ప్రధాని మోదీ రాముడి గురించి మాట్లాడారా, రాజకీయాలు మాట్లాడారా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ
‘‘మన రాముడు తిరిగొచ్చాడు. ఇకపై రాముడు గుడారంలో నివసించాల్సిన అవసరం లేకుండా దివ్యమందిరంలో ఉంటాడు’’ అని జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.
‘‘ఈరోజు శతాబ్దాల సహనాన్ని మనం వారసత్వంగా పొందాం. ఈరోజు మనం శ్రీరాముడి ఆలయాన్ని పొందాం. బానిస మనస్తత్వాన్ని వదిలించుకున్న జాతి ఇలా కొత్త చరిత్ర సృష్టించింది’’ అని ప్రధాని అన్నారు.
రామ మందిరానికి సంబంధించి కోర్టు తీర్పును కూడా ప్రధాని ప్రస్తావించారు. న్యాయానికి పర్యాయపదమైన శ్రీరాముడి మందిరాన్ని కూడా న్యాయమైన పద్ధతిలో నిర్మించుకున్నామని అన్నారు.
రామాలయ నిర్మాణానికి సంబంధించిన వివాదంపైనా ఆయన గురిపెట్టారు. ‘‘రామాలయాన్ని నిర్మిస్తే దేశం తగలబడుతుందని కొందరు చెప్పారు. అలాంటి వారు ఈ దేశంలోని సామాజిక ఏకాభిప్రాయాన్ని అర్థం చేసుకోలేకపోయారు’’ అని ప్రధాని చెప్పారు.
‘‘రాముడు అగ్ని కాదు, రాముడు శక్తి, రాముడు వివాదం కాదు, రాముడు పరిష్కారం’’ అని మోదీ ప్రసంగించారు.
‘‘రాముడు కేవలం మనవాడే కాదు. అందరివాడు. రాముడు శాశ్వతం. ఇప్పుడు ఇండియాకు టైమొచ్చింది. ముందుకు సాగుతోంది. శతాబ్దాల నిరీక్షణ తరువాత ఈ క్షణం వచ్చింది. ఇక ఇక్కడితో ఆగకూడదు’’ అని చెప్పారు.
అయోధ్యలోని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచమంతా చూసింది. ఈ కార్యక్రమాన్ని భారత్ సహా ప్రపంచంలోని మీడియా మొత్తం విశ్లేషించడం మొదలుపెట్టింది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ 2024 లోక్‌సభ ఎన్నికల సమరశంఖాన్ని పూరించారని చెబుతున్నారు. దీనిద్వారా రికార్డుస్థాయిలో మూడోసారి అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
‘హిందూ రక్షకుడిగా’ రాజకీయ సందేశం
రాముడొచ్చాడంటూ ప్రధాని చేసిన ప్రసంగంలో రాజకీయ సందేశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాని ప్రసంగంలోని అర్థాన్ని వివరించమని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తాను అడిగితే ‘‘ఇంతకుముందు రాముడు లేడా? బీజేపీ,ఆర్‌ఎస్ఎస్ కలిసి రాముడిని తీసుకొచ్చారని చెప్పడానికి ప్రధాని ప్రయత్నించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన రాజకీయ సందేశమిది. కిందటిసారి ఎన్నికల్లో కూడా రాముడిని ఎవరు తీసుకువస్తారో, వారిని మేం అధికారంలోకి తీసుకువస్తాం’’ అనే నినాదమిచ్చింది.
‘‘ఈ కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా జెండాలు పంచారు. భజనలు, కీర్తనలు జరిగాయి. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ మాత్రమే హిందూ రక్షకురాలు అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం జరిగింది. లేదంటే అక్కడ మసీదు ఉండేదని, ప్రజలు బానిసల్లా బతికేవారని, మసీదులంటే ఇక్కడ మొగలులు. అంటే ముస్లింలన్నమాట’’ అని శరద్ గుప్తా వివరించారు.
‘‘బీజేపీ మాత్రమే హిందువులను రక్షిస్తుందని చూపడానికి ప్రధాని ప్రయత్నించారు. కాంగ్రెస్ బుజ్జగింపు విధానాల వల్ల దేశంలో 80 శాతం ఉన్న హిందువులు ద్వితీయశ్రేణి పౌరులుగా మిగిలిపోయేవారు’’ అని ఆయన చెప్పారు.
