కర్పూరి ఠాకుర్ : రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా సొంతంగా గజం భూమి కూడా సంపాదించని నేత

ఫొటో సోర్స్, RAMNATH THAKUR
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకుర్‌కు కేంద్రప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
కర్పూరి ఠాకుర్ శతజయంతికి సరిగ్గా ఒకరోజు ముందు ఈ ప్రకటన విడుదలైంది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకుర్ జయంతి అయిన జనవరి 24వ తేదీకి కొన్నాళ్లుగా ఆ రాష్ట్రంలో ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది.
అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఆయన వారసులం తామే అని చెప్పుకోవడానికి పోటీ పడుతుంటాయి.
బిహార్‌లో కనీసం రెండు శాతం కూడా లేని నాయీబ్రాహ్మణ కులంలో పుట్టి, పెద్ద నాయకుడిగా ఎదిగిన కర్పూరి ఠాకూర్ వారసత్వం కోసం పార్టీలు, నాయకులు ప్రయత్నించడానికి కారణం ఉంది.
అది.. అత్యంత వెనుకబడిన వర్గాల నాయకుడిగా కర్పూరి ఠాకూర్‌కు ఉన్న గుర్తింపు.
అత్యంత వెనుకబడి కులాలు (ఈబీసీ) అనేవి బిహార్‌లో తక్కువ జనాభా కలిగిన వేర్వేరు కులాలు. ఈ వర్గంలో 100కు పైగా కులాలు ఉన్నాయి.
అయితే ఈ కులాలను విడివిడిగా చూస్తే ఎన్నికల లెక్కల ప్రకారం పెద్దగా ప్రభావం చూపేవిలా కనిపించవు. కానీ మొత్తంగా చూస్తే ఈ కులాల ఓట్ బ్యాంకు 29శాతం.
నితీష్‌కుమార్‌ను 2005లో ముఖ్యమంత్రిని చేయడంలో ఈ ఈబీసీ ఓటర్లే కీలక పాత్రపోషించారు. దీంతో ఈ గ్రూపు బిహార్ రాజకీయాలలో కీలకంగా మారింది.
ప్రతి రాజకీయ పార్టీ తన ఓటుబ్యాంకులో ఈ గ్రూపు ఉండాలని కోరుకుంటూ ఉంటుంది.

ఫొటో సోర్స్, RAMNATH THAKU
కర్పూరి ఠాకుర్ వారసత్వం కోసం పోటీ
‘‘కర్పూరి ఠాకుర్ బిహార్‌లో సామాజిక ఉద్యమానికి ఓ చిహ్నం. దీంతో అనేక రాజకీయ పార్టీలు ఆయన ఆశయాలు సాకారం చేస్తామని ఆయన జన్మదినోత్సవం నాడు ప్రతిన పూనుతుంటాయి. అందుకే ఆయన వారసత్వానికి తామే ప్రతినిధులమని చెప్పుకొనేవారు పెరుగుతున్నారు’’ అని కర్పూరి ఠాకుర్ కుమారుడు జనతాదళ్ యునైటెడ్ రాజ్యసభ సభ్యుడు రామనాథ్ ఠాకుర్ చెప్పారు.
ఆయన సమస్తిపుర్‌లోని ప్రస్తుతం కర్పూరిగ్రామ్‌గా పేరుమారిన ఒకనాటి పితౌఝియా లో తన తండ్రి జయంత్యుత్సవాల నిర్వహణలో ఉన్నారు.
పితౌఝియా కర్పూరి ఠాకుర్ స్వగ్రామం.
నిజానికి మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు ముందే బిహార్ రాజకీయాలలో కర్పూరి ఠాకుర్ ఓ స్థాయికి చేరుకున్నారు.
అణగారిన కుల నేపథ్యం నుంచి వచ్చి బిహర్ రాజకీయాలలో పేదవారి గొంతుకగా నిలిచారు.
కర్పూరి ఠాకుర్ 1924 జనవరి 24న ప్రస్తుతం కర్పూరిగ్రామ్‌గా మారిన నాటి పితౌఝియాలో జన్మించారు.
ఈయన ఒకసారి ఉప ముఖ్యమంత్రిగానూ, రెండుసార్లు ముఖ్యమంత్రిగానూ, దశాబ్దాలపాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
1952లో తొలిసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత ఆయన ఏనాడూ ఓటమిపాలవ్వలేదు.
ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో బిహార్ సమాజంపై చెరగని ముద్ర వేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన బిహార్‌లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి.

ఫొటో సోర్స్, RAMNATH THAKUR
సామాజిక మార్పుకు నాంది
కర్పూరి ఠాకుర్ 1967లో తొలిసారి ఉప ముఖ్యమంత్రి కాగానే స్కూల్స్‌లో ఇంగ్లిష్‌ను రద్దు చేశారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కానీ దీనివల్ల ఆయన సామాన్యుల వద్దకు చదువును తీసుకువెళ్ళగలిగారనేది నిజం.
అప్పట్లో మెట్రిక్యులేషన్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పినవారంతా తాము ‘కర్పూరి డివిజన్’ పాసయ్యామని సరదాగా చెప్పుకుంటూ ఉండేవారు.
