ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధాలు మారుతున్నాయా?

ఫొటో సోర్స్, @BJP4INDIA
- రచయిత, రాఘవేంద్ర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య ఉన్న లోతైన సంబంధాల గురించి అందరికీ తెలుసు.
అయితే, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు బహిరంగంగా ఒకేసారి లేదా ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.
2020లో అలాంటి ఒక సందర్భం వచ్చింది. అయోధ్యలో రామ మందిర భూమి పూజ కార్యక్రమంలో ఈ ఇద్దరూ కలిసి కనిపించారు.
సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక సమయంలోనూ వీరిద్దరూ మరోసారి ఒకే దగ్గర కనిపించారు.
రామమందిర గర్భగుడిలో మోదీతో కలిసి పూజలు చేస్తూ, వేదిక మీద ప్రసంగిస్తూ భాగవత్ కనిపించారు.

ఫొటో సోర్స్, @BJP4INDIA
సంబంధాల్లో మార్పు వస్తోందా?
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు. కానీ, ఆ వేడుకలో ప్రధాన వ్యక్తిగా మాత్రం కాదు.
తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడంలో భాగవత్ ఎక్కడా తగ్గలేదు. ‘‘ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు ప్రధాన మంత్రి కఠోర వ్రతాన్ని ఆచరించారు. కోరినదాని కన్నా ఎన్నో రెట్లు కఠినమైన వ్రతాన్ని ఆయన ఆచరించారు. ఆయనతో నాది చాలా పాత పరిచయం. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయనొక తపస్వీ’’ అని భాగవత్ ప్రసంగించారు.
బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్. కాబట్టి బీజేపీపై సంఘ్ ప్రభావం ఉండటం సహజమే. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్తగా కూడా పనిచేశారు.
బీజేపీ ఎల్లప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలోనే ఉంటూ పని చేస్తుందా? అలా కాని పక్షంలో బీజేపీని ఆర్‌ఎస్‌ఎస్ ఏ మేరకు నియంత్రిస్తుంది? అనే అంశాలు గత కొన్నేళ్లుగా నిత్యం చర్చల్లో నిలిచాయి.
రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో మతం, రాజకీయాల మధ్య ఉన్న రేఖలు అస్పష్టంగా కనిపించాయి. అక్కడ భాగవత్ ఉనికి కూడా ఒక ప్రశ్నను లేవనెత్తింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య సంబంధాలు మారుతున్నాయా?

