‘నా ఇద్దరు కొడుకులకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను.. వారి కళ్లలోకి చూడడం కంటే చనిపోవడం మేలనిపిస్తోంది’

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
- రచయిత, రష్దీ అబులౌఫ్
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. నిరంతర ఘర్షణలో చిక్కుకుపోయిన పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు.
గతకొన్ని రోజులుగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది.
ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24,900 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు మొదలుపెట్టింది.
హమాస్‌ను సమూలంగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది.
అందులో భాగంగానే గగన, భూతల దాడులతో హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని ప్రకటించింది.
అక్టోబర్ 7 నుంచి మొదలుకొని ఇప్పటివరకు గాజాలో 23 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరు ఆహారం, నీరు, వైద్యం కోసం రోజూ పోరాటం చేస్తూనే ఉన్నారు.

దుర్భరంగా మారిన జీవితాలు..
“నా ఇంటిని కోల్పోయాను. నాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే నా దుకాణం ధ్వంసమైంది. నా ఇద్దరు పిల్లల కనీస అవసరాలను కూడా తీర్చలేని స్థితికి చేరుకునున్నాను” అని బీబీసీతో చెప్పారు గాజాసిటీకి చెందిన మొహమ్మద్ అల్ ఖల్దీ.
ప్రస్తుత పరిస్థితిపై మొహమ్మద్ మాట్లాడుతూ, “ప్రతి రెండూ లేదా మూడేళ్లకు ఓసారి ఇలాంటి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాం. ప్రతిసారి ఆ పరిస్థితులను ఎదుర్కొని, జీవించడం కష్టతరమే అయినా, అలాగే జీవనం సాగించేవాళ్లం. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విపత్తుని తలపిస్తోంది” అన్నారు.
తమ జీవితం గడవటమే కష్టతరంగా మారిందని అన్నారు ఖల్దీ.
“నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అవసరమైన సరుకులు కూడా కొనలేని పరిస్థితి. నిస్సహాయ స్థితిలో ఏమీచేయలేక పోతున్నాను. నా ఇద్దరు కుమారుల కళ్లవైపు చూడటంకంటే మరణమే మేలని అనిపిస్తోంది. వారి కడుపు నింపలేక, వేదన అనుభవిస్తున్నాను” అని బాధపడ్డారు.
ఖాన్ యూనిస్‌లోని చాలామందితో మాట్లాడినప్పుడు వారంతా ఇజ్రాయెల్ దళాలు నగరంవైపు చాలా వేగంగా వస్తున్నారని చెప్పారు.
అయితే, ఆ దళాలు భూ ఉపరితలంపై కంటే, భూగర్భంలోనే ఎక్కువశాతం దాడులకు దిగుతున్నారని గాజా సిటీ నుంచి అక్కడికి వలస వచ్చిన నజీ మహ్మద్ తెలిపారు.
నవంబర్ నెలలో గాజా సిటీలో జరిగిన దాడులు నజీ కళ్లారా చూశారు. అనంతరం కాల్పుల విరమణ సమయంలో ఖాన్ యూనిస్ పట్టణానికి ఆశ్రయం కోసం వచ్చారు.
“భూకంపం వస్తే ఎలా ఉంటుందో, ఆ మాదిరిగానే రోజూ సాయంత్రం ఇక్కడి భూమి కంపిస్తోంది. బహుశా సొరంగాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడులు చేస్తుండొచ్చు” అని ఆయన తెలిపారు.
“మేం గాజా సిటీలో ఉన్నప్పుడు వైమానిక దాడులు మాత్రమే చూశాం” అని చెప్పారు నజీ.
గాజా వ్యాప్తంగా భద్రతావైఫల్యాల వల్ల చోరీలు, సాయుధ దోపిడీలు పెరిగిపోయాయని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
'దారి దోపిడీలు..'
తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరిన జర్నలిస్ట్ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, “రఫాలో అర్ధరాత్రి దాటాక, నా పని ముగించుకుని వెళ్తున్పప్పుడు ముగ్గురు ముసుగు వ్యక్తులు నన్ను అడ్డగించారు. వాళ్ల చేతుల్లో కత్తులు ఉన్నాయి. ఒకరి చేతిలో తుపాకీ ఉంది.
వారు నా కారు మొత్తాన్ని తనిఖీ చేశారు. నేను జర్నలిస్టునని తెలుసుకుని, వెళ్లనిచ్చారు” అని చెప్పారు.
రఫా వీధుల్లో పోలీసు కార్లలో మాస్కులు ధరించిన పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు.
అయితే, ఇష్టానుసారంగా ధరలు పెంచి, దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులను నియంత్రించే రీతిలో వారు పనిచేయడం లేదని ప్రజలు అంటున్నారు.