ఠాకుర్ ఉపముఖ్యమంత్రితోపాటు విద్యాశాఖను కూడా చూసేవారు. ఆయన చేసిన ప్రయత్నాల కారణంగా మిషనరీ స్కూళ్ళు హిందీలో విద్యాబోధన ప్రారంభించాయి.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఆయన స్కూలు ఫీజులను రద్దు చేశారు.
భారతదేశంలో మెట్రిక్యులేషన్ వరకు ఉచిత విద్యను ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి కూడా కర్పూరీ ఠాకురే.
బిహార్‌లో ఉర్దూను రెండో అధికార భాషగా చేసేందుకు ఆయన ప్రయత్నించారు.
1971లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆదాయం లేని భూములపై పన్నును రద్దుచేసి రైతులకు అతిపెద్ద ఊరట కలిగించారు.
అప్పట్లో బిహార్ సచివాలయంలో నాలుగోతరగతి ఉద్యోగులకు లిఫ్ట్‌ను వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది కాదు.
ఠాకుర్ ముఖ్యమంత్రి కాగానే నాలుగో తరగతి ఉద్యోగులు కూడా లిఫ్ట్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ రోజుల్లో ఇలాంటి చర్య చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ రాజకీయాలలో ఇది భారీ సందేశాన్నే ఇస్తుంది.
‘‘అప్పట్లో ఎక్కడైన కులాంతర వివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే అక్కడకు ఆయనకు కచ్చితంగా వెళ్ళేవారు. సమాజంలో ఇటువంటి మార్పు రావాలని ఆయన కోరుకునేవారు. బిహార్‌లో అణగారిన కులాలను అధికారంలో భాగస్వాములను చేయాలని ఆయన భావించేవారు’’ అని మాజీ ఎంఎల్‌సీ ప్రేమ్ కుమార్ మణి చెప్పారు.
ఇక రెండోసారి 1977లో కర్పూరి ఠాకుర్ ముఖ్యమంత్రి అయ్యాక మంజిరీలాల్ కమిషన్ ద్వారా ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేసినందుకు అగ్రవర్ణాల వారికి శత్రువుగా మారారు.
కానీ ఆయన వెనుకబడిన కులాలకోసం పనిచేయడం మాత్రం ఆపలేదు.
బిహార్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలు హిందీలోనే కార్యకలాపాలు సాగించడాన్ని ఆయన తప్పనిసరి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి ఈక్వల్ పే కమిషన్ అమలు చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.
యువతకు ఉద్యోగకల్పన కోసం ఆయన కట్టుబడి ఉండేవారు. ఆయన దాదాపు 9,000 మంది ఇంజనీర్లు, డాక్టర్లకు ఉద్యోగాలు కల్పించారు. దీని తరువాత ఇప్పటిదాకా ఇంత పెద్ద సంఖ్యలో ఇంజినీర్లు, డాక్టర్లను నియమించుకోవడమనేది ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాలేదు.
రాజకీయాలలో పేదవారి గొంతు వినిపించాలని ఆయన రాత్రింబవళ్ళు పనిచేసేవారు.
ఆయనకు సాహిత్యం, సంస్కృతిపట్ల మక్కువ ఎక్కువగా ఉండేది.
ఆయన ‘‘చదవడానికి సమయం చిక్కించుకునేవారు’’ అని ప్రేమ్ కుమార్ మణి గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, RAMNATH THAKUR
నిరాడంబరత, నిజాయితీ
రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణించిన ఠాకుర్, చనిపోయేనాటికి తనకు గానీ, తన కుటుంబసభ్యులకు గానీ సొంత ఇంటిని కూడా సమకూర్చలేకపోయారు.
పాట్నాలో కానీ, లేదంటే తన పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటికి అదనంగా ఓ గజాన్ని కొనడం కానీ ఆయన చేయలేదు.
ప్రతిరోజూ కోట్లాది రూపాయల కుంభకోణాలలో చిక్కుకున్న రాజకీయనాయకుల పేర్లు వింటున్న ఈరోజుల్లో కర్పూరి లాంటి నేత ఒకరున్నారంటే నమ్మశక్యం కాకుండా ఉంటుంది.
కర్పూరి ఠాకుర్ నిజాయితీ గురించి బిహార్‌లో కథలుకథలుగా చెప్పుకుంటారు.
ఒకరోజు కర్పూరి ఠాకుర్ వద్దకు సమీపబంధువు ఒకరు వచ్చి తనకో ఉద్యోగం ఇప్పించడానికి సిఫార్సు చేయమని అడిగారు. దీనిపై ఠాకుర్ కోపగించుకున్నారని, జేబులోంచి 50 రూపాయలు తీసి ఆయనకు ఇచ్చి, వెళ్ళి గడ్డం గీసే కత్తి కొనుక్కుని పూర్వీకుల నుంచి వస్తున్న పని చేసుకోమని చెప్పారని కర్పూరితో పనిచేసిన కొందరు గుర్తు చేసుకున్నారు.