ఫొటో సోర్స్, @BJP4INDIA
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య పవర్ మార్పు?
నీలాంజన్ ముఖోపాధ్యాయ ఒక రచయిత, రాజకీయ విశ్లేషకులు. బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ వ్యక్తులపై ఆయన పుస్తకాలు రాశారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మధ్య శక్తి సమతుల్యంలో మార్పులు వచ్చాయని ఆయన అన్నారు.
‘‘మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొంతమంది వ్యక్తులు మోదీ ఒక ప్రచారక్ కూడా కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వచ్చి అక్కడి ప్రముఖులకు రిపోర్ట్ చేయాలని కోరుకున్నారు. కానీ, సంఘ్ కార్యాలయానికి మోదీ వెళ్లలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూనే సంఘ్ అజెండాను మోదీ ముందుకు తీసుకెళ్లారు.
ఎన్నికైన నాయకులు సంఘ్ కార్యాలయానికి వెళ్లకూడదని మోదీ నమ్మారు. కొంతకాలం తర్వాత రెండింటి మధ్య సమానత్వం ఏర్పడింది. ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యం ముగిసింది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బాస్ తానేనంటూ చూపిన భాగవత్’
భాగవత్ గర్భగుడిలో ఉండటంలో అంతరార్థం ఏంటి? ఇది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సంబంధాల్లో ఏదైనా మార్పును సూచిస్తోందా?
తనకెలాంటి మార్పు కనిపించట్లేదని సీనియర్ జర్నలిస్ట్ రామ్‌దత్తా త్రిపాఠి అన్నారు.
‘‘ఒక్కోసారి సమయాన్ని బట్టి స్క్రిప్టు, పాత్రలు, డైలాగ్స్ మారుతుంటాయి. మోదీ వైభవాన్ని చాటే కార్యక్రమం ప్రాణ ప్రతిష్ట. ఆయన శక్తిని చూపెట్టుకునే కార్యక్రమం అది. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ తన దీర్ఘకాల విజన్ కోసం మోదీని ఉపయోగించుకుంటుంది. తమ విజన్‌ను పూర్తి చేసుకోవడానికి ఒక భారీ రాజకీయ శక్తి కావాలనే సంగతి ఆర్‌ఎస్‌ఎస్‌కు బాగా తెలుసు.
ప్రజలు ఒక్కోసారి ఆర్‌ఎస్‌ఎస్‌ను బీజేపీ సాంస్కృతిక విభాగంగా భావిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను ఒక సాధారణ వ్యక్తి అని అనుకుంటారు.
కానీ, తానే బాస్‌నని మోహన్ భాగవత్ ఈరోజు చూపించారు. రాజకీయ ప్రాజెక్టుల లీడర్ మాత్రం మోదీనే. ఆయన బాస్ కాకపోతే గర్భ గుడిలో ఆయన ఉండాల్సిన అవసరం ఏముంది? మోదీపై ఉన్న ఒత్తిడి ఏంటి?’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘భాగవత్ ఇక మోదీకి సలహాలు ఇవ్వలేరు’’
తనకు తెలిసీ మోదీ ఎప్పుడూ మోహన్ భాగవత్‌ను కలిసేందుకు వెళ్లలేదని నీలాంజన్ ముఖోపాధ్యాయ అన్నారు.
‘‘ఒకవేళ వారు కలిసి ఉంటే భాగవత్‌ను మోదీ తన ఇంటికి ఆహ్వానించి ఉండేవారు. చాలా సార్లు భాగవత్ బహిరంగంగా మోదీని ప్రశంసించారు. గతంలో ఇలా ఎప్పుడూ జరుగలేదు. సంఘ్ పరివార్‌లోని అధికార సమీకరణాల్లో కచ్చితంగా మార్పు వచ్చింది. ప్రధానమంత్రికి సూచనలు ఇవ్వడానికి సర్‌సంఘ్‌చాలక్ ఇకపై సుప్రీమో కాదు.
మోదీ కూడా ఎప్పుడూ సంఘ్‌కు సంబంధించిన ఏ సిద్ధాంతాన్నీ ఉల్లంఘించలేదు.
నిజానికి ఆయన మునుపటిలాగే సంఘ్‌కు గట్టి ప్రచారకుడు. అలా అయితే సంఘ్ ఎందుకు కోపంగా ఉంటుంది? పాలనాపరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు’’ అని నీలాంజన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్‌లో ఎలా ఉంటుంది?
రాబోయే కాలంలో బీజేపీ, ఆరెస్సెస్ మధ్య సంబంధాలు ఎలా మారతాయనేది ముఖ్యమైన ప్రశ్న.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని అట్టడుగు స్థాయి కార్యకర్తలు లేకుండా ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదనే విషయం బీజేపీకి అర్థమైంది. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరి మధ్య గొడవలు ఉండవు.
“వాజ్‌పేయి తరహాలో కాకుండా, నరేంద్ర మోదీకి సంఖ్యాబలం ఉంది. ప్రభుత్వంలోని అనేక శాఖలు, కౌన్సిళ్లలను ఆయన సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తులతో నింపగలిగారు’’ అని నీలాంజన్ అన్నారు.
రాబోయే కాలంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మధ్య పూర్తి సమన్వయం ఉంటుందని ఆయన చెప్పారు.
"ఆర్‌ఎస్‌ఎస్ లాభపడుతోంది. 2004లో ఆర్‌ఎస్‌ఎస్ ఇంత ఉత్సాహంగా లేదు. ఎందుకంటే వాజ్‌పేయి, సుదర్శన్ మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఆర్‌ఎస్‌ఎస్‌లోని వ్యక్తుల కోసం వాజ్‌పేయి ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు" అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యకు, థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