ప్రజలలో హిందువుననే దర్పాన్ని కలిగించడంలో ఆయన విజయం సాధించారు. హిందువులలోని చాలామంది ఇప్పుడదే భావనలో తేలియాడుతున్నారని శరద్ గుప్తా చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం రాజకీయపరమైనదని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు విజయ్ త్రివేది కూడా భావిస్తున్నారు. ‘‘ప్రధానమంత్రి ఓ రాజకీయపార్టీ నాయకుడు. కచ్చితంగా ఆయన ప్రసంగంలో రాజకీయ సందేశం ఉంటుంది. నిజానికి అయోధ్యలో ఇచ్చిన ప్రసంగంలో కొంచెం తక్కువ రాజకీయం ఉంది. ప్రతిపక్షాలన్నీ భయపడ్డాయి. అందుకే, దానిని 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన రాజకీయ ప్రసంగమని చెబుతున్నాయి’’ అని విశ్లేషించారు.
‘‘ఈ కార్యక్రమం ద్వారా హిందూ రక్షకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు వచ్చారని నిందించడం సబబు కాదు.రాముడిని జాతితో కలుపుతూ మోదీ ప్రసంగించారు. ఏదేమైనా రాముడిని భారతదేశమంతటా నాయకుడిగా కొలుస్తారు’’
‘‘ఆయన అయోధ్యలో రామ మందిర నిర్మాణం, రామజన్మభూమి ఉద్యమానికి అతీతంగా తన ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడారు. రాముడిని రాజ్యాంగం ఆధారంగా ఓ విశ్వాసంగా అభివర్ణించారు.’’

ఫొటో సోర్స్, @BJP4INDIA
‘ఉత్సవంలో కేంద్రబిందువుగా’
రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని తానే కేంద్రబిందువుగా ఉండాలనుకోవడం వెనుక రెండు లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషకులు చెపుతున్నారు.
ఈ వేదిక ద్వారా ఆయన రాజకీయ సందేశం ఇవ్వాలనుకున్నారు, అలాగే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలనుకున్నారు.
మోదీనే కేంద్రబిందువుగా 2024 ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి.
అందుకే మోదీ ఇచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నారు కానీ, బీజేపీ ప్రభుత్వం గురించి కాదు. ఈ వ్యూహాన్ని ముందకు తీసుకువెళ్ళడం ద్వారా ఆయన ఈ ఉత్సవంలో కేంద్రబిందువుగా నిలిచారు .
‘‘హిందువుల ఓట్లను పొందేందుకు తనకు మించిన హిందువు లేరని ప్రధాని చెప్పే ప్రయత్నం చేశారని’’ శరద్ గుప్తా చెప్పారు. ‘‘ఆయనన మూడురోజులపాటు ఉపవాసం ఉండమంటే 11 రోజులపాటు ఉన్నారు. అయోధ్యలో అన్నిరకాల పూజాపునస్కారాలు చేశారు. మిగిలినవారంతా ప్రేక్షకపాత్రో పోషించారు. అనిల్ మిశ్రానే క్రతువు అంతా నిర్వహిస్తారని చెప్పినప్పటికీ అందరి దృష్టి ప్రధానిపైనే నిలిచింది. మిగిలినదంతా అప్రాధాన్యం అయిపోయింది.
అయితే ఈ వాదనతో విజయ్ త్రివేది ఏకీభవించలేదు. రామాలయ కార్యక్రమం 2024 ఎన్నికలకు ఉపయోగపడొచ్చు. కానీ బీజేపీ మోదీ హామీలు, ఆలయ ప్రారంభోత్సవాన్ని కలిపేసి పోరాడుతుంది’’ అని చెప్పారు.
‘‘ కేవలం రామాలయాన్నే ఆధారంగా చేసుకుని బీజేపీ ఎన్నికల్లో గెలవలేదు. రామభక్తులందరూ బీజేపీ మద్దతుదారులు కారు. లేదంటే బీజేపీ దాన్నుంచి లబ్ధి పొందదనీ కాదు. 30 ఏళ్ళుగా బీజేపీ దీనికోసం పోరాడుతున్నప్పుడు కచ్చితంగా కొంత ప్రయోజనం పొందుతుంది. జయాలు, అపజయాలు, న్యాయపోరాటాలు, పార్లమెంటరీ రాజకీయాలు, ఓటు రాజకీయాలు మొదలైనవాటినన్నింటినీ దాటుకుని ఓ గొప్ప ఆలయం నిర్మాణమైంది. దీనిని బీజేపీ ఎందుకు ఉపయోగించుకోకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘ప్రతిపక్షాల వద్ద ఈ రెండు అంశాలను ఎదుర్కొనేందుకు ఏమైనా సన్నద్ధత ఉందా? అది రామమందిరం కానివ్వండి, హిందూత్వ విషయం కానీయండి, లేదంటే ఏ సమస్యైనాకానీయండి మోదీ నినాదాలకు పోటీ ఇవ్వగలవా అన్నదే పెద్ద ప్రశ్న’’ అని విజయ్ త్రివేది చెప్పారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
‘‘వివాదం కాదు, పరిష్కారం’’
‘‘రాముడు నిప్పు కాదు, రాముడు శక్తి. రాముడు వివాదం కాదు, పరిష్కారం’’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పారు.
