యూఏఈలో రిపబ్లిక్ డే కార్యక్రమానికి తాలిబాన్ రాయబారిని భారత్ ఆహ్వానించడంపై వివాదమేంటి?

రిపబ్లిక్ డే

ఫొటో సోర్స్, Reuters

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా యూఏఈలోని తాలిబాన్ రాయబారికి ఆహ్వానం పంపడం వివాదాస్పదంగా మారింది.

అఫ్గానిస్తాన్ జర్నలిస్ట్ బిలాల్ సర్కారీ ఈ ఆహ్వాన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘‘తాలిబాన్, పీఎం నరేంద్రమోదీ సర్కారు మధ్య అన్ని స్థాయిల్లో సంబంధాలు మెరుగయ్యాయి. ఇప్పుడు యూఏఈలోని భారత ఎంబసీ, తాలిబాన్ రాయబారి బద్రుద్దీన్ హక్కానీ, ఆయన భార్యను ఆహ్వానించింది. భారత్, తాలిబాన్‌లను దగ్గర చేసే ముఖ్యమైన మార్పు ఇది’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇంకా ఆయన, ‘‘పీఎం మోదీ నేతృత్వంలో కాబుల్‌లోనే కాకుండా ఇతర ముఖ్య భూభాగాల రాజధాని ప్రాంతాల్లోనూ తాలిబాన్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలల క్రితం అఫ్గాన్ దౌత్యవేత్తల నిష్క్రమణ, దిల్లీలో అఫ్గానిస్తాన్ ఎంబసీని మూసివేయడం ఒక శకానికి ముగింపు వంటివి’’ అని కూడా తన ట్వీట్‌లో రాశారు.

తాలిబాన్ రాయబారికి ఆహ్వానం వెళ్లినట్లుగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక ధ్రువీకరించింది.

ఫరీద్

ఫొటో సోర్స్, @AFGHANISTANININ

ఫొటో క్యాప్షన్, భారత్‌లో అఫ్గాన్ మాజీ రాయబారి ఫరీద్ మాముందజాయ్

బద్రుద్దీన్ హక్కానీ ఎవరు?

యూఏఈలో తాలిబాన్ రాయబారి బద్రుద్దీన్ హక్కానీ.

జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు బద్రుద్దీన్. 2023 అక్టోబర్‌ నుంచి బద్రుద్దీన్ ఈ పదవిలో ఉన్నారు.

బద్రుద్దీన్ సోదరుడు సిరాజుద్దీన్ హక్కానీ, అఫ్గానిస్తాన్ హోం శాఖ మంత్రి.

2008లో కాబుల్‌లోని భారత ఎంబసీ మీద దాడి జరిగింది. ఈ దాడిలో తాలిబాన్ కీలక నేతలతో పాటు హక్కానీ నెట్‌వర్క్‌ ప్రమేయం కూడా ఉంది.

జర్నలిస్ట్ బిలాల్ షేర్ చేసిన ఆహ్వానపత్రం, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ పేరుతో ఉంది.

కాబుల్‌లో తిరిగి తెరుచుకున్న భారత రాయబార కార్యాలయానికి టెక్నికల్ టీమ్‌ను పంపించినప్పటి నుంచి మళ్లీ తాలిబాన్లతో చర్చలు జరుగుతున్నాయని సోర్సులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. తాజా ఆహ్వానం దీన్ని ధ్రువపరిచేలా ఉంది.

తాలిబాన్లతో భారత్ మాట్లాడుతోంది. కానీ, ఇప్పటివరకు దౌత్యస్థాయిలో తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు.

తాలిబాన్లతో సంప్రదింపులు జరుపుతూ, ఐక్యరాజ్యసమితి ప్రకారం అధికారిక గుర్తింపు ఇవ్వని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశ వైఖరి కూడా ఉంది.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ పరిశీలిస్తున్న అంశాలేంటి?

న్యూ దిల్లీలోని రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని నిరుటి నవంబర్‌లో ముంబయి, హైదరాబాద్‌లోని అఫ్గానిస్తాన్ కాన్సులేట్లు చెప్పాయి.

ఈ రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నట్లుగా అఫ్గాన్‌లో అధికారాన్ని కోల్పోయిన ప్రభుత్వానికి చెందిన రాయబారి ఫరీద్ మాముందజాయ్ ప్రకటించారు.

తాలిబాన్లకు భారత ప్రభుత్వం గుర్తింపు ఇస్తోందన్న సందేశం వెళ్లకుండా ఉండేందుకు భారత్ మూడు అంశాలను పరిశీలిస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.