కర్పూరి ఠాకుర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన స్వగ్రామంలో కొందరు భూస్వాములు కర్పూరి ఠాకుర్ తండ్రిని హేళన చేయడానికి ప్రయత్నించారు.
ఈ వార్త అంతటా తెలియడంతో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆ గ్రామానికి వెళ్ళి భూస్వాములపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు.
కానీ కర్పూరి ఠాకుర్ వారిపై చర్యలు తీసుకోవద్దని ప్రతిగ్రామంలోనూ అణగారిన వర్గాలు ఇటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కర్పూరి ఠాకుర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో తన కుమారుడు రామ్‌నాథ్‌కు ఓ లేఖ రాశారు.
దీని గురించి రామ్‌నాథ్ మాట్లాడుతూ ‘‘ ఆ లేఖలో మూడే విషయాలున్నాయి. నా పదవిని చూసి ఎటువంటి ప్రభావానికి గురికావద్దు, ఎవరైనా నిన్ను ప్రలోభపెట్టినా అందులో చిక్కుకోకు. దీనివల్ల నాకు చెడ్డపేరు వస్తుంది’’ అని రాశారని గుర్తు చేసుకున్నారు.
‘మహాన్ కర్మయోగి, జననాయక్ కర్పూరి ఠాకుర్’ పేరుతో ప్రభాత్ ప్రకాశన్ రెండు వాల్యుముల పుస్తకాలను ప్రచురించారు. కర్పూరి ఠాకుర్ గురించిన అనేక ఆసక్తికర విషయాలు అందులో ఉన్నాయి.

సొంత కోటు కూడా లేని కర్పూరి ఠాకుర్
‘‘కర్పూరి ఠాకుర్ ఆర్థిక సమస్యల గురించి తెలిసిన దేవీలాల్ కర్పూర్జీ ఎప్పుడు డబ్బులు అడిగినా ఇవ్వండి. ఆ డబ్బులు నాకు అప్పుగా ఇచ్చాను అనుకోండి అని పట్నాలోని తన హరియాణా స్నేహితులకు చెప్పారు. తరువాత దేవీలాల్ చాలాసార్లు కర్పూర్జీ డబ్బులు తీసుకున్నారా లేదా అని స్నేహితులను ఆరా తీసినప్పుడల్లా వారు కర్పూర్జీ డబ్బులు తీసుకోలేదనే చెప్పేవారు. అసలు ఆయన దేని గురించి అడిగేవారు కాదని చెప్పేవారు’’ అని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నాయకుడు హేమవతి నందన్ బహుగుణ తన జ్ఞాపకాలలో రాసుకున్నారు.
తన తండ్రి నిరాండబరత గురించి రామ్‌నాథ్ ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. ‘‘ 1952లో జననాయక్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఓ సమావేశానికి ఆస్ట్రియా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన దగ్గర కోటు లేదు. దీంతో తన స్నేహితుడిని అడిగి ఆయన కోటు తీసుకున్నారు. ఆయన అక్కడి నుంచి యుగోస్లోవియా వెళ్ళారు. అయితే కర్పూర్జీ కోటు చిరిగిపోవడాన్ని మార్షల్ గమనించి ఆయనకు ఓ కోటు అందించాడు’’ అని తెలిపారు.
సామాజిక రాజకీయాలలో కర్పూరి ఓ గొప్పనాయకుడని ప్రేమ్ కుమార్ మణి చెప్పారు. ఆయన పేరు చెప్పుకుంటున్నవారు నిరాండబరత, నిజాయితీలలో ఆయన దారిని అనుసరించే సాహసం చేయలేరని, అందుకే కర్పూరి లాంటి నేతలు గుర్తుండిపోతారని తెలిపారు.
అయితే బిహార్ రాజకీయాలలో పార్టీలు మార్చడం, ఒత్తిడితో కూడిన రాజకీయాలు చేయడంపై కర్పూరిపై విమర్శలు ఉన్నాయి. రాజకీయ వంచకుడనే విమర్శలు వచ్చాయి. కులసమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ప్రజలు ఆయనను ప్రశ్నిస్తుండేవారు. కానీ బిహర్ సంప్రదాయ వ్యవస్థలో అణగారిన కోట్లాదిమంది ప్రజల గొంతుకగా కర్పూరీ నిలిచారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ చతురతను, సోషలిస్టు శిబిరంలోని నేతల ఆశయలను కూడా ఆయన అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన విధానాన్ని అనుసరించి ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేవారు. కానీ తను అనుకున్నట్టు పనులు జరగకపోతే ఆ కూటమి నుంచి వెళ్ళిపోయేవారు.
కర్పూరి రాజకీయ నిర్ణయాలపై ఆయన స్నేహితులు, శత్రువులు కూడా అనిశ్చితితోనే ఉండేవారు.
కర్పూరి ఠాకుర్ 64వ ఏట ఫిబ్రవరి 17, 1988న గుండెపోటుతో మరణించారు.
ఇవి కూడా చదవండి :
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- ప్రాచీన కాలం నాటి సామూహిక నిద్ర అలవాటు ఎలా కనుమరుగైంది?
- అలెగ్జాండర్ జయించిన ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'