ఈ మాటలను వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దీనిపై విజయ్ త్రివేది మాట్లాడుతూ, ‘‘ప్రధాని మోదీ విజయం నుంచి వినయం దాకా మాట్లాడారు. గెలుపు ఉన్మాదంలో హద్దులు దాటే అవకాశం ఉంది. అందుకే దీనిని రామమందిరం విజయంగానే చూడమని ప్రధాని చెప్పారు. హద్దులు దాటొద్దన్నారు. విజయం వరించినా వినయంగా ఉండాలని చెప్పారు’’
అయితే, నరేంద్రమోదీ, రామజన్మభూమి వివాదంపై పుస్తకాలు రాసిన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు నీలాంజన్ ముఖోపాధ్యాయ, ‘‘రాముడు నిప్పు కాదు, రాముడు శక్తి అని చెప్పారు. అయోధ్యలోని రామజన్మభూమి, బాబరీ మసీదు వివాదాన్ని మనసులో పెట్టుకుని ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. ఎందుకంటే, దీనిపై వివాదం ఉన్న సమయంలో అనేక దాడులు, హత్యలు జరిగేవి. అందుకే దీనిద్వారా ఆయన హింసకు పాల్పడవద్దని ప్రజలకు సందేశం ఇచ్చారు’’ అని విశ్లేషించారు.
‘‘ఈ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంతకాలం వేచి ఉండాలి. వారణాసి, మధుర మరికొన్ని పుణ్యక్షేత్రాలలోని బీజేపీ విధానాన్ని ఈ సందేశం మార్చుతుందా లేదా అనేది చూడాలి. ఇటీవలే బీజేపీ నేతలు కాశీలో కొన్ని మసీదులు కూలగొట్టి ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు’’ అని ఆయన చెప్పారు.
‘‘అలాంటివారికి నోర్మూసుకోమని బీజేపీ చెప్పగలదా’’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పోరాటాలకు ఇది ముగింపు కాగలదా? లేదంటే మరో కొత్త అణచివేతకు ఇది ప్రారంభమా? అనేది చూడాలి. ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు బీజేపీ ఎలాంటి నినాదాలు ఇస్తుందో చూడాలి. వారి నాయకులు ఎలాంటి ప్రసంగాలు చేస్తారో చూడాలి. ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి రాజకీయాలు చేస్తారు అనేది చూడాలి. ఫలితాలపై చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా భారతీయత ఎలా ముందుకు వెళుతుందనేది’’ అని విశ్లేషించారు.
‘‘బీజేపీకి 303 సీట్లకు మించి వస్తే, అదోరకమైన విధానాన్ని తీసుకుంటుంది. ‘బహుశా అది తీవ్రమైన విధానాలు కావచ్చు. ఉదాహరణకు 2019లో వారికి మెజార్టీ రాగానే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తెచ్చారు. సీఏఏ, ఉపా చట్టాలు తెచ్చారు. అదే వారికి 272 కంటే తక్కువ సీట్లు వస్తే వారు మిత్రపక్షాలపై ఆధారపడాలి. అందుకే ఇదంతా 2024 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పారు.
‘‘కాబట్టి రాముడు నిప్పుకాదు, శక్తి అనే మృదువైన నినాదాలు చూసి బీజేపీ తీరుతెన్నులు మారిపోయానుకోవడం అసంపూర్ణమే అవుతుంది. బీజేపీ ఎంతలా మారిందనేది ఐదారునెలల తరువాతే తెలుస్తుంది.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
‘దక్షిణ భారత పర్యటన ప్రస్తావన’
‘‘నా 11 రోజుల దీక్షలో శ్రీరాముడు పాదాలు నడయాడిన ప్రదేశాలను తాకేందుకు ప్రయత్నించాను. అది నాసిక్ కానీయండి, కేరళ, రామేశ్వరం, ధనుష్కోడి, కన్యాకుమారి నుంచి సరయూ నది వరకూ తిరిగే అదృష్టం దక్కింది’’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తన పర్యటన గురించి చెప్పడం ద్వారా ప్రధాని మోదీ ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు?
