యెమెన్‌లో రాజకీయ హత్యలు చేసేందుకు అమెరికన్ కిరాయి సైనికులకు సుపారీ చెల్లించిన యూఏఈ.. బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలిందంటే

ఫొటో సోర్స్, JACK GARLAND/BBC
- రచయిత, నవల్ అల్-మఘాఫి
- హోదా, బీబీసీ న్యూస్ అరబిక్ ఇన్వెస్టిగేషన్స్
యెమెన్‌లో రాజకీయ ప్రేరేపిత హత్యలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిధులు సమకూర్చినట్లు బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.
ఇది యెమెన్ ప్రభుత్వానికి, ఇటీవల ఎర్ర సముద్రంలో జరిగిన ఘటనలతో ప్రపంచం దృష్టికి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు మధ్య ఘర్షణలను తీవ్రతరం చేసింది.
యెమెన్‌లోని ఎమిరాటి అధికారులకు అమెరికా కిరాయి సైనికులు ఇచ్చిన 'కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్', గుట్టుచప్పుడు కాకుండా పనిచేయగలిగిన అక్కడి స్థానికులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడిందని, అది రాజకీయ హత్యలలో భారీ పెరుగుదలకు దారితీసిందనే విషయాలను ఓ విజిల్‌బ్లోయర్ బీబీసీ అరబిక్ ఇన్వెస్టిగేషన్స్‌తో చెప్పారు.
యెమెన్ దక్షిణ ప్రాంతంలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటి జిహాదీ గ్రూపులను నిర్మూలించడం అమెరికన్ కిరాయి సైనికుల లక్ష్యం అయినప్పటికీ, వాస్తవానికి హూతీ తిరుగుబాటు ఉద్యమం, ఇతర సాయుధ దళాలతో పోరాడేందుకు యెమెన్‌లో యూఏఈ సృష్టించిన భద్రతా దళం కోసం అల్ ఖైదా మాజీ సభ్యులను నియమించుకున్నట్లు ఇన్వెస్టిగేషన్‌లో బీబీసీ గుర్తించింది.
‘టెర్రరిజం’తో సంబంధం లేని వారిని హతమార్చినట్లు ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడికాగా యూఏఈ ప్రభుత్వం ఖండించింది. ‘అవి పూర్తిగా తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనవి' అని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది.
యెమెన్‌లో మూడేళ్ల వ్యవధిలో కొనసాగిన హత్యాకాండలో వందకు పైగా జరిగిన హత్యలు, మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత పేద దేశంలో అంతర్జాతీయ శక్తుల మధ్య కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలో ఒక అంశం మాత్రమే.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఈ భయంకరమైన వాతావరణం అడ్డుపడింది.
ఇది ఇరాన్ మద్దతు కలిగిన హూతీలకు పరోక్షంగా సాయం చేసేలా ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.
ఎర్రసముద్రంలో ఓడలపై దాడులు చేస్తూ వాణిజ్యానికి ఇబ్బందులు కలిగిస్తూ ఇటీవల హూతీ వార్తల్లో నిలుస్తోంది.
హూతీలను తిరిగి ''గ్లోబల్ టెర్రరిస్టులు''గా గుర్తించనున్నట్లు ఇటీవల వాషింగ్టన్ ప్రకటించింది.
యెమెన్‌కు చెందిన నేను, 2014 నుంచి ఇక్కడ జరుగుతున్న ఘర్షణల గురించి రిపోర్ట్ చేస్తున్నా. ఈ పోరు దేశంలోని ఉత్తర ప్రాంతంపై ప్రభుత్వం పట్టుకోల్పోయి, కొన్నేళ్లుగా అన్నివిధాలుగా పుంజుకుంటున్న హూతీల ఆధీనంలోకి వెళ్లేందుకు దారితీసింది.
ప్రభుత్వానికి మద్దతుగా పోరాడేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలో, యూఏఈ కీలక భాగస్వామిగా ఉన్న అరబ్ దేశాల కూటమికి అమెరికా, యూకే 2015లో మద్దతిచ్చాయి. యెమెన్ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయడం, ‘టెర్రరిజం’పై పోరాడడమే లక్ష్యంగా ఈ కూటమి యెమెన్‌పై దాడి చేసింది.