“నేను 10 డాలర్ల ధర పలికే యూఎన్ఆర్‌డబ్ల్యూఏ (పాలస్తీనా శరణార్ధుల కోసం ఐక్యరాజ్య సమితి అందించే) గోధుమల సంచిని పది రెట్లు ఎక్కువ ధరకు అంటే, 100 డాలర్లకు కొనాల్సి వచ్చింది. నాకు మరో దారి లేదు.
అయితే, మానవతా సాయంగా వచ్చే ఆ ఆహార పదార్థాలను కూడా దోపిడీ చేసి, సొమ్ము చేసుకుంటున్న ఆ వ్యాపారులను పోలీసులు ఏమీ చేయట్లేదు ఎందుకని?” అని ప్రశ్నించారు మొహమ్మద్ షేక్ ఖలీల్.
“నా పాపకు అందించేందుకు పాలు దొరకడం లేదు. నా కుమారుడికి ఆటిజం సమస్య ఉంది. కొన్ని నెలలుగా చికిత్స అందించడం లేదు. అతడి పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. యుద్ధం ముందు సమయంలో అందించిన చికిత్సతో అతడిలో పురోగతి కనిపించింది. ఇప్పుడు పరిస్థితి క్షీణించింది” అన్నారు.
హమాస్ గతంలో నాలుగు సార్లు యుద్ధ సమయంలో అత్యవసర ప్రణాళికలకు అనుగుణంగా పనిచేసింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.
గాజాలో ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూల్చింది. ఆర్మీ దాడుల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు, పోలీసులు మరణించారు.
భద్రతా స్థావరాలు, పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా నేరాల నియంత్రణకు కళ్లెం వేయడానికి వీలు లేకుండా పోయింది.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
'అంతా కోల్పోయాం'
యుద్ధం కారణంగా గాజా సిటీ నుంచి దక్షిణ రఫాకు వలస వచ్చిన మహిళ నవీన్ ఇమాదెదిన్ మాట్లాడుతూ, “దీర్ఠకాలిక రాజకీయ పరిష్కారంతో ఈ యుద్ధం ముగిసిపోవాలని మేం కోరుకుంటున్నాం. శాంతితో, యుద్ధం లేని ప్రశాంతమైన మా గాజా మాకు కావాలని కోరుకుంటున్నాం” అన్నారు.
ఆమె మాట్లాడుతూ, “మాకేలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. దొంగలు నా ఇంటిని దోచుకున్నారు. దుస్తులు, సామాగ్రి, ఫర్నీచర్, సోలార్ ప్యానెళ్లు అన్ని పోయాయి. ఆ రోజున గాజా సిటీలో పశ్చిమాన ఉన్న మా ఇంటిపై నాలుగు బాంబు షెల్స్” అని చెప్పారు.
ప్రస్తుతం పరిస్థితిపై ఆమె మాట్లాడుతూ “ఇప్పుడు మేం రఫాలో ఉంటున్నాం. అంతకుముందు ఖాన్ యూనిస్‌లో ఉన్నాం. ఇప్పుడు మాకు ఇల్లు లేదు. మా చేతుల్లో డబ్బు లేదు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల మధ్య మా జీవితాలు నాశనమవుతున్నాయి” అని బాధపడ్డారు.
మొహమ్మద్ అనే వ్యాపారవేత్త బీబీసీతో మాట్లాడుతూ, “మేం 16 ఏళ్లపాటు అన్యాయమైన పాలనలో జీవితాలను గడిపాం. హమాస్ మా దగ్గర భారీ మొత్తంలో పన్నులు వసూలు చేసేది. చివరికి యుద్ధంలోకి లాగింది. ఫలితంగా మేం మా ఆస్తులు, డబ్బలు, సర్వం కోల్పోయాం” అన్నారు.
“నేను మంచి వ్యాపారం చేసుకుంటూ, మంచి ఇంట్లో ఉండేవాడిని. ఇప్పుడేం చేయాలి? సరిహద్దులు మూసివేశారు. వ్యాపారం మూతబడింది. ఈ విధ్వంసం వల్ల నా ఇల్లు నివసించేదుకు వీలుగా కూడా లేదు.
అన్నింటికన్నా, ఈ యుద్ధం ముగిశాక, మళ్లీ మేం హమాస్ పాలనలోకే వెళ్తే గనుక, అంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు” అన్నారు.
ఇవి కూడా చదవండి..
- పాకిస్తాన్-ఇరాన్: రెండు దేశాలు యుద్ధం వరకు వెళతాయా...పరస్పర దాడుల వెనక ఉద్దేశాలు ఏంటి?
- లెనిన్: ఈ సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడి గురించి తెలుసుకోవాల్సిన 3 విషయాలు
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- జపాన్-స్లిమ్: చంద్రునిపై సురక్షితంగా దిగిన ఈ మిషన్ కొన్ని గంటల్లోనే పనికి రాకుండా పోతుందా...ఏం జరిగింది?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