‘‘’ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని దక్షిణ భారతంలోని పది పదకొండు ఆలయాలు దర్శించారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పూజలు చేశారు. కానీ, కర్ణాటకలో మాత్రం ఇవేవీ చేయలేదు. బీజేపీకి దక్షిణాదిలో చోటు లేదు. 2024 ఎన్నికల్లో ఉత్తర భారతంలో బీజేపికి ప్రతికూల ఫలితాలు ఏమైనా వచ్చి సీట్లు తగ్గితే దక్షిణ భారతంలో గెలుచుకునే కొన్ని సీట్లతో భర్తీ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉంది’’ అని శరద్ గుప్తా చెప్పారు.
‘దక్షిణ భారతంలో విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. మోదీ వేసే ప్రతి అడుగు రాజకీయమైనది, అలాగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేసేదే. దక్షిణాదిలో ఆయన ఆలయాలు సందర్శించిన తీరే దీనిని సూచిస్తోంది’’ అని తెలిపారు.
కానీ, విజయ్ త్రివేది ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ‘‘ ఉత్తరభారతంలో బీజేపీకి సీట్లు తగ్గుతాయని భావించడం లేదు. కానీ, బీజేపీపై పడిన హిందీ బెల్ట్ పార్టీ, ఉత్తరభారతం పార్టీ అనే ముద్రను చెరిపేయాలని మోదీ అర్థం చేసుకున్నారు. దక్షిణ భారతంలో మోదీ గ్యారంటీ ద్వారా ఎదగాలని చూస్తున్నారు’’ అని చెప్పారు.
దక్షిణభారతంలో బీజేపీ పాతుకుపోయే వ్యూహాలను నీలాంజన్ ముఖోపాధ్యాయ వివరిస్తూ ‘‘హిందు, ముస్లీముల మధ్య ఉన్న ఘర్షణలనే విధానంగా చేసుకుని దక్షిణాదిలో బలం పెంచుకోవాలని చూసిన బీజేపీ ఎత్తుగడలు ఫలించలేదు. అందుకే ఇతర మార్గాలలో ప్రయత్నిస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘ఇప్పడాయన అక్కడికి రాముడి సహకారంతో వెళుతున్నారు. అక్కడ ఓ మృదువైన మార్గంలో వెళుతున్నారు. హిందు ముస్లిం వివాదాలు కాకుండా సాంస్కృతిక బంధాలను ముందుకు తెస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది సంస్కృతులు ఒకటేనని బీజేపీ చెబుతోంది. రాముడు మీ వాడు, మా వాడు కూడా’’ అని ఆయన తెలిపారు.
‘‘దాంతో ఓ సమస్య ఉంది. బీజేపీకి ఏకస్వామ్య ధోరణి ఉంది. ‘‘ఒకటే జాతి, ఒకటే ప్రజ, ఒకటే మతం. రామాయణంలో కూడా రాముడు ఒక్కడే ఉన్నాడు. దేశంలో అనేక రామాయణాలు ఉన్నాయి. వాటన్నింటిలో భిన్నమైన రాముడి గుణగణాలు ఉన్నాయి. తమిళుల కంబరామాయణం, బెంగాల్ క్రిత్వాస్ రామయాణానికి భిన్నంగా ఉంటుంది. ఇండోనేషియాలో జరిగే రామ్‌లీలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే రాముడిలోని భిన్నత్వాన్ని తీసేసి, ఆయనను ఓ మూసపద్ధతిలో చూపే ప్రయత్నం చేస్తున్నారు’’ నీలాంజన్ అన్నారు.
‘‘మూసపద్ధతిలో ఉండే రాముడిని సృష్టించారు. అందరినీ ఆ రాముడినే నమ్మమని చెబుతున్నారు. ఇంతకుముందు రాముడికంటూ ఓ ప్రత్యేకంగా ఓ గుడి ఉండాలని భావించలేదు. కానీ, దేశమంతటా రాముడు ఉన్నాడని భావించేవారు. అలాంటప్పుడు హిందూ వాటికన్ సిటీని కట్టాల్సిన అవసరం ఏముంది? చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలనుకున్నారు. అందుకే చేశారు’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ
- (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















