బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు

ఫొటో సోర్స్, GETTY IMAGES
బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు దిల్లీ, పంజాబ్‌తోపాటు ఉత్తర భారతంలో చాలా ఫేమస్.
భారత్‌లోనే కాకుండా, భారతీయ జనాభా ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లోనూ వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ బటర్ చికెన్, దాల్ మఖనీని ఎవరు కనుగొన్నారు అనేదానిపై వివాదం రాజుకుంది.
ఈ వివాదం కోర్టుకు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
మోతీ మహల్ వర్సెస్ దర్యాగంజ్
వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం, దిల్లీలోని ప్రముఖ మోతీ మహల్ రెస్టారెంట్, దర్యాగంజ్ రెస్టారెంట్‌పై కేసు వేసింది.
తమ వంటకాలను వాళ్లు కనిపెట్టినట్లు దర్యాగంజ్ చెప్పుకుంటోందని మోతీ మహల్ రెస్టారెంట్ ఆరోపిస్తోంది.
దాల్ మఖనీని తమ పూర్వీకుడు హల్వాయి కుందన్‌లాల్ గుజ్రాల్ కనిపెట్టారని మోతీ మహల్ రెస్టారెంట్ చెబుతోంది.
‘‘బటర్ చికెన్, దాల్ మఖనీని కనుగొన్నది మేమే’’ అనే ట్యాగ్ లైన్‌ను మోతీ మహల్ వినియోగిస్తోంది. అది తమ బ్రాండ్ ఐడెంటిటీ అని ఆ సంస్థ చెబుతోంది.
తమ వ్యాపారాన్ని, మోతీ మహల్ పేరును దర్యాగంజ్ రెస్టారెంట్ దెబ్బతీస్తోందని మోతీ మహల్ యజమానులు ఆరోపిస్తున్నారు.
ఈ కేసు జనవరి 16న దిల్లీ హైకోర్టులో జస్టిస్ సంజీవ్ నరులా బెంచ్ ముందు విచారణకు వచ్చింది. న్యాయస్థానం దర్యాగంజ్ హోటల్ నిర్వాహకులకు సమన్లు జారీ చేసింది. నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని తన నోటీసుల్లో ఆదేశించింది.
దర్యాగంజ్, మోతీ మహల్‌కి సంబంధాలు ఉన్నాయని, దర్యాగంజ్ రెస్టారెంట్ డైరెక్టర్లు, మోతీ మహల్ డైరెక్టర్లకు బంధుత్వం ఉందంటూ దర్యాగంజ్ రెస్టారెంట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మోతీ మహల్ తరపు న్యాయవాది సందీప్ సేథీ వాదించారు. మోతీ మహల్‌ను కుందన్ లాల్ జగ్గీ స్థాపించారని చెప్పారు.
అలాగే, మోతీ మహల్ యజమాని కుందన్ లాల్ గుజ్రాల్ ఫోటోను దర్యాగంజ్ రెస్టారెంట్ తమ ఫేస్‌బుక్ పేజీలో ఉపయోగించుకుందని సేథీ ఆరోపించారు.
దర్యాగంజ్ నిర్వాహకులు కుందన్ లాల్ జగ్గీ తమ తండ్రి అని చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారని ఆయన అన్నారు.
పెషావర్‌లోని మోతీ మహల్ రెస్టారెంట్ ఫోటోను దర్యాగంజ్ నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో పెట్టుకున్నారని చెప్పారు.
వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ నరులా ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్ సమక్షంలో విచారణ జరుగుతుందని నోటీసుల్లో పేర్కొంది. మార్చి 18న మరోసారి ఈ కేసు విచారణ జరుగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యర్థుల వాదనేంటి?
ఇది తప్పుడు కేసు అని, మా క్లయింట్లు ఎలాంటి తప్పూ చేయలేదని ప్రతివాదుల న్యాయవాది అమిత్ సిబల్ చెప్పారు.
ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోకు, తమకు ఎలాంటి సంబంధం లేదని సిబల్ స్పష్టం చేశారు. ఆ ఫోటో ఏ టూ జెడ్ కిచెన్ చేసిందని చెప్పారు.
పెషావర్‌లోని మోతీ మహల్ రెస్టారెంట్‌ను ఇరు పార్టీల పూర్వీకులు ప్రారంభించారని, అందువల్ల ఆ ఫోటోకి సంబంధించి అవతలి పార్టీకి ఎలాంటి ప్రత్యేకమైన హక్కులూ ఉండవని ఆయన అన్నారు.
దర్యాగంజ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఆ ఫోటోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చని సిబల్ అన్నారు.
వెబ్‌సైట్‌లో ఉన్న ఫోటోలో మోతీ మహల్ కనిపించకుండా క్రాప్ చేసినట్లు చెప్పారు. అందువల్ల వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బటర్ చికెన్, దాల్ మఖనీ ఎలా చేస్తారు?
బటర్ చికెన్ చేసే ముందు చికెన్‌ను పెరుగు, అల్లం, వెల్లుల్లి, ఇతర ద్రవ్యాలను కలిపి కొద్దిసేపు ఉంచుతారు.
ఆ తర్వాత చికెన్ ముక్కలను టొమాటో పేస్ట్‌తో కలిపి వండుతారు. ఆ తర్వాత బటర్ (వెన్న) కలుపుతారు. రోటీలు, అన్నంతో కలుపుకుని బటర్ చికెన్ ఆరగించొచ్చు.
దాల్ మఖనీ కోసం ముందుగా మినప్పప్పు, రాజ్మాను ఉడకబెడతారు. పది నిమిషాల తర్వాత వాటికి ఇతర పదార్థాలు కలిపి వండుతారు. ఆ తర్వాత దానికి బటర్ కలిపి కొంతసేపు కుక్ చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?
- పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ
- గర్భవతులను చేసే జాబ్: ‘మహిళతో ఒకరాత్రి గడిపితే రూ.5 లక్షలు, ఆమె ప్రెగ్నెంట్ అయితే రూ.8 లక్షల గిఫ్ట్...’అంటూ సాగే ఈ స్కామ్ కథ ఏంటి?
- బలూచిస్తాన్: పాకిస్తాన్, ఇరాన్‌లకు టార్గెట్‌గా మారిన ఈ ప్రాంతం ఎక్కడుంది? దీని చరిత్ర ఏమిటి
- ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోవద్దు.. కేంద్రం కొత్త నిబంధనలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














