పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ

చిన్నారితో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

‘మదుపు అంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించింది’ అని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెప్తారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి దీర్ఘకాలం మదుపు చేయాలనేది పర్సనల్ ఫైనాన్స్ మూలసూత్రాలలో ఒకటి.

అదే సమయంలో, స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను (షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్) విస్మరించకూడదు.

మరి ఈ స్వల్ప కాల వ్యవధిని ఎలా నిర్వచించాలి? ఏ అవసరాల కోసం మదుపు చేయాలి? అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

మూడు సంవత్సరాల కాలానికి నిర్దేశించుకున్న ఫైనాన్షియల్ గోల్స్‌ను స్వల్పకాల లక్ష్యాలుగా పరిగణించవచ్చు. అది మాత్రమే కాదు, ప్రతి ఏడాది ఖర్చు చేయాల్సిన అవసరాలను గుర్తించి, వాటి కోసం కూడా మదుపు చేయడం కీలకం.

ఇంతకీ ఏంటి ఈ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్? వాటి కోసం ఏం చేయాలి?

స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మదుపు చేయడం ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఏ అవసరాల కోసం మదుపు చేయాలి?

స్వల్పకాలిక అర్థిక లక్ష్యాల గురించి చెప్పే సందర్భంలో ఈ ఉదాహరణలు చూడండి..

1. ప్రతి ఏడాది చెల్లించే పిల్లల స్కూల్ ఫీజు

2. జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీ వార్షిక ప్రీమియం

3. వాహనం సర్వీసింగ్, వాహన బీమా ఖర్చు

పైన చెప్పినవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండే ఖర్చులే. పైగా తప్పించుకోలేనివి. అవే కాక విహారయాత్రలు, వస్తువుల కొనుగోళ్లు కూడా స్వల్పకాలంలో వచ్చే ఖర్చులుగానే పరిగణించాలి.

ఏడాదికి ఒకసారి లేదా రెండు సార్లు వచ్చే ఈ ఖర్చులు మిగిలిన ఏడాది మొత్తం మనం చేసే మదుపును ప్రభావితం చేస్తాయని మర్చిపోకూడదు.

ఏటా ఉండే ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఆలోచించి మదుపు చేయడం ఎందుకు అనే వాదన కూడా ఉంది. అది సరైన ఆలోచనా ధోరణి కాదు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి.

1. మన ప్రమేయం లేకుండా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను వదులుకోకూడదు. అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

2. తప్పించుకోలేని ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, నెల జీతం నుంచి వీలైనంత తక్కువ మొత్తాన్నే వాడుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్ సూత్రాలలో ఇది చాలా ముఖ్యమైనది.

పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

స్వల్పకాలిక లక్ష్యాల కోసం మదుపు చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం.

1. పెట్టుబడికి రక్షణ

తప్పనిసరి ఖర్చుల కోసం చేసే మదుపు విషయంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.. మదుపు చేసిన మొత్తాన్ని రక్షించుకోవడం.

ఎందుకంటే, మదుపు చేసిన మొత్తం మన ఆర్థిక లక్ష్యానికి తగినట్టుగా ఉన్నప్పుడు ఆ మొత్తానికి ఎలాంటి ఢోకా లేకుండా ఉండాలి.

దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేసే మదుపు, స్వల్పకాల లక్ష్యాల కోసం చేసే మదుపు మధ్య ముఖ్యమైన తేడా ఇదే.

2. పెట్టుబడి ఉపసంహరణ

ఈ లక్ష్యాల పరంగా ఆలోచించాల్సిన మరో విషయం మదుపు చేసిన మొత్తం ఎంత త్వరగా వెనక్కు తీసుకునే అవకాశం ఉందనే అంశం.

ఎందుకంటే, కొన్నిసార్లు ఈ తరహా ఖర్చులకు ముందుగానే పెట్టుబడిని ఉపసంహరించుకోవాల్సిన అవసరం కలగొచ్చు.

అలాంటి సందర్భాల్లో సులభంగా పెట్టుబడిలోని కొంత మొత్తం లేదా మొత్తం మదుపును వెనక్కితీసుకోవాలి.

పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

3. పెట్టుబడిపై వచ్చే రాబడి

ఏ ఆర్థిక లక్ష్యమైనా పెట్టుబడి మీద వచ్చే ఆదాయమే చాలా కీలకం. ఎక్కువ రాబడి వచ్చే మదుపు మార్గాలను సద్వినియోగం చేసుకోవాలి.

అయితే, స్వల్పకాలిక లక్ష్యాల కోసం చేసే మదుపు కాబట్టి, మన పెట్టుబడికి భరోసా ఎక్కడ ఉంటుందో, ఆ మార్గానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే, మన అవసరాల కోసమే చేసే మదుపు అది.

ఇప్పుడు ఎలాంటి మదుపు మార్గాలున్నాయో చూద్దాం.

షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్

ఫొటో సోర్స్, Getty Images

4. ఫిక్స్‌డ్ డిపాజిట్

ఇప్పటిదాకా అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ఆ డిపాజిట్ కాల వ్యవధి కూడా 45 రోజుల నుంచి ఐదేళ్ల మధ్యలో ఉంటుంది. మన అవసరానికి అనుగుణంగా కాల వ్యవధిని ఎంచుకోవచ్చు.

మన పెట్టుబడితో పాటు బ్యాంక్ నుంచి వచ్చే వడ్డీ కూడా కచ్చితంగా అందుతున్న భరోసా ఉంటుంది అయితే, ఆ వడ్డీకి ఆదాయపు పన్ను కట్టాలి.

స్వల్పకాలంలో వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లో సహజంగానే వడ్డీ తక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంక్ తప్పకుండా మనకు రావలసిన మొత్తం ఎలాంటి రిస్క్ లేకుండా ఇస్తుందనే నమ్మకంతో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు.

రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే త్రైమాసిక వడ్డీ రేట్ల ప్రభావం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువగా ఉంటుంది.

5. రికరింగ్ డిపాజిట్

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మాదిరిగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని బ్యాంకులో మదుపు చేయాల్సిన పని లేకుండా, ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించే విధానాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. గతంలో ఇది కూడా చాలా ప్రాచుర్యం పొందిన మదుపు మార్గం.

ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉండటంతో రికరింగ్ డిపాజిట్ విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.

రికరింగ్ డిపాజిట్ ద్వారా వచ్చిన మొత్తం కూడా ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ మాదిరిగానే, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకున్న మదుపు మార్గం ఇది.

డెట్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

6. డెట్ ఫండ్స్

డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసే మొత్తాన్ని నిర్వహించే బాధ్యత ఫండ్ మేనేజర్‌పై ఉంటుంది. ఆ ఫండ్ మేనేజర్ పెట్టుబడితో కొన్ని బాండ్లను కొని, వాటి మీద వచ్చే వడ్డీని మనకు ఆదాయంగా ఇస్తారు. స్థూలంగా ఇది ఒక రుణదాతకు, రుణగ్రహీతకు మధ్య జరిగే లావాదేవీ లాంటిది.

వివిధ రంగాలలో ఉండే బాండ్ల వడ్డీలలో తేడాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫండ్ మేనేజర్ పాత్ర చాలా కీలకం.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంటే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి ఇది చాలా ఉపయోగం, ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే కచ్చితంగా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

డెట్ ఫండ్స్ మీద వచ్చే ఆదాయం కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) పరిధిలోకి ఉన్నందున ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు.

7. లిక్విడ్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ కోవలో ప్రత్యేకమైనవి లిక్విడ్ ఫండ్స్ .

సెబీ నిబంధనల ప్రకారం లిక్విడ్ ఫండ్స్ ఒక రంగంలో గరిష్ఠంగా 20% మాత్రమే మదుపు చేయగలరు. అలాగే కనీసం 20% త్వరగా వెనక్కు తీసుకునే అవకాశం కల్పించే మనీ మార్కెట్‌ వంటి మార్గాలలో మదుపు చేయాలి.

నిబంధనల వల్ల లిక్విడ్ ఫండ్స్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో చేసే మార్పుల ప్రభావం లిక్విడ్ ఫండ్స్ మీద తక్కువగా ఉంటుంది.

దీర్ఘ కాలిక ఆర్థిక లక్ష్యాల మాదిరిగానే, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్‌ను కూడా అందుకునేలా మదుపు మార్గాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

(గమనిక: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారును సంప్రదించి తీసుకోవాలి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)