అల్ ఖైదా బలంగా ఉండడంతో పాటు తన పరిధిని విస్తరిస్తున్న దక్షిణ యెమెన్ భద్రత బాధ్యతలను కూటమి యూఏఈకి ఇచ్చింది.
అలాగే, ఈ రీజియన్‌లో కౌంటర్ టెర్రరిజంలో అమెరికాకు కీలక మిత్రదేశంగా మారింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
యెమెన్ పోరు
యెమెన్‌లో మైనార్టీలైన షియా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఓ వర్గమైన హూతీ తిరుగుబాటుదారులు 2014లో రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు.
యెమెన్ అధ్యక్షులు అబ్దబ్రుహ్ మన్సూర్ హాది 2015 ఫిబ్రవరిలో గృహ నిర్బంధం నుంచి పారిపోయి దక్షిణ ప్రాంతంలోని ఏదెన్ నగరాన్ని తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు మార్చుకున్నారు.
మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో ప్రత్యర్థి అయిన ఇరాన్ ఆయుధాలు సమకూరుస్తోందని చెబుతున్న హూతీలపై సౌదీ అరేబియా సహా ఎనిమిది సున్నీ అరబ్ దేశాలు వైమానిక దాడులు ప్రారంభించాయి.
సౌదీ నేతృత్వంలోని కూటమికి అమెరికా, యూకే, ఫ్రాన్స్ నుంచి దాడులకు అససరమైన సాయం లభిస్తోంది.
అవేకాకుండా ఒకే వర్గంలో ఉన్న వారి మధ్య కూడా ఘర్షణలు జరిగాయి. దక్షిణ యెమెన్‌లో సౌదీ అండగా నిలుస్తున్న ప్రభుత్వ దళాలకు, మిత్రపక్షమైన దక్షిణ వేర్పాటువాద ఉద్యమ సంస్థ సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్టీసీ) మధ్య 2019 ఆగస్టులో ఘర్షణ తలెత్తింది. అధ్యక్షుడు హాది అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు, ఇస్లామిస్టులతో సంబంధాలు నెరుపుతున్నారని ఎస్టీసీ ఆరోపిస్తోంది.
దక్షిణ భూభాగంలో తలెత్తిన గందరగోళాన్ని అవకాశంగా తీసుకున్న ‘అరేబియా ద్వీపకల్పంలోని అల్ ఖైదా’(ఏక్యూఏపీ), ఇస్లామిక్ స్టేట్‌కి అనుబంధంగా నడుస్తున్న స్థానిక గ్రూపు భీకర దాడులకు పాల్పడ్డాయి. ముఖ్యంగా ఏదెన్ లక్ష్యంగా దాడులతో విరుచుకుపడ్డాయి.
తమ పట్టు పెంచుకుంటూ విస్తరించిన హూతీలు 2023 నవంబర్ నుంచి ఎర్రసముద్రంలోని అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో దాడులు చేయడం ప్రారంభించారు.
యెమెన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దక్షిణ ప్రాంతాల్లో నేను తిరుగుతున్నప్పుడు.. ‘టెర్రరిస్ట్’ గ్రూపులతో సంబంధంలేని యెమెన్ పౌరుల హత్యకు గురవడం గమనించాను.
అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఎలాంటి విచారణ ప్రక్రియ లేకుండా పౌరులను అంతమొందించడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.
హత్యకు గురైన వారిలో యెమెనీ ముస్లింలలో ఒక శాఖ అయిన 'ఇస్లా'కు చెందిన వారే ఎక్కువ. అంతర్జాతీయ సున్నీ ఇస్లామిస్ట్ ఉద్యమ సంస్థ అయిన ఇస్లాను అమెరికా ఎన్నడూ టెర్రరిస్ట్ సంస్థగా పేర్కొనలేదు. అయితే, ఇస్లా రాజకీయ ఎదుగుదల, ఎన్నికల్లో మద్దతు వంటి అంశాలు తమ రాచరిక పాలనకు ముప్పుగా భావించే యూఏఈ, దానితో పాటు కొన్ని అరబ్ దేశాలు ఈ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించాయి.