  • అందులో మొదటిది, కొత్త తాలిబాన్ ప్రభుత్వం ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్గానిస్తాన్’కు చెందిన మూడు రంగల జెండానే కొనసాగించాలి. తాలిబాన్ జెండాను ఎగురవేయకూడదు.
  • రెండోది, ఇక్కడి ఎంబసీ పాత పేరు అంటే ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్’ పేరునే కొనసాగిస్తుంది. ‘తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’ అనే పేరుకు ఇక్కడ చోటు లేదు.
  • మూడోది, తాలిబాన్ పాలనలోని దౌత్యవేత్తలు దిల్లీలోని అఫ్గానిస్తాన్ ఎంబసీ తరఫున లేదా ముంబయి, హైదరాబాద్‌లోని అఫ్గాన్ కాన్సులేట్ల తరఫున ఏ కార్యక్రమాలకు హాజరు కావొద్దు.

భారత్ అనుసరిస్తోన్న ఈ వైఖరిని తాలిబాన్లకు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. తాము నిబంధనలను పాటిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకు అఫ్గాన్ కాన్సుల్స్ జనరల్ ధ్రువీకరించారు.

జైశంకర్

ఫొటో సోర్స్, @DRSJAISHANKAR

భారత్ స్పందన ఏంటి?

భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, రొటీన్‌లో భాగంగానే ఆహ్వానాన్ని పంపించామని అధికారులను ఉటంకిస్తూ వార్తా పత్రిక ‘ది హిందూ’ పేర్కొంది.

తాలిబాన్లతో సంబంధాలను భారత్ సాధారణీకరిస్తోందని వస్తోన్న వాదనలను అధికారులు ఖండించారు.

యూఏఈ ప్రభుత్వం గుర్తించిన దౌత్య కార్యాలయాలు అన్నింటికీ రోటీన్‌లో భాగంగా గణతంత్ర వేడుకల ఆహ్వానాన్ని పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇందులో పాకిస్తాన్‌ను చేర్చలేదు. పాకిస్తాన్‌, భారత్‌ల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.

అబుదాబిలోని రాయబార కార్యాలయానికి పంపిన ఆహ్వాన పత్రంలో ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్’ అనే పేరు రాశారని, ‘ఇస్లామిక్ ఎమిరేట్’ అని రాయలేదని ‘ద హిందూ’ తన కథనంలో పేర్కొంది. యూఏఈలోని అఫ్గాన్ ఎంబసీలో ఇప్పటికీ పాత ప్రభుత్వానికి చెందిన జెండానే ఎగురుతోంది.

అఫ్గాన్ రాయబారి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకీ

భారత్‌పై అనేక దాడుల్లో హక్కానీ నెట్‌వర్క్ ప్రమేయం

దిల్లీలో అఫ్గాన్ ఎంబసీని తెరిచేందుకు కూడా భారత్ అనుమతిచ్చింది.

ఇందులో తాలిబాన్ పాలనకు సంబంధించిన కౌన్సిల్‌లు ఉన్నాయి. ఎంబసీలో ఉన్న జెండా కూడా తాలిబాన్లది కాదు.

భారత మిషన్లపై జరిగిన అనేక దాడుల్లో హక్కానీ నెట్‌వర్క్ పాల్గొంది.

2008లో కాబుల్‌లోని భారత ఎంబసీలో జరిగిన కారు బాంబు దాడిలో 58 మంది చనిపోయారు. ఇందులో ఇద్దరు ప్రముఖ భారత రాయబారులు, ఇద్దరు భారత భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.

తాలిబాన్ ప్రభుత్వానికి ఇప్పటివరకు ఏ దేశమూ అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. రష్యా, చైనా వంటి కొన్ని దేశాలు తాలిబాన్ ప్రతినిధులకు తాత్కాలిక అంబాసిడర్లుగా గుర్తింపునిచ్చాయి. అలాగే ఇక్కడి రాయబార కార్యాలయాలపై తాలిబాన్ల జెండా కూడా ఏర్పాటు చేశారు.

2023 డిసెంబర్‌లో చైనా, తాలిబాన్లు నియమించిన బిలాల్ కరీమీని రాయబారిగా గుర్తించింది. ఇలా చేసిన తొలి దేశంగా చైనా నిలిచింది.

ఇలాగే బీజింగ్, మాస్కో, ఇతర దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అక్కడి ప్రభుత్వాల గుర్తింపు పొందిన తాలిబాన్ రాయబారులకు కూడా ఆహ్వానాలు పంపుతాయా?

‘ద హిందూ’ పత్రిక అడిగిన ఈ ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని అఫ్గానిస్తాన్ రాయబార కార్యాలయం

2021 ఆగస్టులో ఎంబసీలను మూసేసిన పలు దేశాలు

2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌తో సహా చాలా దేశాలు అఫ్గానిస్తాన్‌లోని తమ ఎంబసీలను మూసేశాయి.

ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రకారం, 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలకు పైగా ప్రజలు అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది.

సిరియా, యుక్రెయిన్ తర్వాత ప్రపంచంలో అఫ్గానిస్తాన్ నుంచే ఎక్కువమంది శరణార్థులుగా మారారు.

భారత్‌లో దాదాపు 20 వేల మంది అఫ్గాన్ పౌరులు నివసిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)