్ని వారు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. రాజకీయం అంటే అదే’’ అని లోక్‌సత్తా పత్రిక ఎడిటర్ గిరీష్ కుబేర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మండల్ vs కమండల్, కులం vs మతం
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణం, రామమందిర నిర్మాణం పూర్తవుతున్న వేళ, భారత రాజకీయాల్లో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ పోరాటం ఆవిష్కృతమవుతుందా అన్న సందేహం కూడా వస్తోంది.
80లలో రామ మందిర ఉద్యమయం ప్రారంభమై 90ల నాటికి తీవ్ర రూపం దాల్చే నాటికి మండల్ కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చాయి.
ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం దేశ రాజకీయాలను మార్చేసింది.
భారత రాజకీయాల్లో కులం, మతం అనేవి ఎప్పుడూ ప్రభావిత అంశాలే. అందుకే ఈ రాజకీయాలు పునరావృతమవుతాయా అన్న సందేహాలు వస్తున్నాయి. మరి కమండల్ ప్రభావాన్ని మండల్ ఎఫెక్ట్ ఆపగలదా?
ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఆ దిశగా ప్రయత్నిస్తోంది. రామమందిరం అంశం విస్తృతంగా కనిపిస్తుండటంతో కులాల వారీగా జనాభా గణన చేపట్టాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.
'జిత్నీ అబాదీ ఉత్నా హక్' ( కమ్యూనిటీ పరిమాణాన్నిబట్టి వారి హక్కులు కూడా ఉండాలి)అనే ప్రచారం అందులో భాగమే. అయితే, 1992-93 నాటికి 2024 నాటికి కాలం చాలా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐడెంటిటీ పాలిటిక్స్, కులం, మతం మధ్య పోరాట స్వభావం మారిపోయింది. బీజేపీ కూడా కేవలం కమండలానికే పరిమితం కావడం లేదు. మండల్‌ను కూడా ప్రయోగిస్తోంది. అంటే ఆ పార్టీ సోషల్ ఇంజినీరింగ్ లో ముందుంది.
“2014 వరకు, ఓబీసీలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే 2014 నుంచి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మండల్‌ను కమండల్‌తో దెబ్బతీసే రాజకీయం ఇప్పుడు కనిపించడం లేదు. బీజేపీలో ఇప్పుడు అత్యంత వెనకబడిన బీసీలు, పేదలు ఉన్నారు. ఇది వాళ్ల మార్క్ మండల్ రాజకీయం’’ అని ఉత్తరప్రదేశ్ జనమోర్చా పత్రిక ఎడిటర్ సుమన్ గుప్తా అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం బీజేపీ తీసుకొచ్చిన పలు పథకాల వల్లే ఇలా జరిగిందని గుప్తా చెబుతున్నారు. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఆ పార్టీ తమ ప్రభుత్వాలతో ఈ పథకాలు అమలులో పెట్టించింది. దీంతో ఈ వర్గాలు బీజేపీకి దగ్గరయ్యాయి.
సీనియర్ జర్నలిస్ట్ రామ్‌దత్ త్రిపాఠి అభిప్రాయం ప్రకారం ‘‘బీజేపీ రాజకీయాలు మతం, సంక్షేమం అనే అజెండాతో నడుస్తున్నాయి’’
రామమందిరం, హిందుత్వ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిపక్ష పార్టీలు కుల గణన అంశాన్ని తెరపైకి తెచ్చినా అది అంతగా పండకపోవచ్చని లోక్‌నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)కు చెందిన సంజయ్ కుమార్ కూడా భావిస్తున్నారు.
‘‘కుల గణన అంశం గుడి నిర్మాణం తర్వాత మరుగున పడిపోతుంది. కుల జనాభా లెక్కల గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పటికీ, నేటి రోజుల్లో కులంకన్నా మతమే ప్రధానమైపోయింది. బీజేపీకి కులం ముప్పు పొంచి ఉందన్న వాదన అంత బలంగా లేదు. కానీ, హిందువులు, హిందుత్వం ప్రమాదంలో ఉందన్న వాదన మాత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రస్తుతం కులం కన్నా మతం ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. కుల గణన అంశంతో జనాన్ని తమ వైపు తిప్పుకోవడం కష్టమే’’ అని కుమార్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ హిందువులకు దూరమైందా?
ఇలాంటి వాతావరణంలో కాంగ్రెస్, ప్రతిపక్షాలు రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయంగా విజ్ఞత అనిపించుకుంటుందా, ఆ పార్టీలకు అది నష్టం చేయదా? గత కొద్దిరోజులుగా ఆలయ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
అసలు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం అందుతుందా అన్న సందేహం కూడా వచ్చింది. అయితే, కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం వచ్చింది. కానీ, చాలా పార్టీలు ఈ వేడుకకు దూరంగా ఉన్నాయి. తాము అయోధ్యకు తర్వాత వెళతామని ప్రకటించాయి.
ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం లేదా అంగీకరించకపోవడం అనేది ప్రతిపక్ష పార్టీలకు ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. వేడుకకు వెళితే బీజేపీ సిద్ధాంతాన్ని అనుసరించినట్లు అవుతుంది. వెళ్లకపోతే హిందూ ఓటర్లను దూరం చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే, రామమందిరం అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు అయోధ్యకు దూరంగా ఉన్నాయి.
నిజానికి రామ మందిరం నిర్మాణం, ప్రారంభోత్సవం అంశాన్ని ఓటర్లు మతపరమైన అంశంగా చూశారా లేక రాజకీయమైనదిగా పరిగణించారా అన్నది ఎన్నికల ఫలితాలనుబట్టి తెలుస్తుంది.
ఒకవైపు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో రామమందిర వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాల్లో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సాగిస్తున్నారు. అయితే, ఈ యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదని ఆ పార్టీ చెబుతోంది.
‘‘గతంలో బీజేపీకి ఓటు వేయనివారు ఈ కార్యక్రమం చూశాక వారికి ఓటేస్తారని నేను అనుకోను’’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
రామ మందిరం ఓట్లు సంపాదించి పెడుతుందన్న ఊహలో కొందరు, ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయదని మరికొందరు వేసుకుంటున్న అంచనాల్లో ఏది నిజమవుతుందన్నది కీలకం.
అయోధ్యలో జరిగే మతపరమైన కార్యక్రమానికి హాజరు కాకూడదన్న శంకరాచార్య నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటగా మిగిలింది. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించడానికి ఒక సాకు దొరికింది ఆ పార్టీకి.
‘‘హిందూ మతానికి గురువులుగా భావించే శంకరాచార్యులు అయోధ్యలో జరుగుతున్నదంతా అశాస్త్రీయం అని చెప్పారు. ఈ కార్యక్రమానికి రావడానికి కూడా నిరాకరించారు. ఇప్పుడు చెప్పండి ...శంకరాచార్య కూడా హిందూ వ్యతిరేకా? ముస్లిం అనుకూలుడా?’’ అని పృథ్వీరాజ్ చవాన్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ANI
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలను మందిరం మరిపించగలదా?
క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. దేశంలోని సామాన్య ప్రజలు జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పటికీ మీడియాలో మాత్రం మందిరమే అతి పెద్ద సమస్య అన్నట్లు ప్రచారమవుతోంది.
‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' తాజా నివేదిక ప్రకారం, దేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతానికి పైగా ఉంది. ఇది గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే చాలా ఎక్కువ.
మరోవైపు ద్రవ్యోల్బణం ఉంది. అనేక కుటుంబాల బడ్జెట్‌లను ప్రభావితం చేస్తోంది. సమస్యల్లో ఉన్నవారు ఎక్కువమంది దిగువ మధ్యతరగతి, పేద తరగతులకు చెందినవారే.
రామమందిరమే పెద్ద సమస్య అన్నట్లు ప్రచారమవుతున్న నేటి తరుణంలో సామాన్యుల జీవితానికి సంబంధించిన సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపగలవా?
‘‘ఈ పిచ్చిని కావాలని పెంచుతున్నారు. జనం ఇందులో పడి ఇతర సమస్యలను మరిచిపోతారు. ఈ ఉన్మాదంలో నాయకులు కూడా ఉన్నప్పుడు, కింది తరగతి వారు ప్రశ్నలు వేయరు. ఉద్యమాలు జరగవు. దీనికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పరు’’ అని జర్నలిస్టు గిరీష్ కుబేర్ అభిప్రాయపడ్డారు.
లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌కు చెందిన సంజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం ‘‘ధరల పెరుగుదల, నిరుద్యోగం అనేవి చర్చల్లో ఉన్నప్పటికీ, అవి ఓటింగ్‌లో ప్రభావం చూపించకపోవచ్చు. గత రెండేళ్లుగా ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల సమయంలో చేసిన సర్వేల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు తేలింది.
కానీ, సమస్యలతో సంబంధం లేకుండా మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం చూశాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అయినా, ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. ప్రజలు ఈ సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ, ఓటు మాత్రం బీజేపీకి వేస్తారు. మతం, జాతీయవాదం హిందువులను ఏకం చేస్తున్నాయి.’’ అని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
చాలామంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, జాతీయవాదానికి, మతానికి లింక్ పెట్టడంలో బీజేపీ విజయం సాధించింది. అందుకే ఈ రెండూ బీజేపీకి ఎన్నికలలో లాభం కలిగించే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. దీనితో భారత రాజకీయాల్లో అయోధ్య రామమందిర అధ్యాయం ముగుస్తుందా లేదా అదే పుస్తకంలో కొత్త అధ్యాయానికి నాంది అవుతుందా అనేది వచ్చే ఎన్నికలు నిర్ణయిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