ఈ పరంపరలో జరిగిన మొదటి హత్యకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీ, ఈ రహస్య మరణాలపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు నన్ను పురిగొల్పింది. అది 2015 డిసెంబర్ నాటిది. అమెరికాకు చెందిన స్పియర్ ఆపరేషన్స్ గ్రూప్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ సభ్యులు దానిని గుర్తించారు.
ఎట్టకేలకు ఈ ఆపరేషన్ వెనకున్న ఒక వ్యక్తిని 2020లో లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలిశాను.
ఆయన పేరు ఇసాక్ గిల్మోర్. అమెరికా నేవీ మాజీ అధికారి ఈయన, ఆ తర్వాత స్పియర్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గానూ పని చేశారు.
యెమెన్‌లో హత్యలు చేసేందుకు యూఏఈ నియమించిందని చెప్పే అమెరికన్లలో ఈయన ఒకరు.

ఫొటో సోర్స్, JACK GARLAND/BBC
తమ మొదటి లక్ష్యమైన యెమెనీ ఎంపీ, పోర్ట్ సిటీ ఏదెన్‌లో ఇస్లా నాయకుడిగా ఉన్న అన్సాఫ్ మయో గురించి మినహా, యూఏఈ అందించిన ''కిల్ లిస్ట్'' (చంపాల్సిన వారి జాబితా)లోని ఏ ఒక్కరి పేరైనా చెప్పడానికి ఇసాక్ నిరాకరించారు.
ఇస్లాను అమెరికా ఎప్పుడూ టెర్రరిస్టు సంస్థగా పేర్కొనలేదు కదా అని నేను ఇసాక్‌ను ప్రశ్నించాను.
''దురదృష్టవశాత్తూ కొత్త వివాదాలు బయటికి కనిపించేలా ఉండవు'' అని ఆయన అన్నారు. ''అది మనకు యెమెన్‌లో కనిపిస్తుంది. ఒక వర్గం నాయకుడు, మత గురువు.. మరొకరికి తీవ్రవాద నాయకుడు'' అన్నారు.
తమ మిషన్ 2016తో పూర్తయిందని ఇసాక్, ఇంకా ఆ సమయంలో యెమెన్‌లో పనిచేస్తున్న స్పియర్ ఉద్యోగి డేల్ కామ్‌స్టాక్ నాతో చెప్పారు.
కానీ, దక్షిణ యెమెన్‌లో హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి, మానవ హక్కుల సంఘం 'రిప్రైవ్' పరిశోధకుల ప్రకారం, అవి ఇంకా ఎక్కువయ్యాయి.
2015 నుంచి 2018 వరకూ మూడేళ్లలో జరిగిన 160 హత్యలను వారు పరిశోధించారు.
2016 నుంచి ఇలాంటి హత్యలు జరిగాయని, హత్యకు గురైన 160 మందిలో 23 మందికి మాత్రమే ‘టెర్రరిస్టులతో’ సంబంధాలున్నాయని వారు చెప్పారు.
స్పియర్ ఉపయోగించిన వ్యూహాలతోనే ఈ హత్యలు జరిగాయి. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పేల్చివేయడం, ఆ తర్వాత టార్గెట్ లక్ష్యంగా కాల్పులు జరపడం.
యెమెన్‌లోని లాజ్‌లో గత నెలలోజరిగిన ఇమామ్ హత్యను ఇటీవల జరిగిన రాజకీయ హత్యగా యెమెన్ మానవ హక్కుల న్యాయవాది హుదా అల్ సరారి చెబుతున్నారు.
ఏదెన్‌లోని యూఏఈ సైనిక స్థావరంలో ఎమిరాటీ అధికారులకు స్పియర్ శిక్షణ ఇచ్చిందని ఇసాక్, కామ్‌స్టాక్‌తో పాటు పేరు చెప్పేందుకు ఇష్టపడని స్పియర్‌కు చెందిన మరో ఇద్దరు చెప్పారు. అలాంటి శిక్షణ ఇస్తున్న ఫుటేజీని తాను కూడా చూసినట్లు ఒక జర్నలిస్టు కూడా చెప్పారు. ఆయన తన పేరును గోప్యంగా ఉంచాలని కోరారు.
కిరాయి సైనికులు దాని గురించి వివరంగా చెప్పలేదు, కానీ యూఏఈతో కలిసి పనిచేసిన, ఏదెన్‌కు చెందిన యెమెనీ సైనిక అధికారి ఒకరు మరిన్ని వివరాలు వెల్లడించారు.

కిరాయి సైనికుల గురించి ఏదెన్‌లో స్పష్టంగా బయటపడింది. అందువల్ల వారికి ఎమిరాటీ అధికారుల శిక్షణ బాధ్యతలు ఇచ్చారు. ''వాళ్లు లక్ష్యాలను ఛేదించే విధంగా స్థానిక యెమెనీలకు శిక్షణ ఇచ్చారు'' అని యెమెన్ సైనికాధికారి నాతో చెప్పారు.
ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మరో డజను మందికి పైగా యెమెన్ వ్యక్తులతో మాట్లాడాం. ఎమిరాటీ సైనికుల వద్ద శిక్షణ పొందిన తర్వాత, టెర్రరిజంతో సంబంధం లేని హత్యలు చేశామని చెప్పిన ఇద్దరు వారిలో ఉన్నారు. యెమెన్‌కు చెందిన ఒక సీనియర్ రాజకీయ నేతను హత్య చేస్తే యూఏఈ జైలు నుంచి విడుదల చేస్తామని ఆఫర్ ఇచ్చారని, అయితే అందుకు తాను ఒప్పుకోలేదని ఆ ఇద్దరిలో ఒకరు చెప్పారు.
హత్యలు చేసేందుకు యెమెన్‌కు చెందిన వ్యక్తులను ఎంచుకోవడమంటే, వాటి వెనక యూఏఈ ఉందని కనిపెట్టడం చాలా కష్టతరమని అర్థం.
2017 నాటికి ఎమిరాటీ నిధులతో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్టీసీ)లో భాగమైన పారామిలటరీ దళాన్ని ఏర్పాటు చేయడంలో యూఏఈ సాయం చేసింది. ఆ సంస్థ దక్షిణ యెమెన్ అంతటా సాయుధ బలగాల నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తోంది.
దక్షిణ యెమెన్‌లో స్వతంత్రంగా పనిచేసే ఈ దళం కేవలం యూఏఈ ఆర్డర్లను మాత్రమే తీసుకుంటుంది. ఇందులో ఉన్న సభ్యులు కేవలం ముందుండి పోరాడడానికే కాదు. అందులోని ఒక ప్రత్యేక విభాగం ఎలైట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ హత్యలు చేయడంలోనూ శిక్షణ పొందిందని విజిల్‌బ్లోయర్ మాతో చెప్పారు.
ప్రస్తుతం ఎస్టీసీలో పనిచేస్తున్న అల్ ఖైదా మాజీ సభ్యుల 11 మంది పేర్లతో ఉన్న ఒక డాక్యుమెంట్‌ను విజిల్‌బ్లోయర్ మాకు పంపారు. వారిలో కొంతమంది ఐడెంటిటీని మేము ధ్రువీకరించగలిగాం.
మా ఇన్వెస్టిగేషన్‌లో నాసర్ అల్ షిబా పేరు వచ్చింది. అతను అల్ ఖైదాలో ఉన్నత హోదాలో పనిచేసి, టెర్రరిజం కార్యకలాపాల ఆరోపణలతో జైలుపాలయ్యారు.
కానీ ఆ తర్వాత ఆయన విడుదలయ్యారు. 2000 సంవత్సరం అక్టోబర్‌లో అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ కోల్‌పై జరిగిన దాడి, 17 మంది అమెరికన్ నావికులను హతమార్చిన ఘటనలో అల్ షిబా అనుమానితుడని మాతో మాట్లాడిన యెమెన్ మంత్రి ఒకరు మాకు చెప్పారు. ఆయన ఇప్పుడు ఎస్టీసీ మిలటరీ యూనిట్లలో ఒక యూనిట్‌కు కమాండర్ అని వేర్వేరు సోర్సులు మాకు చెప్పాయి.
యూఏఈ మద్దతు కలిగిన దళాలు చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై లాయర్ హుదా అల్ - సరారి విచారణ చేస్తున్నారు. అందుకు ఫలితంగా ఆమెను చంపేస్తామని తరచూ బెదిరింపులు వచ్చేవి. కానీ, చివరికి ఆమె 18 ఏళ్ల కుమారుడు మోసేన్ రూపంలో ఆమె మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
2019 మార్చిలో ఒక పెట్రోల్ స్టేషన్‌కు వెళ్తుండగా ఛాతీలో కాల్చారు. నెల రోజుల తర్వాత మోసేన్ మరణించారు. ఆ తర్వాత ఆమె తన పనిని కొనసాగించినప్పుడు, ఇక్కడితో ఆపేయాలని హెచ్చరిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయని ఆమె చెప్పారు. ''ఒక కొడుకుని చంపితే సరిపోలేదా? మేము ఇంకొకరిని చంపాలా?'' అని బెదిరింపులు వచ్చాయన్నారు.
ఏదెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జరిపిన తదుపరి విచారణలో యూఏఈ మద్దతు గల కౌంటర్ టెర్రరిజం యూనిట్ సభ్యుడు మోసేన్‌ను చంపినట్లు గుర్తించారు. అయితే, అధికారులు ప్రాసిక్యూషన్‌ను కొనసాగించలేదు.
''ఈ హత్యలు భయాందోళనను సృష్టించాయి. యూఏఈకి సంబంధమున్న కేసుల్లో న్యాయం పొందే అవకాశాలను కొనసాగించే విషయంలోనూ వారు భయపడుతున్నారు'' అని ప్రాసెక్యూటర్ కార్యాలయ సిబ్బంది చెప్పారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను ప్రస్తావించడం లేదు.
2020లో కూడా స్పియర్‌కు చెల్లింపులు జరుగుతున్నట్లు చూపించే యూఏఈ డాక్యుమెంట్‌ను రిప్రైవ్ సంపాదించింది. అయితే, ఆ చెల్లింపులు ఎందుకో స్పష్టంగా తెలియలేదు.
స్పియర్ కిరాయి సైనికులు ఎమిరాటీలకు హత్యలు చేయడంలో శిక్షణ ఇచ్చారా అని స్పియర్ వ్యవస్థాపకుడు అబ్రహం గోలన్‌ను మేం అడిగాం, కానీ ఆయన స్పందించలేదు.
మా విచారణలో బయటపడిన ఆరోపణలను యూఏఈ ప్రభుత్వం ముందు పెట్టాం.
టెర్రరిజంతో ఎలాంటి సంబంధాలు లేని వ్యక్తులను టార్గెట్ చేశారనేది అవాస్తవమని, యెమెన్ ప్రభుత్వం, దాని మిత్రదేశాల ఆహ్వానం మేరకు యెమెన్‌లో టెర్రరిజం వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపింది.
''అలాంటి ఆపరేషన్లలో యూఏఈ అంతర్జాతీయ చట్టాలకు లోబడి పనిచేసింది'' అని పేర్కొంది.
స్పియర్ ఆపరేషన్స్ గ్రూప్ గురించి వివరాలు తెలియజేయాలని మేం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించాం, కానీ వారు అందుకు తిరస్కరించారు. అమెరికా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ''సీఐఏ అలాంటి ఆపరేషన్‌పై సంతకం చేసిందనే ఆలోచన తప్పు'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- హమాస్ లీడర్ సలేహ్ అల్ అరూరీ: బేరూత్ బాంబు దాడిలో చనిపోయిన ఈ నాయకుడి చరిత్ర ఏంటి?
- అరేబియా సముద్రంలో భారత్ మూడు క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలను ఎందుకు మోహరించింది?
- హషాషిన్: వందల ఏళ్ల క్రితం పట్టపగలే శత్రువులను గొంతు కోసి చంపిన ముస్లిం ‘రాడికల్’ వర్గం
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














